ఐపీఎల్ 2023: ప్లే ఆఫ్స్‌కు చేరేదెవరు? ఇంటి ముఖం పట్టేదెవరు?

ఐపీఎల్

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN

    • రచయిత, అర్నవ్ వాసవాడ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచ్‌లు మరికొద్ది రోజుల్లో ముగియబోతున్నాయి. ఈ ఏడాది ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తిగా మారింది.

లీగ్ దశ ముగింపుకు వచ్చే కొద్దీ జట్లు మరింత హోరాహోరీగా తలపడుతున్నాయి. దీంతో చాలా మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. అనూహ్య ఫలితాలూ వెలువడుతున్నాయి.

మొత్తం 70 మ్యాచ్‌లలో బుధవారం (మే 10) వరకు 55 మ్యాచ్‌లు జరిగాయి. అయితే అధికారికంగా ఏ జట్టు కూడా ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోలేకపోయింది.

పాయింట్ల పట్టికను చూస్తే చాలా జట్లు ఒకదానికొకటి దగ్గరగానే ఉన్నాయి. ఐపీఎల్‌లో ఈ దశలో ఇంత గట్టి పోటీ అరుదుగా కనిపిస్తుంటుంది.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక

ఫొటో సోర్స్, IPL Website

ఫొటో క్యాప్షన్, ఐపీఎల్: పాయింట్ల పట్టిక (మే 10 వరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా)

అన్ని జట్లలో గుజరాత్ టైటాన్స్ పరిస్థితి మెరుగ్గా ఉంది. 16 పాయింట్లతో పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. తదుపరి మూడు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా హార్థిక్ పాండ్యా సేనకు ప్లే ఆఫ్ స్థానం ఖాయం.

గుజరాత్ తన తదుపరి మూడు మ్యాచ్‌లూ భారీ తేడాతో ఓడితే ప్లే ఆఫ్స్ ఛాన్సు కష్టంగా మారొచ్చు.ధోని సారథ్యంలోని చెన్నై తన మిగతా రెండు మ్యాచ్‌లూ ఓడితే ప్లే-ఆఫ్‌ ఛాన్సు కష్టం.

హైదరాబాద్ జట్టు

ఫొటో సోర్స్, NURPHOTO

సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి?

ఐపీఎల్ 2023లో 10 జట్లు ఆడుతున్నాయి. హైదరాబాద్, దిల్లీ జట్లు 8 పాయింట్లతో పట్టికలో 9వ, 10వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.

దీంతో ఈ రెండు జట్లకు ప్లేఆఫ్ ఛాన్సు కష్టంగా మారింది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్ పరిస్థితి కొంత మెరుగు. ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఆ నాలుగూ గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది.

దిల్లీ రాబోయే మూడు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్ రేసు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఆ మూడు మ్యాచ్‌లు దిల్లీ గెలిచినా ప్లే ఆఫ్‌ ఛాన్సు కోసం మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా, ఆ మూడు మ్యాచ్‌లనూ భారీ తేడాతో గెలిస్తే కొన్ని జట్ల ఆశలు గల్లంతు కావొచ్చు.

చివరి లీగ్ మ్యాచ్ వరకు ఎవరు మూడో స్థానంలో ఉంటారు, ఎవరు నాలుగో స్థానంలో నిలుస్తారో చెప్పడం కష్టమే. అందువల్ల నెట్ రన్‌రేట్ కూడా కీలకంగా మారనుంది.

"రాజస్థాన్ రాయల్స్ మొదటి ఐదు మ్యాచ్‌లు బాగా ఆడింది. అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ప్రదర్శన పడిపోయింది. ఇది అన్ని జట్లకు ప్లేఆఫ్‌ మార్గాన్ని క్లిష్టతరం చేసింది" అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ చింతన్ బుచ్ చెప్పారు.

ఐపీఎల్

ఫొటో సోర్స్, R. SATISH BABU

ప్లే ఆఫ్ అవకాశం కోసం ఏ జట్టు ఏం చేయాలి?

ఇప్పుడు అట్టడుగున ఉన్న దిల్లీ, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే రాబోయే అన్ని మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాలి.

లక్నో, గుజరాత్, బెంగళూరు, ముంబయి జట్లను హైదరాబాద్ ఓడించాలి.

దిల్లీ ప్లేఆఫ్ కలను సాకారం చేసుకోవాలంటే చెన్నైని ఒక మ్యాచ్‌లో ఓడించి పంజాబ్‌ను రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు ప్లే ఆఫ్‌లో స్థానం కోసం దిల్లీ మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఇక ముంబయి, బెంగళూరు జట్ల విషయానికి వస్తే- బెంగళూరు రాబోయే అన్ని మ్యాచ్‌లను గెలవాలి. ముంబయి మూడింటిలో కనీసం రెండు గెలవాలి. అప్పుడే ఇరు జట్లకు ప్లేఆఫ్‌ మార్గం సుగమం అవుతుంది.

అయితే మంగళవారం నాటి మ్యాచ్‌లో ముంబయిపై ఓటమితో ఆర్‌సీబీకి ప్లే ఆఫ్ దారి కష్టంగా మారింది.

లక్నో జట్టు ప్రయాణాన్ని చూస్తే- ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కిలా సాగుతోంది. లక్నో వరుసగా రెండు మ్యాచ్‌లు ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.

ఇప్పుడు బెంగళూరుపై ముంబయి విజయం తర్వాత లక్నో దూకుడు పెంచాల్సిన అవసరం ఏర్పడింది.

ప్లే ఆఫ్ రేసులో ముందున్నా, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నా లక్నోకు మిగతా జట్ల నుంచి గట్టి పోటీ అయితే ఉంది.

లక్నో ఇక్కడి నుంచి ఒక్క మ్యాచ్‌లో ఓడినా, ప్లే ఆఫ్ స్థానం కోసం అది ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి రావచ్చు.

మహేంద్ర సింగ్ ధోనీ సేన తదుపరి రెండు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ సీఎస్‌కే రెండు మ్యాచ్‌లూ ఓడిపోతే ప్లే ఆఫ్ రేసు కోసం అది కూడా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది.

అంటే ప్లేఆఫ్స్‌లో ఎవరెవరు ఉంటారు? అది ప్లేఆఫ్స్ సమయానికే తెలిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)