ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?

డెలివరీ తర్వాత సిద్ధూ మూసేవాలా తల్లి

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, డెలివరీ తర్వాత సిద్ధూ మూసేవాలా తల్లి

దివంగత పంజాబీ పాప్ సింగర్ శుభ్‌దీప్ సింగ్ అలియాస్ సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో మరో బిడ్డకు జన్మనిచ్చారు.

పుట్టిన బిడ్డ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బాబు అచ్చం శుభ్‌దీప్(సిద్ధూ మూసేవాలా అసలు పేరు) మాదిరే ఉన్నాడని సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్‌కౌర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.

సిద్ధూ మూసేవాలా 2022 మే 22న హత్యకు గురయ్యారు.

బిడ్డ పుట్టిన తర్వాత, సిద్ధూ మూసేవాలా ఇంటికి చాలామంది బంధువులు, స్నేహితులు వస్తూ సిద్ధూ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుంచీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

బఠిండాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు చరణ్ కౌర్.

అయితే, ఈ వయసులో ఆమె బిడ్డను కనడంపై చర్చ సాగుతోంది. ఎందుకంటే, చరణ్ కౌర్‌ 58 ఏళ్ల వృద్ధురాలు. సాధారణంగా ఈ వయసులో బిడ్డను కనడం చాలా కష్టంతో కూడుకున్న విషయమే.

చరణ్ కౌర్ ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్జిలైజేషన్) విధానంలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు.

అయితే, పెద్ద వయసులో ఇలా పిల్లలను కనడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వివరణ కోరింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

సిద్ధూ మూసేవాలా, ఆయన తల్లి చరణ్ కౌర్

ఫొటో సోర్స్, CHARAN KAUR/INSTA

ఫొటో క్యాప్షన్, సిద్ధూ మూసేవాలా, ఆయన తల్లి చరణ్ కౌర్ (ఫైల్ ఫోటో )

ఐవీఎఫ్ విధానంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి?

డాక్టర్ రజనీ జిందాల్ సంరక్షణలో చరణ్ కౌర్ రెండో బిడ్డను కన్నారు.

ఈ వార్త ద్వారా ఐవీఎఫ్ టెక్నాలజీ గురించి అపోహలను, తప్పుడు అభిప్రాయాలను ప్రజలు పొందకూడదని రజనీ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

పెద్ద వయసులో ఐవీఎఫ్ టెక్నాలజీ వాడేటప్పుడు, తల్లి ఆరోగ్యకరంగా ఉండటం అత్యంత ముఖ్యమని చెప్పారు.

చరణ్ కౌర్ వైద్య పరీక్షల కోసం ప్రతి రోజూ వచ్చేవారని తెలిపారు. పెద్ద వయసులో కొన్నిసార్లు బ్లడ్ ప్రెజర్(రక్త పోటు) పెరుగుతుంది. రక్తస్రావమయ్యే అవకాశముంటుంది. అందుకే తాము ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చేదన్నారు.

చరణ్ కౌర్ పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నారని తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించి ఆమెకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. అందుకే, తాము ఐవీఎఫ్ విధానాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని రజనీ జిందాల్ తెలిపారు.

‘‘వయసు పైబడిన తర్వాత గర్భవతి అయితే, తొలుత చేయాల్సిన పని తల్లి ఆరోగ్యాన్ని పరీక్షించడం. ఆమె ఆరోగ్యాన్ని సంరక్షించడం మా ప్రధాన బాధ్యత. ఏదైనా ప్రొసీజర్‌ను ప్రారంభించే ముందు, తల్లిని క్షేమంగా ఉంచడం ముఖ్యం. ఇది ప్రతిఒక్కరి బాధ్యత’’ అని రజనీ జిందాల్ చెప్పారు.

‘‘తల్లి ఆరోగ్యకరంగా లేకపోతే, ఐవీఎఫ్ టెక్నాలజీ వాడటానికి వీలు లేదు. ఒకవేళ తల్లి ఆరోగ్యకరంగా ఉండి, శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గుండె సరిగ్గా పనిచేస్తూ, డయాబెటీస్ లేనప్పుడు అలాంటి వ్యక్తులు ఐవీఎఫ్ టెక్నాలజీ సాయం తీసుకోవచ్చు’’ అని తెలిపారు.

