ఆంధ్రప్రదేశ్: వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా... ఎందుకీ ప్రచారం సాగుతోంది?

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
అధికార పార్టీ రాజకీయ కార్యాచరణలో జోరు మొదలైంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి ఆపార్టీ నేతలు గడపగడపకూ తిరుగుతున్నారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పార్టీ నేతలతో విస్తృత సమావేశాలకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు.
స్వయంగా తన పర్యటనలు విస్తృతం చేస్తూనే ఎమ్మెల్యేలు, నాయకులంతా ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తమ టార్గెట్ 175 అంటూ పదే పదే చెబుతున్నారు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా దూకుడు పెంచింది. ఆపార్టీ నాయకులు కూడా 'బాదుడే బాదుడు' పేరుతో జనం వద్దకు వెళ్లడం ప్రారంభించి మహానాడుతో వేగం పెంచారు. స్వయంగా టీడీపీ అధినేత జిల్లాల పర్యటనలు, బహిరంగసభలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తల్లో ఉత్తేజం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేగాకుండా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ కూడా ప్రస్తావించారు. అందుకు తగ్గట్టుగా పార్టీ సన్నద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, TELUGU DESAM PARTY/TWITTER
అధికార, ప్రధాన ప్రతిపక్షాలతో పాటుగా జనసేన కూడా ఎన్నికలు, పొత్తులు గురించి మాట్లాడుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో మార్చి 14న ఏర్పాటు చేసిన సభలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో తమ విధానాన్ని చాటినట్లు అయింది. కౌలు రైతులకు భరోసా యాత్ర పేరుతో ప్రతీ నెలా కొన్ని రోజుల పాటు జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేనాని దసరా నుంచి విస్తృత ప్రచారానికి కాన్వాయ్ కూడా సిద్ధం చేసుకోవడం విశేషంగా మారింది.
బీజేపీ కూడా వేగం పెంచింది. ఆపార్టీ జాతీయ నాయకులు ఏపీలో పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా ''వైసీపీ పోవాలి- బీజేపీ రావాలి'' అనే నినాదంతో రాజమహేంద్రవరంలో సభ కూడా నిర్వహించారు. జులై 4న ప్రధాని రాక సందర్భంగా విశాఖలో బహిరంగ సభకి సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా కమలదళం కూడా సమరానికి సిద్ధమవుతోంది.
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలో కూడా కదలిక కనిపిస్తోంది. ఇటీవల కడపలో ఏపీసీసీ ఆధ్వర్యంలో మేథోమథనం నిర్వహించారు. ఇంటింటికీ సీపీఎం అంటూ కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

పార్టీల కదలికలు దేనికి సంకేతం
2019లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయంతో వైసీపీ అధికారం చేపట్టింది. ఏడాదిలోగానే కరోనా కారణంగా అధికారిక వ్యవహారాలకు ఆటంకాలు ఏర్పడటంతో పాటుగా రాజకీయ కార్యాచరణకు బ్రేక్ పడింది. దాదాపు అన్ని పార్టీలు అడపాదడపా రోడ్డు మీద కనిపించడం మినహా జూమ్ మీటింగులు, ఆన్ లైన్ సమావేశాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వైసీపీ అధినేత, సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలతో సరిపెట్టుకోగా... చంద్రబాబు, పవన్ వంటి వారు అత్యధిక కాలం హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తమ పార్టీ శ్రేణులతో ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.
కొంతకాలంగా కరోనా తగ్గడంతో రాజకీయ కార్యాచరణకి దాదాపు అన్ని పార్టీలు మళ్లీ శ్రీకారం చుట్టాయి. అదే సమయంలో పాలనా పగ్గాలు చేపట్టి మూడేళ్లు నిండిన తరుణంలో అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలు, వైసీపీ అధినేత ప్రకటనలతో ఇది మరింత ఊపందుకుంది.
శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టడం, ఆ తర్వాత మంత్రి మండలిలో మార్పు ద్వారా ఎలక్షన్ టీమ్ ని సిద్ధం చేయడం ద్వారా జగన్ పంపించిన సంకేతాలు ముందస్తు చర్చను ముందుకు తీసుకొచ్చాయి. అదే సమయంలో ''గడప గడపకూ వైసీపీ'' అనే తమ నినాదాన్ని ''గడప గడపకూ ప్రభుత్వం'' అంటూ మార్చేసి అధికారయుతంగా కార్యక్రమాలకు పూనుకోవడంతో ముందస్తు ఊహాగానాలను మరింత విస్తృతం చేశాయి.
ఇక మంత్రుల బస్సు యాత్ర, వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు తామే గెలుస్తామనే ప్రకటనలకు తోడుగా వరుసగా సీఎం తన సభల్లో ప్రతిపక్షాల మీద చేస్తున్న విమర్శలు కూడా రాజకీయంగా జగన్ వేగంగా కదులుతున్నారనే అంచనాలను పెంచాయి.

ఫొటో సోర్స్, TDP/FB
విపక్షాల్లోనూ అదే స్పందన
పాలకపార్టీ నుంచి వస్తున్న స్పందనతో విపక్షాలు కూడా వేగం పెంచాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. అందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు బహిరంగ కార్యక్రమాలకు ఆస్కారం లేకపోవడంతో వీలైనంత త్వరగా ప్రజలకు చేరువ కావాలనే సంకల్పంతో కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా వివిధ రకాల కార్యక్రమాలకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా టీడీపీ సాగుతోంది. అందుకు అనుగుణంగానే మహానాడు నుంచి జిల్లాల పర్యటనల వరకూ చంద్రబాబు తీరు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, పెరుగుతున్న ధరల భారం, అభివృద్ధి కుంటుపడిందనే అంశాల చుట్టూ విపక్షం దృష్టి సారించింది. జగన్ పాలనలో శాంతిభద్రతలకు ముప్పు ఉందని పదే పదే చెబుతూ ప్రజల్లోకి వెళుతోంది. అంతేగాకుండా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీకి 160 సీట్లు ఖాయమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

ఫొటో సోర్స్, @JANASENAPARTY
కౌలుదారుల ఆత్మహత్యల అంశాన్ని ప్రధానంగా తీసుకున్న పవన్ కల్యాణ్ తన జిల్లాల యాత్ర ద్వారా ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అథోగతి పాలవుతుందని, అందుకే ఈసారి ఆపార్టీని అడ్డుకుని తీరుతామని చెబుతున్నారు. జనసేన నాయకులు కూడా వివిధ జిల్లాల్లో జనంలోకి వెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టారు. వివిధ సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఓవైపు ఎన్నికలు-పొత్తుల గురించి ప్రస్తావిస్తూనే మరోవైపు జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ కూడా దిల్లీ స్థాయి వ్యవహారాల్లో వైసీపీ నుంచి సహాయ సహకారాలు అందుకుంటున్నప్పటికీ ఏపీలో వైసీపీ విఫలమైందని విమర్శలు చేస్తోంది. పార్లమెంట్‌లో ఆపార్టీ మద్దతు పొందుతూనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించాలని అంటోంది. తాము జనసేనతో మిత్రపక్షంగా ఉన్నామని బీజేపీ నాయకులు చెబుతూనే మరోవైపు స్వతంత్రంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చివరకు జేపీ నడ్డా పర్యటనల సందర్భంగా ఆయన కూడా పవన్ పేరుని ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది.

