చైనాకు అమెరికా మీద ఎందుకంత కోపం... అసలేమిటీ తైవాన్ వివాదం?

చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ వెయి ఫెంఘీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ వెయి ఫెంఘీ
    • రచయిత, టెస్సా వాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

తైవాన్ సంపూర్ణ స్వాతంత్య్రం సాధించేందుకు పూర్తి మద్దతును ఇచ్చేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. బైడెన్ ఈ ప్రకటన చేసిన కొన్ని వారాల్లోనే బీజింగ్ అమెరికాకు ఘాటుగా సమాధానమిచ్చింది.

తైవాన్ స్వాతంత్య్రం విషయంలో అమెరికా ఎటువంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని, అలాంటి ప్రయత్నాలని అణచివేసేందుకు వెనుకాడబోమని చైనా స్పష్టం చేసింది.

తైవాన్ స్వాతంత్య్రానికి అమెరికా మద్దతిస్తోందని చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ వీ ఫెంఘీ ఆదివారం ఆరోపించారు. అమెరికా తైవాన్ విషయంలో చేసిన చెప్పిన మాటలను ఉల్లంఘించి చైనా వ్యవహారాల్లో తల దూరుస్తోందని ఆరోపించారు.

"చైనా నుంచి తైవాన్‌ను విడదీయాలని చూస్తే పోరాడేందుకు వెనుకాడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి వరకు పోరాడతాం. ఎంతవరకైనా పోరాడటం తప్ప చైనా మిలిటరీకి మరో మార్గం ఉండదుని స్పష్టం చేస్తున్నాను" అని ఆయన సింగపూర్‌లో జరిగిన ఆసియా సెక్యూరిటీ షాంగ్రీ-లా సమావేశంలో చెప్పారు.

తైవాన్ గగన తలం పై యుద్ధ విమానాలను తిప్పుతూ చైనా ప్రమాదంతో చెలగాటమాడుతోందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. బైడెన్ ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చైనా ప్రకటన వెలువడింది. తైవాన్ పై దాడి చేస్తే ఆ దేశానికి సైనికపరమైన రక్షణ కల్పిస్తామని బైడెన్ హామీ ఇచ్చారు.

తైవాన్ తనను తాను సార్వభౌమాధికార దేశంగా ప్రకటించుకుంటుంది. తైవాన్‌ తమ అంతర్భాగంమని చైనా అంటోంది. తైవాన్ అమెరికాను మిత్ర దేశంగా పరిగణిస్తుంది. దీంతో, ఈ దేశానికి అండగా ఉండడానికి అమెరికా అనుకూలంగా ఉంది.

చైనా తరచుగా తైవాన్ గగనతలం పైకి యుద్ధ విమానాలను పంపిస్తుండటంతో ఇరు దేశాల మధ్య వాదనలు ముదిరాయి. గత నెలలోనే చైనా తమ యుద్ధ విమానాలను తైవాన్ గగనతలం పైకి పంపింది. మరో వైపు అమెరికా తమ నావికా దళ నౌకలను తైవాన్ జలాల్లోకి పంపింది.

వీడియో క్యాప్షన్, ఏమిటీ తైవాన్? ఎందుకీ టెన్షన్

అమెరికా, చైనా సైనిక పోరుకు సన్నద్ధమవుతున్నాయా?

చైనా తైవాన్ మీద దాడి చేస్తే అది యుద్ధానికి దారి తీస్తుందేమోననే భయం ఉంది. అవసరమైతే, బలవంతంగానైనా తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామని బీజింగ్ గతంలో చెప్పింది.

కానీ, ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి ఏమీ లేదని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.

దాడి చేస్తే చైనా విజయం సాధించే సామర్ధ్యంపై చర్చ జరుగుతోంది. మరో వైపు, తైవాన్ తన గగనతల, నావికాదళ రక్షణ సామర్ధ్యాలను బలపరుచుకుంటోంది.

యుద్ధానికి పాల్పడితే అటువంటి చర్య ఒక్క చైనాకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా వినాశకరంగా మారుతుందని బీజింగ్‌కు తెలుసని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

"ఈ అంశం పై చాలా వాదనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ, యుక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుండగా తైవాన్ మీద దాడి చేయాలనుకుంటే చైనా చాలా ఆలోచించాల్సి ఉంటుంది. రష్యాతో పోలిస్తే, చైనా ఆర్ధిక వ్యవస్థ అంతర్జాతీయంగా చాలా దేశాలతో అనుసంధానమై ఉంటుంది" అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ సీనియర్ ఫెలో విలియం చూన్గ్ చెప్పారు.

చైనా మాత్రం తైవాన్‌ను శాంతియుతంగా విలీనం చేసుకోవాలని అనుకుంటోంది. ఇదే విషయాన్ని జనరల్ వీ కూడా స్పష్టం చేసారు. చైనాను ప్రేరేపించిన పక్షంలోనే తిరుగుబాటు జరుగుతుందని చెప్పారు.