తల్లి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ, వారిని తమ సంరక్షణలో ఉంచడం మేలని చెప్పారు. డెలివరీ సమయంలో తల్లిని, బిడ్డను క్షేమంగా ఉంచడం ముఖ్యమన్నారు.

బిడ్డ పుట్టినప్పుడు రెండు కిలోల బరువు ఉన్నాడని డాక్టర్ రజనీ జిందాల్ చెప్పారు.

సిద్ధూ మూసేవాలా తండ్రి

ఫొటో సోర్స్, BALKAUR SIDHU/INSTA

ఫొటో క్యాప్షన్, పుట్టిన బిడ్డను ఎత్తుకున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన సిద్ధూ మూసేవాలా తండ్రి

ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్జిలైజేషన్) అంటే ఏమిటి?

సహజ పద్ధతిలో లేదా మరేదైనా పద్ధతుల ద్వారా గర్భవతి కాలేనప్పుడు ఐవీఎఫ్ వాడతారు.

‘‘1978లో లెస్లీ బ్రౌన్ టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనివ్వడంతో ఇది ప్రారంభమైంది. మహిళల ట్యూబ్స్ దెబ్బతినడమో, ఇన్ఫెక్షన్ కు గురవడమో జరిగితే, వారికి ఐవీఎఫ్ విధానాన్ని ఉపయోగిస్తారు’’ అని గుజరాత్‌లోని ఆనంద్‌లో ఆకాంక్ష హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో మెడికల్ డైరక్టర్‌గా ఉన్న డాక్టర్ నయనా పటేల్ బీబీసీతో చెప్పారు.

ఈ విషయాన్ని పటేల్ మరింత వివరిస్తూ ‘‘అండాన్ని, వీర్యాన్ని ప్రయోగశాలలో ఫలదీకరణ చెందిస్తాం. పిండం సిద్ధమయ్యాక , దానిని మహిళ యుటెరస్‌లో ప్రవేశపెడతాం. ఈ టెక్నాలజీ ఎంతోమంది జంటలకు సంతానాన్నిచ్చింది. పిల్లలు కలగరేమోననుకునే మహిళల బెంగను తీర్చింది’’ అని చెప్పారు.

వృద్ధాప్యంలో ఐవీఎఫ్ ఎంత ప్రమాదకరం?

వృద్ధాప్యంలో ఐవీఎఫ్‌కు వెళ్లడం కాస్త కష్టంతో కూడుకున్నదేనని గైనకాలజిస్ట్ డాక్టర్ శివాని చెప్పారు. ఆ వయసులో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అలాగే, గర్భవతి అయినప్పుడు కూడా శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయన్నారు.

వృద్ధాప్యంలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చితే, బయట నుంచి చాలా రకాల హార్మోన్లను ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల రక్తపోటు, డయాబెటీస్, కొలెస్టరాల్ పెరగడం వంటివి జరుగుతుంటాయి.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

మెనోపాజ్ తర్వాత మహిళకు ప్రెగ్నెన్సీ వస్తుందా?

మెనోపాజ్ తర్వాత ఐవీఎఫ్ ద్వారా గర్భవతి కావడం చాలా కష్టమైన విషయమని డాక్టర్ శివాని అన్నారు.

మెనోపాజ్ అంటేనే మహిళల యుటెరస్‌లో పూర్తిగా అండాలు తగ్గిపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో వేరే వారి అండాలను తీసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత, హార్మోన్లతో మెనోపాజ్ అయిన మహిళ గర్భాశయాన్ని సిద్ధం చేయడం ద్వారా ఓవులేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ విధంగా మహిళ గర్భవతి కావొచ్చు.

