ఉద్దానం: ఈ ప్రాంతంలో యువతీ యువకుల పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎందుకంటే...

అమ్మాయిలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"నాకు కిడ్నీ వ్యాధి ఉందని తెలిసి ఆరేళ్లయ్యింది. నా జబ్బే నా కుతూరు పెళ్లికి అడ్డు అవుతుందని అనుకోలేదు. పెళ్లి కుదుర్చుకుని, ముహూర్తం దగ్గరపడుతుండగా, నాకు కిడ్నీ జబ్బుందని మా అమ్మిని పెళ్లి చేసుకోమన్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?" అని ఉద్దానం ప్రాంతానికి చెందిన కిడ్నీ వ్యాధి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు కారణంగా కుదిరిన పెళ్లిళ్లు రద్దవుతున్నాయి. ఒకప్పుడు ఉద్దానం ప్రాంత అబ్బాయిలను చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితులుండేవి. ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలను కూడా వేరే ప్రాంతవాసులు పెళ్లిళ్లు చేసుకోవడానికి వెనకాడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది మే నెలలో పెళ్లి కుదిరిన కుటుంబాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్థులున్నారని ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు రద్దయ్యాయి.

పెళ్లి పందిరి

'వైజాగ్‌లో లైఫ్ ప్లాన్ చేసుకున్నాం'

ఉద్దానం ప్రాంతానికి చెందిన రమేష్ (పేరు మార్చాం) విశాఖలో కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. గత ఏడాదిగా పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖపట్నానికి చెందిన యువతితో సంబంధం కుదిరింది. అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం పోటి పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

"పెద్దలు మాట్లాడుకుని వివాహ ముహుర్తం మే నెలలో నిర్ణయించారు. అప్పటికి ఇంకా వివాహ తేదీకి నెలన్నర టైమ్ ఉంది. ఈ లోపు నేను, నా కాబోయే భార్య రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారం. అమ్మాయిది వైజాగ్ కావడం, నాది కూడా అక్కడే ఉద్యోగం కావడంతో...పెళ్లి తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాం. పెళ్లికి పదిహేను రోజులుందనగా, పెళ్లి వద్దనుకుంటున్నామని వాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. కారణాలు పెద్దగా చెప్పలేదు. ఎంక్వైరీ చేస్తే, నాకు కిడ్నీ వ్యాధి వస్తుందనే భయంతో క్యాన్సిల్ చేసుకున్నారని తెలిసింది" అని రమేష్ బీబీసీతో చెప్పారు.

"పెళ్లి రద్దయ్యాక పది, పదిహేను రోజులు ఫోన్‌లో ఆ అమ్మాయి ఫోటో పదే పదే చూసుకునేవాడిని. కొన్ని సార్లు తెలియకుండానే ఏడుపు వచ్చేసేది. నాకు కిడ్నీవ్యాధి లేదు. ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకున్నాను. క్రియాటినిన్ 1 mg/dL ఉంది. ఇది నార్మల్ వ్యాల్యూనే" అని రమేష్ తెలిపారు.

ఇదిలా ఉంటే, అమ్మాయిల వివాహాలు కూడా కిడ్నీ వ్యాధుల కారణంగా రద్దయ్యాయి. వారిలో ఒకరి తల్లి బీబీసీతో మాట్లాడారు.

ఉద్దానం

'నా వల్లే మా అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది'

ఆ ఇంటి ముందు పెళ్లి పందిరి ఇంకా అలాగే ఉంది. అయితే అప్పటికే పెళ్లి రద్దయి 20 రోజులైంది. డయాలసిస్ కు వెళ్లి వచ్చిన ఆ ఇంటి దంపతులు కిడ్నీ వ్యాధి కారణంగా తమ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని చెప్పారు. తల్లికి కిడ్నీ వ్యాధి ఉందని తెలిసి మగపెళ్లివారు ఈ సంబంధాన్ని వద్దనుకున్నారు.

"పెళ్లి కార్డులు వేయిద్దామనుకున్నా ముందు రోజే మగపెళ్లివారు పెళ్లి వద్దని ఫోన్ చేశారు. కారణం అడిగితే మధ్యవర్తిని అడగమన్నారు. అతడ్ని అడిగితే నీకు కిడ్నీ జబ్బుందని ఈ పెళ్లిని వద్దనుకున్నారని చెప్పారు" అని పెళ్లి కుమార్తె తల్లి బీబీసీతో చెప్పారు.

