పాకిస్తాన్: ఏడాదికి 12 లక్షల ఆదాయానికి ఇన్‌కమ్ టాక్స్ 100 రూపాయలే

పాకిస్తాన్‌లో ఆదాయపు పన్ను

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తన్వీర్ మలిక్, ముహమ్మద్ సుహైబ్
    • హోదా, బీబీసీ ఉర్దూ

పాకిస్తాన్‌ ప్రభుత్వం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో అత్యంత చర్చనీయాంశమైన విషయం... వేతనజీవులకు పన్ను తగ్గించడం.

నెలకు లక్ష రూపాయల జీతం అంటే సంవత్సరానికి రూ. 12 లక్షల వేతనం తీసుకునేవారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

అయితే, ఫైనాన్స్ బిల్లు ప్రకారం, రూ. 6 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం పొందేవారు నామమాత్రపు పన్నుగా 100 రూపాయలు చెల్లించాలి.

బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పన్ను శ్లాబుల వివరాలు చెప్పలేదు. అయితే, కేబినెట్ ఆమోదించిన ఫైనాన్స్ బిల్లు ప్రకారం ఆదాయపు పన్ను శ్లాబుల సంఖ్యను 12 నుంచి ఏడుకు తగ్గించారు.

పాకిస్తాన్‌లో ఆదాయపు పన్ను

ఫొటో సోర్స్, Getty Images

ఎవరు ఎంత ఆదాయపు పన్ను చెల్లించాలి?

ఏడాదికి రూ.6 లక్షల వరకు జీతం ఉన్నవారు మొదటి శ్లాబులో ఉంటారు. వీరికి ఎలాంటి ఆదాయపు పన్ను వర్తించదు.

రెండవ శ్లాబులో సంవత్సర ఆదాయం 6- 12 లక్షల వరకు ఉన్న వారు ఉంటారు. వీరు వార్షిక పన్నుగా రూ. 100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పన్ను పరిధిలోకి తీసుకురావాలనే ప్రయత్నంగా ఈ నామమాత్రపు పన్నును విధించారు.

వార్షిక ఆదాయం రూ.12 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఉన్న వారు మూడో శ్లాబు పరిధిలోకి వస్తారు. 12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు 7 శాతం ఫిక్స్‌డ్ రేటు ప్రకారం పన్ను చెల్లించాలి.

నాల్గవ శ్లాబులో వార్షిక వేతనం రూ.24 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ఉంటుంది. ఈ శ్లాబులోని వారు 84 వేల ఫిక్స్‌డ్ ట్యాక్స్‌తో పాటు 24 లక్షలకు పైబడిన ఆదాయంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అయిదవ శ్లాబులో వార్షిక ఆదాయం రూ.36 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఉన్న వ్యక్తులు వస్తారు. వీరు రూ. 2,34,000 ఫిక్స్‌డ్ ట్యాక్స్‌తో పాటు రూ. 36 లక్షలకు పైబడిన ఆదాయంపై 17.5 శాతం పన్నుగా కట్టాలి. గతంలో రూ.60 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి కూడా ఇదే శ్లాబు వర్తించేది. కానీ, ఇప్పుడు దీన్ని మార్చారు.

వార్షిక ఆదాయం రూ. 60 లక్షల నుంచి కోటి 20 లక్షల వారిని ఆరో శ్లాబులో చేర్చారు. వీరు 6,54,000 ఫిక్స్‌డ్ ట్యాక్స్‌తో పాటు 60 లక్షలకు పైబడిన ఆదాయంపై 22.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

సంవత్సరానికి కోటి 20 లక్షల కంటే ఎక్కువగా సంపాదించేవారిని చివరిదైన ఏడో శ్లాబులో చేర్చారు. వీరు రూ. 20,04,000 ఫిక్స్‌డ్ పన్నుతో పాటు కోటి 20 లక్షల కంటే అధికంగా వచ్చే ఆదాయంపై 32.5 శాతం పన్ను రూపంలో కట్టాలి.

ఒక సామాన్యుడి జీతంపై ఈ శ్లాబుల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

ఆదాయపు పన్ను

ఫొటో సోర్స్, Getty Images

ప్రజలపై పన్ను భారం ఎంత?

