Afghanistan Earthquake: భూకంపంలో చిన్నారులు ఎక్కువమంది చనిపోయి ఉండవచ్చంటున్న అఫ్గానిస్తాన్ డాక్టర్లు

ఫొటో సోర్స్, EPA
- రచయిత, అలీ హమెదానీ, థామ్ పూలే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
"సాయం అందించేందుకు కొన్ని హెలికాప్టర్లు వచ్చాయి. శవాలను మోయడానికి తప్ప అవి ఇంకేం సాయం అందించగలవో అర్థం కాలేదు"
అక్కడి పరిస్థితిని వివరిస్తూ ఓ అఫ్గాన్ వ్యక్తి చెప్పిన మాటలవి. అఫ్గానిస్తాన్‌లో పెను భూకంపం విలయం సృష్టించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే, ఈ ప్రమాదంలో చిన్నారులు ఎక్కువగా చనిపోయి ఉంటారని అఫ్గానిస్తాన్ కు చెందిన డాక్టర్లు అంటున్నారు.
జూన్ 22 తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించింది. ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. ఇళ్లల్లో నిద్రిస్తున్నవారు ఎక్కడికక్కడ ప్రాణాలు వదిలారు.
సహాయ కార్యకర్తలకు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడమే కష్టమైంది. చేరుకోగలిగిచోట చేతులతో తవ్వి మనుషుల జాడ వెతుకుతున్నారు. గ్రామీణ తూర్పు అఫ్గానిస్తాన్‌కు చేరుకోవడం అంత సులభం కాదు.
రోజులు గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
"జూన్ 21 అర్థరాత్రి దాటిన తరువాత, 22 తెల్లవారు జామున 1.30 ప్రాంతంలో భూకంపం వచ్చింది. భయంతో వణికిపోయాను. నా స్నేహితుల కోసం వెతికాను. కొంతమంది ఆత్మీయులను కోల్పోయారు. కొంతమంది ప్రాణాలు దక్కించుకోగలిగారు గానీ వాళ్ల ఇళ్లు కూలిపోయాయి" అని అహ్మద్ నూర్ అనే బాధితుడు చెప్పారు.
అంతర్జాతీయ సమాజం తమకు సాయం చేయాలని అఫ్గానిస్తాన్ లోని తాలిబన్ పాలకులు అన్నారు.‘‘ఆ ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా ఉంది. నెట్‌వర్క్ వీక్‌గా ఉంది’’ అని అఫ్గానిస్తాన్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

'ఎవరిని కదిలించినా దు:ఖమే'
"ఎక్కడ చూసినా అంబులెన్సుల రొదే. ఎవరిని కదిలించినా ఏడుపులే. కుటుంబాన్ని, బంధువులను కోల్పోయారు. పరిస్థితి దారుణంగా ఉంది" అని ఆయన అన్నారు.
పరిస్థితి విషమంగా ఉందని ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
"ఏ వీధికెళ్లినా, జనాల ఏడుపులే వినిపిస్తున్నాయి. రక్త సంబంధీకులనో, ఆత్మీయులనో కోల్పోనివారు లేరు" అని ఒక జర్నలిస్ట్ వివరించారు.
మూడు, నాలుగేళ్ల వయసున్న ఒక చిన్న పాప సగం కూలిపోయిన భవనం ముందు నిలబడి ఉన్న ఫొటోను బీబీసీ చూసింది. పాప ఒంటి నిండా దుమ్ము. ఆ పిల్ల బిత్తరపోయినట్టు కనిపిస్తోంది. ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలీదు. పాప గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది.
అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో పక్తికా ప్రావిన్స్ ఒకటి. అక్కడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు 49 ఏళ్ల అలెమ్ వాఫా వెళ్లారు.
"ఇక్కడ అధికారిక సహాయ కార్యకర్తలు ఎవరూ లేరు. కానీ, చుట్టు పక్కల పట్టణాలు, గ్రామల నుంచి సాయం అందించడానికి చాలామంది వచ్చారు. నేను ఈ ఉదయమే ఇక్కడకు చేరుకున్నా. కనీసం 40 మృతదేహాలను చూశాను. వారిలో చాలామంది చిన్నపిల్లలే" అని వాఫా వివరించారు.
'సహాయానికి అవసరమైన వనరులు లేవు'
ఇప్పటికే అఫ్గాన్ ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. పేదరికం ప్రబలంగా ఉంది. ఆ దేశం దశాబ్దాల యుద్ధాన్ని భరించింది. గత ఏడాది తాలిబాన్లు అధికారంలోని వచ్చినప్పటి నుంచీ పలు దేశాలు అఫ్గానిస్తాన్‌కు సహాయ నిధిని నిలిపివేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అవసరమైన సహాయం ఎంతవరకు అందుతుందో తెలీదు.
"ఎంతోమంది డాక్టర్లు, నర్సులు కూడా ప్రాణాలు కోల్పోయారు" అని పక్తికాలోని గయాన్ జిల్లాకు చెందిన ఒక వైద్యుడు తెలిపారు.
"భూకంపానికి ముందు కూడా మాకు సౌకర్యాలు, సేవలు అందించే మనుషులు లేరు. ఉన్న కాస్త సాయాన్ని కూడా ఈ భూకంపం తుడిచిపెట్టేసింది. నా సహోద్యోగుల్లో ఎంతమంది బతికి ఉన్నారో తెలీదు" అంటూ ఆయన వాపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
సహాయ సంస్థలు ముందుకు వస్తున్నా, కమ్యూనికేషన్, నీటి సదుపాయాలు సవాలుగా మారాయి. బాధితులకు ఆహారం, మందులు, అత్యవసర ఆశ్రయం ఏర్పాటు చేంసేదుకు ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
"బాధిత జిల్లాల్లో మా హెల్త్, న్యూట్రిషన్ బృందాలు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిస్తున్నాయి" అని యునిసెఫ్‌కు చెందిన సామ్ మోర్ట్ చెప్పారు.
"హైజీన్ కిట్లు, దుప్పట్లు, టెంట్లు, టార్పాలిన్ వంటి సామాగ్రితో మా ట్రక్కులు వస్తున్నాయి. దారిలో ఉన్నాయి. వర్షం పడుతోంది. దాంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా ఆకలితో అలమటిస్తున్న పేదలు, అనారోగ్యం, కరువుతో బాధపడుతున్నవారు. ఇప్పుడు ఈ భూకంపం వచ్చింది. వీళ్లకు విపత్తులను ఎదుర్కునే శక్తి లేదు" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో బైజూస్ ఒప్పందంలో ఏముంది, దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- దినేశ్ కార్తీక్: ఫినిష్ అయిపోయాడనుకున్న ప్రతిసారీ ఫీనిక్స్ లాగా పైకి లేస్తున్న క్రికెటర్
- ఈ యూట్యూబర్లు ఇచ్చే ఆర్ధిక సలహాతో లాభాలు సంపాదించొచ్చా, యూజర్లు ఎందుకు ఎగబడుతున్నారు
- Cannabis: గంజాయితో ఇక్కడ కూరలు వండుతారు, ఐస్ క్రీమ్‌లు, పానీయాలు అన్నింటిలోనూ..
- ప్రాణాలు మింగేస్తున్న మ్యాన్‌హోల్స్ - మురుగు కాలువల్లోకి ఇంకా మనుషులే దిగాలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












