కోవిడ్ వల్ల వాసన శక్తి కోల్పోయినప్పుడు ఎదురయ్యే 6 సమస్యలివే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోహన్ ఎన్ లుండ్‌స్టార్మ్
- హోదా, బీబీసీ ముండో
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకిన వారిలో సగం మంది వాసన చూసే సామర్థ్యం తాత్కాలికంగా కోల్పోయినట్లు (అనోస్మియా) భిన్న అధ్యయనాల్లో రుజువైంది.
మరో 20 నుంచి 35 శాతం మందిలో వాసన చూసే సామర్థ్యం తగ్గినట్లు (హైపోస్మియా) వెల్లడైంది.
అయితే, ఇదివరకటి వేరియంట్లతో పోల్చినప్పుడు ఒమిక్రాన్‌తో వాసన చూసే సామర్థ్యంపై పెద్దగా ప్రభావం పడటంలేదని పరిశోధనల్లో తేలింది.
ప్రస్తుతానికి 50 కోట్ల మందికి ఒక్కసారైనా ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కోట్ల మంది ఇతరుల ఆరోగ్యం ఈ వైరస్ వల్ల ప్రభావితమైంది.
అయితే, కోవిడ్-19 సోకిన 12 నుంచి 18 నెలల తర్వాత కూడా 34 నుంచి 46 శాతం మందిలో వాసన చూసే సామర్థ్యం ఇంకా తగ్గే ఉన్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అయితే, చాలా మందికి తమ వాసన చూసే సామర్థ్యం తగ్గినట్లు తెలియడం లేదు.
మరికొంతమందిలో వాసన వేరేగా అనిపించే సమస్య (పారోస్మియా) కూడా వస్తోంది. అయితే, ఈ రుగ్మత కొంతమందిలో కొన్ని రోజుల్లో తగ్గుతోంది. మరికొంత మందిలో మాత్రం ఇది దీర్ఘ కాలం ఉంటోంది.
వాసన కోల్పోవడానికి కోవిడ్-19 మాత్రమే కారణం కాదు. ఇతర ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు, నాడీ సంబంధిత వ్యాధుల వల్ల కూడా మన వాసన చూసే సామర్థ్యం తగ్గిపోవచ్చు. అయితే, ఇలా వాసన చూసే సామర్థ్యం తగ్గడం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి?

ఫొటో సోర్స్, Getty Images
1. ఇతర వ్యాధుల ముప్పు
వాసన చూసే సామర్థ్యం తగ్గినప్పుడు పాడైన ఆహారాన్ని తీసుకునే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆహారం పాడైందీ లేనిదీ మనం ఎక్కువగా వాసన చూసే పసిగడతాం.
వాసన సరిగా చూడలేనప్పుడు ఆహారంతో వచ్చే అలర్జీలు, ఇతర ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
2. రుచి..
తీపి, ఉప్పు, చేదు లాంటి రుచులను పక్కన పెడితే, మిగతా రుచులపై వాసనలు ప్రభావం చూపిస్తాయి.
ముఖ్యంగా ముక్కు, నాలుక మధ్య వెనుక భాగంలో ఉండే రిసెప్టర్లు దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
వాసన చూసే సామర్థ్యం తగ్గిపోయినప్పుడు, కళ్లను మూసి నోటి ముందు యాపిల్ పెట్టినా బంగాళాదుంప వాసనే వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
3. ఆకలి
ఆకలి పెంచడంలోనూ వాసన కీలక పాత్ర పోషిస్తుంది.
అంటే వంట చేసేటప్పుడు వచ్చే వాసను మనం ఆస్వాదించలేం. ఫలితంగా మనకు ఆకలిగా కూడా అనిపించకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
4. బరువు నియంత్రణ
ఆకలి తగ్గిపోవడంతోపాటు తినే ఆహారాన్ని ఆస్వాదించే సామర్థ్యం తగ్గినప్పుడు కొందరు బరువును కూడా కోల్పోవచ్చు.
అయితే, వాసన చూసే సామర్థ్యం తగ్గినప్పుడు ఇతర జ్ఞానేంద్రియాలు కాస్త మెరుగ్గా పనిచేయడం మొదలుపెట్టొచ్చు. ఉదాహరణకు ఆహారంలో కరకరలాడే స్వభావాన్ని మనం ఎక్కువగా ఆస్వాదించొచ్చు.