"నాకు జబ్బుందని వాళ్లకు తెలుసు, మరి ముందేందుకు ఒప్పుకున్నారో, తర్వాత ఎందుకు రద్ద చేసుకున్నారో తెలియదు. మా ఆయన వాళ్లతో మాట్లాడేందుకు చాలా సార్లు ప్రయత్నించారు. మగపెళ్లివారు ఒప్పుకోలేదు. నా కిడ్నీ వ్యాధి చికిత్సకే చాలా డబ్బులు ఖర్చైపోతున్నాయి. ఇప్పటి దాకా రూ. 4 లక్షలుపైగానే ఖర్చుపెట్టాం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి కూడా నా వలన ఇబ్బందిల్లో పడింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, కొడుకు ప్రాణాలు కాపాడేందుకు ఆ తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే...
ఉద్దానం

'చుట్టాలు కూడా రావడానికి ఇప్టపడటం లేదు'

కొబ్బరితోటలు, పొడవాటి తీర ప్రాంతం ఉన్న 160 గ్రామాల ప్రాంతమే ఉద్దానం. ఒకప్పుడు దీని పేరు ఉద్యానవనం. ఆ పేరే క్రమంగా ఉద్దానంగా మారింది. ఉద్దానం ప్రాంతం కోనసీమను తలపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని చూసేందుకు, ఇక్కడ ఒకట్రెండు రోజులు గడిపేందుకు అంతా ఇష్టపడతారు. అయితే అది గతమని, ఇప్పుడు కిడ్నీవ్యాధి భయంతో చుట్టాలు సైతం ఇక్కడికి ఎంతో అత్యవసరమైతే కానీ వచ్చేందుకు ఇష్టపడటం లేదని స్థానికులు చెప్తున్నారు.

"గతంలో మగ పిల్లలకే అక్కడక్కడ పెళ్లి సమస్యలు ఎదురైయ్యేవి. ఉద్దానం ప్రాంతానికి మా ఆడపిల్లని ఇవ్వలేమని అనేవారు. ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలను కూడా చేసుకోడానికి చాలా మంది భయపడుతున్నారు. కుదిరిన సంబంధాలే క్యాన్సిల్ అయిపోవడం, పెళ్లి దాకా వచ్చి కూడా పెళ్లిని వద్దనుకోవడం జరిగాయి. ఇక బయటవాళ్లైతే మా ఊళ్లకు రావడానికి ఇష్టపడటం లేదు. కిడ్నీ వ్యాధి వలన పెళ్లి సంబంధాలు కుదుర్చుకోడానికి కూడా భయపడుతున్నారు" అని ఉద్దాన ప్రాంతానికి చెందిన మహాలక్ష్మీ అనే మహిళ చెప్పారు.

ఉద్దానం

'ఎంక్వైరీ చేస్తున్నారు, క్యాన్సిల్ అంటున్నారు'

పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న తర్వాత పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్నారు. ఇది అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ జరుగుతుంది. కుటుంబంలోనో, ఊర్లోనో ఎవరికి కిడ్నీ వ్యాధి ఉన్నా కూడా అక్కడున్న యువతకు పెళ్లి సంబంధం కుదరడంలేదని, కిడ్నీ వ్యాధి తమ ప్రాంతానికి శాపంగా మారిందని ఈ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్న్నారు.

"ఉద్దానం ప్రాంతంలో అమ్మాయి, అబ్బాయిలు అందరం చదువుకున్న వాళ్లమే. మా పెళ్లిళ్ల విషయానికి వస్తే సంబంధాలు వస్తున్నాయి. కానీ ఒకసారి ఓకే అనుకున్న తర్వాత, అమ్మాయైనా, అబ్బాయైనా వారి కుటుంబాల్లో కిడ్నీ వ్యాధి ఎవరికైనా ఉందా అని పదే పదే ఎంక్వైరీలు చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తెలుసుకుంటున్నారో ఏమో, కిడ్నీ వ్యాధి కారణం చెప్పి పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇటీవల ఈ పరిస్థితి ఎక్కువైంది" అని ఉద్దాన ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థిని ఒకరు తెలిపారు.

