ప్రొఫెసర్ సాయిబాబా డిమాండ్లకు జైలు అధికారుల అంగీకారం.. నిరాహార దీక్ష ఆలోచన విరమణ

ఫొటో సోర్స్, A S VASANTHA
నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా హక్కులను పరిరక్షిస్తామని జైళ్ల శాఖ అదనపు డీఐజీ ఆయనకు హామీ ఇచ్చారని.. సాయిబాబా డిమాండ్లు నెరవేర్చటానికి అంగీకరించారని 'కమిటీ ఫర్ ద డిఫెన్స్ అండ్ రిలీజ్ ఫర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా' చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
నాగ్‌పుర్ సెంట్రల్ జైలులో జైలులో తన హక్కులు, సౌకర్యాలను నిరాకరిస్తున్నారని నిరసిస్తూ అక్టోబర్ 21వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేయబోతున్నట్లు తనకు చెప్పారని.. ఆయన భార్య ఎ.ఎస్.వసంతకుమారి ఇంతకుముందు మీడియాకు విడుదల చేసిన ఒక లేఖలో తెలిపారు.
ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయన నిరాహార దీక్ష చేపట్టకుండా నివారించటానికి.. ఆయన హక్కులను పరిరక్షిస్తామని భరోసా కల్పించాల్సిందిగా జైలు సూపరింటెండెంట్‌కు వసంతకుమారి విజ్ఞప్తి చేశారు. 'కమిటీ ఫర్ ద డిఫెన్స్ అండ్ రిలీజ్ ఫర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా' కూడా ఇదే విజ్ఞప్తి చేసింది.
ఎంతోకాలంగా చక్రాల కుర్చీకే పరిమితమైన సాయిబాబా శరీరంలో కేవలం ఒక చెయ్యి, మెదడు మాత్రమే పనిచేస్తున్నాయని.. 90 శాతం శారీరక వైకల్యం గల ఆయన చాలా కాలంగా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నారని వసంతకుమారి పేర్కొన్నారు.
ఆయన నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించినప్పటి నుంచి ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో మౌలిక హక్కులు కూడా కల్పించకుండా వేధిస్తున్నందుకే ఆయన ఈ దీక్ష చేపడుతున్నారని ఆయన కుటుంబం చెబుతోంది.
ఈ నేపథ్యంలో.. గురువారం మధ్యాహ్నం మూడు గుంటలకు ప్రొఫెసర్ సాయిబాబా కుటుంబ సభ్యులు జైలులో ఉన్న ఆయనతో ఫోన్‌లో మాట్లాడారని హరగోపాల్ తాజా ప్రకటనలో తెలిపారు.
జైళ్ల శాఖ అదనపు డీఐజీ అక్టోబర్ 20వ తేదీన జైలులో తనను కలిసి చర్చించారని.. తన డిమాండ్లు నెరవేర్చటానికి అంగీకరించారని కుటుంబ సభ్యులకు సాయిబాబా తెలిపినట్లు ఆ ప్రకటనలో వివరించారు.

ఫొటో సోర్స్, A S VASANTHA
అంగీకరించిన డిమాండ్లు ఇవీ...
అదనపు డీఐజీ అంగీకరించిన డిమాండ్లు ఏమిటనేది ఆ ప్రకటనలో వెల్లడించారు:
- ప్రొఫెసర్ సాయిబాబా భార్య, కుటుంబ సభ్యులు, ఆయన తరఫు న్యాయవాదులు పంపించిన లేఖలను ఆయనకు అందించకుండా జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలన్నిటినీ తక్షణమే సాయిబాబాకు అందించాలి.
- సాయిబాబా కుటుంబ సభ్యులు, న్యాయవాదులు అందించిన ఔషధాలను జైలు అధికారులు ఆపరాదు.. ఇప్పటివరకూ ఆపివేసిన మందులన్నిటినీ తక్షణమే సాయిబాబాకు అందించాలి.
