మహానాడు: తెలుగుదేశం పార్టీ పండుగకు సంబంధించి 8 ఆసక్తికర అంశాలు

ఫొటో సోర్స్, TDP/FB
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
మహానాడు అంటే తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద పండుగలా భావిస్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం(మే 28) సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏటా మహానాడును నిర్వహిస్తుంది.
ఈసారి ఒంగోలులో మహానాడును రెండు రోజుల పాటు మే 27, 28 తేదీల్లో నిర్వహిస్తోంది. గతంలో మూడు రోజుల పాటు సాగిన ఈ మహానాడు స్వరూపం క్రమంగా మారుతోంది. అనేక కారణాల వల్ల తర్వాతి కాలంలో టీడీపీ దీనిని రెండు రోజలకే పరిమితం చేస్తూ వస్తోంది.

ఫొటో సోర్స్, TDP/FB
మహానాడుకు సంబంధించిన 8 ఆసక్తికర అంశాలు ఇవీ:
1. తొలి మహానాడు:
1982లో టీడీపీ పార్టీ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ ఉత్సాహన్ని కొనసాగిస్తూ 1983 మే 26, 27, 28 తేదీల్లో గుంటూరులో తొలి మహానాడు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జరుపుకొన్న తొలి మహానాడు ఇది.
అప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్‌ను ఓడించి పార్టీ పెట్టిన స్వల్ప వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ ఈ సభకు ఎందరో ప్రముఖులను ఆహ్వానించారు.
ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రాం, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు, ఎల్‌కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్‌పేయి, రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, రవీంద్ర వర్మ, మేనకాగాంధీ లాంటి పెద్ద నాయకులు టీడీపీ మహానాడుకు రావడం దేశం దృష్టిని ఆకర్షించింది.

ఫొటో సోర్స్, TDP/FB
2. మహానాడు పేరు ఎవరు పెట్టారు?
మహానాడు అనే పేరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వార్తల్లో తప్ప మరెక్కడా కనిపించదు, వినిపించదు. మహానాడు అనే పేరు పెట్టింది ఎన్టీఆరే. 1982 మార్చి 29న టీడీపీ ఆవిర్భవించాక పార్టీ జెండా, గుర్తు లాంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఈ విషయంపై ఇతర నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
అలాగే ఏప్రిల్ 11న పార్టీ విధివిధానాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు నిజాం కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సభ పేరు ఏమిటనేదానిపై అంతా చర్చిస్తుండగా...ఎన్టీఆర్ మహానాడు అని సూచించారు. దానికి అందరి ఆమోదం లభించింది.
అయితే ఆ సభను కాకుండా టీడీపీ 1983 ఎన్నికల్లో గెలిచిన తర్వాత గుంటూరులో నిర్వహించిన సభను టీడీపీ తొలి మహానాడుగా చెబుతారు. నిజాం గ్రౌండ్స్‌లో జరిగిన సభనే మహానాడుగా అనుకుంటే టీడీపీ సాధారణంగా జరిపే మహానాడు తేదీలకు భిన్నంగా ఏప్రిల్ 11న జరిగిన మొట్టమొదటి మహానాడు అదే.

ఫొటో సోర్స్, facebook/TDP
3. మహానాడు ప్రత్యేకత
టీడీపీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు అందరూ కూడా మహానాడుకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. పార్టీ కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు అంతా కలసి తీర్మానాలు ఆమోదించుకోవటం పార్టీ ఆరంభం నుంచి వస్తున్నదే. ఈ తీర్మానాల ద్వారా రాబోయే ఎన్నికల్లో పొత్తులు, ప్యూహాలు, ప్రజా పోరాటాలపై కార్యచరణ వంటివి ఉంటాయి.
అందుకే పార్టీ నాయకత్వమైతే ఈ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇక్కడే పార్టీ భూత, భవిష్యత్, వర్తమానాలపై చర్చ జరుగుతుంది. పార్టీ అధ్యక్షుల్ని కూడా ఇక్కడే ఎన్నుకుంటారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారు.

ఫొటో సోర్స్, TDP/FB
4. అప్పుడు మహానాడు జరగలేదు
ఏటా మే 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 28కి ఒక రోజు అటు, ఒక రోజు ఇటు కూడా మహనాడు జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తారు.
అయితే 1985, 1991, 1996 సంవత్సరాల్లో మహానాడు వేడుకలను టీడీపీ నిర్వహించలేదు. ఇందులో 1985లో మధ్యంతర ఎన్నికలు, 1995 'ఆగస్టు సంక్షోభం' లో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారం దక్కించుకున్న తర్వాత 1996 మహనాడు, అలాగే 1991 మే నెలలో రాజీవ్ గాంధీ హత్య తర్వాత దేశంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ ఏడాది మహానాడు నిర్వహించలేదు.
2019లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి, తరువాత 2020, 2021లలో కరోనా వ్యాప్తి కారణాలతో మహానాడు నిర్వహించలేదు.