తైవాన్ అధికారికంగా స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం ఒక విధంగా చైనాను ప్రేరేపించడమే. తైవాన్ సార్వభౌమ దేశం అని చెబుతున్నప్పటికీ కూడా అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్ ఇలాంటి ప్రకటన చేయడాన్ని చాలా కాలంగా తప్పించుకుంటూ వస్తున్నారు.

తైవాన్‌లో చాలా మంది ప్రస్తుతం ఉన్న స్టేటస్ కో స్థితిని సమర్థిస్తున్నారు. చాలా కొంత మంది మాత్రమే పూర్తి స్వాతంత్య్రం కావాలని అంటుంటారు.

సై ఇంగ్ వెన్

ఫొటో సోర్స్, Taiwan Presidential Office

ఫొటో క్యాప్షన్, సై ఇంగ్ వెన్

అమెరికా కూడా ఆసియాలో సైనిక పోరాటానికి తలపడేందుకు అంత ఉత్సాహంగా లేదు. యుద్ధానికి ఆసక్తి లేదని పదే పదే చెబుతూ వస్తోంది.

షాంగ్రీ -లా సమావేశానికి హాజరయిన అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ కూడా ఆయన ప్రసంగంలో తైవాన్ సంపూర్ణ స్వాతంత్య్రాన్ని అమెరికా సమర్ధించడం లేదని, అలా అని మరో ప్రచ్ఛన్న యుద్ధాన్ని కూడా కోరుకోవడం లేదని చెప్పారు.

"ఇరు దేశాలు తైవాన్ విషయంలో వారి హామీలకు కట్టుబడి ఉన్నట్లే కనిపిస్తోంది. వారు దృఢ చిత్తంతో ఉన్నట్లు కనిపించాలి. వారు వెనక్కి తగ్గుతున్నట్లు కనిపించేందుకు ఇష్టపడటం లేదు" అని ఎస్ రాజారత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో రీసెర్చ్ ఫెలౌ కొలిన్ కోహ్ చెప్పారు.

"అదే సమయంలో వారు నేరుగా పోరాటానికి పాల్పడే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇరు దేశాలూ తాము చేస్తున్న వాదనలను కళ్లప్పగించి చూస్తూ ముప్పును తగ్గించేందుకే చూస్తున్నారు" అని అన్నారు.

"అయితే, జనరల్ వీ , ఆస్టిన్ షాంగ్రీ-లా సమావేశంలో కలుసుకోవడం సానుకూల సంకేతాలను ఇస్తోంది. ఇదంతా చూస్తుంటే, ఇరు దేశాలు సమావేశమై ఈ అంశంపై చర్చించుకుని ఒక ఒప్పందానికి రావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది" అని కోహ్ అన్నారు.

ఈ సమావేశం ఇరు దేశాల సైన్యాల మధ్య క్రియాశీలక చర్చలు జరిగేందుకు దారి తీస్చుంజియ ట్రంప్ హయాంలో జరగని చర్చలు ఇకపై జరిగే అవకాశం ఉంటుంది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, చైనా అమ్మాయి, గుంటూరు అబ్బాయి లవ్ స్టోరీ

ఏది ఏమైనా, చైనా, అమెరికాలు తమ వాద ప్రతివాదాలను కొనసాగించవచ్చని అనిపిస్తోంది.

"తైవాన్ సైనిక దళాలను అణచివేసేందుకు చైనా మరిన్ని యుద్ధ విమానాలను అక్కడికి పంపడం, తప్పుడు ప్రచారాలను నిర్వహించడం వంటి పనులు చేసే అవకాశముంది" అని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో చైనా నిపుణులు డాక్టర్ ఇయాన్ చాంగ్ చెప్పారు.

తైవాన్‌లో ఎన్నికలు జరగడానికి ముందు చైనా దుష్ప్రచారాలు వ్యాప్తి చేసిందని తైవాన్ ఆరోపించింది. ఈ ఏడాది చివర్లో తైవాన్‌లో కీలకమైన స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.

అమెరికాలో నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు ఈ ఏడాది చివర్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని పార్టీ అధినేత భావిస్తున్నారు. ఈ పరిస్థితులో అటు అమెరికా కానీ, ఇటు చైనా కానీ తైవాన్ విషయంలో తమ రాజకీయ వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా లేవు.

"అయితే, ఇరు దేశాలూ ప్రస్తుతానికి ఈ విషయాన్ని పొడిగించేందుకు ఆసక్తిగా లేకపోవడం మంచి విషయం" అని డాక్టర్ చాంగ్ అన్నారు.

"ఈ పరిస్థితి ముదరకపోవడం అంటే మెరుగైన స్థితి ఏర్పడుతుందని అర్ధం కాదు. ఈ పరిస్థితిలో మనమంతా కొంత కాలంగా కూరుకుపోయి ఉన్నామని అర్థం" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)