BYJU'S: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో బైజూస్ ఒప్పందంలో ఏముంది, దీనిపై అభ్యంతరాలు ఎందుకు?

బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఫొటో సోర్స్, I&PR/twitter

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం...

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన విద్యావిధానం అమలు కోసం ఏపీ ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. అందుకు అనుగుణంగా సీబీఎస్ఈ సిలబస్ బోధనకు శ్రీకారం చుడుతోంది.

అందుకు తోడుగా డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకంటూ ప్రైవేటు సంస్థ, లెర్నింగ్ యాప్ బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ విద్యాసంవత్సరం నుంచే అమలులోకి వస్తున్న ఈ ఒప్పందంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు బైజూస్ తో ఒప్పందం ఏమిటి? దానిని వ్యతిరేకిస్తున్న వారి వాదన ఏంటి?

బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఫొటో సోర్స్, I&PR/twitter

బైజూస్ ఏం చేస్తుంది?

బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు జూన్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్‌గా బైజూస్ సంస్థ ఉంటుందని ఆయన వెల్లడించారు. దానికి సంబంధించి బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌తో ఆన్‌లైన్‌లో సీఎం మాట్లాడారు. ఒప్పందంలోని కీలక అంశాలను ప్రకటించారు.

ఈ ఎంఓయూ పట్ల బైజూస్ సంస్థ కూడా ఆనందం వ్యక్తం చేసింది.

అంతకుముందే మే నెలలో దావోస్‌లో సీఎం జగన్, బైజూస్ రవీంద్రన్ భేటీ జరిగింది. ఆ సందర్భంగానే ఏపీ ప్రభుత్వ విద్యారంగంలో బైజూస్ ప్రవేశానికి సంబంధించి ప్రాథమిక ప్రక్రియ జరిగింది.

ఎంఓయూ అధికారికంగా వెల్లడించిన సమావేశంలో రవీంద్రన్ మాట్లాడుతూ తమ మధ్య చర్చలను కొన్ని రోజుల వ్యవధిలోనే కార్యరూపంలోకి తీసుకురావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సీఎం జగన్ ఏం చెప్పారు?

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకూ బైజూస్ సేవలు అందిస్తుంది.

ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తయినందున వచ్చే విద్యాసంవత్సరానికి అంటే 2023-24 నుంచి ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాల్లోనే బైజూస్ సిలబస్ కూడా కలిపి ముద్రిస్తారు.

ఏటా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తారు. వాటిలో బైజూస్ కంటెంట్ ఉంటుంది. ఈ ఏడాది 4.7 లక్షల మంది విద్యార్థులకు ఈ ట్యాబ్‌లు అందించి వాటిలో బైజూస్ మెటీరియల్ అప్‌లోడ్ చేయబోతున్నారు.

ఆ ట్యాబ్‌ల కొనుగోలు కోసం ఒక్కోటి సుమారుగా రూ. 10 వేలు చొప్పున రూ. 500 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించబోతోంది.

విద్యార్థులతో వై ఎస్ జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM

విద్యార్థులకు వ్యక్తిగతంగా ట్యాబ్‌తో పాటు ప్రతి తరగతి గదిలో టీవీ ఏర్పాటు చేస్తారు. నాడు-నేడు పథకంలో భాగంగా టీవీ సెట్లు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.

ఈ ఏడాది 8వ తరగతి విద్యార్థికి ఇచ్చే ట్యాబ్‌లో వచ్చే ఏడాది 9వ తరగతి, ఆ తర్వాత ఏడాది పదో తరగతి సిలబస్ అప్‌లోడ్ చేస్తారు.

ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నందున 2025లో మొదటి బ్యాచ్ పదో తరగతి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. అప్పటికి వరుసగా మూడేళ్ల పాటు డిజిటల్ విద్యాబోధన ద్వారా వారిని సన్నద్ధం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

ప్రస్తుతం ప్రైవేటు యూజర్లకు రూ. 20 వేల నుంచి 25 వేలు చెల్లిస్తే అందిస్తున్న బైజూస్ కంటెంట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందిస్తారు. తద్వారా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల బడుల విద్యార్థులు ఎదుగుతారని, ఇదో గేమ్ చేంజర్ అని సీఎం జగన్ ప్రకటించారు.

బైజూస్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూ కాపీ కోసం బీబీసీ ప్రయత్నించింది. ఒప్పందం కాపీ కోసం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ను సంప్రదించగా, ఆయన స్పందించలేదు.

బైజూస్

ఫొటో సోర్స్, Getty Images

అభ్యంతరాలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తరగతుల విలీనం ప్రక్రియ పలు చోట్ల ఆందోళనలకు కారణమవుతోంది. మూడు, నాలుగు, ఐదు తరగతులను కూడా దగ్గరలోని హైస్కూళ్లకు తరలిస్తుండటం వల్ల స్థానికంగా పాఠశాలలు అందుబాటులో లేని పరిస్థితి వస్తోందంటూ పలువురు ఆందోళనలకు దిగారు.

