అమెరికాలో మండిపోతున్న ధరలు... 40 ఏళ్ల గరిష్టానికి పెరిగిన ద్రవ్యోల్బణం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నటాలీ షెర్మన్
- హోదా, బిజినెస్ రిపోర్టర్, న్యూయార్క్
అమెరికాలో ధరలు గత నెలలో ఊహించన దానికన్నా వేగంగా పెరిగిపోయాయి. ఆహార, ఇంధన ధరలు పెరిగిపోతుండటంతో ద్రవ్యోల్బణం రేటు 1981 తర్వాత అత్యధిక స్థాయికి పెరిగింది.
ఏప్రిల్‌లో కొంత తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు మే నెలలో 8.6 శాతానికి పెరిగిందని లేబర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
పెరిగిపోతున్న జీవన వ్యయం ప్రజలను పిండేస్తోంది. విధానకర్తల మీద పరిస్థితిని నియంత్రణలోకి తేవాల్సిన ఒత్తిడిని పెంచుతోంది.
ఈ పరిస్థితుల్లో అమెరికా సెంట్రల్ బ్యాంకు మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది.
ఈ చర్యలు ఆర్థిక కార్యకలాపాలను చల్లబరిచే పనిని ప్రారంభించాయని, ధరల ఒత్తిడిని తేలికపరుస్తున్నాయని విశ్లేషకులు ఆశిస్తున్నారు.
కానీ.. రష్యా, యుక్రెయిన్‌ల ఘర్షణ వల్ల.. ఆ రెండు దేశాల నుంచి ఎగుమతులు పడిపోవటంతో చమురు ధరలు, గోధుమల వంటి సరకుల ధరలు పెరిగిపోయాయి. ఈ యుద్ధం కారణంగా.. ధరల సమస్యను పరిష్కరించటం మరింత కష్టంగా మారింది.
ఆహార పదార్థాల ధరలు 2021 మే నెలతో పోలిస్తే గత నెలలో 10 శాతానికి పైగా పెరిగాయి. ఇక ఇంధన ధరలైతే ఏకంగా 34 శాతానికి పైగా పెరిగిపోయాయి.
అయితే.. ఈ పెరుగుదలలు ఆర్థికవ్యవస్థ అంతటా వ్యాపించటం కొనసాగుతోందని శుక్రవారం నాడు లేబర్ మినిస్ట్రీ విడుదల చేసిన నివేదిక చూపుతోంది. ఫలితంగా విమానాల టికెట్లు మొదలుకుని, దుస్తులు, వైద్య సేవల ధరలు కూడా అత్యధికంగా పెరిగిపోయాయి.
''వినియోగ వస్తువుల ధరలు ఊహించిన దానికి మించి పెరిగిపోయాయి. ఇది మంచిది కాదు. ద్రవ్యోల్బణం వార్షిక పెరుగుదల రేటు 8.6 శాతంగా ఉండటమనేది 40 ఏళ్లలో అత్యంత వేగవంతమైన పెరుగుదల'' అని Bankrate.com లో చీఫ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గ్రెగ్ మెక్‌బ్రైడ్ పేర్కొన్నారు.
''ఇంకా దారుణమేమిటంటే ఈ పెరుగుదలలు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. తల దాచుకునే తావే లేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా గత ఏడాది నుంచి ధరల పెరుగుదలతో సతమతమవుతోంది. బలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ అసాధారణ రీతిలో మహమ్మారి శరాఘాతానికి కుదేలు కాగా.. ఆ పరిస్థితి నుంచి కోలుకోవటానికి అమెరికా ప్రభుత్వం భారీ స్థాయిలో వ్యయాలు చేసింది. ప్రజల ఇళ్లకు నేరుగా నగదు చెక్కులు పంపించటం వంట చర్యలు కూడా ఇందులో ఉన్నాయి. సరుకులు పెరిగిపోవటంతో కంపెనీలు ధరలను పెంచాయి.
ఇప్పుడు యుక్రెయిన్‌లో యుద్ధం ఈ సమస్యను ప్రపంచమంతటికీ విస్తరించింది. మరోవైపు ఈ వసంత కాలంలో చైనాలో కోవిడ్ సంబంధిత లాక్‌డౌన్లు కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయి.
పెరుగుతున్న ధరలు ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుండటంతో వారు ఖర్చు చేయటానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా దేశాల్లో అర్థిక వృద్ధి వేగంగా తిరోగమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
''యుక్రెయిన్‌లో యుద్ధం, చైనాలో లాక్‌డౌన్లు, పంపిణీ వ్యవస్థలకు ఆటంకాలు, మాంద్యంతో కూడిన ద్రవ్యోల్బణం (స్టాగ్ఫ్లేషన్).. వృద్ధిని దెబ్బతీస్తున్నాయి. చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యాన్ని నివారించటం కష్టమవుతుంది'' అని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ ఈ వారంలో హెచ్చరించారు.
