జి.ఎన్.సాయిబాబా: అండా సెల్ వద్ద సీసీటీవీ కెమెరాను తొలగించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న ఖైదీ.. మహారాష్ట్ర హోంమంత్రికి కుటుంబ సభ్యుల లేఖ

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిబాబా

ఫొటో సోర్స్, A S VASANTHA

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా (పాత ఫొటో)

నాగపూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న డాక్టర్ జి.ఎన్.సాయిబాబాను ఉంచిన అండా సెల్ ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాను తక్షణమే తొలగించాలని.. ఆయన కుటుంబ సభ్యులు జైలు అధికారులను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అండా సెల్‌లో టాయిలెట్, స్నానం సహా జి.ఎన్.సాయిబాబా కదిలికలన్నిటినీ ప్రతి రోజూ 24 గంటల పాటూ చూస్తూ, నిరంతరం రికార్డు చేసేలా ఈ సీసీటీవీని ఏర్పాటు చేయటం.. రాజ్యంగం ప్రకారం ఆయనకు గల గోప్యత హక్కును, జీవన హక్కును, శారీరక సమగ్రత హక్కును ఉల్లంఘించటమేనని వారు పేర్కొన్నారు.

ఈ నెల 10వ తేదీన ఏర్పాటు చేసిన ఆ సీసీటీవీని తక్షణమే తొలగించాలని, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని జి.ఎన్.సాయిబాబా హెచ్చరిస్తున్నారని చెప్తూ వారు మహారాష్ట్ర హోంమంత్రికి ఒక లేఖ రాశారు.

ప్రొఫెసర్ సాయిబాబా భార్య ఎ.ఎస్.వసంత కుమారి, ఆయన తమ్ముడు జి.రామదేవుడు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.

మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో సాయిబాబాను 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 మార్చిలో విచారణ కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం సాయిబాబా నాగ్‌పూర్ జైలులోని 'అండా సెల్‌'లో ఏకాంతచెరలో ఉన్నారు.

జీఎన్ సాయిబాబా

ఫొటో సోర్స్, A S VASANTHA

తొంబై శాతం శారీరక వైకల్యంతో ఉండి, అనేక వ్యాధులతో బాధపడుతున్న జి.ఎన్.సాయిబాబాను జైలు అధికారులు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు రాసిన లేఖలో వారు ఆరోపించారు. ''గత ఐదేళ్లుగా జైలులో ఉన్న సాయిబాబా జైలు నిబంధనలు దేనినైనా ఉల్లంఘించారా? ఆయనను హింసించటానికి, వేధించటానికే ఇలా చేస్తున్నారు'' అని పేర్కొన్నారు.

తాను ఉన్న అండా సెల్‌లోని ప్రతి కదలికనూ సీసీటీవీ ద్వారా నిరంతరం చూస్తుండగా, అది 24 గంటలూ రికార్డు చేస్తుండగా.. తాను టాయిలెట్‌ను ఉపయోగించటానికి కానీ, స్నానం చేయటానికి కానీ ఆయన నిరాకరిస్తున్నారని తెలిపారు.

అలాగే మే 9వ తేదీన ప్రాఫెసర్ సాయిబాబా తరఫు న్యాయవాది అశోక్ సోర్డే జైలు ములాఖత్ ద్వారా సాయిబాబాను కలిసి, కొన్ని వస్తువులతో పాటు ఒక వాటర్ బాటిల్‌ను కూడా ఇస్తే, జైలు అధికారులు వాటర్ బాటిల్‌ను సాయిబాబాకు ఇవ్వటానికి నిరాకరించారని వారు తెలిపారు. సాయిబాబా మంచం పక్కన స్టీల్ థర్మోస్ బాటిల్‌ను ఉంచి ఫొటో తీసుకున్నారని.. కానీ భుజాల కండరాలు దెబ్బతినటం వల్ల సాయిబాబా ఆ బాటిల్‌ను పైకి ఎత్తలేరని వివరించారు. ఆయన కదలలేరు కాబట్టి తనకు తానుగా వెళ్లి నీళ్లు తెచ్చుకోలేరనీ పేర్కొన్నారు. ఈ ఎండా కాలంలో మొత్తం జైలులో తాగటానికి మంచినీళ్ల బాటిల్ లేని ఒకే ఒక్క ఖైదీ సాయిబాబానే అని చెప్పారు.

సాయిబాబా సహచరి వసంత

ఫొటో సోర్స్, A S VASANTHA

అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం అంతకంతకూ విషమిస్తోందని.. ఆయనను నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్‌లోన చర్లపల్లి సెంట్రల్ జైలుకు మార్చాలని.. తద్వారా ఆయన ప్రాణాలు కాపాడటానికి అవసరమైన మందులను ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అందించటానికి వీలుంటుందని తాము జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశామని కానీ దానిని తిరస్కరించారని మహారాష్ట్ర హోంమంత్రికి రాసిన ఆ లేఖలో వివరించారు.

ఇటువంటి అనారోగ్య పరిస్థితుల్లో సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆయన ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుందని.. కాబట్టి ఆయనను ఉంచిన అండా సెల్ వద్ద ఏర్పాటు చసిన సీసీటీవీ కెమెరాను తొలగించి, ఆయన రాజ్యాంగ హక్కులను కాపాడాలని కోరారు.

అలాగే.. ఆయనకు గల అర్హత మేరకు ఆయనకు సరైన చికిత్స, వైద్య సహాయం అందించేందుకు వీలుగా పెరోల్ మీద విడుదల చేయాలని కూడా కోరారు.

ఇదిలావుంటే.. అండా సెల్‌లో ఉంచిన ఖైదీలను గమనించటానికి, కేవలం నిర్వహణ, భద్రత అవసరాల కోసం అక్కడ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు నాగపూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అనూప్ కుమ్రె చెప్పినట్లు ‘ఫస్ట్‌పోస్ట్’ ఒక కథనంలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)