వానరాలకు ఉన్నట్లుగా మన దేహమంతటా దట్టమైన జుత్తు ఎందుకు లేదు? ఈ మానవ పరిణామానికి, సెక్స్‌కు సంబంధం ఏమిటి?

మానవ దేహం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోసెలిన్ టింపెర్లె
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

భూమ్మీది అనేక క్షీరదాలకు ఒంటి నిండా దట్టంగా వెంట్రుకలు ఉంటాయి.

మనిషికి పూర్వీకులుగా చెప్పే వానరాలకు.. అంటే కోతి జాతి జంతువులకూ శరీరమంతా బొచ్చు (ఫర్) ఉంటుంది. కానీ, మనుషులకు మాత్రం దేహం నున్నగా ఉంటుంది.

ఇతర అనేక క్షీరదాల మాదిరిగా చర్మంపై బొచ్చు ఉండదు. ఎందుకిలా?

గ్రహాంతర జీవజాతి ఏదైనా భూమ్మీదకు వచ్చి మనుషులను వారి పూర్వీకులైన వానరజాతిని వరుసగా నిల్చోబెట్టి చూస్తే స్పష్టంగా కనిపించే తేడాలు మూడేమూడు.. ఒకటి నిటారుగా నిల్చోవడం, రెండోది మాట్లాడే సామర్థ్యం, మూడోది.. బొచ్చు లేని దేహం.

ఇతర అనేక క్షీరదాలతో పోల్చినప్పుడు మనుషులవి బొచ్చు లేని దేహాలు. అయితే.. మరికొన్ని క్షీరదాలకూ ఒంటిపై బొచ్చు ఉండదు. ఖగ్డమృగాలు, నేకెడ్ మోల్ రాట్స్, ఏనుగులు, తిమింగలాలు వంటి వాటి ఒంటిపైనా జుత్తు ఉండదు.

ఇంతకీ మనుషులకు ఒళ్లంతా బొచ్చు లేకపోపడానికి కారణమేంటి? శరీరంపై కొన్ని ప్రదేశాలలోనే ఎందుకు ఒత్తయిన జుత్తు ఉంటుంది.. అనేక ఇతర క్షీరదాలలా ఒళ్లంతా ఎందుకు ఉండదు? ఇలా ఒళ్లంతా జుత్తు లేకపోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయా?

మనిషి, చింపాంజీ చేతులు

ఫొటో సోర్స్, Getty Images

నిజానికి మానవుల శరీరం అంతటా సగటున సుమారు 50 లక్షల వెంట్రుకల కుదుళ్లు (హెయిర్ ఫాలికల్స్) ఉంటాయి. కానీ ఈ కుదుళ్ల నుంచి అత్యధిక శాతం నూగు వెంట్రుకలే మొలుస్తాయి కానీ బలమైన, దట్టమైన వెంట్రుకలు రావు.

తలపైన.. కొంత వయసు వచ్చాక ముఖంపైన, బాహుమూలాలు, ఇతర ప్రాంతాలలో పెరిగే దట్టమైన వెంట్రుకలతో పోల్చితే మిగతా శరీరంపై ఉండే నూగు వెంట్రుకలు పూర్తిగా భిన్నమైనవి.

‘సాంకేతికంగా చూస్తే మనుషులకూ శరీరమంతా వెంట్రుకలు ఉంటాయి. కానీ అవి సూక్ష్మరూపంలో ఉండేవి మాత్రమే’ అని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో బయోలాజికల్ ఆంథ్రోపాలజిస్ట్ టీనా లసాసి చెప్పారు. ఆ వెంట్రుకలు ఉష్ణోగ్రతల నుంచి ఎలాంటి రక్షణను ఇవ్వలేవు అన్నారు టీనా.

శరీరంపై దట్టమైన బొచ్చు ఉండాల్సిన స్థానంలో ఇలాంటి చిన్నచిన్న వెంట్రుకలకు మారడం వెనుక ఉన్న కారణం శాస్త్రవేత్తలకూ కచ్చితంగా తెలియదు. మానవ జాతి శరీరంపై దట్టమైన జుత్తు ఎందుకు లేదనే విషయంలో అనేక సిద్ధాంతాలు వచ్చినా దేనికీ బలమైన ఆధారాలు లేవు.

ఈ సిద్ధాంతాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ‘శరీరాన్ని చల్లబరిచే’ సిద్ధాంతం. దీన్నే సవానా సిద్ధాంతం అని కూడా అంటారు. తొలినాళ్లలో మానవజాతి శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించుకునే క్రమంలో క్రమంగా దేహంపై జుత్తును కోల్పోయిందనేదే ఈ సిద్ధాంతం.

మానవ పరిణామం

ఫొటో సోర్స్, Getty Images

ప్లైసెటొసిన్ (వ్యావహారికంలో ఐస్ ఏజ్‌) యుగంలో హోమో ఎరక్టస్ మానవుడు, ఆ తరువాత హోమినైన్‌లు సవానా గడ్డి మైదానాలలో వేటాడడం ఆరంభించాయి. ఆధునిక వేట సాధనాలు లేకుండా ఎరను పరుగెత్తించి అలసిపోయేలా చేసి వేటాడినట్లు శిలాజ ఆధారాలున్నాయి.