ద్రవ్యోల్బణం నివేదికలు చూసి అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రధానమైన మూడు సూచీలూ 2 శాతం పైగా పడిపోయాయి. నిజానికి ఆర్థిక వ్యవస్థ దిశను చూసి మదుపుదారులు ఆందోళన చెందుతుండటంతో కొన్న వారాలుగా అమెరికా షేర్లు దిగజారుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
''ద్రవ్యోల్బణం త్వరలోనే గరిష్ట స్థాయికి పెరిగిపోయినా.. అది వేగంగా తగ్గే పరిస్థితి కనిపించటం లేదు. అధిక ధరలు కొంత కాలం పాటు వినియోగదారుల ఖర్చు మీద ఒత్తిడిని కొనసాగించవచ్చు'' అని చార్లెస్ ష్క్వాబ్ యూకే మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ ఫ్లిన్ అంచనా వేశారు.
''ఈ ద్రవ్యోల్బణం ప్రమాదానికి.. ఇంకా కొనసాగుతున్న పంపిణీ వ్యవస్థ సమస్యలను, యుక్రెయిన్ మీద రష్యా సైనికదాడి ప్రభావాన్ని జోడించి చూడండి. ఆర్థిక వ్యవస్థ తిరోగమనం భయాలు ఇంత వేగంగా ఎందుకు పెరిగాయో కనిపిస్తుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటికైతే అమెరికా కార్మిక మార్కెట్‌లో కొత్త ఉద్యోగాల కల్పన కొనసాగింది. ఇది వృద్ధి కొనసాగుతోందనేందుకు సంకేతం.
కానీ ధరలు పెరిగిపోతుండగా వేతనాలు మాత్రం ఆ వేగాన్ని అందుకోలేదు. పెరుగుతున్న జీవన వ్యయం.. ఆహారం, ఇంధనం వంటి కనీస అవసరాలకు ఖర్చులే ఎక్కువగా ఉండే అల్పాదాయ గృహాలను ప్రత్యేకించి గట్టి దెబ్బతీసింది.
అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి పెద్ద సమస్య ద్రవ్యోల్బణమేనని దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి. వినియోగదారుల సెంటిమెంట్ కుప్పకూలింది. ఈ అంశంపై అధ్యక్షుడు జో బైడెన్ మీద రిపబ్లికన్లు విమర్శలు ఎక్కుపెడుతుండటంతో.. అధ్యక్షుడి జనామోదం రేటింగ్‌లు తగ్గిపోయాయి.
గత నెల రోజుల్లో అమెరికాలో కొత్త రికార్డులను తాకి మరీ పెరుగుతున్న పెట్రోల్ ధర కారణంగా మిగతా ధరలు 1 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఒక గ్యాలన్ (3.785 లీటర్లు) పెట్రోల్ ధర దాదాపు 5 డాలర్లకు (రూ. 390) చేరుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
ధరలను తగ్గించటం ప్రప్రధమ ప్రాధాన్యమని అమెరికా విత్త మంత్రి జానెట్ యెల్లెన్ ఈ వారంలో వాషింగ్టన్‌లో ఒక విచారణలో చెప్పారు.
''ఇక్కడ అమెరికాలో ధరలను తగ్గించటం కోసం మనం మరింత కృషి చేయాలి. వేగంగా చేయాలి'' అని అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
''పుతిన్ ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించటానికి, చమురు, ఆహార ధరలను తగ్గించటానికి నా శక్తిమేర నేను అంతా చేస్తున్నా'' అని ఆయన కాలిఫోర్నియాలోని పోర్ట్ ఆఫ్ లాస్ ఏంజెలెస్‌లో ఒక ప్రసంగం సందర్భంగా చెప్పారు.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ ధరలు పెంచుతుండటంతో ధరలు అదుపులోకి వస్తాయని తాను భావిస్తున్నట్లు పైపర్ సాండ్లర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో గ్లోబల్ పాలసీ రీసెర్చ్ విభాగాధిపతి రోబర్టో పెర్లి తెలిపారు. కానీ అప్పుల ధరలు పెరగటం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు.
''ఇప్పటికైతే అమెరికా ఆర్థికవ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంది. ప్రతి దానికీ.. వస్తువులు, సేవలు అన్నిటికీ బలమైన డిమాండ్ ఉండటమే దీనికి నిదర్శనం. అయితే అప్పుల ధరల పెరుగుదల సమస్యను ఫెడరల్ బ్యాంక్ పరిష్కరించాల్సి ఉంటుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
''ఫలితం ఇప్పుడు ఉండదు. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఫెడరల్ బ్యాంక్ ప్రధానంగా ప్రవేశపెట్టిన గణనీయమైన మందగమనం రాబోయే త్రైమాసికాల్లో కనిపిస్తుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- వయసు పెరగకుండా చరిత్రలో జరిగిన ప్రయోగాలేంటి... తాజాగా సైన్స్ కనిపెట్టింది ఏమిటి?
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం?
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












