ఉప్పు తగ్గించాలంటూ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. రోజుకు ఎంత ఉప్పు తినడం మేలు?

ఉప్పు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురుగేశ్ మాడకన్ను
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆహారంలో ఉప్పు తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు కచ్చితంగా ఉంటుంది. 'ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా' అని భాస్కర శతకంలో ఓ పద్యం కూడా ఉంది. ఎంత నలభీమపాకమైనా ఉప్పు లేకపోతే నోట పెట్టలేం. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి మేలు చేస్తుంది కూడా.

కానీ, రోజులో ఎంత ఉప్పు తీసుకోవచ్చు? అధికంగా ఉప్పు వాడితే ఏమవుతుంది? మొదలైన విషయాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.

శరీరంలో సోడియం ఎక్కువైతే అనారోగ్యం పాలవుతారని, గుండెజబ్బులు, అకాల మరణాలకు దారి తీస్తుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. అందుకే ప్రపంచ దేశాలు ఉప్పు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

2025 నాటికి ఆహారం ద్వారా తీసుకునే సోడియం మోతాదును 30 శాతానికి తగ్గించాలన్న లక్ష్యానికి ప్రపంచ దేశాలు చాలా దూరంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఉప్పులో అధిక శాతం సోడియం ఉంటుంది. అజినమోటోలోనూ సోడియం ఉంటుంది.

డబ్ల్యూహెచ్ఓ సభ్యదేశాలలో 5 శాతం మాత్రమే సోడియం తగ్గింపు దిశగా సమగ్రమైన, తప్పనిసరి విధానాలను అనుసరిస్తున్నాయి.

73 శాతం సభ్య దేశాలు ఉప్పు తగ్గించే విధానాలను సమగ్రంగా అమలుచేయట్లేదని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెబుతోంది.

సోడియం తగ్గించేందుకు సక్రమమైన చర్యలు తీసుకుంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మరణాలను తగ్గించవచ్చని తెలిపింది.

ప్రస్తుతం తొమ్మిది దేశాలు.. బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే మాత్రమే సోడియం తగ్గించే విధానాలను పూర్తిగా పాటిస్తున్నాయి.

ఇతర దేశాలలో కూడా సత్వరమే చర్యలు తీసుకోవాలని, తయారీదారులు ఆహారంలో సొడియం మోతాదు తగ్గించేలా ప్రమాణాలను అమలుచేయాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది.

ఉప్పు

ఫొటో సోర్స్, Getty Images

రోజువారీ ఆహారంలో ఎంత ఉప్పు తీసుకోవాలి?

ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 4 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చని ఒమంతురార్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోషకాహార నిపుణురాలు డాక్టర్ మీనాక్షి బజాజ్ చెప్పారు.

"ప్రజలు ప్రస్తుతం రోజుకు సగటున 10.8 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భారతదేశంలో అయితే 9.8 గ్రాములు. ఇది మన రోజువారీ అవసరాల కంటే 2 రెట్లు ఎక్కువ. పిల్లలకు ఇచ్చే రోజువారీ ఆహారంలో 2 గ్రాముల ఉప్పును చేర్చవచ్చు. సగటు వ్యక్తికి 4 గ్రాముల ఉప్పు అవసరం. రక్తపోటు ఉన్నవారు వారు 3 గ్రాముల ఉప్పు తీసుకుంటే చాలు" అని ఆమె వివరించారు.

వయసు బట్టి, అనారోగ్యం ఉంటే దాని స్వభావాన్ని బట్టి ఉప్పు తీసుకోవాలని ఆమె అన్నారు.

"మనం ఆహారంలో రెండు రకాలుగా ఉప్పును జోడిస్తాం. మనం తినే అన్నం, కూరలు, పప్పు మొదలైన వాటిలో ఉప్పు నేరుగా కలుపుతాం. రెండో రకం.. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఊరగాయలు, సోడా మొదలైనవాటిలో ఉప్పు ఉంటుంది. ఇది మన కంటికి కనిపించదు" అని డాక్టర్ మీనాక్షి చెప్పారు.

డాక్టర్ మీనాక్షి బజాజ్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ మీనాక్షి బజాజ్

ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? ఎలా తగ్గించాలి?

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, పక్షవాతం, కడుపులో క్యాన్సర్, కిడ్నీలో రాళ్లు, ఎముకలు పటుత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అకాల మరణాలు సంభవించే అవకాశం కూడా ఉందని డాక్టర్ మీనాక్షి హెచ్చరిస్తున్నారు.

సోడియం వినియోగాన్ని నియంత్రించేందుకు భారత్ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని డాక్టర్ మీనాక్షి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన జాబితాలో భారతదేశం యెల్లో లిస్ట్‌లో ఉంది. అంటే సోడియం వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు ప్రారంభించిందని అర్థం.

భారత్ ప్రభుత్వం ఈట్ రైట్ (Eat Right India) అనే కార్యక్రమం ద్వారా ఆహారంలో ఉప్పు, పంచదార తగ్గించే దిశలో అవగాహన చేపడుతోందని మీనాక్షి చెప్పారు. అలాగే, చెడు కొవ్వు (బ్యాడ్ కొలెస్ట్రాల్) తగ్గించడం కూడా ఇందులో భాగమని వివరించారు.

ఉప్పు

ఫొటో సోర్స్, Getty Images

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి, స్థానికంగా లభించే ఆహార పదార్థాలను కాలానుగుణంగా తీసుకోవాలని డాక్టర్ మీనాక్షి సూచించారు.

"ఉప్పుకు ప్రత్యామ్నాయంగా అల్లం, వెల్లుల్లి, ఉల్లి, దాల్చిన చెక్క, నిమ్మకాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి ఆహారంలో ఉప్పు అవసరాన్ని తగ్గించగలవు. ఊరగాయలు, పొడులు, సాల్టెడ్ వేరుశెనగలు, మోనోసోడియం గ్లుటామేట్ ఉన్న పదార్థాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారా పదార్థాలను తినడం మానేయాలి.

మనకు రోజువారీ కోటా 4 గ్రాముల ఉప్పు. జంక్ ఫుడ్ లేదా ఇన్‌స్టాంట్ ఫుడ్ తింటే వెంటనే ఆ 4 గ్రాములు చేరిపోతాయి. ఇంక మిగిలినదంతా అదనం, అనవసరం. ప్రాసెస్ చేసిన ఆహారన్ని తగ్గిస్తే సగం సమస్య తీరిపోయినట్టే" అని వివరించారామె.

వీలైనంత ఎక్కువ ఇంట్లో వండుకుని తినడం మేలని, ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాలంటే ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు.

ఇవి కూడా చదవండి: