Russian Army: 'మాది ప్రపంచంలోనే సూపర్ సైన్యం అనుకున్నా. కానీ..' - యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న రష్యా సైనికుడి అనుభవాలు

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఒలీస్యా గెరాసిమెన్కో, కాటరీనా ఖిన్కులోవా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
రష్యా సైనికులు కొందరు యుక్రెయిన్‌లో యుద్ధం చేసేందుకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారని రష్యాకు చెందిన మానవ హక్కుల న్యాయవాదులు, ఉద్యమకారులు చెప్తున్నారు.
యుక్రెయిన్ మీద దండయాత్ర మొదలుపెట్టిన తొలి రోజుల్లో యుద్ధ రంగంలో తమ అనుభావాలే దీనికి కారణమని వారు అంటున్నారు. అలాంటి ఒక సైనికుడితో బీబీసీ మాట్లాడింది.
''చంపటానికి, చావటానికి మళ్లీ (యుక్రెయిన్‌కు) తిరిగి వెళ్లాలని నాకు లేదు'' అంటున్నారు సెర్గీ. అది అతడి అసలు పేరు కాదు. అతడు ఈ ఏడాది ఆరంభంలో యుక్రెయిన్‌లో 5 వారాలు యుద్ధం చేశారు.
అతడు ఇప్పుడు రష్యాలో తన ఇంట్లో ఉన్నారు. మళ్లీ యుద్ధానికి తిరిగి పంపించకుండా ఉండేలా న్యాయ సలహా తీసుకున్నారు. ఇలాంటి న్యాయ సలహాలు తీసుకుంటున్న వందలాది మంది రష్యా సైనికుల్లో సెర్గీ ఒకరు.
యుక్రెయిన్‌లో తన అనుభవం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని సెర్గీ చెప్తున్నారు.
''మా రష్యా సైన్యం. ప్రపంచంలోనే సూపర్ సైన్యం అని అనుకున్నా'' అన్నారాయన విచారంగా. కానీ తాము నైట్ విజన్ డివైస్‌ల వంటి కనీస పరికరాలు కూడా లేకుండా యుద్ధరంగంలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.
''మా పరిస్థితి చీకట్లో గుడ్డి పిల్లుల్లా మారింది. మా సైన్యం పరిస్థితి చూసి నేను షాక్ తిన్నా. మాకు పరికరాలు ఇవ్వటానికి పెద్ద ఖర్చు కాదు. కానీ ఎందుకివ్వలేదు?'' అని ఆశ్చర్యం వ్యక్తంచేశారాయన.

ఫొటో సోర్స్, Getty Images
సెర్గీ రష్యా సైన్యంలో ఒక కాన్‌స్క్రిప్ట్‌గా చేరారు. అంటే.. 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల వయసు మధ్య రష్యా పురుషుల్లో అత్యధికులు ఒక ఏడాది పాటు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి సైనికులను కాన్‌స్క్రిప్ట్‌గా వ్యవహరిస్తారు. అలా చేరిన సెర్గీ కొన్ని నెలల తర్వాత రెండేళ్ల పాటు ప్రొఫెషనల్ కాంట్రాక్టుతో సైన్యంలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. దానివల్ల ఆయనకు జీతం లభిస్తుంది.
ఈ ఏడాది జనవరిలో సైనిక విన్యాసాలు నిర్వహించటానికి అంటూ సెర్గీని యుక్రెయిన్ సరిహద్దు వద్దకు పంపించారు. ఒక నెల తర్వాత ఫిబ్రవరి 24న యుక్రెయిన్ మీద రష్యా సైనిక దండయాత్ర మొదలుపెట్టింది. సరిహద్దు దాటి వెళ్లాలని సెర్గీకి ఆదేశాలు. అతడు పనిచేస్తున్న సైనిక పటాలం సరిహద్దు దాటిన వెంటనే వారిపై దాడి మొదలైంది.
ఆ రోజు సాయంత్రం వారు ఒక నిర్మానుష్య పొలంలో ఆగినప్పుడు.. ''ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. ఇది జోక్ కాదు'' అని వారి కమాండర్ వారితో చెప్పాడు.
''దీంతో నేను పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యాను. అప్పుడు నా మనసులో వచ్చిన మొదటి ఆలోచన 'నాకు ఇలా నిజంగా జరుగుతోందా?'' అని సెర్గీ చెప్పారు.
