ఆకాశంలో అద్భుతం: ఒకే వరుసలోకి అయిదు గ్రహాలు... బైనాక్యులర్స్ లేకుండానే చూడొచ్చు

జూన్ 23వ తేదీన ఈ గ్రహాల కలయికలోకి చంద్రుడు కూడా చేరతాడు

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH

ఫొటో క్యాప్షన్, జూన్ 23వ తేదీన ఈ గ్రహాల కలయికలో చంద్రుడు కూడా చేరతాడు

ప్రతీ 18 ఏళ్లకు ఒకసారి మాత్రమే చూడగలిగే అరుదైన దృశ్యం.... ఈ జూన్‌ నెలలో కనిపించబోతుంది.

అసాధారణ రీతిలో ఈ జూన్‌ నెలలో ఒకేసారి బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, శని గ్రహాలు కనిపించనున్నాయి. ఒకే అక్షంపైకి వచ్చే ఈ అయిదు గ్రహాలను మనం నేరుగా కళ్లతో చూడవచ్చు.

భూమికి పొరుగునే ఈ అయిదు గ్రహాలు ఉంటాయి.

వీటిని చూడటానికి టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ అవసరమే లేదు. సూర్యోదయానికి అరగంట ముందు లేస్తే చాలు. ఆకాశం స్పష్టంగా ఉంటే మరింత చక్కగా చూడొచ్చు.

ఆకాశం తేటగా ఉండే గ్రామీణ ప్రాంతాల వారికి ఇవి మరింత స్పష్టంగా అగుపిస్తాయి. నగరాల్లోని వారు కూడా ఎలాంటి సమస్య లేకుండా వీటిని చూడొచ్చు.

ఈ అయిదు గ్రహాల్లో బుధుడు, సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటాడు. కాబట్టి మామూలు సమయాల్లో దాన్ని చూడటం కష్టం. కానీ, జూన్‌లో సూర్యుడి నుంచి బుధుడు క్రమంగా దూరం వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలో బుధ గ్రహాన్ని ఇప్పుడు చూడటం వీలు అవుతుంది.

వీడియో క్యాప్షన్, అంగారకుడిపై ఈ తలుపు రహస్యం ఏంటి?

జూన్ 24న ఈ అరుదైన దృశ్యం కనబడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు బుధుడు, సూర్యునికి చాలా దూరంలో ఉంటాడు. కాబట్టి సూర్యోదయానికి గంట ముందు కూడా బుధుడు కనబడతాడని వారు చెబుతున్నారు.

అంతేకాకుండా జూన్ 23వ తేదీన చంద్రుడు ఆకాశంలో శుక్రుడు, అంగారక గ్రహాల మధ్యకు వస్తాడు. కాబట్టి ఆ సమయంలో ఒకేసారి ఆకాశంలో ఆరు గ్రహాలను చూడొచ్చు.

2004లో చివరిసారిగా ఈ అయిదు గ్రహాల కలయిక జరిగింది. మళ్లీ ఇలా అయిదు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం 2040లో జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.

వీడియో క్యాప్షన్, ఆకాశం నుంచి పడ్డ వింత గోళాలు.. 12 గ్రామాల్లో భయం భయం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)