మొక్కలకు చల్లని నీరు పోయకూడదు, ఎందుకో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్ థోరోగుడ్
- హోదా, బోటనిస్ట్
ఇంటి లోపల పెంచుకునే మొక్కల విషయంలో చాలా మందిని చాలా సందేహాలు వెంటాడుతుంటాయి.
కొన్నిచోట్ల మొక్కలకు నీరు ఎక్కువై చనిపోతుంటాయి. మరికొన్ని చోట్ల నీరు లేకపోవడంతో ఎండిపోయి మరణిస్తుంటాయి.
ఒక్కో మొక్కకు ఒక్కో రకమైన అవసరాలు ఉంటాయి. అయితే, ఇక్కడ మరొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే ఇంటి వాతావరణం. కొన్ని ఇళ్లలో మొక్కలు అసలు పెరగడానికి అవకాశం ఉండదు.
నేను ఒక మొక్కల నిపుణుడిని. ఉద్యోగంలో భాగంగా ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు వెళ్తుంటాను. మీరు ఏదైనా ఒక మొక్క మీ ఇంట్లో ఎలా పెరుగుతుందో అంచనా వేయాలంటే అసలు బయట అది ఎలా పెరుగుతుందో ముందు గమనించాలి. అప్పుడు మన ఇంట్లో దానికి అనువైన పరిస్థితులు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.
నేను మా ఇంటికి కొత్త మొక్కను తీసుకొచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకుంటాను. అవేమిటంటే.. ‘‘బయట ఇది ఎలా పెరుగుతుంది? మా ఇంట్లో దీనికి అనువైన పరిస్థితులు ఉన్నాయా’’ లాంటి అంశాలను తెలుసుకుంటాను.

ఫొటో సోర్స్, Getty Images
1. మొదట అన్ని వివరాలూ తెలుసుకోండి
ఇంట్లో ఎక్కువగా పెంచుకునే మొక్కల్లో ఫెలనోప్సిస్ కూడా ఒకటి. పెద్ద పెద్ద చెట్ల కొమ్మలపై ఇవి పెరుగుతుంటాయి. వీటి వేర్లకు గాలి తగులుతుండాలి. అంతేకానీ, వేర్లను నీటిలో ముంచేసి ఉంచకూడదు.
ఈ మొక్కలకు నీరు తగినంత పెడుతూ, ఆ తర్వాత వేర్లు కాస్త గాలికి ఎండిపోయేలా చూడాలి. అప్పుడే ఈ మొక్కలు బాగా పెరుగుతాయి.
ఫిలిప్పీన్స్‌లోని ఉష్ణమండల అడవుల్లో నేను ఆలకేసియాగా పిలిచే ఓ మొక్కను చూశాను. దట్టమైన అడవుల్లో నేలపై ఇవి పెరుగుతాయి. వీటికి చెట్ల మధ్య నుంచి వచ్చే కొంచెం ఎండ సరిపోతుంది. వీటికి నీరు తరచూ పెట్టాల్సి ఉంటుంది.
ఇలా ఒక్కోమొక్కకు ఒక్కో అవసరం, ప్రత్యేక పరిస్థితి ఉంటాయి. ఈ మొక్కలను పెంచేటప్పుడు వాటి గురించి మొదట మనం తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, CC BY-NC-ND
2. మొక్కలను ఎక్కడ పెట్టాలి?
నేడు ఇంట్లో పెంచుకునే మొక్కల్లో చాలా రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే, ఇక్కడ అన్ని మొక్కలను ఒకేచోట పెట్టడం లేదా మొక్కను దానికి అనువైన చోట కాకుండా వేరే చోట పెట్టడం లాంటివి చేయకూడదు.
ముళ్లచెట్లైన కాక్టస్‌లను ముఖ్యంగా నీడలో పెట్టకూడదు. నీడ అసలు వాటికి పనిచేయదు.
ఉష్ణమండల లేదా సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో పెరిగే చాలా మొక్కలకు ఇంట్లోని వంటగది, బాత్‌రూమ్ కిటికీ లాంటి చోట్లు అనువుగా ఉంటాయి. ఇక్కడి గాలిలో తేమ శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కలు పెరగడానికి వాతావరణం అనువుగా ఉంటుంది.
ఎడారుల్లో పెరిగే కాక్టై, సక్యులెంట్ జాతి మొక్కలకు ఎండ కాస్త ఎక్కువ అవసరం ఉంటుంది. నిజానికి వీటికి ఏడాది పొడవునా ఎండ అవసరం.
ఇంట్లో పెరిగే మొక్కల్లో చాలా వరకు బయట కూడా పెరుగుతుంటాయి. నిజానికి ఉత్తరార్ధ గోళంలో అయితే, జూన్ నుంచి ఆగస్టు వరకూ మొక్కలను బయటపెట్టొచ్చు. వేసవి కాలంలో ఇలానే సక్యులెంట్ జాతి మొక్కలను నేను బయటపెడుతుంటాను.
అయితే, ఒక్కసారిగా భగభగ మండే ఎండలో మొక్కలను పెట్టొద్దు. ఉష్ణ మండల ప్రాంతాల్లో బాగా పెరిగే అరటి లాంటి మొక్కలు కూడా ఒక్కసారిగా ఎండలోకి తీసుకెళ్తే తట్టుకోలేవు. నెమ్మదిగా వీటిని బయట పరిస్థితికి అలవాటు చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
3. నీరు ఎప్పుడు పోయాలి?