అతడు చెప్పిన దాని ప్రకారం.. వారి మీద విరామం లేకుండా షెల్లింగ్ జరిగింది. కదులుతున్నపుడు, రాత్రిపూట ఆగినప్పుడు ఎప్పుడూ వారి మీద షెల్లింగ్ ఆగలేదు. మొత్తం 50 మంది సైనికులున్న అతడి పటాలంలో 10 మంది చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు. దాదాపు అతడి సహ సైనికులందరూ 25 ఏళ్ల లోపు వారే.
రష్యా సైనికులకు అనుభవం లేదని, ఒక మోర్టారు మొదలు ఏదో చివర ఏదో కూడా చెప్పలేరనే మాట అతడు విన్నాడు.
ఉత్తర యుక్రెయిన్ గుండా ప్రయాణిస్తున్న అతడి కాన్వాయ్ నాలుగో రోజున వారు దాటబోతున్న ఒక వంతెన పేలిపోవటంతో వీరిలో ముందున్న సహ సైనికులు చనిపోయారు. దీంతో వీరి కాన్వాయ్ పటాపంచలైంది.
మరో ఘటనలో అతడి ముందు మంటల్లో కాలిపోతున్న వాహనంలో తన సహ సైనికులు చిక్కుకుపోయి ఉండగా, వారిని వదిలేసి అతడు ముందుకు సాగాల్సి వచ్చింది.
''గ్రెనేడ్ లాంచర్ లేదా మరి దేనితోనో దానిని పేల్చేశారు. దానికి నిప్పంటుకుంది. లోపల (రష్యా) సైనికులున్నారు. మేం మా వాహనాలను దాని పక్క నుంచి నడుపుకుంటూ కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లాం. నేను వెనుదిరిగి చూడలేదు'' అని చెప్పాడు సెర్గీ.
అతడి యూనిట్ యుక్రెయిన్ గ్రామీణ ప్రాంతాల గుండా వెళ్లింది. కానీ స్పష్టమైన వ్యూహం లేదని సెర్గీ చెప్తున్నాడు. రావాల్సిన అదనపు బలగాలు రాలేకపోయాయి. ఒక పెద్ద నగరాన్ని లోబరుచుకునే పని చేయాల్సిన ఈ సైనికులకు కనీస పరికరాలు లేవు.

ఫొటో సోర్స్, Getty Images
''మేం హెలికాప్టర్లు లేకుండా వెళ్లాం. ఏదో పరేడ్‌కు వెళుతున్నట్లు కవాతు చేసుకుంటూ పోయాం. కీలక నగరాలు, బలమైన ప్రాంతాలను చాలా వేగంగా స్వాధీనం చేసుకోవాలని మా కమాండర్లు ప్లాన్ చేశారు. యుక్రెయిన్ వాళ్లు తమకు ఊరకే లొంగిపోతారని లెక్కలు వేసుకున్నారు.
రాత్రిళ్లు తక్కువసేపు ఆగుతూ మేం వేగంగా ముందుకు వెళ్లాం. దాడుల నుంచి రక్షించుకోవటానికి కందకాలు లేకుండా, శత్రువు ఆనుపానులను, ప్రదేశాలను పరిశీలించి వ్యూహాలేమీ రచించుకోకుండా వెళ్లాం. మా వెనుక వైపు నుంచి ఎవరైనా దాడిచేస్తే రక్షించటానికి వెనుకవైపు ఎవరినీ కావలి పెట్టకుండా వెళ్లాం.
మా వాళ్లు చాలా మంది చనిపోవటానికి ఇదే కారణమని నేను అనుకుంటాను. మేం నెమ్మదిగా ముందుకు సాగినట్లయితే, మందుపాతరలు ఉన్నాయోమోనని రోడ్లను తనిఖీ చేసినట్లయితే చాలా మంది సైనికుల మరణాలను నివారించి ఉండేవాళ్లం'' అని సెర్గీ వివరించాడు.
