ఫేస్‌బుక్ లైవ్‌లో పిస్టల్‌తో తలపై కాల్చుకున్నాడు, అదే పిస్టల్‌తో ప్రియురాలిని చంపేశాడు... అసలేం జరిగింది?

అంకిత్

ఫొటో సోర్స్, ANKIT'S FACEBOOK

    • రచయిత, రవి ప్రకాశ్
    • హోదా, బీబీసీ కోసం

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో లైవ్‌లో మాట్లాడిన తర్వాత అంకిత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు.

వచ్చే జూన్ 15తో అతనికి 22 ఏళ్లు నిండుతాయి. ఈలోగానే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలారు.

మే 13వ తేదీ సాయంత్రం పిస్టల్‌తో తలపై కాల్చుకుని అంకిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి 23 గంటల ముందు అదే పిస్టల్‌తో తన ప్రేయసి నివేదితని ఆయన హత్య చేశారు.

నివేదిత వయస్సు 20 ఏళ్లు. మే 12వ తేదీన నివేదితను పిస్టల్‌తో కాల్చేసి అంకిత్ పరారయ్యారు. ఫోన్‌ను కూడా స్విచ్చాఫ్ చేశారు.

ఆయన కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలోనే మే 13వ తేదీ సాయంత్రం తన సోషల్ మీడియా ఖాతాల్లో లైవ్‌లో మాట్లాడారు. నివేదితను తానే హత్య చేసినట్లు లైవ్‌లో ఒప్పుకున్నారు.

ఫేస్‌బుక్ లైవ్‌ స్టార్ట్ చేసి తాను ప్రేమించిన నివేదితను హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఆ తరువాత తలపై పిస్టల్‌ను పెట్టుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పాడు. మరు క్షణం లైవ్ ఆగిపోయింది.

ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య.

ఒకవేళ మీరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే, భారత ప్రభుత్వం అందించే జీవన్‌సాథీ హెల్ప్ లైన్ 18002333330ను సంప్రదించండి. మీ స్నేహితులు, బంధువులతో మీ సమస్య గురించి చర్చించండి.

అంకిత్

ఫొటో సోర్స్, ANKIT'S FACEBOOK

ఆత్మహత్య పాల్పడటానికి ముందు అంకిత్ ఏం చేశారు?

ఆత్మహత్యకు కొద్ది క్షణాల ముందు తాను ఉన్న లొకేషన్ వివరాలను అంకిత్ తన కుటుంబీకులకు పంపించారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో అంకిత్ లైవ్ కార్యక్రమాన్ని ఆయన కుటుంబీకులు కూడా చూశారు. వెంటనే రాంచీ పోలీసులను సంప్రదించి, అంకిత్ ఉన్న ప్రదేశం వివరాలకు వారికి చెప్పి ఎలాగైనా అంకిత్‌ను కాపాడాలని కుటుంబీకులు కోరారు.

వెంటనే స్పందించిన పోలీసులు అంకిత్ ఉన్న ప్రదేశానికి వెళ్లారు. కానీ, వారు వెళ్లేసరికే తలపై కాల్చుకొని అంకిత్ చనిపోయారు.

రాంచీలోని కోకర్ ప్రాంతం నుంచి రక్తసిక్తమైన అంకిత్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు తోబుట్టువులలో అంకిత్ అందరికంటే చిన్నవాడు.

అంకిత్, నివేదిత పూర్వీకుల గ్రామాలు బిహార్ రాష్ట్రం నవాదా జిల్లాలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉంటాయి.

కానీ, నవాదా నగరంలో ప్రస్తుతం వారిద్దరూ పక్కపక్కన ఇళ్లలోనే ఉంటారు. అయితే, వారిద్దరి కులాలు, సామాజిక స్థితిగతులు వేరు.

నివేదిత రాంచీలోని ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నారు. హర్మూ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఆమె చదువుకుంటున్నారు.

హాస్టల్ సమీపంలోనే నివేదిత తలపై అంకిత్ పిస్టల్‌తో కాల్చి హత్య చేశారు. ఈ ఘటనలో నివేదిత ఫ్రెండ్‌కు కూడా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అంకిత్

ఫొటో సోర్స్, ANKIT'S FACEBOOK

ఫొటో క్యాప్షన్, తల్లితో అంకిత్

నివేదిత చనిపోయిన రోజు ఏం జరిగింది?

రాంచీలోని అర్గోడా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ వినోద్ కుమార్ ఈ ఘటన గురించి మీడియాతో మాట్లాడారు.

