అమెరికాకు చైనా హెచ్చరిక: 'తైవాన్‌ స్వతంత్రం కోసం ప్రయత్నిస్తే యుద్ధం తప్పదు'

తైవాన్‌లో సైనిక కార్యకలాపాలను పెంచడం పట్ల చైనాను అమెరికా విమర్శించింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తైవాన్‌లో సైనిక కార్యకలాపాలను పెంచడం పట్ల చైనాను అమెరికా విమర్శించింది

చైనా నుంచి తైవాన్‌ను స్వతంత్రంగా మార్చే ఏ ప్రయత్నమైనా... సైనిక చర్యను ప్రేరేపిస్తుందని అమెరికాను చైనా హెచ్చరించింది.

ఆసియా భద్రతా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సింగపూర్‌లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌ను చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘె కలిశారు.

చైనా నుంచి తైవాన్‌ను విడదీయాలని చూస్తే.... ఎంతవరకైనా పోరాడటం తప్ప చైనా మిలిటరీకి మరో మార్గం లేకుండా పోతుందని వీ ఫెంఘె అన్నారు.

చైనా సైనికులవి రెచ్చగొట్టే, అస్థిరపరిచే కార్యకలాపాలని ఆ తర్వాత ఆస్టిన్ వ్యాఖ్యానించారు.

తైవాన్ సమీపంలో ప్రతీరోజూ రికార్డు స్థాయిలో చైనా విమానాలు తిరుగుతున్నాయని ఆయన చెప్పారు. చైనా చర్యలు, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు.

తైవాన్‌ను తమ అంతర్భాగంగా చైనా పరిగణిస్తుంది. అందుకే తైవాన్‌కు అమెరికా ఆయుధ విక్రయాలను సైతం చైనా ఖండించింది.

ఒక అధికార ప్రతినిధి చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘెను ఉటంకిస్తూ ఇలా చెప్పారు. ''చైనా నుంచి తైవాన్‌ను విడదీయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే, చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఎంతకైనా తెగిస్తుంది. తైవాన్‌ను విడదీయాలనే ప్రయత్నాన్ని అణిచివేయడానికి, జాతీయ సార్వభౌమాధికారం- ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి పోరాటడం తప్ప చైనా ఆర్మీకి మరో మార్గం లేదు'' అని ఆయన అన్నారు.

చైనా-తైవాన్‌ల మధ్య ఉన్న యథాతథ స్థితిని కొనసాగించేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆస్టిన్ చెప్పారు. బలవంతంగా ఉద్రిక్తతలను పరిష్కరించే ప్రయత్నం చేయరాదని ఆయన నొక్కి చెప్పారు.

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ (ఎడమ వైపు) తొలిసారి చైనా రక్షణమంత్రి వీ ఫెంఘెతో నేరుగా సమావేశం అయ్యారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ (ఎడమ వైపు) తొలిసారి చైనా రక్షణమంత్రి వీ ఫెంఘెతో నేరుగా సమావేశం అయ్యారు

అమెరికా, చైనా రక్షణ అధిపతులు సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశం దాదాపు గంటపాటు కొనసాగింది.

ఈ భేటీ సజావుగా సాగిందని వీ ఫెంఘె చెప్పారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని ఇరుపక్షాలు అన్నాయి.

ఇరు పక్షాల మధ్య అపార్థాలను నివారించడానికి చైనా సైన్యంతో పారదర్శకంగా వ్యవహరిస్తామని ఆస్టిన్ అన్నారు.

తమ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి చైనా పంపిన 30 యుద్ధ విమానాలను హెచ్చరించడానికిగానూ ఫైటర్ జెట్‌లను మోహరించామని మే చివరలో తైవాన్ తెలిపింది.

వీడియో క్యాప్షన్, భవిష్యత్ యుద్ధాల్లో పశ్చిమ దేశాలు రష్యా, చైనాలను ఎదుర్కోగలవా?

చైనా, తైవాన్‌ల ప్రాథమిక అంశాలు

చైనా, తైవాన్‌ల మధ్య సత్సంబంధాలు ఎందుకు లేవు?

1940లలో అంతర్యుద్ధం సమయంలో చైనా, తైవాన్‌లు విడిపోయాయి. అవసరమైతే బలవంతంగానైనా ఏదో ఒకరోజు తిరిగి తైవాన్‌ను సొంతం చేసుకుంటామని బీజింగ్ నొక్కి చెప్పింది.

తైవాన్‌లో పాలన ఎలా ఉంటుంది?

ఈ ద్వీపం ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. దీనికి సొంత రాజ్యాంగం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకులు ఉన్నారు. సాయుధ బలగాల్లో దాదాపు 300,000 క్రియాశీల దళాలు ఉన్నాయి.

తైవాన్‌ను ఎవరు గుర్తించారు?

కొన్ని దేశాలు మాత్రమే తైవాన్‌ను గుర్తించాయి. అమెరికాకు తైవాన్‌తో ఎలాంటి అధికారిక సంబంధాలు లేవు. అయితే, 'తైవాన్ రిలేషన్స్ యాక్ట్'‌ను అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చింది. అందులో భాగంగా తైవాన్‌కు రక్షణ ఆయుధాలను అమెరికా సరఫరా చేయసాగింది.

వీడియో క్యాప్షన్, గల్వాన్ ఘర్షణలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)