సెర్గీ చెప్తున్నట్లుగా.. సైనికులకు సరైన పరికరాలు లేవనే మాటలు.. పలువురు ఇతర సైనికులు, వారి కుటుంబ సభ్యులకు మధ్య జరిగినట్లు చెప్తున్న ఫోన్ సంభాషణల్లో కూడా వినిపించాయి. ఆ సంభాషణలను యుక్రెయిన్ భద్రతా బలగాలు రహస్యంగా రికార్డు చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాయి.
ఏప్రిల్ ఆరంభంలో సెర్గీని సరిహద్దు వద్ద రష్యా భూభాగంలోని ఒక శిబిరానికి వెనక్కి పంపించారు. ఉత్తర యుక్రెయిన్ నుంచి బలగాలను ఉపసంహరించి, తూర్పు ప్రాంతం మీద దాడి చేయటానికి పునఃసమీకరిస్తున్నట్లు కనిపించింది. అదే నెల చివర్లో యుక్రెయిన్‌కు తిరిగి వెళ్లాలని సెర్గీకి ఆదేశాలు అందాయి. కానీ తాను తిరిగి యుక్రెయిన్ వెళ్లటానికి సిద్ధంగా లేనని అతడు తన కమాండర్‌తో చెప్పాడు.
''అది నా ఇష్టమేనని ఆయన చెప్పారు. మామీద ఒత్తిడి చేయటానికి కూడా వాళ్లు ప్రయత్నించలేదు. ఎందుకంటే మేమే మొదటి వాళ్లం కాదు'' అని సెర్గీ బీబీసీతో చెప్పారు. అయితే యుక్రెయిన్ తిరిగి వెళ్లటానికి తను నిరాకరించటం పట్ల, న్యాయ సలహా తీసుకోవాలని తను నిర్ణయించుకోవటం పట్ల తన సైనిక యూనిట్ ప్రతిస్పందనను చూసి సెర్గీ ఆందోళనకు గురయ్యారు.
సెర్గీకి, ఆయన లాగే ఆలోచిస్తున్న మరో ఇద్దరు సహచర సైనికులకు.. వారి ఆయుధాలను తిరిగి ఇచ్చేసి వారి యూనిట్ ప్రధాన కార్యాలయానికి తిరిగి వెళ్లాలని ఒక న్యాయవాది సలహా ఇచ్చారు. తాము నైతికంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోయామని, యుక్రెయిన్‌లో యుద్ధం చేయటం కొనసాగించలేమని వివరిస్తూ యూనిట్ ప్రధాన కార్యాలయంలో లేఖ సమర్పించాలని చెప్పారు.
యూనిట్‌కు తిరిగి వెళ్లటం ముఖ్యమని, అలా కాకుండా మామూలుగా వెళ్లిపోతే సైన్యం నుంచి పరారైనట్లు పరిగణిస్తారని, అందుకుగాను డిసిప్లనరీ బెటాలియన్‌లో రెండేళ్లు పనిచేసేలా శిక్ష విధిస్తారని సెర్గీకి న్యాయవాది చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
సైనిక కమాండర్లు కాంట్రాక్టు సైనికులు తమ యూనిట్లలో కొనసాగేలా బెదిరించటానికి ప్రయత్నిస్తారని రష్యా మానవ హక్కుల న్యాయవాది అలెక్సీ టబలోవ్ చెప్పారు. అయితే.. సైనికులు తాము ఇష్టపడకపోతే యుద్ధం చేయటానికి నిరాకరించేందుకు వీలుకల్పించే నియమనిబంధనలు రష్యా సైనిక చట్టంలో ఉన్నాయని ఆయన బలంగా చెప్తున్నారు.
యుద్ధ రంగానికి తిరిగి వెళ్లటానికి నిరాకరించే వారిని విచారించి శిక్షించిన ఉదంతాలు తనకు తెలిసినంతవరకూ లేవని మానవ హక్కుల ఉద్యమకారుడు సెర్గీ క్రివెంకో పేర్కొన్నారు.
అయితే అలా విచారించటానికి ప్రయత్నాలు జరగలేదని కాదు.
ఉత్తర రష్యాలో ఒక కమాండర్.. యుక్రెయిన్ తిరిగి వెళ్లటానికి నిరాకరించిన తన కింది సైనికుడి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరగా.. అలా చేయటానికి సైనిక ప్రాసిక్యూటర్ తిరస్కరించినట్లు బీబీసీ పరిశీలించిన కొన్ని పత్రాలు చెప్తున్నాయి.
