నియోనేటల్ పర్పురా ఫుల్మినన్స్: గర్భంలో ఉన్నప్పుడే కరోనా సోకడం వల్ల వచ్చే అరుదైన సమస్య, దీనికి పరిష్కారం ఉందా?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
కోవిడ్ మహమ్మారి కంటి మీద కనుకు లేకుండా చేస్తున్న ఈ సమయంలో ఓ బిడ్డకు జన్మనివ్వడమంటే మాటలు కాదు. ముఖ్యంగా నెలలు నిండిన మహిళలు బిడ్డకు జన్మనిచ్చేంత వరకు అనుక్షణం టెన్షనే. కేవలం వారికే కాదు... వారి బాగోగులు చూసే కుటుంబసభ్యులకు కూడా వారిని జాగ్రత్తగా చూసుకోవడం సవాలు లాంటిదే.
అయితే ఇన్ని సవాళ్ల మధ్య ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భూమ్మీద పడిన మూడు నాలుగు గంటలు కూడా కానీ ఆ చిన్నారికి కోవిడ్ సోకితే..ఇక ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది...విజయవాడలో ఓ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.
నెలలు నిండటంతో విజయవాడకు చెందిన బాబ్జీ భార్యను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఓ వైపు కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో తల్లి, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
సమస్య ఎలా మొదలైంది?
అయితే, మూడు, నాలుగు రోజుల తర్వాత బిడ్డ పరిస్థితి చూసిన తల్లిదండ్రులకు ఒక్కసారిగా ఆందోళన మొదలయ్యింది. పసికందుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఎక్కడికక్కడ చర్మం కమిలి పోయినట్టు కనిపించింది.
దీంతో కంగారు పడ్డ బాబ్జీ దంపతులు వెంటనే విజయవాడలోని ఆంధ్రా హాస్పటల్‌లో చేర్చారు.
''పొత్తి కడుపు, పిరుదులతో పాటు కాళ్ళ వెనుక భాగంలో కమిలినట్లు గాయాలు ఏర్పడ్డాయి. రెండు మూడు రోజులకే అవి తీవ్రమయ్యాయి. కొన్ని గాయాలు నల్లగా, కొన్ని ఎరుపు రంగులో, కొన్ని గాయాలు నీలిరంగులో కనిపించాయి. గర్భదారణ సమయంలో గానీ, డెలివరీ సందర్భంగా గానీ తల్లికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు.'' అని ఆ చిన్నారి తండ్రి బాబ్జీ బీబీసీకి చెప్పారు.
శిశువుని ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి జ్వరం ఎక్కువగా ఉండడం, ఊపిరి పీల్చుకోవడంలో కూడా సమస్యలు రావడంతో డాక్టర్లు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. తల్లి, బిడ్డ ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో యాంటీ బాడీస్‌ని కూడా గుర్తించారు.
దీంతో లక్షణాలు లేకుండానే తల్లికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, ఆమె కోలుకోవడంతో యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లి ద్వారా శిశువుకి కూడా యాంటీ బాడీస్ చేరినట్లు గుర్తించారు. నియో నేటల్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు.

పరీక్షల ద్వారా సమస్య గుర్తింపు
అప్పుడే పుట్టిన పిల్లల్లో చర్మానికి గాయాలు ఏర్పడడం అరుదైన విషయంగా ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్, చిన్న పిల్లల వైద్య విభాగం చీఫ్ డాక్టర్ పీవీ రామారావు తెలిపారు. ఇలాంటి స్థితిని వైద్య పరిభాషలో 'నియోనేటల్ పర్పురా ఫుల్మినన్స్' అంటారని రామారావు వివరించారు.
''శిశువుకి నిర్వహించిన వివిధ పరీక్షల్లో రక్తకణాల సంఖ్య అధికంగా ఉండడం, సి-రియాక్టివ్ ప్రోటీన్ వంటి ఇన్‌ఫ్లమేటరీ మార్కర్ల పెరుగుదలతోపాటు, గుండెకి సంబంధించిన సమస్యలను కూడా గుర్తించాము.'' అని డాక్టర్ రామారావు వివరించారు. డాక్టర్లు భూజాత, కృష్ణ ప్రసాద్, మేఘన, బాలకృష్ణ బృందం ఈ శిశువుకి వైద్య సహాయం అందించారు
పిల్లలలో మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS -C) అని పిలిచే కోవిడ్ సమస్య నవజాత శిశువుల్లో అరుదని చెబుతున్నారు. 6 వారాల వయసు నిండిన శిశువుల నుంచి పెద్దల్లో ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పటికీ నవజాత శిశువుల్లో యాంటీబాడీస్ చాలా అరుదుగా భావిస్తున్నారు
''మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ వల్ల కనీసం 3 కంటే ఎక్కువ రోజుల జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మ గాయాలతో పాటు కొందరికి కళ్ల కలక, గుండె పని చేయక పోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. కొరోనరీ ఆర్టరీ డైలేటేషన్‌తో కొందరు పిల్లలలో అది ఆన్యుయరిజన్(రక్త నాళాలు ఉబ్బటం)కి దారి తీస్తుంది. కొందరిలో అపెండిసైటిస్, మూర్ఛలు వంటి సమస్యలు కూడా వస్తాయి.'' అని డాక్టర్ రామారావు వివరించారు.

ఇది అరుదైనా కేసా?
ఇలాంటి లక్షణాలతో ప్రపంచంలోనే చాలా తక్కువ కేసులు నమోదయ్యాయని, నవజాత శిశువు MIS-C తో కలిపి నియో నేటల్ పర్పురా ఫుల్మినన్స్ అని చెప్పే అరుదైన చర్మ సమస్య ఎదుర్కోవాల్సి రావడం ఇప్పటి వరకూ ఎక్కడా రిపోర్ట్ కాలేదని డాక్టర్ రామారావు వెల్లడించారు.
ప్రత్యేక కేసుగా పరిగణించి ఈ శిశువుకి చికిత్స అందించామని, శిశువు ఆరోగ్యం మెరుగుపడుతోంది, సకాలంలో సమస్యను గుర్తించి, తగిన వైద్యం అందించడం ద్వారానే కోలుకోవడానికి అవకాశం ఏర్పడిందని డాక్టర్ రామరావు అభిప్రాయపడ్డారు.
బిడ్డ పుట్టిన ఆనందం 3 రోజుల్లోనే ఆందోళనగా మారినప్పటికీ సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడం వెంటనే వైద్యులు తగిన చికిత్సనందించడంతో అరుదైన వ్యాధి బారి నుంచి తమ బిడ్డను కాపాడుకోగలిగామని బాబ్జీ బీబీసీతో చెప్పారు.
''బిడ్డ పరిస్థితి మాకేమీ అర్థం కాలేదు. పుట్టిన మూడు, నాలుగు రోజుల తర్వాత హఠాత్తుగా పెద్ద పెద్ద దెబ్బలు కనిపించడంతో కంగారు పుట్టింది. ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత కోలుకోవడం సంతృప్తిగా ఉంది. పూర్తిగా నయమై తిరిగి తల్లీ, బిడ్డా ఇంటికి చేరితే అదే చాలు.'' అని అన్నారు బాబ్జీ.
ఇవి కూడా చదవండి:
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