ఇలాంటి వేట విధానం కూడా శరీరంపై వెంట్రుకలు తగ్గడానికి కారణమై ఉండొచ్చన్న సిద్ధాంతాలున్నాయి. ‘ఎరను అలసిపోయేలా చేసే క్రమంలో వారి శరీరం విపరీతంగా వేడెక్కే ప్రమాదంలోకి నెట్టి ఉండొచ్చు.. శరీరంపై వెంట్రుకలు తగ్గడం వల్ల వేగంగా చెమట పట్టడంతో పాటు అంతేవేగంగా శరీరం చల్లబడడానికి అవకాశం ఏర్పడి ఉండొచ్చు. వేడెక్కిన శరీరం అంతే వేగంగా చల్లబడడం వల్ల వేటలో విరామం తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది’ అనేదే ఈ సిద్ధాంతం.

కాగా 15 లక్షల నుంచి 20 లక్షల ఏళ్ల కిందట మనిషి తన శరీరంపై జుత్తును కోల్పోయినట్లు టీనా లాసిసి భావిస్తున్నారు.

1980లలో మరో సిద్ధాంతం తెరపైకి వచ్చింది. మనుషులు మిగతా జంతువుల్లా కాకుండా నిటారుగా ఉండడం వల్ల శరీరంపై బొచ్చు వల్ల కలగాల్సిన ప్రయోజనాల అవసరం తగ్గి.. క్రమంగా ఒంటిపై జుత్తు తగ్గిపోయిందన్నది ఆ సిద్ధాంతం.

ఒంటిపై జుత్తు లేకుండానే మానవ శరీరంపై చెమట పడుతున్నందున శరీర ఉష్ణోగ్రతల నియంత్రణలో జుత్తు అవసరం తగ్గిందని సూత్రీకరించారు.

మానవ శరీరం

ఫొటో సోర్స్, Getty Images

అయితే, లక్షల ఏళ్ల కిందట పోయిందనుకుంటున్న శరీరంపై జుత్తు మళ్లీ పెరగలేదని.. అతిశీతల ప్రాంతాలలో జీవించే మనుషులలోనూ ఇలాంటి మార్పు రాలేదని ఇవల్యూషన్ బయాలజీ ప్రొఫెసర్ మార్క్ పాగెల్ చెప్పారు.

అయితే, దీనికి గల కారాణాలనూ పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. మనిషి వాతావరణం నుంచి రక్షించుకోవడానికి, శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి దుస్తులు, ఇతర సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవడం వల్ల భూమ్మీది ఏ ప్రాంతంలో జీవించే మనుషులలోనూ మళ్లీ శరీరంపై జుత్తు పెరగాల్సిన అవసరం రాలేదంటున్నారు.

2003లో పాగెల్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆయన స్నేహితుడు వాల్టర్ బాడ్మర్ కలిసి మరో విశ్లేషణ తీసుకొచ్చారు. ‘ఎక్టోపారసైట్ హైపోథీసిస్’గా చెప్పే ఈ విశ్లేషణలో వారు.. బొచ్చు లేని ఏదైనా కోతికి మిగతా కోతుల కంటే పరాన్నజీవుల బెడద తక్కువగా ఉండి ఉండొచ్చని.. ఆ అనుకూలత క్రమంగా మనిషి బొచ్చు కోల్పోయిన పరిణామానికి దారితీసి ఉండొచ్చని చెప్పారు.

‘శరీరంపై బొచ్చు ఉండే జీవులపై పరాన్నజీవులు ఉంటాయి. అవి అక్కడే గుడ్లు పెట్టి సంతతి పెంచుకోవడంతో పాటు వ్యాధులనూ మోసుకెళ్తాయి. మానవ పరిణామ క్రమంలో పరాన్నజీవుల పాత్రా ఉంది’ అంటా పాగెల్.

కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఈ సిద్ధాంతాలు, సూత్రీకరణలు, విశ్లేషణలు అన్నిటికీ భిన్నంగా చార్లెస్ డార్విన్ వేరే వాదన వినిపించారు. లైంగిక భాగస్వాముల ఎంపికే మానవుల శరీరంపై బొచ్చు కోల్పోవడానికి కారణమన్నది ఆయన వాదన. మానవ పూర్వీకులు ఒంటిపై తక్కువ జుత్తు ఉన్నవారిని లైంగిక భాగస్వాములుగా ఇష్టపడడం, ఎంచుకోవడం వల్ల ఈ పరిణామం జరిగినట్లు డార్విన్ చెప్పారు.

అయితే... మానవుల శరీరంపై ఒత్తయిన జుత్తు లేకపోవడంపై అనేక వాదనలు, సిద్ధాంతాల తరువాత తలెత్తే ప్రశ్నలున్నాయి. తలపై ఎందుకు జుత్తు మిగిలింది? బాహుమూలాలు, ఇతర ప్రాంతాలలో కూడా జుత్తు ఎందుకు దట్టంగా పెరుగుతుంది? అనేవే ఆ ప్రశ్నలు.

‘సోలార్ రేడియేషన్ నుంచి రక్షించుకోవడానికి మానవులు తలపై వెంట్రుకలు పెంచుకుని ఉండొచ్చు’ అని టీనా లాసిస్ తన పీహెచ్‌డీ పత్రాలలో రాశారు. ఇవి ఇంకా ప్రచురణ కాలేదు.

బాహుమూలాలు, ఇతర ప్రాంతాలలో దట్టంగా వెంట్రుకలు ఉండడానికి గల కారణాలు ఆమె చెప్తూ కొన్నిరకాల జీవుల మధ్య సంకేతాల బదిలీ కోసం ఫెరోమోన్స్ తరహాలో పూర్వీకుల నుంచి ఇవి మిగిలిపోయి ఉండొచ్చని టీనా అంచనా వేశారు. అయితే... మానవులలో ఫెరోమోన్స్ ద్వారా సంకేతాల బదిలీ ఉన్నట్లు సైన్స్‌లో ఎక్కడా ఆధారాలు లేవు.

ఇవి కూడా చదవండి: