CBI: మరణించారని చెప్పిన మహిళ కోర్టుకు ఎలా వచ్చారు

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
- రచయిత, సీటూ తివారి
- హోదా, బీబీసీ కోసం
బిహార్ సివాన్ నగరంలోని కసేరా వీధిలో బంగారం, వెండి షాపుల మధ్య ఒక చిన్న సంధు కనిపిస్తుంది. ఈ సంధు గుండా వెళ్తే చివర్లో ఒక ఇల్లుంది. దీని గురించి మాట్లాడటానికి ఇక్కడ ఎవరూ ఇష్టపడటం లేదు.
ఈ ఇంటి ముందున ఒక పెద్ద చెక్క తలుపు ఉంది. దీని గుండా లోపలకు వెళ్తే పచ్చని రంగు వేసిన గుండ్రని స్తంభాలు కనిపిస్తాయి. లోపలకు గాలి కూడా సరిగా రావడం లేదు. ఇక్కడ వెలుతురు కూడా సరిగా లేదు.
కొంచెం ముందుకు వెళ్తే.. మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ఇరుకైన మెట్ల వరస కనిపిస్తోంది. ఆ చీకట్లో మొబైల్ టార్చ్‌లైట్ సాయంతో మేం పైకి వెళ్లాం. పైన ఒక చిన్న లైట్ వేసుంది. దీని నుంచి వచ్చే వెలుతురులో ఎదుటి వ్యక్తి మొహం కూడా స్పష్టంగా కనిపించడం లేదు.
రెండు గదుల ఈ ఇంటిలో ఒక పెద్దావిడ ఉంటున్నారు. తనకు గుండె సంబంధిత వ్యాధి ఉందని, ఏదైనా ఆసరా లేకపోతే నడవడం కూడా కష్టమని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
ఆమె ఎవరు?
84ఏళ్ల ఈ వృద్ధురాలి పేరు బాదామీ దేవీ. ఈమె పేరు తాజాగా వార్తల్లో నిలించింది. ఈమె మరణించారని ముజఫర్‌పుర్ కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మే 24న తెలిపింది. అయితే, జూన్ 3న ఈమె కోర్టుకు హాజరయ్యారు. ‘‘హుజూర్ (సర్) నేను బతికే ఉన్నాను’’అని కోర్టులో ఆమె చెప్పారు.
బిహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన జర్నలిస్టు రాజ్‌దేవ్ రంజన్ హత్య కేసులో బాదామీ దేవి సాక్షిగా ఉన్నారు. బాదామీ దేవి భర్త సత్యదేవ్ ప్రసాద్ కూడా ఈ కేసులో సాక్షిగా ఉండేవారు. బట్టల కొట్టును నడిపే సత్యదేవ్ 1998లో కిడ్నీ వ్యాధితో మరణించారు. వీరికి సొంత పిల్లలు లేరు.
‘‘బాదామీ దేవికి సొంత పిల్లలు లేరు. అయితే, సప్నా దేవి అనే అమ్మాయిని ఆమె పెంచుకున్నారు. కుశినగర్‌కు చెందిన రాజేశ్ సాహాతో సప్నాకు పెళ్లిచేశారు. వీరికి ఆర్తీ సాహా అనే కుమార్తె ఉంది. ఆర్తీని విజయ్ కుమార్ గుప్తా (రాజ్‌దేవ్ రంజన్ హత్య కేసులో నిందితుడు) అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ప్రస్తుతం బాదామీ దేవి బాగోగులను ఆర్తీనే చూసుకుంటోంది’’అని బాదామీ దేవికి సన్నిహితులు బీబీసీతో చెప్పారు.
అయితే, ఇంతకీ రాజ్‌దేవ్ రంజన్ హత్య కేసుతో బాదామీ దేవికి సంబంధం ఏమిటి? ఈ కేసులో ఆమె సాక్షిగా ఎలా మారారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే బాదామీ దేవి ఇంటి వివాదం గురించి తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
ఇంటి వివాదం..
600 చదరపు అడుగుల విస్తీర్ణంలోని నాలుగు అంతస్తుల భవనంపై బాదామీ దేవి, వీరేంద్ర పాండేల మధ్య వివాదం నడుస్తోంది.
మార్కెట్‌లో ఉండటంతో ఈ ఇంటి విలువ కాస్త ఎక్కువే ఉంటుంది. ఈ ఇల్లు మొదట బాదామీ దేవి పేరిట ఉండేది. దీనిలో అద్దెకు ఉండేందుకు 1998లో వీరేంద్ర పాండే వచ్చారు. ఆయన ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తుంటారు. ప్రస్తుతం ఆయన కింద ఇంట్లో ఉంటున్నారు.
‘‘ఇంటిపై రూ.8 లక్షలు ఇవ్వడంతో బాదామీ దేవి పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇచ్చారు. 2010లో ఈ ఇంటిని నా భార్య బేబీ పాండే పేరిట రిజిస్ట్రేషన్ చేయించాం. ఈ ఇంటి విషయంలో మాకు ఒక అంగీకారం కుదిరింది. బాదామీ దేవి బతికున్నంత వరకు ఆమె ఇక్కడే ఉండొచ్చని, ఆమె మరణానంతరం మేం ఇల్లును సొంతం చేసుకుంటామని చెప్పాం’’అని వీరేంద్ర చెప్పారు.
అయితే, మోసం చేసి ఈ ఇల్లును రాయించేసుకున్నారని బాదామీ దేవి అంటున్నారు. ‘‘నా ఇల్లును నాకు వెనక్కి ఇచ్చేయాలి. చూడండి సీబీఐ, వీరేంద్ర కలిసి నేను చచ్చిపోయానని కోర్టుకు చెప్పారు’’అని బాదామీ దేవి అన్నారు.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
ఈ ఇంటి వివాదంపై స్థానిక కోర్టు 2018లో వీరేంద్ర పాండేకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. దీంతో బాదామీ దేవి అప్పీలును దాఖలు చేశారు. ఇప్పటికీ ఈ వివాదం కోర్టు పరిధిలోనే ఉంది.
అయితే, ఈ ఇంటి వివాదానికి, జర్నలిస్టు రాజ్‌దేవ్ రంజన్ హత్య కేసుకు సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నపై నిందితుల తరఫు లాయర్ శారద్ సిన్హా బీబీసీతో మాట్లాడారు.
‘‘రాజ్‌దేవ్ రంజన్‌ను అజహరుద్దీన్ అలియాస్ లడ్డన్ మియా హత్య చేసినట్లు కోర్టులో సీబీఐ చెప్పింది. ఈ హత్యలో విజయ్ కుమార్ గుప్తా(బాదామీ దేవి మనుమరాలి భర్త)కు కూడా సంబంధముందని, వీరేంద్ర పాండే నుంచి ఇల్లును వెనక్కి వచ్చేలా చూస్తామని విజయ్ కుమార్‌కు లడ్డన్ మియా హామీ ఇచ్చారని సీబీఐ అధికారులు చెప్పారు’’అని ఆయన వివరించారు.
ఆర్జేడీ నాయకుడు షాబుద్దిన్‌కు లడ్డన్ మియాన్ నమ్మినబంటు.
రాజ్‌దేవ్ రంజన్ హత్య కేసులో బాదామీ దేవితోపాటు వీరేంద్ర పాండే, ఆర్తీ సాహా కూడా సాక్షులుగా ఉన్నారు. ‘‘అయితే, ఆ హత్య కేసులో మా ఇంటి వివాదానికి సంబంధం ఏమిటో తెలియదు’’అని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
హత్య కేసు ఏమిటి?
బిహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన రాజ్‌దేవ్ రంజన్ హిందీ పత్రిక హిందుస్థాన్‌లో పనిచేసేవారు. ఆయన క్రైమ్ వార్తలు రాసేవారు. 13 మే 2016 సాయంత్రం సివాన్‌లో ఆయన్ను కాల్చి చంపారు.
గుర్తు తెలియని వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో మొదట ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదైంది. ఆ తర్వాత లడ్డన్ మియాన్, విజయ్ కుమార్ గుప్తా, రోహిత్ కుమార్ సోని, రాజేశ్ కుమార్, రిషు కుమార్ జైస్వాల్, సోను కుమార్ గుప్తాలపై చార్జిషీటు నమోదు చేశారు. ఈ కేసులో ఒక మైనర్‌పై ఆరోపణలు మోపారు. నిందితుల్లో విజయ్ కుమార్ గుప్తా.. బాదామీ దేవి మనుమరాలు ఆర్తీకి భర్త. సోను కుమార్ ఆర్తీకి బావ అవుతారు. వీరిద్దరికీ బాదామీ దేవితో సంబంధముంది.