కొన్నిసార్లు ఆకలి వేసేంత వరకు ఆగకుండా.. తినడానికి ప్రయత్నించొచ్చు. ఫలితంగా తిండి ఎక్కువై కొందరు బరువు కూడా పెరగొచ్చు. దీర్ఘకాలంలో హృద్రోగాలు లాంటి ఇతర అనారోగ్య ముప్పులను ఇది పెంచొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
5. రిలేషన్‌షిప్స్
వాసన కోల్పోవడంతో వచ్చే కొన్ని పరిణామాలను మనం ముందుగా ఊహించలేం కూడా.
ఉదాహరణకు వాసన చూడలేని వారు తమ శరీరం నుంచి వచ్చే దుర్వాసనను పసిగట్టలేరు. దీని వల్ల ఆత్మన్యూనత, అభద్రతా భావం లాంటివి పెరిగే అవకాశముంది.
వాసన తగ్గడంతో సామాజిక సంబంధాలపై ప్రభావం పడుతుందని, స్నేహితుల సంఖ్య తగ్గుతుందని, శృంగారాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆస్వాదించలేరని అధ్యయనాల్లో వెల్లడింది.
కొన్నిసార్లు జీవిత భాగస్వామి నుంచి వచ్చే వాసనను కూడా ఆస్వాదించడం కష్టం అవుతుంది.
6. మానసిక ఆరోగ్యం
వాసన చూసే సామర్థ్యం తగ్గినవారిలో మూడో వంతు మంది తమ జీవితాన్ని సరిగా ఆస్వాదించ లేకపోతున్నట్లు వెల్లడింది. దీని వల్ల వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోంది.
ముఖ్యంగా కుంగుబాటు, ఆందోళన లాంటి సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి.
చికిత్స ఏమిటి?
దురదృష్టవశాత్తు వాసన చూసే సామర్థ్యం తగ్గడం అనే సమస్యకు మెరుగైన చికిత్సలు అందబాటులో లేవు.
వైరస్‌ల వల్ల ఈ సమస్య వస్తే, స్మెల్ ట్రైనింగ్‌తో కొంతవరకు ఫలితం ఉంటుంది. ఇది ఫిజికల్ థెరపీ లాంటిదే. దీనిలో భాగంగా రోగులకు 20 నిమిషాలపాటు రోజూ ఉదయం, సాయంత్రం వేర్వేరు రకాల వాసనలను చూడమని చెబుతారు. రెండు నుంచి మూడు నెలలపాటు ఈ చికిత్స ఉంటుంది.
అయితే, ఈ చికిత్స ద్వారా పూర్తిగా కోలుకోవడం కష్టమే. కానీ, దీని వల్ల పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్-19 మహమ్మారి వల్ల వాసన చూసే సామర్థ్యంపై పరిశోధనలు కూడా పెరిగాయి. కొన్ని ఏళ్ల తర్వాత ఈ విషయంలో కొత్త చికిత్సలు కూడా అందుబాటులో రావొచ్చు.
మీకు ఇప్పుడు వాసన చూసే సామర్థ్యం తగ్గినట్లు అనిపిస్తే, ఆరు వారాల పాటు స్మెల్ ట్రైనింగ్ ప్రయత్నిస్తే కొంతవరకు ఫలితం ఉండొచ్చు. ఒకవేళ అప్పటికీ ఫలితం లేకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇవి కూడా చదవండి:
- భూ పరిరక్షణ ఉద్యమం, వివాదాస్పద అంశాలపై జగ్గీ వాసుదేవ్‌తో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ..
- మ్యాపుల్లో ఉత్తరం దిక్కునే పైభాగంలో చూపుతారెందుకు? నార్త్ అంటే ఆధిపత్యమా? పేదవాళ్లంతా సౌత్‌లోనే ఉంటారా?
- జగ్గీ వాసుదేవ్: ‘ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మించలేం, అలా చేయాలంటే దేశమంతా తవ్వుకుంటూ రావాలి’
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం
- పిల్లల ఉన్నత విద్య ఖర్చుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















