‘నేను గర్భవతిని, నా బిడ్డకు 25-45 ఏళ్ల వయసున్న అద్దె తండ్రి కావాలి’ - బీబీసీ పరిశోధనలో బయటపడిన బ్రిటన్ మగాళ్ల వ్యాపారం

ప్రతీకాత్మక చిత్రం
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ప్యాట్రిక్ క్లాహన్, దివ్య తల్వర్, ఖుయే బి లు
    • హోదా, బీబీసీ న్యూస్‌నైట్

బ్రిటన్‌కు వలస వచ్చి అక్రమంగా నివసిస్తున్న మహిళల పిల్లలకు తండ్రిగా నటించేందుకు బ్రిటిషర్లు వేల పౌండ్లు (లక్షల రూపాయలు) తీసుకుంటున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

తమ పిల్లలకు యూకే పౌరసత్వం కోసం, వారి జనన ధ్రువీకరణ పత్రాల్లో తండ్రిగా బ్రిటిష్ వ్యక్తి పేరును చేర్చేందుకు దాదాపు 9 లక్షల రూపాయలు చెల్లించేందుకు కూడా ఆ మహిళలు సిద్ధమవుతున్నారు. పిల్లలకు యూకే పౌరసత్వం లభిస్తే వారి తల్లులు కూడా అక్కడ నివాసానికి అర్హత సాధించేందుకు మార్గం సులభమవుతుంది.

ఈ వ్యాపారం చేసేందుకు మోసగాళ్లు ఫేస్‌బుక్‌‌ను వాడుకుంటున్నారు. ఇలా వేలాది మంది మహిళలకు సాయం చేస్తున్నట్లు వారు చెబుతున్నారు.

అయితే, తమ నిబంధనల ప్రకారం అలాంటి కంటెంట్‌పై నిషేధం ఉంటుందని ఫేస్‌బుక్ చెబుతోంది.

యూకేలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ మోసాలు జరుగుతున్నట్లు బీబీసీ న్యూస్‌నైట్ నిర్వహించిన పరిశోధనలో గుర్తించింది.

బ్రిటిష్ పురుషులను నకిలీ తండ్రులుగా చూపించే ఏజెంట్ల వ్యవస్థను ఇది బయటపెట్టింది.

థాయ్
ఫొటో క్యాప్షన్, థాయ్

ఇన్వెస్టిగేషన్ ఇలా..

పరిశోధనలో భాగంగా ఒక మహిళ, తాను గర్భవతినని చెప్పి అక్కడి ఏజెంట్లను సంప్రదించారు. ఆమె కూడా యూకే నిబంధనలకు విరుద్ధంగానే అక్కడ ఉంటున్నారు.

తండ్రిగా నటించేందుకు ఒప్పుకునే చాలా మంది బ్రిటిష్ పురుషులు తనకు తెలుసని అయితే, అందుకు పది లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆమెకు థాయ్ అనే ఏజెంట్ చెప్పారు. అందులోనే అన్ని ఖర్చులు(ఫుల్ ప్యాకేజీ) కలిపి ఉంటాయని చెప్పారు.

పుట్టబోయే బిడ్డకు యూకే పాస్‌పోర్ట్ వచ్చేందుకు అవసరమైన అన్ని పనులు తానే చూసుకుంటానని, అది తనకు చాలా సులభమైన పని అని ఆమెకు వివరించారు.

ఫేస్‌బుక్‌లో థాయ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, అధికారులను బురిడీ కొట్టించేందుకు ఒక నమ్మకమైన కథను కూడా సిద్ధం చేస్తానని ఆమెకు థాయ్ చెప్పారు.

ఆండ్రూ అనే బ్రిటిష్ వ్యక్తికి ఆ మహిళను పరిచయం చేశారు. తండ్రిగా నటించేందుకు ఆండ్రూ సిద్ధమని థాయ్ చెప్పారు. ఈ పని చేయాలంటే ఆండ్రూకి 8 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఆండ్రూ

ఆ సమావేశంలో తాను యూకే పౌరుడినేనని నిర్ధారించేందుకు ఆండ్రూ తన పాస్‌పోర్ట్‌ను చూపించారు. పరిశోధకురాలితో ఆండ్రూ సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

నకిలీ తండ్రులను సరఫరా చేస్తున్న ఏజెంట్లకు బీబీసీ ఎలాంటి డబ్బులు చెల్లించలేదు.

ఈ మోసంలో ఆయనకు కూడా ప్రమేయం ఉందని చెప్పిన తర్వాత, తానేమీ తప్పు చేయలేదని థాయ్ అన్నారు. ''అసలు దాని గురించి తనకేమీ తెలియదు'' అని ఆయన చెప్పారు.

దీనిపై మాట్లాడేందుకు బీబీసీ ఆండ్రూని సంప్రదించినా ఆయన స్పందించలేదు.

వలస వచ్చిన వేలాది మంది గర్భిణులకు తాను సాయం చేశానని మరో మహిళ చెప్పారు. తన పేరు థి కిమ్ అని ఆమె పరిచయం చేసుకున్నారు.