ఉద్దానం

'జన్యుపరంగా నిర్ధరణ కాలేదు'

కుటుంబంలో కిడ్నీవ్యాధి ఉంది కాబట్టి, ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలకు కూడా వ్యాధి వస్తుందనే అనుమానాలతో పెళ్లిళ్లు రద్దు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది. ఈ విషయంపై గత 25 ఏళ్లుగా ఉద్దానం కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు చేసిన, చేస్తున్న న్యూయార్క్‌లో మూత్ర పిండాల వ్యాధి నిపుణుడు డాక్టర్ రవిరాజ్ తో బీబీసీ మాట్లాడింది.

"ఉద్దానం కిడ్నీ వ్యాధిపై అనేక పరిశోధనలు జరిగాయి. విదేశాల నుంచి కూడా వచ్చి చాలా మంది కిడ్నీ వ్యాధిపై అనేక పరీక్షలు నిర్వహించారు. కానీ ఏ పరిశోధనల్లోనూ ఇది జన్యుపరమైన వ్యాధి అంటే కుటుంబంలో ఒకరికి ఉంటే ఆ కుటుంబంలోని ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని రుజువు కాలేదు. ముఖ్యంగా ఈ ప్రాంతవాసులను వివాహం చేసుకుంటే, వారికి లేదా వారి పిల్లలకు కూడా వ్యాధి సంక్రమించే అవకాశముందనేది అనే ఒక అపోహ మాత్రమే. ఈ ప్రాంత యువతీయవకులను వివాహాలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు" అని డాక్టర్ రవిరాజ్ బీబీసీతో చెప్పారు.

కిడ్నీవ్యాధి ఎవరికైతే వస్తుందో, వారికే ఆ వ్యాధి పరిమితం. వారి నుంచి ఇతరులకు రావడమనేది జరగదని, అలాగే కిడ్నీ వ్యాధి ఉన్నవారు కూడా తగు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ దాని తీవ్రతను తగ్గించుకోవచ్చని డాక్టర్ రవిరాజ్ అన్నారు.

ఉద్దానం

'కిడ్నీ వ్యాధి కుటుంబాల్లో పెళ్లి, పెద్ద సవాలే'

దాదాపు మూడున్నర లక్షల జనాభా ఉండే ఉద్దాన ప్రాంతంలో 35 వేల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారేనని, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ లెక్కలు చెప్తున్నాయి. అందులో 21 శాతం మంది దశాబ్ధ కాలం కంటే ఎక్కువగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారేనని జార్జ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ చెప్పింది.

సాధారణంగా రక్తంలో సీరం క్రియాటినిన్ 1.2 mg/dL కంటే ఎక్కువగా ఉంటే, మూత్రపిండాలు సరిగా పని చేయడం లేదని అర్థం. అలాంటిది ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటినిన్ స్థాయిలో చాలా మందికి 25 mg/dL కూడా ఉంది.

"కిడ్నీ వ్యాధి చికిత్స ఖర్చుల కారణంగా చాలా కుటుంబాల ఆర్థిక పరిస్థితి కూడా తలక్రిందులవుతోంది. ఆర్థిక ఇబ్బందులతో చాలామంది కిడ్నీ వ్యాధి బాధితులు వైద్యం మానుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయం కూడా సరిపోవడం లేదు. మా సర్వేలో కిడ్నీ వ్యాధి కారణంగా బాధిత కుటుంబాలు ఆర్థికంగా కోలుకోలేనంత స్థాయికి పడిపోతున్నాయనే విషయం తేలింది. కిడ్నీ వ్యాధి బాధితుల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి, వారికి ఆర్థికంగా పెద్ద సవాల్‌గా మారుతోంది." అని సోషియో, ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనే ప్రాజెక్టు చేస్తున్న స్కాలర్ హరిరామ్ బీబీసీతో చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఉద్దానం

'నిర్ధరణ పరీక్షలు తగ్గాయి'

ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బాధితుల తాజా పరిస్థితులు, గణాంకాల కోసం బీబీసీ శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారులతో మాట్లాడింది.

"కోవిడ్ మొదలైనప్పటి నుంచి కిడ్నీ నిర్ధరణ వైద్య పరీక్షలకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. సాధారణంగా పరీక్షలకు వచ్చే వారిలో 10 శాతం మందికి కిడ్నీ వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఉద్దాన ప్రాంతంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, కిడ్నీ వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకందరికి అవగాహన కల్పించాం. 2019, 2020లతో పోలిస్తే 2021, 2022లో పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు కోవిడ్ దాదాపుగా తగ్గిపోవడంతో, మళ్లీ నిర్ధరణ పరీక్షలకు వచ్చే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది" అని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ కె. లీల బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)