- జైలులో గత కొన్ని నెలలుగా తనకు ఎదరవుతున్న వేధింపులు, కనీస హక్కుల నిరాకరణ గురించి వివరిస్తూ ఏడీజీ (పుణె)కు రాసిన ఫిర్యాదు లేఖను తక్షణమే ఆయనకు అందించాలి. జైలు అధికారులు ఇంతకుముందు ఆయన రాసిన లేఖలను పంపించకుండా, అక్రమంగా నిలిపివేస్తున్నారు.
- సాయిబాబా కుటుంబ సభ్యులు పంపించిన పేపర్ క్లిపింగ్‌లు అన్నిటినీ ఆయనకు తక్షణమే అందించాలి. భవిష్యత్తులో ఇటువంటి పేపర్ కటింగ్‌లను స్వాధీనం చేసుకోరాదు.
- ఆయన కుటుంబ సభ్యులు పంపించిన పుస్తకాలను ఆయనకు అందించాలి.
అదనపు డీఐజీ తన డిమాండ్లన్నిటికీ అంగీకరించటంతో డాక్టర్ సాయిబాబా అక్టోబర్ 21వ తేదీ నుంచి ప్రారంభించాలని తలపెట్టిన నిరాహార దీక్షను చేపట్టలేదని హరగోపాల్ తెలిపారు.
అయితే.. గురువారం నాడు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన సమాచారాన్ని బట్టి.. అంగీకరించిన ఈ డిమాండ్లలో వేటినీ ఇంతవరకూ అమలు చేయలేదని హరగోపాల్ పేర్కొన్నారు. నాగ్‌పూర్ జైలు అధికారులు సత్వరమే స్పందించి ప్రొఫెసర్ సాయిబాబా కనీస హక్కులను పునరుద్ధరిస్తారని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.
అలాగే.. ప్రొఫెసర్ సాయిబాబా పెరోల్ కోసం ఆయన సోదరుడు రామదేవుడు సమర్పించిన రెండో దరఖాస్తును తిరస్కరించినట్లు జైలు అధికారులు బుధవారం నాడు సాయిబాబాకు తెలియజేశారని కూడా హరగోపాల్ చెప్పారు. పెరోల్ దరఖాస్తును తిరస్కరించటానికి కారణాలు తెలియవని, తిరస్కరణకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వుల కాపీనీ సాయిబాబాకు కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఇంతవరకూ అందించలేదని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, A S VASANTHA
ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు?
దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు. 2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆయనను ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో నిర్బంధించారు.
వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కొంత కాలంగా ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదని, కరోనావైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కేస్లుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వస్తోంది.

ఫొటో సోర్స్, A S VASANTHA
వసంత రాసిన లేఖలోని ముఖ్యాంశాలు
ప్రొఫెసర్ సాయిబాబా.. తన ఆరోగ్యం రీత్యా బెయిల్ ఇవ్వాలని గతంలో కూడా కోరినపుడు.. ఆయనపై మోపిన ఆరోపణల దృష్ట్యా వికలాంగుడనే కారుణ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమని గడ్చిరౌలి సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం ఆయనకు కనీస సదుపాయాలు కూడా కల్పించడంలేదని, అందుకే ఆయన నిరాహార దీక్ష చేపడుతున్నారని సాయిబాబా భార్య ఎ.ఎస్.వసంతకుమారి చెప్పారు. నాగ్‌పుర్ జైలు సూపరింటెండెంట్‌కు ఆమె ఓ లేఖ రాశారు.
''అక్టోబరు 21 నుంచి సాయిబాబా నిరహార దీక్ష చేస్తానని చెప్పారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి. ఆయనకు మౌలిక హక్కులు కల్పించాలి'' అని ఆమె ఆ లేఖలో కోరారు.
