శత్రువుల్ని చంపేందుకు ఊహకందని విధంగా విష పదార్ధాలు తయారు చేసే సోవియట్ యూనియన్ పాయిజన్ ఫ్యాక్టరీ

పాయిజన్ ఫ్యాక్టరీ

ఫొటో సోర్స్, Getty Images

సోవియట్ యూనియన్ మొదటి నాయకుడు వ్లాదిమర్ లెనిన్‌కు1922లో తొలిసారిగా గుండెపోటు వచ్చింది. దీని తర్వాత, తనను తాను చంపుకోవడానికి సైనైడ్ ఇవ్వమని జోసెఫ్ స్టాలిన్‌ను లెనిన్ అడిగారు. కానీ, స్టాలిన్ తిరస్కరించారు. ఈ ఘటన తర్వాతే ఇదంతా ప్రారంభమైందని కొందరు అంటారు.

మరికొందరేమో... 1918లో ఒక సోషలిస్టు విప్లవకారుడు, లెనిన్‌ను కాల్చిన తర్వాత ఇది మొదలైందని అంటుంటారు. లెనిన్‌కు తగిలిన బుల్లెట్లకు విషపు పూత పూసినట్లు ఆయన డాక్టర్లు నిర్ధారించారు. ఇదే, దీని ఏర్పాటుకు దారితీసిందని చెబుతుంటారు.

కానీ, అందరూ ఏకీభవిస్తున్న విషయం ఏంటంటే... లెనిన్ ఆదేశాల ప్రకారమే 1920ల ప్రారంభంలో క్రెమ్లిన్ పాయిజన్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది.

ఆనవాళ్లు తెలియకుండా శత్రువులకు విషాన్ని ఎక్కించే కొత్త పద్ధతులను సోవియట్లు ఈ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసేవారు. శత్రువులను అణిచివేయడం, నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన సోవియట్ రాజకీయ, సైనిక ఇంటెలిజెన్స్ సంస్థ 'చెకా'. చెకా సంస్థ రహస్యంగా ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలను చూసుకునేది.

సోవియట్ రహస్య సర్వీసుల పేరు కాలక్రమేణా మారుతూ వచ్చింది. అలాగే ఈ ఫ్యాక్టరీ పేరు కూడా మారింది. మొదట దీన్ని 'స్పెషల్ రూమ్'గా పిలిచేవారు. తర్వాత 'లాబోరేటరీ 1' అని, 'లాబోరేటరీ ఎక్స్' అని లాబోరేటరీ 12 అని కూడా పిలిచేవారు. తర్వాత స్టాలిన్ ఆధ్వర్యంలో దీనికి సింపుల్‌గా 'కమేరా: ద చాంబర్' అనే పేరును ఫిక్స్ చేశారు.

సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఆయన రహస్య కార్యకలాపాల వివరాలు బయటకు వచ్చాయి. గతంలో అసమ్మతివాదులు వెల్లడించిన అంశాలు కూడా నిర్ధారణ అయ్యాయి.

పాయిజన్ ఫ్యాక్టరీ

ఫొటో సోర్స్, Getty Images

సమర్థమైన ఆయుధం

రాజకీయ ఆయుధంగా విషానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. చరిత్రను తరచి చూస్తే గొప్పవ్యక్తులు ఆహారం తినే ముందు ఆ ఆహారాన్ని పరీక్షించేందుకు సేవకులు ఉండేవారు. ముందు సేవకులు తిన్న తర్వాతే ఆ ఆహారం గొప్పవ్యక్తులకు అందించేవారు.

నిజానికి విషాన్ని ఆయుధంగా ఉపయోగించింది సోవియట్లు మాత్రమే కాదు. 1960లో ఫిడెల్ క్యాస్ట్రోను హత్య చేయడానికి సీఐఏ... కొన్ని సిగార్లలో బోటులినమ్ అనే విషాన్ని నింపిన సంగతి మరిచిపోవద్దు.

రుచి, వాసన లేకుండా శవపరీక్షలో కూడా కనుక్కునే వీలు లేని విషాన్ని తయారు చేయడం 'కమేరా' ముఖ్య లక్ష్యాలలో ఒకటి. ఈ ఫ్యాక్టరీ, విషం తయారీలో చాలా తెలివిగా వ్యవహరించేది.

సోవియట్‌కు వ్యతిరేకి అయిన ఒక రచయిత లెవ్ రెబెట్, 1957లో గుండెపోటుతో మరణించారని అందరూ నమ్మారు. కానీ, 4 ఏళ్ల తర్వాత అతన్ని హత్య చేసిన కేజీబీ ఏజెంట్ ఆయన మరణానికి గల కారణాలను చెప్పారు. సైనైడ్‌ను చూర్ణంగా చేసి తయారు చేసిన విషపూరిత గ్యాస్‌ను స్ప్రే చేయడం వల్ల ఆయన మరణించాడని తెలిపారు.

వీడియో క్యాప్షన్, దేశంలో ఐదో వంతు భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకుందన్న జెలియెన్‌స్కీ

మరొక రాజకీయ నాయకుడిని చంపేందుకు ఆయన రీడింగ్ ల్యాంప్‌పై ఒక విషపూరిత పదార్థాన్ని స్ప్రే చేశారు. బల్బ్ నుంచి పుట్టిన వేడి కారణంగా ఆ విషపూరత పదార్థం గది అంతటా వ్యాపించడంతో దాన్ని పీల్చిన ఆయన మరణించారు.

కేజీబీ ఏజెంట్లు, సోడియం ఫ్లోరైడ్‌ను కూడా ఉపయోగించారు. దంతక్షయాన్ని నివారించడం కోసం దీన్ని వాడతారు. కానీ, ఇది మోతాదుకు మించి వాడితే ప్రాణాంతకం అవుతుంది. సాధారణంగా వినియోగించే దీనితో ప్రాణాలను కూడా తీయొచ్చని కనిపెట్టడం చాలా కష్టం. కానీ, చాలా మంది రక్త నమూనాల్లో దీని జాడను గుర్తించారు.

థాలియం విషం లక్షణాలను గుర్తించడంలో డాక్టర్లకు తలెత్తిన గందరగోళం కూడా రేడియేటెడ్ థాలియం విషానికి అనుకూలంగా మారింది. సాధారణంగా ఎలుకల మందులో థాలియంను వాడతారు. రేడియేషన్ కారణంగా రోగి మృతి చెందుతున్నాడన్న సంగతి తెలియక వైద్యులు... కేవలం థాలియం విరుగుడుకు చికిత్స చేసేవారు. శవపరీక్ష సమయానికి రేడియేటెడ్ థాలియం విచ్ఛిన్నమైపోయి విషప్రయోగానికి సంబంధించిన భౌతిక ఆధారాలు కనుమరుగు అయ్యేవి.

ఒకవేళ రోగి శరీరంలో విషాన్ని గుర్తించినప్పటికీ, కిల్లర్ ఎవరో తెలిసే ప్రసక్తే లేదు.

ఒకవేళ అనుభవజ్ఞులైన ఏజెంట్లు ఇలాంటి ఆపరేషన్‌ను జాగ్రత్తగా ప్రణాళిక చేసి, అమలు చేస్తే... ఇక దాన్ని కనిపెట్టడం అసాధ్యంగానే ఉండేది.

పాయిజన్ ఫ్యాక్టరీ

ఫొటో సోర్స్, Getty Images

మానవ ప్రయోగాలు

వాసిలీ మిత్రోఖిత్ అనే వ్యక్తి, చేతితో రాసిన 6 ట్రంకుల రహస్య పత్రాల ద్వారా పశ్చిమాన మొదటిసారిగా ఈ ప్రయోగశాల ఉనికి గురించి ప్రస్తావన వచ్చింది. కేజీబీ అర్కైవిస్ట్‌గా 30 ఏళ్ల పాటు పనిచేసిన కాలంలో వాసిలీ ఈ పత్రాలు రాశారు

అనేక మంది మాజీ రష్యన్ ఇంటెలిజెన్స్ అధికారులు, కొన్నేళ్లుగా ఈ రహస్య స్థావరం గురించి చాలా సమాచారాన్ని ఇచ్చారు.

అయితే, దీనికి సంబంధించిన అత్యంత కలతపెట్టే విషయాలను మాత్రం స్టాలిన్ మాజీ గూఢచారి చీఫ్ పావెల్ సుడోప్లాటోవ్ వెలుగులోకి తెచ్చారు. ఈ ల్యాబ్ గురించి... దాని డైరెక్టర్, ప్రొఫెసర్ గ్రిగరీ మైరనోవ్‌స్కీ గురించి పావెల్ ప్రచురించడంతో కలతపెట్టే విషయాలు బహిర్గతం అయ్యాయి.