సదరు సైనికుడి సైనిక విభాగానికి జరిగే హానిని అంచనా వేయకుండా అటువంటి చర్య చేపట్టటం తొందరపాటు అవుతుందని ఆ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.
అలాగే మున్ముందు మరిన్ని ప్రాసిక్యూషన్లు రాబోవనే భరోసా కూడా ఏమీ లేదు.
యుద్ధ రంగానికి తిరిగి వెళ్లటానికి విముఖత చూపే సెర్గీ వంటి సైనికులు అసాధారణమేమీ కాదని కాన్‌ఫ్లిక్ట్ ఇంటెలిజెన్స్ టీమ్ ఎడిటర్ రుస్లాన్ లెవియేవ్ చెప్పారు. యుక్రెయిన్‌లో రష్యా సైన్యపు అనుభవాలను గోప్యమైన ఇంటర్వ్యూల ద్వారా, అందుబాటులోని సమాచారం ద్వారా దర్యాప్తు చేస్తున్న మీడియా ప్రాజెక్ట్ అది.
యుక్రెయిన్ మీద దండయాత్రకు తొలి దశలో పంపిన కాంట్రాక్టు సైనికుల్లో గణనీయమైన సంఖ్యలోని సైనికులు మళ్లీ తిరిగి యుద్ధరంగానికి వెళ్లటానికి తిరస్కరించినట్లు తమ బృందం అంచనాగా లెవియేవ్ తెలిపారు.
ఏప్రిల్ ఆరంభం నుంచి వందలాది మంది సైనికులు మళ్లీ యుక్రెయిన్‌లో యుద్ధం చేయటం కోసం తిరిగి వెళ్లటానికి తిరస్కరిస్తున్నట్లు స్వతంత్ర రష్యా మీడియా కూడా చెప్తోంది.
యుక్రెయిన్‌కు తిరిగి వెళ్లకూడదని కోరుకుంటున్న సైనికులకు తాము తరచుగా సలహాలు అందిస్తున్నామని పలువురు న్యాయవాదులు, మానవ హక్కుల ఉద్యమకారులు బీబీసీతో చెప్పారు.
మేం మాట్లాడిన ప్రతి ఒక్కరూ డజన్ల కొద్దీ కేసులను డీల్ చేశారు. ఆ సైనికులు ఈ సలహాలను వారి సహచర సైనికులతో కూడా పంచుకుంటున్నట్లు సదరు న్యాయవాదులు, ఉద్యమకారులు భావిస్తున్నారు.
యుద్ధ రంగానికి తిరిగి వెళ్లటానికి సెర్గీ తిరస్కరిస్తున్నప్పటికీ.. ఎలాంటి అనూహ్య పరిణామాలూ ఎదురుకాకుండా చూసుకోవటానికి రష్యాలో తన సైనిక సర్వీసు కాలాన్ని పూర్తి చేయాలని అతడు కోరుకుంటున్నాడు. దాని అర్థం.. యుద్ధం చేయటానికి నిరాకరిస్తూ అతడు సమర్పించిన లేఖను ఆమోదించినప్పటికీ.. అతడి సర్వీసు కాలంలో భవిష్యత్తులో అతడిని మళ్లీ యుక్రెయిన్‌కు పంపించబోరనే గ్యారంటీ లేదు.
''ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని నాకు కనిపిస్తోంది. అది ఇప్పట్లో ముగిసేది కాదు. నాకు మిగిలిన ఈ సర్వీసు (తప్పనిసరి మిలటరీ సర్వీసు) కాలంలో ఏమైనా జరగొచ్చు. ఎలాంటి విషాదమైనా ఎదురుకావచ్చు'' అంటాడు సెర్గీ.
ఇవి కూడా చదవండి:
- మ్యాపుల్లో ఉత్తరం దిక్కునే పైభాగంలో చూపుతారెందుకు? నార్త్ అంటే ఆధిపత్యమా? పేదవాళ్లంతా సౌత్‌లోనే ఉంటారా?
- జగ్గీ వాసుదేవ్: ‘ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మించలేం, అలా చేయాలంటే దేశమంతా తవ్వుకుంటూ రావాలి’
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం
- పిల్లల ఉన్నత విద్య ఖర్చుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












