అమెరికా: చైనా ‘స్పై బెలూన్’ను మిసైల్ ప్రయోగించి అట్లాంటిక్ సముద్రంలో కూల్చేసిన యూఎస్
కీలకమైన తమ సైనిక స్థావరాలపై గూఢచర్యం కోసం చైనా ప్రయోగించిందని అమెరికా ఆరోపిస్తున్న భారీ బెలూన్‌ను ఆ దేశం గాల్లోనే పేల్చేసింది.
తమ దేశానికి చెందిన ఫైటర్ జెట్‌లతో తమ ప్రాదేశిక జలాలలోనే ఆ భారీ బెలూన్‌ను కూల్చివేశాయని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.
కాగా అమెరికా చర్యపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
తమ మానవ రహిత బెలూన్‌ను అమెరికా బలవంతంగా కూల్చడంపై చైనా నిరసన తెలిపింది.
బెలూన్ సముద్రంలో పడిపోతున్న దృశ్యాలు అమెరికా టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. చిన్నపాటి పేలుడు తరువాత ఆ భారీ బెలూన్ పగిలి సముద్రంలో పడిపోతుండడం ఆ వీడియోలలో కనిపించింది.

ఫొటో సోర్స్, Reuters
11 కిలోమీటర్ల మేర పడిన శిథిలాలు
కాగా పేలిన బెలూన్ భాగాలు, అందులోని పరికరాలను సముద్రంలో 11 కిలోమీటర్ల మేర పడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకోవడానికి భారీ క్రేన్ సహా అమెరికా నౌకాదళానికి చెందిన రెండో ఓడలు అక్కడికి వెళ్లాయి.
అమెరికా గగనతలంలో భారీ బెలూన్ ఒకటి ఎగురుతోందని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు గుర్తించిన తరువాత దాన్ని పరిశీలిస్తున్నామంటూ గురువారం వారు తొలిసారి ప్రకటించినప్పటి నుంచి దాన్ని కూల్చేయాలంటూ ఆ దేశాధ్యక్షుడు జో బైడన్‌పై తీవ్ర ఒత్తిడి వచ్చింది.
ఎఫ్-22 మిలటరీ జెట్ నుంచి ఏఐఎం-9ఎక్స్ సైడ్ వైండర్ క్షిపణిని ప్రయోగించి ఈ బెలూన్‌ను కూల్చామని అమెరికా రక్షణ శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.
దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్ నుంచి 6 నాటికల్ మైళ్ల దూరంలో 47 అడుగుల లోతున్న సముద్రంలో ఇది పడిందని రక్షణ శాఖ అధికారులు అమెరికా మీడియాకు చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
అమెరికాకు సమాచారమిచ్చామన్న చైనా
కాగా బెలూన్ కూల్చివేత అనంతరం జో బైడెన్ బెలూన్‌ను విజయవంతంగా కూల్చివేసిన వైమానిక దళ సిబ్బందిని అభినందించారు.
అనంతరం చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘తమ దేశానికి చెందిన ఈ బెలూన్(ఎయిర్‌షిప్) గతి తప్పి ప్రమాదవశాత్తు అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది, ఈ విషయం గుర్తించినప్పటి నుంచి అమెరికాకు అనేకమార్లు సమాచారం ఇచ్చాం’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.
కాగా ఈ బెలూన్ వ్యవహారం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఇబ్బందులను కలిగించింది.
అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి చైనాలో పర్యటించాల్సి ఉండగా.. బెలూన్ విషయంలో చైనా బాధ్యతారహితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు.
అయితే, అమెరికా ఆరోపణలను చైనా ఖండించింది. అది గూఢచర్య బెలూన్ కాదని.. వాతావరణ పరిశోధనకు ఉద్దేశించిందని చెప్పింది.

ఫొటో సోర్స్, EPA
బైడెన్ బుధవారమే కూల్చేయమన్నారు
బెలూన్ కూల్చివేతకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ బుధవారమే ఆదేశాలిచ్చారు.
అయితే, బెలూన్ సముద్రంపై ఉన్న సమయంలో కూల్చే ఆలోచనతో పెంటగాన్ ఇంతవరకు నిరీక్షించింది.
సముద్రంలో కాకుండా బయటకు ఉన్నప్పుడైతే కూల్చివేత సమయంలో దాని భాగాలు ప్రజల పడే ప్రమాదం ఉందన్న కారణంతో పెంటగాన్ ఈ వ్యూహం అమలు చేసింది.

ఫొటో సోర్స్, US Department of Defense
మూడు ఎయిర్‌పోర్టులలో విమానాల రాకపోకలు నిలిపివేసి..
కూల్చివేత సమయంలో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దక్షిణ కరోలినా తీరానికి సమీపంలోని మూడు విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను మూడు గంటల పాటు నిలిపివేసింది.
మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నందున ఆ ప్రాంతంలో సముద్రంలో కూడా ఎవరూ లేకుండా కోస్ట్ గార్డ్స్ ఖాళీ చేయించారు.
దక్షిణ కరోలినా తీరంలో నివసించే హేలీ వాల్ష్ ఈ కూల్చివేతను ప్రత్యక్షంగా చూశారు. వాల్ష్ ‘బీబీసీ’తో మాట్లాడుతూ మూడు ఫైటర్ జెట్‌లు బెలూన్‌ను చుట్టుముట్టాయని.. అందులో ఒక జెట్ నుంచి మిసైల్ ప్రయోగించారని.. వెంటనే భారీ శబ్దంతో బెలూన్ పేలిపోయిందని చెప్పారు. ఆ తీవ్రతకు తమ ఇల్లు కూడా కదిలినట్లయిందన్నారు వాల్ష్.
అమెరికా అణు క్షిపణులు ఉన్న రాష్ట్రంపై ఎగిరిన బెలూన్
బెలూన్ శిథిలాలను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని, నేవీకి చెందిన ఈతగాళ్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటారని సీనియర్ మిలటరీ అధికారి ఒకరు సీఎన్ఎన్‌తో చెప్పారు.
ఈ బెలూన్ తొలుత అమెరికా గగనతలంలోకి జనవరి 28న ప్రవేశించిందని, అనంతరం కెనడా గగనతలంలోకి ప్రవేశించిందని.. అక్కడి నుంచి మళ్లీ జనవరి 31న అమెరికాలోకి కొట్టుకొని వచ్చిందని అధికారులు చెప్పారు.
అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో మొదట దీన్ని చూశారు. అమెరికా రక్షణ శాఖకు ఇది అత్యంత కీలక రాష్ట్రం. ఇక్కడ ఆ దేశానికి చెందిన అణు క్షిపణుల స్థావరాలున్నాయి.
రెండో బెలూన్ కూడా వస్తోంది.. ఎక్కడుందంటే
మరోవైపు చైనాకు చెందిన మరో బెలూన్ కూడా గుర్తించినట్లు శుక్రవారం పెంటగాన్ ప్రకటించింది.
అది ప్రస్తుతం దక్షిణ అమెరికాలోని కోస్టారికా, వెనెజ్వెలాలపై ఎగురుతోందని పెంటగాన్ చెప్పింది.
అయితే, ఈ రెండో బెలూన్ విషయంలో చైనా ఇంతవరకు స్పందిందచలేదు.
కాగా చైనాది బాధ్యతారాహిత్యమని అమెరికా ఆరోపిస్తుండగా... అమెరికావన్నీ నిరాధార ఆరోపణలంటూ చైనా కొట్టిపారేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘అతడు నన్ను చంపేసుండేవాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయినా హింస కొనసాగింది’
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