వయసు పెరుగుతున్నా కొద్ది శరీరంలో హార్మోన్లు తగ్గడం వల్ల యుటెరస్ కూడా కుచించుకు పోతుంటుంది. దీనివల్ల బయట నుంచి హార్మోన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

కొన్నిసార్లు ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి. ఆ తర్వాత యుటెరస్ మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలుపెడుతుంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

చట్టం నిర్దేశించిన వయోపరిమితి ఎంత?

భారత్‌లో 2021లో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టి)యాక్ట్ అమలులోకి వచ్చింది.

ఈ చట్టం ప్రకారం ఐవీఎఫ్ కింద తల్లిదండ్రులవ్వాలనుకునేవారికి భర్త వయసు 55గానూ, భార్య వయసు 50ఏళ్ళుగా నిర్థరించారు.

ఇది సరైన వయోపరిమితి అని దిల్లీలోని బ్లూమ్ ఐవీఎఫ్ సెంటర్‌లో ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సునీతా ఆరోరా అన్నారు.

‘‘వయోపరిమితి విధించడంలో ఒక కారణం ఏమిటంటే పిల్లలను పెంచి పెద్దచేయడం. ఉదాహరణకు పిల్లాడికి 15, 20 ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రుల వయసు 70 ఏళ్ళు దాటుతుంది. ఆ సమయంలో వారు పిల్లాడి బాగోగులు ఎలా చూడగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా చూసినప్పుడు 50 ఏళ్ళ వయసులో తల్లి కావడం అంత తేలికైన విషయం కాదు’’ అని ఆరోరా చెప్పారు.

‘‘ఐవీఎఫ్ విధానంలో 45 ఏళ్ళు దాటినవారి విషయంలో వారి ఆరోగ్యం గురించి మేం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే గర్భవతుల గుండె వేగం పెరుగుతుంది. వారి రక్తపోటు కూడా హెచ్చు తగ్గులతో ఉంటుంది. చాలా సందర్భాలలో మహిళలు ఈ మార్పులను తట్టుకోలేరు’’ అన్నారు ఆరోరా.

వృద్ధాప్యంలో ఐవీఎఫ్ విధానం కింద పిల్లలు కనడాన్ని డాక్టర్ పటేల్ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే కొన్ని కేసుల్లో ఒకటీ లేదా రెండేళ్లు మినహాయింపు ఇచ్చేలా ఏదైనా ప్రత్యేక ప్రొవిజన్ ఉండి ఉంటే బావుండేదన్నారు.

‘‘ఉదాహరణకు భార్య వయసు 40 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండి, భర్త వయసు 56 ఏళ్ళు ఉన్నా, లేదంటే భర్త వయసు 53 ఉండి, భార్య వయసు 51 ఉన్నా, వారు ఆరోగ్యంగా ఉంటే ఇటువంటి కేసులో ఐవీఎఫ్ విధానాన్ని అనుమతించవచ్చు’’ అని చెప్పారు.

ఈ కేసుల్లో సక్సెస్ రేటెంత?

35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళల కేసుల్లో 80 శాతం సక్సెస్ సాధించవచ్చని డాక్టర్ నయనా పటేల్ బీబీసీకి తెలిపారు.

35 నుంచి 40 ఏళ్ల వయసున్న మహిళలు, బిడ్డను కనే అవకాశం 60 శాతం ఉంటుందన్నారు. ఒకవేళ 40 ఏళ్లు దాటితే, కేవలం 18 నుంచి 20 శాతం కేసులు మాత్రమే విజయవంతమవుతాయని చెప్పారు.

సిద్దూ మూసేవాలా, తల్లి చరణ్ కౌర్

ఫొటో సోర్స్, FB/CHARAN KAUR

సిద్ధూ మూసేవాలా ఎవరు?

28 ఏళ్ల సిద్ధూ మూసేవాలా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ గాయకుడు.

2022 మే 29న ఆయన హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గం మధ్యలో దుండగులు ఆయన్ను అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు.

సిద్ధూ మూసేవాలా 2020 మే 15న విడుదల చేసిన పాటను తన తల్లికి అంకితం చేశారు. ‘డియర్ మామా’ అనే పేరుతో ఈ పాట విడుదలైంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)