ఫొటో సోర్స్, TDP/FB
5. ఒంగోలు మహానాడు - స్పెషల్ మహానాడు
ఒంగోలు మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు కావడం, ఎన్టీఆర్ జన్మించి 99 ఏళ్ళు పూర్తి కావొస్తుండటంతో ఆయన శత జయంతి ఉత్సవాలను మహానాడు నుంచే మొదలు పెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ మహానాడుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు చంద్రబాబు డిజిటల్ సంతకం చేసిన డిజిటల్ ఆహ్వాన పత్రికలను పంపించారు.
అందులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చతోపాటు ప్రభుత్వ "ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధానాల"పై జరిగే చర్యలో పాల్గొనాలని ఆ డిజిటల్ పత్రికలో ఉంది. ఈ డిజిటల్ ఆహ్వానాలు ఒక్కొక్కరికి ఆ వ్యక్తి పేరుతో పంపుతున్నారు.
మహానాడు సందర్భంగా ప్రత్యేక వాట్సప్ డీపీని తెలుగుదేశం విడుదల చేసింది. కార్యకర్తలు బైక్, కారు ర్యాలీలతో రాష్ట్రం నలుమూలల నుంచి మహనాడు ప్రాంగణానికి చేరుకుంటారు.

ఫొటో సోర్స్, TDP/FB
6. ఆన్‌లైన్ మహానాడు
మహానాడు కార్యక్రమానికి టీడీపీ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి వేలల్లో తరలివస్తారు. విదేశాల నుంచి కూడా వస్తుంటారు. అయితే 2020లో కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, పండుగలు, ఉత్సవాలు, ర్యాలీలపై కఠిన అంక్షలు అమలయ్యాయి.
దాంతో వేల మంది టీడీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక చోట చేరి నిర్వహించే మహానాడుకు బ్రేక్ పడింది. అయితే చంద్రబాబునాయుడు కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో డిజిటల్ వేదికపై మహానాడు నిర్వహించారు. జూమ్ యాప్ వీడియో ఛాట్ మీటింగ్ ద్వారా మహానాడు నిర్వహించారు.
14 వేల మందితో ఆన్‌లైన్‌లో మహానాడు వంటి భారీ సమావేశాన్ని నిర్వహించిన తొలి రాజకీయ పార్టీ తెలుగుదేశమేనని టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెప్తుంటారు. ఆ తర్వాత ఏడాది 2021లో కూడా డిజిటల్ వేదికపైనే మహనాడు నిర్వహించారు. అంతకు ముందు 2019లో జనరల్ ఎలక్షన్ కారణంగా మహానాడు జరగలేదు. మూడేళ్ల తర్వాత బహిరంగ వేదికపై నిర్వహిస్తున్న మహానాడు ఇదే.

ఫొటో సోర్స్, TDP/FB
7. విదేశాల్లో మహానాడు
ఒంగోలు మహానాడుతో పాటు విదేశాల్లో సైతం మహానాడును టీడీపీ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది అమెరికాలోని బోస్టన్‌లో ఈ వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. విదేశాల్లో తొలిసారి మహానాడు ఉత్తర అమెరికాలోని డాలస్ నగరంలో 2018లో జరిగింది.
అంతకు ముందు విదేశాల్లో మహానాడు సంబరాలు జరిగినా...ఏపీలో జరుగుతున్న మహానాడు వేడుకలకు అనుబంధంగా జరిగేవి. అలా కాకుండా విదేశాల్లో మహానాడును ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాన్ని మాత్రం తొలిసారి 2018లో డాలస్‌లో నిర్వహించారు.
దానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం అమెరికాలోని బోస్టన్, సౌత్ ఆఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లలో మహానాడును మే 27, 28 రెండు రోజులపాటు నిర్వహిస్తారు. దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ నాయకులు కూడా హజరవుతారు.

ఫొటో సోర్స్, TDP/FB
8. మహానాడులో ఎన్టీఆర్‌కు ఇష్టమైన వంటలు
తెలుగు దేశం పార్టీ నిర్వహించే మహానాడులో వంటకాలు కూడా ప్రత్యేకం. ఏటా మహానాడు సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యేవారి కోసం చేసే వంటకాలు వార్తల్లో నిలుస్తాయి. ఇక్కడే కాకుండా విదేశాల్లో జరిగే మహానాడు వేదికల్లో కూడా తెలుగు వంటల రుచులే ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 28న ఆయనకు ఇష్టమైన ప్రత్యేక మెనూ ఉంటుంది. కేసరి, ఇడ్లీ, పునుగు గారె, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, బాదం కత్లీ, మసాలా వడ, చింతపండు దప్పళం, కొత్త మామిడి పచ్చడి, ఉలవచారు, పూతరేకులు, కాజు, వేరుసెనగ పకోడి, వెజ్ కట్లెట్, వంకాయ పకోడి, మిక్స్‌డ్ వెజిటబుల్ చట్నీ వంటి వంటకాలు మెనూలో తప్పనిసరిగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- పోస్టాఫీసులో ప్రజలు డిపాజిట్ చేసిన కోటి రూపాయలతో ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన సబ్ పోస్ట్ మాస్టర్
- ఫేస్‌బుక్: మెటావర్స్‌లో మహిళ అవతార్‌పై లైంగిక దాడి
- యాసిన్ మలిక్‌కు జీవితఖైదు విధించడంపై పాకిస్తాన్ ఎలా స్పందించింది
- భారతీయులు లావెక్కిపోతున్నారు... ఇది మామూలు సమస్య కాదు
- స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు నష్టాల నుంచి బయట పడేందుకు ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