1994లో చేపట్టిన 'స్పెషల్ ఆపరేషన్స్'లో భాగంగా సాధారణ వైద్య పరీక్షల ముసుగులో గ్రిగరీ, ప్రజలకు విషాన్ని ఎక్కించినట్లు ఆయన వివరించారు.

లేబొరేటరీ సూపర్‌వైజర్ జనరల్ వాసిలీ బ్లోఖిన్, స్టాలిన్ సీక్రెట్ పోలీస్ చీఫ్ లావెంట్రీ బెరియా ఆదేశాల మేరకు ఆయన గులాగ్ జైలులోని ఖైదీలపై 'కెమెరా' ల్యాబ్ ఉత్పత్తులైన మస్టర్డ్ గ్యాస్, రిసిన్, డిజిటాక్సిన్, సైనైడ్ సహా మరెన్నో విషపదార్థాలను పరీక్షించారు.

వీరి బాధితుల్లో సోవియట్ కస్టడీలో అనుమానాస్పదంగా మరణించిన స్వీడన్ దౌత్యవేత్త రౌల్ వాలెన్‌బర్గ్‌తో పాటు యుక్రెయిన్ జాతీయవాదులు, ఫిరాయింపుదారులు కూడా ఉన్నారు.

ఆ తర్వాత ఈ ఆపరేషన్‌ను కప్పిపుచ్చే బాధ్యతను స్వయంగా పావెల్ సుడోప్లాటోవ్ చూసుకున్నారు.

బల్గేరియాలో మార్కోవ్ ప్రసిద్ధ రచయిత. ఈ చిత్రంలో ఆయన భార్య అనాబెల్, కూతురు అలెగ్జాండ్రా రైనాను చూడొచ్చు
ఫొటో క్యాప్షన్, బల్గేరియాలో మార్కోవ్ ప్రసిద్ధ రచయిత. ఈ చిత్రంలో ఆయన భార్య అనాబెల్, కూతురు అలెగ్జాండ్రా రైనాను చూడొచ్చు

సోవియట్ యూనియన్ నుంచి ప్రపంచానికి

ప్రచ్ఛన్నయుద్ధం ఉధృతంగా ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులు, అసమ్మతివాదులు, ఫిరాయింపుదారులు, స్వాతంత్ర్య ఉద్యమ నాయకులే లక్ష్యంగా రసాయన ఆయుధాలను ఉపయోగించడంలో సోవియట్‌కు స్పష్టత వచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడతారు.

''నిజంగా లెక్కలేనంత మంది ఆ విధిని చవి చూశారు'' అని వాల్ స్ట్రీట్ జర్నల్‌కు రాసిన 'హు కెన్ కౌంట్ ద విక్టిమ్స్ ఆఫ్ ఫాయిజన్ వెన్ నో పాయిజన్ డిటెక్టెడ్' అనే పేరుతో రాసిన ఆర్టికల్‌లో రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ వెటరన్ బోరిస్ వోలోడార్‌స్కీ పేర్కొన్నారు. ''ద కేజీబీస్ పాయిజన్ ఫ్యాక్టరీ'' అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు.

సోవియట్ యూనియన్ చివరి దశలో కూడా కేజీబీ, శత్రువులను నిర్వీర్యం చేయడం కొనసాగించింది.

1978 లండన్‌లో బీబీసీ జర్నలిస్ట్ జార్జి మార్కోవ్‌ను హత్య చేసేందుకు సోవియట్‌లు కుట్ర పన్నినట్లు కేజీబీ జనరల్ ఒలెగ్ కలుగిన్ అంగీకరించారు.

కమెరా ల్యాబ్‌లో రిసిన్ అనే విషాన్ని చిన్న చిన్న రేణువుల రూపంలో తయారు చేశారు. శరీరంలో విష పదార్థాల జాడ తెలియకుండా, నొప్పి లేని విధంగా ఇంజెక్ట్ చేసేలా ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.

కానీ, ఈ రోజుకీ కచ్చితంగా తెలియని విషయం ఏంటంటే... ఏదో ఒక సమయంలో నిజంగానే ఈ ల్యాబ్‌ను మూసివేశారా? లేదా మరో రూపంలో రష్యాలో ఈ ల్యాబ్ ఇంకా మనుగడలో ఉందా?

వీడియో క్యాప్షన్, డోన్బాస్ యుద్ధరంగం నుంచి బీబీసీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)