హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, తిరుపతిలకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది?

నీరు తాగుతున్న బాలిక

ఫొటో సోర్స్, Getty Images

మండు వేసవిలో తాగునీటి అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజుకోసారో, లేక రెండు రోజులకు ఒకసారో, ఏదో రూపంలో నగరవాసులకు మునిసిపాలిటీ వారి తాగు నీరు అందుతోంది. దానికి రకరకాల దారులున్నాయి. వేల జనాభా ఉండే చిన్నపట్టణాలు సరే. మరి లక్షల జనాభా ఉండే మహా నగరాలకు మంచి నీరు ఎలా అందుతోంది?

ఇంత జనాభాకు నిత్యం ఇంటికి కుళాయిలో నీళ్లు ఎలా వస్తాయి? హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ, తిరుపతి - రెండు రాష్ట్రాల్లో పెద్దవి, ప్రముఖమైనవి అయిన ఈ నగరాల ప్రజలకు నీరు ఎక్కడి నుంచి, ఎలా వస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ. ముందుగా హైదరాబాద్ గురించి తెలుసుకుందాం.

హైదరాబాద్

విశాఖ, విజయవాడ, తిరుపతి, వరంగల్ - ఈ నాలుగు నగరాల జనాభా మొత్తం కలిపినా దానికంటే ఎక్కువమంది హైదరాబాద్‌లో ఉన్నారు. అందుకే నీటి కష్టాలు కూడా ఈ నగరానికి వాటన్నింటి కంటే ఎక్కువే.

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ నగర జనాభా 68 లక్షలు. అయితే ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రస్తుతం 90 లక్షల జనాభా దాటేసింది. ఇంత పెద్ద నగరం కాబట్టే ఈ నగరంలో మంచినీరు, మురుగు నీరు నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అంటే సీవరేజ్ బోర్డు అనే సంస్థ 1989లో ప్రారంభం అయింది. రెండు రాష్ట్రాల్లోని మిగిలిన నగరాల్లో ఆయా స్థానిక మునిసిపల్ కార్పొరేషన్లే ఈ పని చేస్తాయి. హైదరాబాద్‌లో ఈ సంస్థను ఒక ఐఏఎస్ అధికారి నిర్వహిస్తారు. స్వయంగా సీఎం చైర్మన్ గా ఉంటారు. వందల మంది ఇంజినీర్లు, మేనేజర్లు పని చేస్తుంటారు.

ఇక హైదరాబాద్‌కు నీరు వచ్చేది ఇక్కడా అక్కడా అని లేదు. గోదావరి, కృష్ణా రెండు నదులనీ, అనేక చెరువులను కలిపి వాడేస్తున్నా ఈ నీరు సరిపోవడం లేదు.

హైదరాబాద్ నగర నీటి అవసరాల కోసం ప్రత్యేక బోర్డు పని చేస్తుంది
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ నగర నీటి అవసరాల కోసం ప్రత్యేక బోర్డు పని చేస్తుంది

ప్రస్తుతం హైదరాబాదు నగరంలో 12 లక్షల 50 వేల కుళాయి కనెక్షన్లున్నాయి. వాస్తవానికి శివార్లతో కలిపి నగరానికి రోజుకు 732 మిలియన్ గ్యాలన్ల నీరు కావాలని ఒక అంచనా. ప్రధాన నగరమే చూసుకుంటే 530 ఎంజీడీల నీరు కావాలి.

ప్రస్తుతం రోజుకు 460-480 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తోంది వాటర్ బోర్డు. వీటిలో గోదావరి నీరు 155, కృష్ణా నీరు 275 ఎంజీడీలు ఉన్నాయి. ఇంకా రోజు 70 ఎంజీడీల నీటి కొరత ఉంది హైదరాబాద్లో. అందుకే చాలా కాలనీల్లో నీటి సమస్య తీవ్రంగా కనిపిస్తుంది.

మరీ చరిత్రలోకి వెళ్లకపోయినా, ఒకప్పటి నగర తాగునీటి అవసరాల కోసం పనికొచ్చిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నీటిని ఇప్పుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టింది. ఒకప్పుడు ఈ రెండు చెరువులే హైదరాబాద్ తాగు నీటి అవసరాలకు దిక్కుగా ఉండేవి. తరువాత క్రమంగా మంజీర వంటివి చేరాయి.