''జైలులో మౌలిక హక్కులు కూడా కల్పించడంలేదని ఆయన నాకు ఫోన్‌లో చెప్పారు. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం.. కొన్ని నెలలుగా ఆయనకు మందులు ఇవ్వడం లేదు. వైద్యులు సూచించినట్లుగా ఆయనకు ఎలాంటి సహాయకులను నియమించలేదు. ఆయన రోజూ ఫిజియోథెరపీ చేయాలని వైద్యులు సూచించారు. కానీ, మీరు దానికి అనుమతించడంలేదు. అంతేకాదు మేం పంపించిన కొన్ని పుస్తకాలు, లేఖలు మీరు మధ్యలో ఆపేసినట్లు తెలిసింది. అందుకే, తాను నిరాహార దీక్ష చేపడతానని చెప్పారు.''

''ఒక ఖైదీగా తనకు మౌలిక హక్కులు కల్పించడంలేదని, వేధింపులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆయన దిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. నిరంతరం ఆయన పుస్తకాలు చదివేవారు. వాటి నుంచి ఆయన్ను దూరం చేయొద్దు. మేం ప్రఖ్యాత రచయితల రచనలనే పంపిస్తున్నాం. దయచేసి అవి ఆయనకు అందించండి''.
''ఆయనకు హృద్రోగాలు ఉన్నాయి. ఆయనకు మందులు ఎప్పటికప్పుడు అందించాలి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మేం చాలా బాధపడుతున్నాం. ఆయన నిరాహార దీక్ష చేపట్టకూడదని మేం భావిస్తున్నాం. దీని గురించి ఆయనకు మేం లేఖ కూడా రాశాం. దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఆయనకు ప్రాథమిక హక్కులు కల్పించాలి''.
''ఆయనతో వెంటనే ఫోన్‌కాల్ మాట్లాడేందుకు కుటుంబాన్ని అనుమతించాలి. ఆయన దీక్ష కొనసాగించకుండా మేం ఒప్పిస్తాం. మా అభ్యర్థనలపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. ఆయన సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం''అని వసంత వివరించారు.
మరోవైపు ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని 'కమిటీ ఫర్ ద డిఫెన్స్ అండ్ రిలీజ్ ఫర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా' చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ కూడా జైలు సూపరింటెండ్‌కు లేఖ రాశారు.
''నిరాహార దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆందోళనగా ఉంది. ఆయన దీక్ష చేపట్టకూడదని మేం భావిస్తున్నాం. దయచేసి మా అభ్యర్థనను ఆయనకు తెలియజేయండి''అని లేఖలో కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు.
''జైలు అనేది ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి.. అంతేకానీ వారిని శిక్షించడానికి కాదు. సాయిబాబా డిమాండ్లను పరిష్కరించాలని మేం కోరుతున్నాం''.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''యూఏపీఏను రద్దు చేయాలి''
సాయిబాబాపై మోపిన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)ను రద్దు చేయాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీ ఎమ్మెల్యే సుప్రియా సూలే, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు బుధవారం డిమాండ్ చేశారు.
ఆన్‌లైన్ వేదికగా వీరంతా బుధవారం సమావేశం అయ్యారు. బీమా కోరేగావ్ కేసులో స్టాన్ స్వామి సహా పలువురు మానవ హక్కుల ఉద్యమకారులను అరెస్టు చేయడంపై వీరు నిరసన వ్యక్తంచేశారు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
''పౌర హక్కులు, ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిపై ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి''అని హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు.
సాయిబాబా కోసం రాజకీయ పార్టీలన్నీ కదిలిరావాలని డి రాజా పిలుపునిచ్చారు. ఆయనకు 90 శాతం వైకల్యమున్నప్పటికీ బెయిలు రాకుండా కావాలనే అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- ‘నక్సలైట్ల కుట్ర కేసులు’ ఎన్నిసార్లు రుజువయ్యాయి?
- భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకొంటారు?
- విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఫ్యాక్టరీ అత్యవసరంగా తెరిచేందుకు అనుమతి
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- ట్విటర్: డోనల్డ్ ట్రంప్ ట్వీట్‌కు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








