చార్‌ధామ్: ఎత్తైన ప్రాంతాలలో ఊపిరి ఆడనప్పుడు ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
అమర్నాథ్, బద్రీనాథ్, చార్ ధామ్ లాంటి యాత్రలకు వెళ్ళడానికి ఈ మధ్య చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే అక్కడికి వెళ్లే సమయంలో ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, తలెత్తే సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాలయాల చెంత ఉండే నాలుగు పవిత్ర స్థలాల సందర్శనమే ఈ చార్ ధామ్ యాత్ర. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకోవాలని అనుకునేవారు ఈ యాత్రలో పాల్గొంటారు.
హిమాలయాల గరిష్ఠ ఎత్తు 8,848 మీ. కాగా, బద్రీనాథ్ 6,560 మీ., అమర్నాథ్ 5,186 మీ ఎత్తులో ఉంటాయి.
రోహ్‌తాంగ్ పాస్ ఎత్తు 4,000 మీ. కాగా, కేదార్‌నాథ్ 3,584 మీ., మనాలి 2,500 మీ. ఎత్తులో ఉంటాయి.
ఇలాంటి పర్వత ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు కనీసం కొన్ని నెలల ముందు నుంచి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, శారీరికంగా సిద్ధపడాలి.
ప్రభుత్వ వైద్యుల నుంచి అనుమతి పత్రం పొందితేనే ఆ యాత్రలకు వెళ్ళగలరు. దీని కోసం బీపీ, షుగర్, మూత్ర పిండాల తదితర సాధారణ పరీక్షలు అన్నీ చేసుకొని ఎలాంటి అనారోగ్యం లేదు అని నిర్ధారించుకోవాలి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు బాగుందా లేదా కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక వేళ ఏదైనా కొద్దిపాటి సమస్య ఉన్నా, మందులు వాడి అవి అదుపులోకి వచ్చాకే ప్రయాణం చేయాలి.
అవసరమైతే ఆక్సిజన్ తీసుకొని వెళ్ళడం మేలు. పర్వతారోహణ చేసేప్పుడు కింద చిన్న చిన్న సిలిండర్లలో ఆక్సిజన్ అమ్మకానికి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సమస్య ఏమిటి?
అసలు పర్వతారోహణలో తలెత్తే సమస్య ఏమిటి? అనే ప్రశ్న మొదట ఉత్పన్నం అవుతుంది. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అక్కడ గాలి చాలా తక్కువగా ఉంటుంది.
అక్కడి ఆక్సిజన్ మనకు సరిపోదు. ఫలితంగా ఊపిరితిత్తులలో నీరు చేరుతుంది. అప్పుడు ఎక్కువ ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. దానితో ఆయాసం, నీరసం లాంటివి వస్తాయి.
ఒక్కోసారి సమస్య తీవ్రమైతే ఊపిరితిత్తులు, మెదడులో నీరు చేరుతుంటుంది. దీంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
మూడు రకాలుగా అనారోగ్యం..
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వారు, ఎత్తులో ఉండే పర్వత ప్రాంతాలకు వెళ్ళడం వల్ల కలిగే సమస్యలు ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించారు.
- తీవ్రమైన పర్వత అనారోగ్యం - Acute mountain sickness
- ఎత్తైన ప్రదేశం వల్ల ఊపిరి తిత్తులలో నీరు చేరడం - (High altitude pulmonary edema )
- ఎత్తైన ప్రదేశం వల్ల మెదడులో నీరు చేరడం - (High altitude cerebral edema)
తక్కువ సమయంలో ఎక్కువ ఎత్తుకు వెళ్లిన వారికి ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడు అప్రమత్తం కావాలి?
తీవ్రమైన పర్వత అనారోగ్యం అనేది సాధారణంగా 2500 మీ. కన్నా తక్కువ ఎత్తులో కనిపించదు.
అంతకంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లినప్పుడు ఆరు గంటల లోపే కొన్ని లక్షణాలు మనలో కనిపిస్తాయి.
తలనొప్పి, వాంతులు అవ్వడం, నీరసం, అలసట, తల తిప్పడం, నిద్రలేమి లాంటి ఇబ్బందులు వీటిలో ఉంటాయి. మద్యం సేవిస్తే లేక, మత్తు కలిగే మాత్రలు వేసుకుంటే సమస్య మరింత తీవ్రం అవుతుంది. ఎందుకంటే ఇవి ఊపిరి ఎక్కువ తీసుకోకుండా ఆపుతాయి.
మెదడులో నీరు ఎప్పుడు చేరుతుంది?