మొక్కలు వేసవిలో చాలా వేగంగా పెరుగుతాయి. అప్పుడు వాటికి నీరు కూడా ఎక్కువ అవసరం అవుతుంది. అదే శీతాకాలంలో అయితే, అంత నీరు వాటికి అవసరం ఉండదు.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, కాక్టై, సక్యులెంట్స్ లాంటి మొక్కలకు ఉత్తరార్ధ గోళంలో శీతాకాలం అంటే అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య పెద్దగా నీరు అవసరం ఉండదు. ఎడారిలో రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది. అయితే, ఇక్కడ వాతావరణంలో తేమ శాతం కూడా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ మొక్కలు తట్టుకొని నిలబడతాయి. కాబట్టి, వీటికి అంత ఎక్కువ నీరు అవసరం ఉండదు.
దీనికి భిన్నంగా మాన్‌స్టెరా డెలీసియోసా లాంటి మొక్కలను మనం నీడలో పెంచొచ్చు. వీటికి శీతాకాలంలో 15 రోజులకు ఒకసారి, వేసవిలో వారానికి ఒకసారి నీరు పెడితే సరిపోతుంది.
ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొక్కలకు ఎప్పుడూ గోరు వెచ్చని నీటినే పోయాలి. చాలా చల్లని నీరు పెట్టకూడదు. ఎందుకంటే గోరు వెచ్చని నీటిని మొక్కలు హాయిగా పీల్చుకుంటాయి. దీనికి వల్ల వాటికి థెర్మల్ షాక్ కలిగే అవకాశం కూడా తక్కువ.
మొత్తంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోని నీరు పెడితే మొక్కలకు మంచిది.
వీనస్ ఫ్లైట్రాప్ లాంటి మాంసాహార మొక్కలు తమకు కావాల్సిన పోషకాలను కీటకాల నుంచి తీసుకుంటాయి. నీటి కోసం ఇవి ఎక్కువగా వర్షంపైనే ఆధారపడుతుంటాయి. వీటికి ట్యాప్ నీరు పడదు.

ఫొటో సోర్స్, Getty Images
4. ఎరువులు, పోషకాలు అందించాలా?
చాలా వరకు మొక్కలకు ప్రత్యేక పోషకాలను అందించాల్సిన అవసరం లేదు. కొన్ని మొక్కలకు మాత్రం స్వల్ప మొత్తంలో పోషకాలు అవసరం అవుతాయి.
అయితే, రబ్బరు, మాన్‌స్టెరా లాంటి మొక్కలకు పోషకాలను అందిస్తే, ఇవి మెరుగ్గా పెరుగుతాయి.
అది కూడా వేసవిలో మొక్కలకు పోషకాలను అందిస్తే మంచిది. అప్పుడే ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. నేను ఎక్కువగా టమాటో ఎరువులను వేసవిలో మొక్కలకు వేస్తుంటాను.
కొన్ని పూల చెట్లకు పోషకాలను చాలా తక్కువ మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది. అతి పోషకాలను అవి తట్టుకోలేవు.
మొత్తంగా టమాటోలతో చేసిన సహజసిద్ధమైన ఎరువులు ఇంట్లో మొక్కలకు మంచిది. అదే తోటల తరహాలో పెంచుకుంటే బయట దొరికే ఎరువులను ఎంచుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
5. కుండీలను ఎప్పుడు మార్చాలి?
చాలా వరకు మొక్కలు ఒకే కుండీలో ఎక్కువ రోజులు హాయిగా ఉండగలవు. కాక్టై లాంటి నెమ్మదిగా పెరిగే మొక్కలకు అయితే, కుండీలు మార్చడం ఆలస్యమైనా ఏమీ కాదు.
అదే ఆకులు ఎక్కువగా ఉండే మొక్కలను వేడి వాతావరణంలో పెంచినప్పుడు కుండీలను మార్చాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మొక్క పరిమాణం, చుట్టుపక్కల వాతావరణంపై ఎన్ని రోజులకు ఒకసారి దీన్ని మార్చాలనేది ఆధారపడి ఉంటుంది.
కుండీలను మార్చినప్పుడు కాస్త పెద్దవి ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి మొక్కల వేర్లు పెరిగేందుకు అవకాశం ఇస్తాయి.
ఇవి కూడా చదవండి:
- జనగణమన: జాతీయగీతానికి మదనపల్లెకూ సంబంధం ఏమిటి?
- ఐశ్వర్య తాటికొండ: టెక్సస్ కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదీ, ఆమె ఫ్రెండ్‌కూ బుల్లెట్ గాయాలు
- పాకిస్తాన్: ఉచిత ఆహారం కోసం క్యూ కడుతున్న ప్రజలు... రాజకీయ కలహాలే ఆ దేశాన్ని చిందరవందర చేస్తున్నాయా?
- కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మళ్లీ వస్తుందా, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా? గ్రాఫిక్స్‌లో రాజకీయ ముఖచిత్రం
- తెలంగాణ: రబీ సాగును ముందుకు జరపాలని కేసీఆర్ ఎందుకు అంటున్నారు? ఇది రైతులకు ప్రయోజనకరమేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