గండిపేట చెరువు
ఫొటో క్యాప్షన్, గండిపేట చెరువు

ఇప్పుడు హైదరాబాద్‌కు ప్రధానంగా సింగూరు, మంజీర, యల్లంపల్లి నుంచీ గోదావరి నీళ్లు, మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువల నుంచి కృష్ణా నీరు వస్తుంది. తాజాగా నిలిపివేసిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వీటికి అదనం.

వీటిలో సాధారణంగా యల్లంపల్లి నుంచి 86 ఎంజీడీలు (మిలియన్ గ్యాలన్ పర్ డే), అక్కంపల్లి నుంచి 270, మంజీర 45, సింగూరు 75 వరకూ తీసుకోవచ్చు.

రోజూవారీ తాగునీటి అవసరాలు, లభ్యత ఆధారంగా ఎంత నీరు తీస్తారు అనేది మారుతూ ఉంటుంది. ఇక ఉస్మాన్ సాగర్ నుంచి 25 ఎంజీడీలు, హిమాయత్ సాగర్ నుంచి 15 ఎంజీడీలు తీసేవారు. ఈ నీటిని దాదాపు 494 స్టోరేజీ రిజర్వాయర్లలో నిల్వ చేస్తారు. వీటి సామర్థ్యం 767 మిలియన్ లీటర్లు.

కుళాయిలు కాకుండా రోజుకు 1500 వరకూ ట్యాంకర్ల బుకింగుల కోసం హైదరాబాద్ జల మండలికి డిమాండ్ ఉంటుంది. ఈ రెండు చెరువులు తప్ప మిగతా నీరంతా పంపు చేయాల్సిందే.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ హైదరాబాద్‌కు ప్రధాన తాగు నీటి వనరులు
ఫొటో క్యాప్షన్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ హైదరాబాద్‌కు ప్రధాన తాగు నీటి వనరులు

ఇవన్నీ ఉన్నప్పటికీ హైదరబాద్ లో నీటి కొరత తీవ్రంగానే ఉంది. అనేక కాలనీల్లో నీటి లభ్యత సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. నగరం బాగా విస్తరించడంతో శివార్లలోని మునిసిపాలిటీల్లో, పంచాయితీల్లో నీటి సమస్యలు వీటికి అదనం. దీంతో దానికి శాశ్వత పరిష్కారంగా పలు ప్రణాళికలు రచించింది తెలంగాణ ప్రభుత్వం.

నాగార్జునసాగర్ వెనుక వైపు నీరు తీసుకునేలా సుంకిశాల ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితమే దీనికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇది అందుబాటులోకి వస్తే ఇక హైదరాబాద్‌కు నీటి కొరత ఉండదని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం.

రూ.1450 కోట్లతో చేపడుతోన్న ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్ డెడ్ స్టోరీజీ నుంచి కూడా నీరు తీసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ కి కృష్ణా నీటిని (అక్కంపల్లి) ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ ద్వారా తరలిస్తున్నారు. అందులో అనేక సమస్యలు ఉన్నాయి. సుంకిశాలతో ఆ సమస్యలు కూడా తీరతాయి.

ఇది కాక కేశవాపూర్, దేవులమ్మనాగారం దగ్గర కూడా చిన్నచిన్న రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఇక ఔటర్ రింగు రోడ్డు చుట్టూ నీటి సరఫరా కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేయబోతోంది ప్రభుత్వం. ఇటీవల ఎన్నికల హామీగా మీటర్లు ఉన్న దాదాపు 2.5 లక్షల ఇళ్లకు, మీటర్లు లేని మరో 2 లక్షల ఇళ్లకు నెలకు 20 వేల లీటర్ల చొప్పున ఉచిత మంచి నీరు ఇస్తున్నట్టు వాటర్ బోర్డు ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వ అంచనా ప్రకారం సుంకిశాల పూర్తయ్యే వరకూ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల వారికి తాగునీటి కష్టాలు తప్పవు. మరోవైపు జంట జలాశయాల చుట్టూ నిర్మాణాలు అనుమతిస్తే ఆ చెరువుల్లో నీరు ఇక తాగడానికి పనికిరాదన్న వాదన ఒకవైపు, అసలు అవసరమే లేదన్న ప్రభుత్వ వాదన మరోవైపు చర్చలుగా సాగుతూనే ఉన్నాయి.

కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ కూడా అవసరమైతే హైదరాబాద్ నీటి అవసరాలకు ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

ఒకటి వాస్తవం. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పని చేసే Central Public Health & Environmental Engineering Organisation (CPHEEO) నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. కానీ ఏ నగరంలోనూ అది పూర్తి స్థాయిలో అమలయ్యే పరిస్థితి లేదు.

మేఘాద్రి గడ్డ
ఫొటో క్యాప్షన్, మేఘాద్రి గడ్డ

విశాఖపట్నం

ఇక ఆంధ్రలో అతి పెద్దనగరం విశాఖపట్నం. విశాఖ, హైదరాబాద్ ఈ రెండూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నగరాలు. విశాఖ కంటే హైదరాబాద్ సుమారు నాలుగు రెట్లు పెద్దది. నగరం సైజు పెరిగే కొద్దీ తాగునీటి కష్టాలు పెరుగుతాయి. అందుకే తిరుపతి, విజయవాడ, వరంగల్ తో పోలిస్తే విశాఖకు కాస్త కష్టాలెక్కువ.

విశాఖ జనాభా 22.5 లక్షలు. సిటీ నీటి అవసరాలను తీర్చేందుకు జీవీఎంసీ ప్రధానంగా ఏడు రిజర్వాయర్లపై ఆధారపడుతుంది. ఏలేరు, రైవాడ, తాటిపూడి, మేఘాద్రి గడ్డ, గోస్తనీ, గంభీరం, ముడసర్లోవ వీటి పేర్లు.

ఇందులో ఏలేరు నుంచి రోజుకు 42.65 మిలియన్ గ్యాలన్లు, రైవాడనుంచి 13.20, తాటిపూడి నుంచి 10.01, మేఘాద్రిగడ్డ నుంచి 8.01, గోస్తనీ నుంచి 5, గంభీరం నుంచి 1.10, ముడసర్లో నుంచి 1.10 మిలియన్ గ్యాలన్ల చొప్పున తీసుకుంటారు. ఏలేరు నీరు పారిశ్రామిక అవసరాల కోసం కూడా వాడతారు.

వీటికి అదనంగా ఇతర పబ్లిక్ వాటర్ స్కీమ్స్ అంటే నూతులు, బోర్లు ద్వారా విశాఖకు 5.45 జీఎండీల నీరు రోజు వినియోగంలోకి వస్తుంది. ఒక గ్యాలన్ అంటే 4.546 లీటర్లు.

ఇవన్నీ ఉన్నా నగరానికి నీరు తగినంత సరిపోవడం లేదు. విశాఖకు రోజూ 108 ఎంజీడిల నీరు అవసరం కాగా, సుమారు 86.5 ఎంజీడీల నీరే అందుబాటులోకి వస్తోంది. ఇందులో రోజూ 16 నుంచి 19 జీఎండీలు పరిశ్రమలకు అందిస్తారు.

ఏలేరు నుంచి వచ్చే నీటితోనే జీవీఎంసీ పరిధిలోని రోజువారి 60 శాతం నీటి అవసరాలు తీరుతాయి. విశాఖకు వివిధ రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిని 11 ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేస్తారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖకు 125 ఎంజీడీల నీటిని ఏలేరు నుంచి వచ్చే విధంగా పైప్‌లైన్‌ పనులు జరుగుతున్నాయి. అలాగే పోలవరం పూర్తయితే అక్కడ నుంచి నీరు విశాఖ తీసుకుని వచ్చేందుకు ఇప్పటికే పనులు జరుగుతున్నాయి.

వరంగల్ నగరంలోని కాకతీయ తోరణం

ఫొటో సోర్స్, S.Praveen Kumar

వరంగల్

దాదాపు విజయవాడతో సమానంగా ఉండే నగరం వరంగల్. జనాభాలో కాస్త హెచ్చుతగ్గులున్నా దాదాపు సమాన నగరాలివి. తెలంగాణలో హైదరాబాద్ తరువాత పెద్ద నగరం వరంగల్. హనుమకొండ, కాజీపేట, వరంగల్ కలిపిన ఈ నగర జనాభా 2011 లెక్కల ప్రకారం 6,27,449.

