రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ లాండలే, హెన్రి ఆస్టియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యాకు చెందిన ఒక ఫైటర్ జెట్ అమెరికా డ్రోన్‌ను ఢీకొనడంతో, అది నల్ల సముద్రంలో కూలిపోయిందని అమెరికన్ మిలిటరీ తెలిపింది.
యుక్రెయిన్ యుద్ధంపై రష్యా, అమెరికాల మధ్య ప్రత్యక్ష ఘర్షణలు పెరిగే అవకాశాన్ని ఈ ఘటన హైలైట్ చేస్తోంది.
అమెరికా డ్రోన్ దినచర్యలో భాగంగా అంతర్జాతీయ గగనతలంలో ఎగురుతూ ఉంటే, రెండు రష్యన్ జెట్ విమానాలు దాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించాయని అమెరికా చెబుతోంది.
అయితే, డ్రోన్ "క్లిష్టమైన విన్యాసాలు" చేయడం వలన పడిపోయింది కానీ, తమ దేశ జెట్ విమానాలు అడ్డగించడం వల్ల కాదని రష్యా పేర్కొంది. తమ విమానాలు డ్రోన్‌ను నేరుగా ఢీకొనలేదని వాదిస్తోంది.
ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ట్రాన్స్‌పాండర్లను ఆఫ్ చేసి ఆకాశంలో ఎగురుతూ కనిపించిందని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ట్రాన్స్‌పాండర్లు అనేవి విమానాన్ని ట్రాక్ చేయడానికి సహాయపడే కమ్యూనికేషన్ పరికరాలు.
రీపర్ డ్రోన్‌లు నిఘా విమానాలు. వీటికి 20మీ (66అడుగులు) పొడవైన రెక్కలు ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
మంగళవారం సెంట్రల్ యూరోపియన్ కాలమానం ప్రకారం సుమారు 07:03 గంటలకు ఈ సంఘటన జరిగిందని అమెరికా మిలిటరీ వెల్లడించింది.
"మా ఎంక్యూ-9 డ్రోన్ అంతర్జాతీయ గగనతలంలో రోజువారీ ఆపరేషన్లు నిర్వహిస్తుండగా, ఒక రష్యన్ విమానం దాన్ని అడ్దగించి ఢీకింది. దాంతో, డ్రోన్ కూలబడింది. పూర్తిగా ధ్వంసమైపోయింది" అని ఒక ప్రకటనలో తెలిపింది.
ఢీకొనడానికి ముందు ఎస్‌యూ-27 ఫైటర్ జెట్లు డ్రోన్‌పై "నిర్లక్ష్యంగా, పర్యావరణానికి హాని కలిగించే విధంగా, అన్‌ప్రొఫెషనల్‌గా ఇంధనాన్ని గుమ్మరించాయని" అమెరికా మిలిటరీ పేర్కొంది.
రష్యా చర్యలను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్‌లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్‌ను చర్చలకు పిలిపించింది.
ఈ సమావేశం తరువాత, డ్రోన్ సంఘటనను "రెచ్చగొట్టే చర్య"గా రష్యా భావిస్తోందని ఆంటోనోవ్ అన్నట్టు రష్యా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి నల్ల సముద్రంపై ఉద్రిక్తతలు పెరిగాయి.
రష్యా యుక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి అమెరికా, బ్రిటన్‌లు అంతర్జాతీయ గగనతలంలో నిఘా విమానాలను పెంచాయి.
మంగళవారం ఘటనలో అమెరికా డ్రోన్ పనిని అడ్డగించడమే రష్యా ఉద్దేశమే లేక దాన్ని నేలకూల్చడమే లక్ష్యమా అన్నది ప్రశ్న.
రష్యా విమానాల పైలట్లు ఉద్దేశపూర్వకంగానే ప్రమాదకరమైన చర్యలకు పూనుకున్నారని అమెరికా ఆరోపిస్తోంది.
రష్యా విమానం పొరపాటున డ్రోన్ దారిలోకి వెళ్లి ఉండవచ్చు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కావచ్చు.
కానీ, ఉద్దేశపూర్వకమైన చర్య అయితే, రష్యా కావాలనే అమెరికా డ్రోన్‌పై దాడి చేస్తే దీన్ని తీవ్రమైన రెచ్చగొట్టే చర్యగా పరిగణించాల్సి ఉంటుంది. పర్యవసానాలు బలంగా ఉంటాయి. సమస్యలు మరింత ఉధృతమవుతాయి.
యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపడానికి పశ్చిమ దేశాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా, రష్యాతో నేరుగా ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ ఘటన అందుకు ఒక ఉదాహరణ. అమెరికా దీనిపై సమీక్షించాల్సి ఉంటుంది.
"దీనివలన సమస్యలు మరింత ఉధృతమవుతాయని" అమెరికా మిలిటరీ కమాండర్స్ ఇప్పటికే హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయటానికి వచ్చిన పోలీసులు.. ఘర్షణకు దిగిన పీటీఐ కార్యకర్తలు
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
- థైరాయిడ్ సమస్య ప్రమాదకరంగా ఉన్నా.. ఏడాదిన్నరలో బాడీ బిల్డింగ్ చాంపియన్ అయిన మహిళ
- కర్నాటక: ‘‘మైకుల్లో ప్రార్థించకుంటే అల్లాకు వినపడదా..’’ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు... మరి నిబంధనలు ఏం చెబుతున్నాయి
- ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నత స్థాయి పోస్టుల్లో 90 శాతం మంది అగ్ర కులాలవారే.. ఎందుకిలా? బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాల పరిస్థితి ఏమిటి?