వేగంగా అధిక ఎత్తుల్లోకి వెళ్లడం వల్ల మెదడులో నీరు చేరవచ్చు. ఫలితంగా తీవ్రమైన తలనొప్పితో, గందరగోళం ఏర్పడొచ్చు, వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే కిందకు దిగడం మంచిది. చికిత్స అందించడం ఆలస్యం అయితే బాధిత వ్యక్తి చనిపోవచ్చు కూడా.
ఎక్కువ మరణాలు ఎత్తైన ప్రదేశం వల్ల ఊపిరి తిత్తులలో నీరు చేరడం (HAPE) వల్ల సంభవిస్తాయి. పర్వతారోహణకు వెళ్లిన రెండో రోజు రాత్రి ఈ లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి.
ఊపిరి తిత్తులలో నీరు చేరడం వల్ల, ఊపిరి సరిగా ఆడకపొకపోవడం వల్ల గుండె వేగం పెరుగుతుంది. నెమ్మదిగా స్పృహ కోల్పోవచ్చు కూడా.
ఈ లక్షణాల తీవ్రత దేనిపై ఆధారపతుంది?
- ఎంత ఎత్తులో ఉన్నారు
- ఎంత వేగంగా ఆ ఎత్తుకు చేరారు
- అక్కడ ఎంత సేపు గడిపారు
- అక్కడ నిద్ర పోయారా
ఆ వ్యక్తిలో సహజంగా ఉండే శక్తి సామర్థ్యాలు కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తాయి
ఆ లక్షణాలు కనిపించినప్పుడు ఏం చేయాలి అంటే,
- లక్షణాలు తగ్గే వరకు ఇంకా పైకి వెళ్లకుండా ఉండాలి
- లక్షణాలను బట్టి మందులు వేసుకోవాలి
- అవసరమైతే కృత్రిమంగా అందించే ఆక్సిజన్ తీసుకోవాలి
- ఎక్కువ ఇబ్బంది అయితే కిందకు దిగాలి

ఫొటో సోర్స్, Getty Images
ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
పర్వతారోహణలో ఎదురయ్యే మరొక సమస్య తీవ్రమైన చలి. ఆ ప్రాంతాలలో ఉండే తీవ్రమైన చలి వల్ల చేతులు, కాళ్ళు గడ్డ కట్టుకుపోవడం, అలసట, కండరాలు బిగుసుకు పోవడం, గందరగోళం, గుండె వేగం అస్తవ్యస్తంగా అవ్వడం లాంటి లక్షణాలు కలుగుతాయి.
అందుకే, అలాంటి ప్రాంతాలకు వెళ్ళే వారు, తమని తాము వెచ్చగా ఉంచుకోవడానికి అవసరమైనవన్ని తీసుకొని వెళ్ళాలి.
పొరలు పొరలుగా ఉండే బట్టలు ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తాయి. తలని, చెవులని కప్పే లాగా స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది.
ముఖ్యంగా చేతులు, కాళ్ళు వెచ్చగా ఉండేలా, గ్లవ్స్, సాక్స్, షూలు వేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడల్లా వెచ్చగా ఏమైనా తాగుతూ ఉండే ప్రయత్నం చేయాలి.
మనసు మాత్రమే ఉత్సాహం ఉంటే సరిపోదు, శరీరం సహకరిస్తుందా అనేది నిర్ధారణ చేసుకొని, ఇలాంటి యాత్రలకు వెళ్ళడం మంచిది. అప్పుడు మాత్రమే ఆ అందమైన ప్రదేశాలను పూర్తిగా ఆరోగ్యంగా ఆస్వాదించగలుగుతారు.
ఏం తినాలి?
తేలికగా అరిగే ఆహారం, తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం మంచిది.
పర్వతారోహణలో 1,500 మీ. మించి ఎత్తుకి చేరుకున్నాక, తెలియకుండానే అధిక శక్తి ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అధిక క్యాలరీలుండే ఆహారంగా తీసుకోవాలి.
ముఖ్యంగా వెంటనే శక్తిని అందించే పిండి పదార్ధాలు అధిక మోతాదులో తీసుకోవాలి.
దాహం ఎక్కువ వేయకపోయినా, తరచూ నీరు తాగుతూ ఉండాలి. రోజుకి 3 నుంచి 5 లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- మణిపుర్: ‘ప్రాణాలు కాపాడుకోవాలంటే పరిగెత్తాల్సిందే... మరో దారి లేదు’
- ఐపీఎల్ 2023: ప్లే ఆఫ్స్‌కు చేరేదెవరు? ఇంటి ముఖం పట్టేదెవరు?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి పోటెత్తుతున్న వాట్సాప్ కాల్స్ .. ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీకు ముప్పే
- పాకిస్తాన్లో ‘డర్టీ హ్యారీ’ ఎవరు, ఇమ్రాన్ ఖాన్ పదే పదే ఆ పేరెందుకు చెబుతున్నారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