2013 లో 42 గ్రామాల విలీనంతో వరంగల్ కార్పోరేషన్ 'గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్' (GWMC) గా మారింది. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ పరిధిలో జనాభా 11 లక్షలుగా అంచనా. ఇక వరంగల్ ప్రజలకు ప్రధాన తాగు నీటి వనరు గోదావరి నది.

దేవాదుల, లోయర్ మానేరు డ్యామ్‌ల నుంచి గోదావరి నీటిని వరంగల్‌కు అందిస్తున్నారు. నగరంలో మొత్తం 2 లక్షల కుళాయి/నల్లా కనెక్షన్లు ఉండగా రోజూ నీరిస్తున్నారు.

ధర్మసాగర్ చెరువులో ఎల్ఎండీ( లోయర్ మానేరు డ్యామ్), దేవాదుల నీటిని నిల్వచేసి 4 ఫిల్టర్ బెడ్ ల ద్వారా శుద్ధిచేసి సరఫరా చేస్తున్నారు. గతంలో ధర్మసాగర్ చెరువుతో పాటు భద్రకాళీ చెరువులో వేసవి అవసరాల కోసం నీటిని నిల్వ చేసేవారు. అయితే ఇటీవల కాలంలో భద్రకాళీ బండ్ ను పర్యాటకంగా అభివృద్ది పరిచారు.

వరంగల్ కార్పోరేషన్ అవసరాలను తీర్చే 4 ఫిల్టర్ బెడ్ లలో ప్రతి రోజు 219.78 ఎంఎల్డీ (మిలియన్స్ ఆఫ్ లీటర్స్ పర్ డే) నీటి శుద్ధి జరుగుతోంది.

సిబ్బంది వేతనాలతో కలిపి ప్రతి ఏటా తాగునీటి సరఫరా నిర్వహణ ఖర్చు 15.36 కోట్ల రూపాయలు. 630.37 కోట్ల నిధులతో తాగునీటి సరఫరా మరింత మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో 'అమృత్ స్కీమ్' పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నగరానికి తాగునీటి సమస్య తీవ్రంగా ఏమీ లేదు, కానీ తరచూ పైపుల లీకేజీ వల్ల నీటి వృథా ఎక్కువవుతుంటుంది.

విజయవాడ
ఫొటో క్యాప్షన్, విజయవాడ

విజయవాడ

ప్రస్తుతానికి తాగునీటి విషయంలో కాస్త నిమ్మళంగా ఉన్నది విజయవాడ నగరం. ఎందుకంటే పక్కనే కృష్ణా నది ఉంది. అంతకుమించి ప్రకాశం బ్యారేజ్ పుణ్యమా అని ఎప్పుడూ నీరు నిల్వ ఉంటుంది.

ఎప్పుడైనా కృష్ణా నది వరద ప్రవాహం తక్కువగా ఉంటే పట్టిసీమ నుంచి వచ్చిన నీటిని కూడా తాగునీటి అవసరాలకు వినియోగించిన సందర్భాలున్నాయి. ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన కృష్ణా నది నుంచి తాగునీటిని సేకరించి, దానిని శుభ్రపరిచిన తర్వాత నగరంలోని ఇంటింటికీ సరఫరా చేస్తారు.

కృష్ణా నదిలో విజయవాడకు నీరిచ్చే పథకం
ఫొటో క్యాప్షన్, కృష్ణా నదిలో విజయవాడకు నీరిచ్చే పథకం

2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో 10,39,518 జనాభా ఉన్నారు. ప్రస్తుతం సుమారు 13 లక్షలు ఉండవచ్చని అంచనా. నగరంలో తాగునీటి సరఫరా కోసం 960 కిలోమీటర్ల మేర వాటర్ పైప్ లైన్ ఉంది.

మొత్తం గృహ అవసరాలకు తాగునీటి కుళాయిల సంఖ్య 1,08,712గా ఉంది. పబ్లిక్ కుళాయిలు 2,892 ఉన్నాయి. రోజుకి సగటున 150 లీ.ల చొప్పున మంచినీటి సరఫరా జరుగుతోంది. రోజుకి 39 మిలియన్ గ్యాలన్ల శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్నారు. దీని కోసం నగరంలో 620.5 లక్షల గ్యాలన్ల సామర్థ్యంతో 59 రిజర్వాయర్లున్నాయి.