మే 12వ తేదీ సాయంత్రాన ఒక ఫ్రెండ్‌తో కలిసి హాస్టల్‌కు తిరిగి వస్తుండగా నివేదితను అంకిత్ కాల్చేసినట్లు ఆయన చెప్పారు.

అంకిత్ నడుచుకుంటూ నివేదితకు అత్యంత దగ్గరగా వెళ్లి తలపై పిస్టల్‌తో కాల్చాడని ఆయన వెల్లడించారు.

వెంటనే ఆమెను చికిత్స కోసం రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఆర్‌ఐఎంఎస్) తరలించగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

నివేదిత తండ్రి ఫిర్యాదు మేరకు అంకిత్‌పై హత్యా నేరాన్ని నమోదు చేశారు.

‘‘నివేదిత బంధువులు అంకిత్‌ హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలో ఇందుకు సంబంధించిన ఆధారాలు మాకు లభించాయి. అందుకే అతన్ని అరెస్ట్ చేయడానికి నవాదాకు ఒక బృందాన్ని పంపించాం.

ఈలోగా, మే 13 సాయంత్రం అంకిత్ ఫేస్‌బుక్ లైవ్ గురించి మాకు సమాచారం అందింది. పోలీసులు అతను ఉన్న లొకేషన్‌ను కనిపెట్టారు. ఆ ప్రదేశం నుంచి అంకిత్ మృతదేహం, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం.

ప్రాథమిక దర్యాప్తులో అంకిత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్, సాంకేతిక బృందాల సహాయం తీసుకుంటున్నాం.

పోస్ట్‌మార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించాం. మే 13న నివేదిత, మే 14న అంకిత్ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు.

రెండు పోస్ట్ మార్టం నివేదికల్లోనూ బుల్లెట్ గాయాల వల్లే మృతి చెందినట్లు పేర్కొన్నారు’’ అని వినోద్ కుమార్ వివరించారు.

అంకిత్

ఫొటో సోర్స్, ANKIT'S FACEBOOK

ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రులతో అంకిత్

కుటుంబీకులు ఏం అంటున్నారు?

నివేదిత, రాంచీకి వెళ్లిపోయిన తర్వాత అంకిత్ కూడా ఆమె హాస్టల్‌కు సమీపంలోని ఒక అద్దె ఇంట్లో నివసించడం మొదలుపెట్టాడని ఆయన కజిన్ సనోజ్ యాదవ్, బీబీసీకి చెప్పారు.

నివేదిత కూడా అంకిత్ దగ్గరికి వచ్చి వెళ్తుండేదని ఆయన తెలిపారు.

‘‘2019 నుంచి వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ విషయం వారి కుటుంబాలకు కూడా తెలుసు. ఈ మధ్య ఏదో విషయంలో వారిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. తర్వాత ఈ దుర్ఘటన జరిగింది’’ అని సనోజ్ యాదవ్ తెలిపారు.

నివేదిత తండ్రి సిద్ధేశ్వర్ ప్రసాద్ కూడా వారిద్దరి మధ్య సంబంధాన్ని అంగీకరించారు. తన కూతురు, అంకిత్‌తో మాట్లాడటం మానేసిందని ఆయన చెప్పారు. దీంతో అంకిత్ ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడని ఆయన అన్నారు.

‘‘చివరకు అతను నా కూతుర్ని హత్య చేశాడు. నా సర్వస్వాన్ని నాశనం చేశాడు. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని సిద్ధేశ్వర్ ప్రసాద్ అన్నారు.

మీడియాతో మాట్లాడిన తర్వాత సిద్ధేశ్వర్ ప్రసాద్, రాంచీలోనే నివేదిత అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం ఇంటికి వస్తుండగా పోలీసులు ఫోన్ చేసి ఆయనకు అంకిత్ ఆత్మహత్య విషయాన్ని చెప్పారు.

ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభ పక్ష నేత బాబూలాల్ మరాండీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘‘రాంచీలోని జన సమ్మర్థ ప్రాంతంలో పట్టపగలు ఒక అమ్మాయి హత్య జరిగిన తీరు చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవనే విషయం రుజువు అవుతోంది. అమ్మాయిలపై అఘాయిత్యాల గురించి రోజూ వార్తలు వస్తున్నాయి. కానీ, ముఖ్యమంత్రి వీటి గురించి పట్టించుకోవట్లేదు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

మానసిక వైద్యంపై సాయం కోసం కేంద్ర ప్రభుత్వ హెల్ప్‌లైన్ 1800-599-0019కు కాల్ చేయండి

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)