17 మే 2016లో ఈ కేసును బిహార్ ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఆగస్టు 2018లో సీబీఐ చార్జిషీటు నమోదు చేసింది. దీనికి అదనంగా దాఖలుచేసిన చార్జిషీటులో షాబుద్దీన్ పేరు కూడా ఉంది.
‘‘షాబుద్దీన్‌కు వ్యతిరేకంగా రాజ్‌దేవ్ రంజన్ వరుసగా వార్తలు రాశారు. సివాన్ జైలు నుంచి విడుదలైన కొందరు హత్యలు చేస్తున్నారని ఒక వార్త రాయడంతో ఆయన్ను హత్య చేశారు. ఈ కేసులో 98 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. వీరిలో 28 మంది ఇప్పటివరకు తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు’’అని సీబీఐ వర్గాలు చెప్పాయి.
ఆమె చనిపోయిందని చెప్పారా?
మే 2న బాదామీ దేవి, సకల్‌దేవ్ సింగ్‌లను తమ ముందు హాజరుపరచాలని సీబీఐకి ముజఫర్‌పుర్ కోర్టు జడ్జి పునీత్ కుమార్ గార్గ్ సూచించారు. అయితే, బాదామీ దేవి చనిపోయారని ఆయనకు సీబీఐ అధికారులు చెప్పారు.
బాదామీ దేవి చనిపోయరనే వార్త పత్రికల్లోనూ వచ్చింది. వీటిని ఆమె మనుమరాలు ఆర్తీ సాహా చూశారు. దీంతో జూన్ 3న కోర్టులో జరిగే విచారణకు బాదామీ దేవిని ఆర్తీ తీసుకొచ్చారు.
‘‘అసలు సీబీఐ అధికారులు నాతో మాట్లాడనే లేదు. వారికి వారే నేను చచ్చిపోయానని నిర్ధారించేసుకున్నారు. ఇదొక కుట్ర’’అని కోర్టులో బాదామీ దేవి ఒక అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
దీనిపై జూన్ 20లోగా సమాధానం ఇవ్వాలని సీబీఐకి కోర్టు సూచించింది. కోర్టు నోటీసుల తర్వాత జూన్ 4న బాదామీ దేవి ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు. ఆమెతో హత్య కేసుపై మాట్లాడారు.
‘‘ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఇదివరకు మరణించారని చెప్పిన ఆ మహిళతో మేం మాట్లాడాం’’అని స్థానిక మీడియాతో సీబీఐ అధికారులు చెప్పారు.
‘‘ఈ కేసులో సీబీఐ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’’అని నిందితుల తరఫు న్యాయవాది శారద్ సిన్హా చెప్పారు.
రాజ్‌దేవ్ రంజన్ హత్యకుగురై ఆరేళ్లు గడుస్తోంది. నిందితుల్లో ఒకరైన షాబుద్దీన్ కోవిడ్‌తో మరణించారు. మిగతా నిందితులు జైలులో ఉన్నారు.
‘‘ఇప్పటివరకు కేవలం 30 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా సీబీఐ నమోదు చేయలేదు. నేను చనిపోయిన తర్వాత కూడా ఈ కేసు విచారణ కొనసాగుతుందేమో. న్యాయం జరగడంతోపాటు ఎప్పుడు జరిగింది అనేది కూడా చాలా ముఖ్యం. ఇందులో జాప్యం చోటుచేసుకోకూడదు’’అని రాజ్‌దేవ్ రంజన్ భార్య ఆశా రంజన్ చెప్పారు. సీబీఐ ఈ కేసును సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పబ్జీ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపి మృతదేహాన్ని రెండు రోజులు గదిలో దాచిపెట్టిన బాలుడు
- బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు, అగ్నికీలలు.. 40 మందికి పైగా మృతి, గాయపడినవారితో నిండిపోయిన ఆసుపత్రులు
- ఆస్ట్రేలియా విమానంపై నిప్పులు కురిపించిన చైనా విమానం, దక్షిణ చైనా సముద్ర గగనతలంపై ప్రమాదకర విన్యాసం
- అఫ్గాన్ సైన్యానికి భారత్ శిక్షణ ఇవ్వాలని తాలిబాన్లు ఎందుకు కోరుకుంటున్నారు
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