నకిలీ తండ్రిగా నటించేందుకు తాను ఒక బ్రిటిష్ వ్యక్తిని సిద్ధం చేస్తానని, అందుకు ''తండ్రికి 9 లక్షల రూపాయలు'', తన ఫీజు 27 వేల రూపాయలు చెల్లించాలని ఆమె చెప్పారు.

''నేను సిద్ధం చేసే బ్రిటిష్ వ్యక్తులు ఇక్కడే పుట్టారని, ఇంతకుముందెప్పుడూ వారు పిల్లలకు తండ్రిగా ఎక్కడా నమోదు కాలేదు'' అని పరిశోధకురాలితో ఏజెంట్ కిమ్ చెప్పారు.

''ఆ పనులను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. పాస్‌పోర్ట్ లేదని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాస్‌పోర్ట్ తప్పకుండా వస్తుంది'' అని అన్నారు.

అయితే, బీబీసీ సంప్రదించినప్పుడు ఆమె స్పందించలేదు.

కిమ్
ఫొటో క్యాప్షన్, కిమ్

యూకేలో జన్మిస్తే బ్రిటిష్ పౌరులే

ఇమ్మిగ్రేషన్ లాయర్ ఎనా గొంజాలెజ్, ఈ నకిలీ తండ్రుల మోసంలో నమ్మలేని విషయాలను వెల్లడించారు.

''ఇది చాలా క్లిష్టమైన వ్యవహారం. దీన్ని ఛేదించడం పోలీసులకు కూడా అంత సులభం కాదు. అలాంటి మహిళలు ఎంత నిరాశలో ఉన్నారో చెప్పేందుకు ఇదొక ఆధారం. యూకేలో ఉండే హక్కును పొందేందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకునేందుకు కూడా వారు సిద్ధమవుతున్నారు'' అని ఆమె చెప్పారు.

వలస వచ్చి అక్రమంగా నివసిస్తున్న మహిళ, యూకే పౌరుడి ద్వారా లేదా ఇక్కడ శాశ్వత నివాసం ఉండే అర్హత కలిగిన వ్యక్తి ద్వారా బిడ్డను కంటే, ఆ బిడ్డ పుట్టుకతోనే బ్రిటిష్ పౌరుడవుతాడు.

ఆ తర్వాత బిడ్డ తల్లి కుటుంబ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బిడ్డ ఇక్కడ పుట్టడంతో ఆమెకు యూకేలో నివాసం ఉండే హక్కు ఉంటుంది. ఆ తర్వాత నిబంధనలకు అనుగుణంగా బ్రిటిష్ పౌరసత్వానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

'' ఈ నిబంధన చిన్నారుల రక్షణకు ఉద్దేశించినది. అంతేకానీ, సరైన ధ్రువపత్రాలు లేకుండా యూకేలో నివసిస్తున్న మహిళలకు వీసా ఇచ్చేందుకు కాదు'' అని గొంజాలెజ్ తెలిపారు.

ఇలాంటి కేసులకు సంబంధించిన డేటాను హోం శాఖ కార్యాలయం అందించలేకపోవడంతో ఈ మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో బీబీసీ అంచనా వేయలేకపోయింది.

బ్రిటిష్ పౌరులుగా జన్మించిన ఇలాంటి పిల్లల విదేశీ తల్లిదండ్రుల్లో, ఎంతమందికి వీసాలు మంజూరు చేశారనే సంఖ్యను కూడా హోం శాఖ ప్రచురించలేదు.

అయితే, గతేడాది 4,860 మందికి ''అదర్ డిపెండెంట్స్'' కోటా కింద వీసాలు మంజూరయ్యాయి. బ్రిటిష్ పౌరులుగా జన్మించిన చిన్నారుల తల్లిదండ్రులు (అక్కడే నివసిస్తున్న వారు) కూడా ఈ కేటగిరీ కిందకే వస్తారు.

అయితే, బర్త్ సర్టిఫికెట్ల కోసం ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు సమర్పించడం చట్టరీత్యా నేరం.

తప్పుడు బర్త్ సర్టిఫికెట్లతో జరుగుతున్న ఇలాంటి మోసాలను గుర్తించి, వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హోం శాఖ కార్యాలయం తెలిపింది.

''పితృత్వాన్ని నిర్ధారించేందుకు జనన ధ్రువీకరణ పత్రం ఒక్కటే సరిపోదు. కొన్ని సందర్భాల్లో వాటిని నిరూపించాల్సి ఉంటుంది. వీసా ప్రక్రియను పూర్తి చేసే సమయంలో అదనపు ఆధారాలు కూడా పరిశీలించే అవకాశం ఉంది'' అని పేర్కొంది.

కానీ, ఇలాంటి కేసుల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నారా అని ఇమ్మిగ్రేషన్ లాయర్ హర్జప్ భంగల్ ప్రశ్నిస్తున్నారు.

''ఇలాంటివి ఒక్కటి కాదు. వేలల్లో ఉన్నాయి. అయినా హోం శాఖ కార్యాలయం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు'' అని అన్నారు.

భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, శ్రీలంక లాంటి చాలా దేశాల నుంచి వలస వచ్చిన వారు ఇలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారని, ఇది చాలా ఏళ్లుగా జరుగుతోందని ఆయన చెప్పారు.

ఫేస్‌బుక్ స్క్రీన్ షాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్‌లో ప్రకటనలు

ఇలాంటి ప్రకటనలు వియత్నాంకి చెందిన నిరుద్యోగుల ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఎక్కువగా కనిపించినట్లు న్యూస్‌నైట్ తన పరిశోధనలో గుర్తించింది.

తండ్రులుగా నటించేందుకు అవసరమైన పేర్లు వివరాలతో కొందరు బ్రిటిష్ వ్యక్తులను, తండ్రులుగా చూపించాలనుకుంటున్న మహిళల పేర్లతో డజన్ల కొద్దీ పోస్టులను బీబీసీ గుర్తించింది.

''నేను 4 నెలల గర్భవతిని. పౌరసత్వం వచ్చే అవకాశం ఉన్న 25 నుంచి 45 ఏళ్లలోపు తండ్రి కావాలి'' అని ఒక అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు.

''నేను రెడ్ బుక్ ఉన్న తండ్రిని. మీరు గర్భవతి అయితే, మీకు తండ్రి లేకపోతే నాకు మెసేజ్ చేయండి'' అని మరో పోస్ట్ ఉంది. రెడ్ బుక్ అంటే వియత్నాంలో యూకే పాస్‌పోర్ట్ కలిగి ఉన్నామని అర్థం.

అయితే, ''దత్తత కోసం వినతులు చేయడం, బర్త్ సర్టిఫికెట్ మోసాలను ఫేస్‌బుక్ అనుమతించదు'' అని ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ మెటా చెబుతోంది. తమ పాలసీలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్‌ను తొలగించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని చెబుతోంది.

వీడియో క్యాప్షన్, సింగిల్ మదర్: ‘నా బిడ్డను చంపేయమని ఒత్తిడి చేశారు’

ఆయన నాకంటే 30 ఏళ్లు పెద్దవాడు

తన బిడ్డకు తండ్రిగా ఉండేందుకు ఒకరికి 8 లక్షల రూపాయలు చెల్లించినట్లు బీబీసీతో ఒక మహిళ చెప్పారు.

''ఆయన నాకంటే వయసులో 30 ఏళ్లు పెద్దవాడు. ఆయన గతంలో మరో మహిళతో కూడా ఇలాంటి ఒప్పందం చేసుకున్నాడని విన్నాను.'' అని ఆమె తెలిపారు.

ఆయనతో తనకు అంత పరిచయం లేదని ఆమె చెప్పారు.

బర్త్ సర్టిఫికెట్ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లేందుకు మూడుసార్లు మాత్రమే వారిద్దరూ కలిశారు.

తాను 9 లక్షల రూపాయలు చెల్లించానని మరో మహిళ మాకు చెప్పారు. అయితే, అతను తన పౌరసత్వం గురించి అబద్ధం చెప్పాడని ఆమెకు తర్వాత తెలిసింది.

''నా బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ వచ్చే ఒక్కరోజు ముందు అతనికి పౌరసత్వం లేదని తెలిసింది. నాకు మతిపోయినంత పనైంది. ఎందుకంటే అప్పటికే బర్త్ సర్టిఫికెట్‌ దరఖాస్తుపై అతని వివరాలు సమర్పించేశాను. దాన్ని నేను మార్చలేను'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆమె బిడ్డకు ఒక అపరిచిత వ్యక్తి తండ్రిగా రికార్డుల్లో నమోదయ్యారు. ఇప్పుడు ఆమె, ఆమె బిడ్డ యూకేలో ఉండేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

వీడియో క్యాప్షన్, ఒకప్పుడు భిక్షాటన చేసిన హిజ్రా.. ఇపుడు ఫోటోగ్రాఫర్ ఎలా అయ్యారు?

'డీఎన్ఏ టెస్టు చేయించాలి'

వీసా దరఖాస్తులను హోం శాఖ కార్యాలయం మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని హర్జప్ భంగల్ తెలిపారు.

''బిడ్డకు, తల్లిదండ్రుల్లో ఒకరికి బ్రిటిష్ పౌరసత్వం ఉండి, మరొకరికి వీసా లేకపోతే, అలాంటి వారికి డీఎన్ఏ పరీక్ష చేయించాలి'' అని ఆయన అన్నారు.

బర్త్ సర్టిఫికెట్ కోసం, బిడ్డకు బ్రిటిష్ పాస్‌పోర్ట్‌కి దరఖాస్తు చేసేందుకు యూకేలో డీఎన్‌ఏ పరీక్షలు అవసరం లేదు.

ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది విచారణ ఎదుర్కొంటున్నారని భంగల్ భావించడం లేదు.

''అందుకే ప్రజలు ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందోననే భయం వారికి లేదు.''

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)