ఒక వ్యక్తి నెల జీతం రూ. 50,000 ఉన్నట్లయితే ఆయన ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ జీతం నెలకు లక్ష రూపాయలు అయితే... ఏడాదికి 100 రూపాయలను ఆదాయపు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

గతంలో నెలకు రూ. 1.5 లక్షల ఆదాయం ఉన్నవారు నెలవారీ పన్నుగా రూ. 7,500 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది రూ. 3,500కి తగ్గిపోనుంది.

నెలకు రూ.2 లక్షలు సంపాదించే వారు గతంలో రూ.15 వేలు పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు ఈ మొత్తం నెలకు రూ.7 వేలకు తగ్గనుంది.

నెలవారీ ఆదాయం రూ.2,50,000 ఉన్నవారు గతంలో రూ.23,541 పన్ను చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు నెలకు రూ.13,250 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

నెలకు రూ.3 లక్షలు జీతంగా అందుకునే వ్యక్తులు గతంలో రూ. 32,500 ఆదాయపు పన్ను చెల్లించేవారు. తాజాగా వారికి రూ. 13,000 మినహాయింపు లభించింది. దీంతో నెలకు ఆదాయపు పన్నుగా రూ.19,500 చెల్లిస్తే సరిపోతుంది.

అలాగే 3.5 లక్షల ఆదాయం ఉన్నవారు నెలకు రూ. 28,250 (గతంలో రూ. 42,500), 4 లక్షలు ఆర్జించేవారు నెలకు రూ. 37,000 (గతంలో రూ. 52,500) కట్టాల్సి ఉంటుంది.

ఐఎంఎఫ్ నిబంధనల ప్రకారం రూపాయి విలువ క్షీణించింది. దీని కారణంగా పాకిస్తాన్‌పై విదేశీ అప్పుల భారం పెరుగుతోంది: డాక్టర్ అష్ఫాక్ అహ్మద్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఐఎంఎఫ్ నిబంధనల ప్రకారం రూపాయి విలువ క్షీణించింది. దీని కారణంగా పాకిస్తాన్‌పై విదేశీ అప్పుల భారం పెరుగుతోంది: డాక్టర్ అష్ఫాక్ అహ్మద్

అల్పాదాయ వర్గాలకు కొంత ఊరట

పన్ను శ్లాబుల్లో మార్పుల గురించి బీబీసీతో ఆదాయపు పన్నుల నిపుణుడు ఇక్రమ్ ఉల్ హక్ మాట్లాడారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు ఉపశమనం కలిగించాయని అన్నారు.

శ్లాబుల తగ్గింపు అనేది ఐఎంఎఫ్ షరతుల్లో ఒకటని ఆయన తెలిపారు.

ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోన్న పరిస్థితుల్లో అల్పాదాయ వర్గాలకు ఇది కొంత ఊరటను ఇస్తుందని చెప్పారు.

వీడియో క్యాప్షన్, రిటైర్ అయిన తరువాత కూడా నెలనెలా తగినంత డబ్బు రావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి?

వ్యక్తిగత పన్ను అంటే ఏంటి?

వ్యక్తిగత పన్నులో సంస్కరణలు అవసరమని ఐఎంఎఫ్ భావించింది. వ్యక్తిగత పన్ను గురించి ఇక్రమ్ ఉల్ హక్ మాట్లాడుతూ... వేతనజీవులపై ఆదాయపు పన్ను రేటును పెంచడమే దీనర్థం అని అన్నారు.

"వ్యక్తిగత పన్నుల్లో సంస్కరణలు అంటే... అధిక జీతం పొందే వ్యక్తులపై పన్ను పెంచాలని ఐఎంఎఫ్ అనుకుంటోంది'' అని ఇక్రమ్ అభిప్రాయపడ్డారు.

వేతన తరగతుల నుంచి పన్ను వసూలు చేయాలని ఐఎంఎఫ్ నుంచి డిమాండ్ రావడం ఇదే తొలిసారి కాదనేది గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు కూడా ఐఎంఎఫ్ ఇదే డిమాండ్ చేసింది. కానీ, గత ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు.

వేతన తరగతులు నుంచి అదనంగా రూ. 130- 150 బిలియన్లు వసూలు చేయాలని ఐఎంఎఫ్ కోరింది. అయితే దీన్ని ప్రభుత్వం అంగీకరించలేదు.

వీడియో క్యాప్షన్, నెలకు 5000తో 12 లక్షలు సంపాదించొచ్చా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)