ఇక విలీనం చేసే స్కూళ్లలో సదుపాయాలు లేకపోవడం, తగిన సిబ్బంది లేకపోవడం లాంటి సమస్యలు కూడా ఉన్నాయనే నిరసనలూ వ్యక్తమయ్యాయి.

విద్యారంగంలో ఒకదాని వెంట ఒకటి అన్నట్టుగా వేగంగా వస్తున్న మార్పుల మూలంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సర్దుకునే అవకాశం కూడా ఉండడం లేదని రిటైర్డ్ ఎంఈవో ఎ.జోగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

"విద్యారంగంలో మార్పులు అవసరమే. డిజిటల్ బోధన అవసరమే. కానీ ఉపాధ్యాయుడు - విద్యార్థి మధ్య బంధాన్ని బలోపేతం చేయాలి. దానికి బదులుగా ట్యాబ్‌లో ఇచ్చి , టీవీలలో వీడియోలు పెట్టి చదువుకోవాలంటే ఆన్‌లైన్ చదువులతో ఏమయ్యిందో మొన్నటి పదో తరగతి ఫలితాలే సాక్ష్యం'' అని ఆయన ఉటంకించారు.

''ఏదైనా క్రమంగా పిల్లలకు అలవాటు చేస్తూ సాగాలి. అందుకు భిన్నంగా జరుగుతోంది. ఒక్కసారిగా తరగతుల విలీనం పేరుతో బడి మారిపోయింది. సీబీఎస్ఈ పేరుతో సిలబస్ మారింది. డిజిటల్ విద్య పేరుతో ఇంగ్లిష్ పాఠాలను టీవీల్లో చెబితే పిల్లలు అర్థం చేసుకోవడం ఎలా సాధ్యం?'' అని ప్రశ్నించారు.

''తొలుత బడి భవనం అభివృద్ధి చేయడంతో పాటు టీచర్ల నియామకం జరగాలి. ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వాలి. వారి ద్వారా పిల్లల్లో మార్పు జరగాలి" అని ఆయన బీబీసీతో చెప్పారు.

సాధారణ, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారిలో చాలామంది ఆన్‌లైన్ బోధనకు అలవాటుపడేందుకు కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు.

బైజూస్ రవీంద్రన్

ఫొటో సోర్స్, Getty Images

టెండర్ పిలిచారా?

బైజూస్ సంస్థ మీద గతంలో అనేక విమర్శలు వచ్చాయి. పార్లమెంటులో కూడా వాటిని చర్చించే వరకూ వెళ్లింది. బైజూస్ కంటెంట్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారి నుంచి అత్యధిక మొత్తం ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.

2011లో రవీంద్రన్ నేతృత్వంలో బైజూస్ ప్రారంభమయ్యింది. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆధ్వరంలో నడిచే చాన్ జుకర్‌బర్గ్, టైగర్ గ్లోబల్ అండ్ జనరల్ అట్లాంటిక్ లాంటి సంస్థల నుంచి అందిన సహాయంతో దీనిని ఏర్పాటు చేశారు.

కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ చదువుల కారణంగా ఆన్‌లైన్ ఎడ్‌టెక్ స్టార్టప్‌లకు అవకాశాలు పెరిగాయి. అందులో భాగంగానే బైజూస్ కూడా విస్తరించింది. పెద్ద సంఖ్యలో వినియోగదారులను, దాంతోపాటు ఆదాయాన్ని సంపాదించింది.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: కొండరెడ్ల జీవితాల్లో అక్షర దీపం వెలిగిస్తున్న కొండబడి

ఆ క్రమంలోనే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తోందని, ప్రకటనలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టలేకపోతోందని ఆరోపిస్తూ పలువురు ఫిర్యాదులు చేశారు. బైజూస్ చుట్టూ వివాదం చెలరేగింది. 2021 శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవహారం చర్చకు వచ్చింది.

గతంలో ఎన్నో అభియోగాలు ఎదుర్కొన్న సంస్థతో ఒప్పందం ఎక్కడ, ఎంతకు జరిగిందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఎంవోయూలో ఏముందనే విషయాలు ప్రభుత్వం వెల్లడించిందా? అని అడిగారు.

"టెండర్లు పిలిచి బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నారా? రూ. 500 కోట్లు దీని కోసం వెచ్చిస్తామని చెబుతున్నారు. గతంలో రూ. 100 కోట్లు దాటిన ప్రతీ కాంట్రాక్ట్‌ని జ్యుడిషియల్ రివ్యూకు పంపుతామని చెప్పిన విషయం మరచిపోయారా?'' అని ప్రశ్నించారు.

విద్యార్థులు

''బైజూస్‌తో ఒప్పందం ద్వారా విద్యావ్యవస్థ ఉద్ధరణ అలా ఉంచి, ఉపాధ్యాయ నియామకాలకు ఎసరు పెట్టే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.

బైజూస్ పట్ల ప్రభుత్వం ప్రత్యేక ప్రేమను చూపిస్తోందని ఆరోపిస్తూ, దీనికి కారణమేమిటో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బైజూస్‌తో ఒప్పందాన్ని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తప్పుబడుతోంది. అది బైజూస్ కాదు జగన్మోహన్‌రెడ్డి జ్యూస్ అంటూ విజయనగరం బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు.