ముందే చెప్పుకున్నట్టు బ్యారేజ్ పక్కన ఉండడం వల్ల నగరంలో తాగునీటి కొరత చాలా అరుదు. కొండ ప్రాంతంలో ఉన్న వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు.

కల్యాణి డ్యామ్
ఫొటో క్యాప్షన్, కల్యాణి డ్యామ్

తిరుపతి

విశాఖ, విజయవాడతో పాటూ ఆంధ్రలో మరో ప్రముఖ నగరం తిరుపతి. తిరుపతికి స్థానికులే కాకుండా యాత్రికులు కూడా వస్తుంటారు. ఈ నగరానికి ప్రధానంగా తెలుగు గంగ, కల్యాణి డ్యామ్ నుంచి నీరు వస్తుంది. దీంతో పాటూ బోర్లు కూడా ప్రధాన వనరే.

2011 జనాభా లెక్కల ప్రకారం తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మూడు లక్షల పదివేల జనాభా ఉండగా.. ప్రస్తుతం అది 4.56 లక్షలు దాటింది. తిరుపతిలో 50 వేల నీటి కనెక్షన్లు ఉన్నాయి. కల్యాణి డ్యామ్, తెలుగు గంగలకు అదనంగా, నగరంలో ఉన్న 4 వందల బోర్ల నుంచి నీటి సరఫరా జరుగుతుంది. ఇక్కడ ప్రతీ రోజూ కాకుండా రోజు విడిచి రోజు నీరు వస్తుంది.

తిరుపతిలో రోజుకి 3mcft (మిలియన్ కూబిక్ ఫీట్)ల నీరు అవసరం అవుతుంది. సంవత్సరానికి దాదాపు 1000mcft నీరు వినియోగం ఉంటుంది. కల్యాణి డ్యామ్ నుంచి 400 mcft, కండలేరు నుంచి వచ్చే తెలుగు గంగ నుంచి 600mcftలు తిరుపతికి తీసుకుంటారు. ఈ నీటిని కాళహస్తి సమీపంలో కైలాసగిరి రిజర్వాయర్ లో స్టోర్ చేసి అక్కడి నుంచి ఆరు పంపింగ్ సిస్టంల ద్వారా తిరుపతికి తెస్తారు.

తిరుపతి నగరం
ఫొటో క్యాప్షన్, తిరుపతి నగరం

కల్యాణి డ్యామ్ ఎత్తులో ఉండడంతో కాస్త సులువుగా నీరు వస్తుంది. కానీ తెలుగు గంగ నీటి నిర్వహణకు దాదాపు ఏటా రూ.12 కోట్లు ఖర్చు పెడుతుంటారు.

ఇక తిరుమల కొండపై సాధారణ సమయాల్లో 80 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. వారి నీటి అవసరాలకు తిరుమలలో పాపవినాశం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుదార అనే 5 చిన్న నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితోపాటు దిగువనున్న కల్యాణి డ్యామ్ నీటిని కూడా తిరుమల నీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు.

తిరుమలలో రోజుకు 5mcftల నీరు అవసరం ఉంది. అందులో కొండ కింద కల్యాణి డ్యామ్ నుంచి 20 LG (ల్యాక్ గ్యాలర్స్), పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుదారల నుంచి 12LG నీటిని వాడుతున్నారు. మొత్తం ఏడాదికి సుమారు 186 mcft నీరు అవసరం ఉంటుంది. తిరుమలలో నీటి అవసరాలకు గానూ ఏడాదికి 6 కోట్లు వరకూ ఖర్చవుతుంది.

రిపోర్టింగ్: బళ్ల సతీశ్(హైదరాబాద్), లక్కోజు శ్రీనివాస్(విశాఖపట్నం), శంకర్ వడిశెట్టి(విజయవాడ), శుభం ప్రవీణ్ కుమార్(వరంగల్), తులసీ ప్రసాద్ రెడ్డి(తిరుపతి)

వీడియో క్యాప్షన్, రెంట చింతల: ‘ఈ గ్రామంలో మీరైతే గంటసేపు కూడా ఉండలేరు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)