పొత్తులు- ఎత్తుల చుట్టూ ప్రకటనలు
నాయకుల ప్రకటనలు, పార్టీల ప్రచారాలు, రాజకీయ వ్యవహారాలు అన్నీ కలిసి ముందస్తు ఎన్నికల గురించి సాగుతున్న చర్చను విస్తృతం చేస్తున్నాయి. దాదాపుగా అన్ని పార్టీలు వచ్చే ఏడాది కాలంలోనే ఎన్నికలు ఉంటాయనే రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఆ క్రమంలో విమర్శలు, ప్రతివిమర్శలు కూడా హద్దులు దాటుతున్నాయి. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ఆపార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి వారు అటు ట్విట్టర్‌లోనూ, ఇటు బహిరంగంగానూ చేస్తున్న వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా ఎన్నికల ముంగిట హద్దులు మీరే కొందరు నేతలు ఈసారి ముందుగానే ఇలాంటి వ్యవహారాలకు సిద్ధం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. తొలుత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని, బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ వస్తుందని పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో మరోసారి 2014 నాటి కూటమి ఖాయమా అనే ఆసక్తి కలిగింది. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూడా టీడీపీతో జతగట్టాయి. మూడు పార్టీల కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండానే కూటమిలో భాగస్వామిగా ఉండగా, మిగిలిన టీడీపీ, బీజేపీ రాజకీయంగా ప్రయోజనం పొందాయి. అధికారాన్ని పంచుకుని ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశాయి. 2018 నాటికి ఆ కూటమిలో విబేధాలు రావడంతో మొన్నటి ఎన్నికల్లో ఎవరి దారి వారు చూసుకున్నారు.

ఫొటో సోర్స్, PMO
2019లో టీడీపీ విడిగా పోటీ చేసింది. బీజేపీ ఒంటరిగా బరిలో దిగింది. జనసేన అటు కమ్యూనిస్టులు, ఇటు బీఎస్పీతో కలిసి రంగంలో దిగింది. కానీ మూడు పార్టీలకు ఆశాభంగం తప్పలేదు. తన చరిత్రలోనే అత్యల్పంగా టీడీపీ 23 సీట్లకు పరిమితం కాగా, జనసేన కేవలం రాజోలు అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరకు పవన్ కల్యాణ్ కూడా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ రెండో స్థానంలో నిలిచి ఓటమి చవిచూశారు. బీజేపీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక ఒక్క శాతం లోపు ఓట్లతో నోటా కన్నా వెనుకబడింది
ఆ అనుభవంతో మరోసారి కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని పవన్ కలిగించారు. కానీ అంతలోనే ముఖ్యమంత్రి పీఠం గురించి చర్చ ముందుకు రావడంతో జనసేన ఆశించిన స్పందన కనిపించడం లేదు. చివరకు బీజేపీ నాయకులు కూడా జనసేన డిమాండ్‌ని పట్టించుకోలేదు. పవన్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే అంశానికి ప్రాధాన్యత లేదని జీవీఎల్ నరసింహరావు లాంటి బీజేపీ నాయకులు కొట్టిపారేశారు. సీఎం ఎవరనేది తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన ప్రకటించారు.
ఎన్నికలు ఎప్పుడొస్తాయనే అంశం చుట్టూ చర్చ సాగుతుండగానే, వచ్చే ఎన్నికల్లో ఎవరు, ఎవరితో కలుస్తారనే అంశం కూడా ముందుకొచ్చింది. కూటములు, కూర్పులు కూడా కీలకం కాబోతున్న తరుణంలో అవి కొలిక్కి వస్తాయా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఫొటో సోర్స్, INCTELANGANA/FACEBOOK
ముందస్తు ఎన్నికల చరిత్ర
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి చరిత్ర చూస్తే 1978 వరకూ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగాయి. తొలిసారి 1982లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ తెర మీదకు వస్తున్న తరుణంలో త్వరగా ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఆపార్టీని నిలువరించాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అనూహ్య మెజార్టీతో విజయం దక్కించుకున్న ఎన్టీఆర్ ప్రభంజనం ముందు కాంగ్రెస్ ఎత్తులు ఫలించలేదు.