"ఎయిడెడ్ విద్యావ్యవస్థలో ప్రభుత్వం తలదూర్చి విచ్ఛిన్నం చేయాలని చూసింది. స్కూళ్లు విలీనం అంటూ అస్తవ్యస్తంగా మార్చింది. మునిసిపల్ స్కూళ్ల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. జీవో 117 పేరుతో విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తోంది'' అని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తప్పుపట్టారు.

''గతంలో టీచర్, స్టూడెంట్ రేషియో 1:20 గా ఉండేది. 16 మంది వరకూ పిల్లలుంటే ఒక టీచర్, ఆపైన ఉంటే ఇద్దరు టీచర్లు ఉండేవారు. ఇక నుంచి కొత్త జీవో ప్రకారం 30 మంది లోపు పిల్లలున్న ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ స్కూళ్లకు ఒక్క ఎస్జీటీని ఇస్తామని చెబుతున్నారు. అంటే ఆ రేషియో 1:30కి మారిపోతోంది. ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టులు ఎత్తేస్తున్నారు" అని విమర్శించారు.

ఎన్ని యాప్స్ వచ్చినా ముఖాముఖీ విద్యావిధానానికి సరిపోవని ప్రపంచ అనుభవం చెబుతుంటే, టీచర్-స్టూడెంట్ రేషియో పెంచేసి, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా ఆన్‌లైన్ విధానం మీద ఆధారపడేలా చేయడం ఏవిధంగా సమంజసమని ఆయన ప్రశ్నించారు.

బైజూస్

ఫొటో సోర్స్, Getty Images

బైజూస్ తన కంటెంట్‌ను ఉచితంగా అందిస్తోంది: రాష్ట్ర మంత్రులు

టీడీపీ విమర్శలను మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ తప్పుబట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని సురేష్ ఆరోపించారు.

"నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో ప్రపంచ వ్యాప్తంగా బైజూస్ పేరొందింది. నాణ్యమైన విద్యను ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు అందించేందుకు బైజూస్ ముందుకు వచ్చింది. బైజూస్‌ను జ్యూస్ అంటూ చంద్రబాబు వెటకారంగా, హేళనగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం'' అని సురేష్ చెప్పారు.

''రాష్ట్రంలో 32 లక్షల మంది పైచిలుకు ఉన్న విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ను అందించాలంటే రూ. 500 - 600 కోట్లు అవుతుంది. అలాంటి మెటీరియల్‌ను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను వెటకారం చేస్తూ మాట్లాడటం పద్ధతి కాదు" అని పేర్కొన్నారు.

టీచర్లు

ఖాళీ పోస్టుల సంగతేంటి?

రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ బడుల సంఖ్య తగ్గిస్తున్నారని, ఉపాధ్యాయ నియామకాల ఊసే తీసుకురావడం లేదని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర రావు అన్నారు. బైజూస్‌తో ఒప్పందానికి ముందే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

"బైజూస్ కంటెంట్‌తో టెక్ట్స్ పుస్తకాలు వస్తాయంటున్నారు. అంటే ఎస్‌సీఈఆర్‌టీ ఏం చేస్తుంది? ట్యాబ్‌లు, టీవీలతో పాఠాలు చెప్పిస్తామంటున్నారు. అప్పుడు టీచర్ నియామకాలు ఏమవుతాయి? విద్యావ్యవస్థను కార్పొరేట్ సంస్థకు అప్పగిస్తే ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్య ఎన్నాళ్లుంటుంది? బైజూస్ ఉచితంగా కంటెంట్ ఇస్తోందని ప్రభుత్వం చెబుతోంది. అది ఎంత కాలం? ఆ తర్వాత వాళ్లకు ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది? లేదంటే ఆ తర్వాత పిల్లల నుంచి ఎంత వసూలు చేస్తారు? పాఠ్యాంశాల తయారీ నుంచి, వాటి బోధన వరకూ బైజూస్‌కి అప్పగిస్తే విద్యారంగంలో ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానాలు లేవు. ఎవరితోనూ చర్చలు లేవు. ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు" అంటూ ఎమ్మెల్సీ విమర్శించారు.

పాఠశాల విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పుల విషయంపై ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి ప్రతినిధులతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని ఆయన బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.

ఉపాధ్యాయ ప్రతినిధుల అభ్యంతరాలు, విద్యార్థి సంఘాల ఆందోళనలు, విపక్షాల విమర్శల నడుమనే జూలై 5న ప్రారంభం కాబోతున్న కొత్త విద్యాసంవత్సరం నుంచే బైజూస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ అంశంపై బైజూస్ స్పందన కోసం సంస్థ ప్రతినిధులను సంప్రదించటానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ అటునుంచి జవాబు రాలేదు.

వీడియో క్యాప్షన్, తెలుగురాష్ట్రాల్లో గుత్తికోయలుగా పిలువబడే గోండులు భయంలో ఎందుకున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)