1989లో కూడా ఎన్టీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ఉద్యోగుల సమ్మె సహా వివిధ కారణాలతో 1990 మార్చిలో జరగాల్సిన ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు ఎన్టీఆర్ సన్నద్ధమయ్యారు. 1989 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ కంగుతిన్నారు. టీడీపీ ఓటమి చవిచూడటంతో కాంగ్రెస్‌కి తిరిగి అధికారం దక్కింది.
ఉమ్మడి ఏపీలో చివరి సారిగా ముందస్తుగా అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన అనుభవం చంద్రబాబుకి ఉంది. అలిపిరిలో జరిగిన దాడి సహా వివిధ కారణాలతో 2003లోనే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమయ్యారు. చివరకు 2004లో ఎన్నికలు జరిగాయి. కానీ ముందస్తు వ్యూహం ఫలించలేదు. టీడీపీ వరుసగా మూడో విజయం కోసం వేసిన ఎత్తులు బెడిసికొట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ విజయం కైవసం చేసుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో వరుసగా రెండు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగాయి. కానీ తెలంగాణాలో మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ విజయం సాధించి చరిత్రను తిరగరాయగలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ముందస్తు ఎన్నికలపై రాజ్యంగం ఏం చెబుతోంది.
పూర్తి అధికారం ఉన్న ప్రభుత్వానికి సభను ఎప్పుడైనా రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లే అధికారం ఉంటుందని రాజకీయ పరిశీలకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అంటున్నారు. సభలో మెజార్టీ కోల్పోయిన నాయకుడు సభను రద్దు చేయాలని ప్రతిపాదిస్తే గవర్నర్ పునరాలోచన చేయవచ్చు గానీ పూర్తి మెజార్టీ ఉన్న నాయకుడు చేసిన ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
"పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్ అనే పుస్తకం పేజీ నెం. 196లో ఇది స్పష్టంగా ఉంది. రాష్ట్రాల శాసనసభల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ సభ రద్దు కోసం ప్రతిపాదన వస్తే అది గవర్నర్‌కి వెళుతుంది. దానికి గవర్నర్ ఆమోదం తెలపగానే ప్రభుత్వం అపద్ధర్మ ప్రభుత్వంగా మారుతుంది. తదుపరి సభ ఏర్పాటుకి సంబంధించి రాజ్యాంగపరమైన ప్రక్రియను ఆరు నెలల్లోగా ఎన్నికల సంఘం పూర్తి చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఈసీదే ఆ బాధ్యత. కానీ ఆర్టికల్ 174(1) ప్రకారం శాసనసభ రెండు సమావేశాల మధ్య గడువు ఆరు నెలలకు మించకూడదు. అత్యవసరం వంటి ప్రత్యేక పరిస్థితులు మినహా ఇది అమలవుతుంది" అంటూ ఆయన వివరించారు.
2002లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శాసనసభ సమావేశాల మధ్య ఆరు నెలల గడువు రద్దయిన సభకు వర్తించదని కె. నాగేశ్వర్ గుర్తు చేశారు. ఆర్టికల్ 174 అక్కడ వర్తించదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు.
అసెంబ్లీ రద్దు, ముందస్తుకి వెళ్లడం అనేది సభ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఈసీ పరిధిలో ఉన్న అంశమంటూ రాజ్యాంగంతో పాటుగా వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులు చాటుతున్నాయి.

ఏపీలో అలాంటి అవసరం ఉందా
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికల అవసరం కనిపించడం లేదని, కానీ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం ఉత్పన్నమైనా ఆశ్చర్యం లేదని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ వెంకట్రావు అన్నారు.
"ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ 15వ సభలో అధికార పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంది. 151 స్థానాలు గెలుచుకోవడమే కాకుండా వివిధ కారణాలతో సభకు విపక్షాలు హాజరుకాకపోవడంతో అధికార పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఢోకా లేదు. రాజ్యాంగం ప్రకారం సభను కొనసాగించడమా, రద్దు చేసుకోవడమా అనే అంశంలో పాలకపక్షానికి స్వేచ్ఛ ఉంది. కానీ రాజకీయంగా ఎన్నికలు అవసరమా కాదా అనేది ఆలోచించుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలతో కలిపి ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. తదుపరి ఎన్నికలు కూడా అదే రీతిలో జరిగితే అదనపు ఖర్చు ఉండదు. కానీ అందుకు భిన్నంగా ఆలోచిస్తే మాత్రం విడివిడిగా ఎన్నికల నిర్వహణ, అది కూడా స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఎన్నికలు అనివార్యం అవుతాయి. దేశమంతా జమిలీ ఎన్నికల చుట్టూ చర్చ జరుగుతున్న తరుణంలో ఎలాంటి ముందస్తు ప్రతిపాదనలు వచ్చినా ఆశ్చర్యమే" అంటూ ఆయన బీబీసీతో అన్నారు.
ప్రజా ప్రయోజనాలకు సంబంధించినంత వరకూ ముందస్తు ఎన్నికల వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు.
ముందస్తు ఎన్నికలు ఎవరికి అవసరం
ముందస్తు ఎన్నికలు ఎప్పుడయినా అధికార పార్టీ వ్యూహాలకు అనుగుణంగానే జరుగుతుంటాయని, ప్రస్తుతం వాటి చుట్టూ చర్చ వెనుక కూడా వైసీపీ రాజకీయ లక్ష్యాలున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకుడు ఐనం ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
"కేంద్రంలో బీజేపీ నాయకత్వంతో జగన్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి ముందస్తు ఎన్నికల వ్యూహం అనుసరించాలని నిర్ణయించుకుంటే దాదాపు అడ్డు ఉండదు. వాస్తవంగా ఏపీలో ఆర్థిక పరిస్థితి కరోనా నుంచి క్రమంగా కోలుకుంటోంది. కానీ అప్పులు పెరుగుతున్నాయి. వడ్డీల భారం అనివార్యంగా ఉంటుంది. అదే సమయంలో రాజకీయంగా చూస్తే విపక్షాలు పూర్తిగా సంసిద్ధంగా కనిపించడం లేదు. నేటికీ కొన్నిచోట్ల ప్రధాన ప్రతిపక్షానికి తగిన ఇన్‌ఛార్జిలు కూడా లేరు. ముందస్తు ఎన్నికలకు వెళితే ఆయా పార్టీలు తమ శక్తి కూడదీసుకునే లోగా మరోసారి సత్తా చాటవచ్చనే అభిప్రాయం పాలకపక్షంలో ఉండవచ్చు. అదే సమయంలో ద్రవ్యోల్బణం సహా వివిధ కారణాలతో ప్రజల్లో పెరిగే అసంతృప్తి ప్రభావం పూర్తిగా కనిపించకుండా గట్టెక్కవచ్చనే అంచనాకు కూడా రావచ్చు. రాజకీయంగా ముందస్తు ఎన్నికలను అధికార పార్టీ అవకాశంగా మలచుకోవాలని చూడడం పెద్ద విశేషం కాదు" అరి ఆయన వ్యాఖ్యానించారు.
ఇతర పక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునేలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారపక్షం ఆశిస్తున్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా ప్రత్యర్థులు ఏమేరకు తమ బలాన్ని నిరూపించుకునే దిశలో ముందుకొస్తారన్నదే కీలకం అవుతుందని ప్రసాద్ బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్లకు మేలు ఎంత?
- సాద్ అన్సారీ ఎవరు? నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదంలో ఈ ముస్లిం యువకుడిని ఎందుకు అరెస్టు చేశారు?
- బిట్ కాయిన్ ఎందుకు ఇంత వేగంగా కుప్పకూలుతోంది?
- అచ్చం మీలాగే ఉండే, మీలాగే ఆలోచించే డిజిటల్ ట్విన్ రూపొందిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- 68 అడుగుల లోతులో 5 రోజులు నరకయాతన.. పదేళ్ల మూగ బాలుడిని ఎలా రక్షించారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












