దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ.కిశోర్ బాబు
- హోదా, బీబీసీ కోసం
దేశంలో షెడ్యూలు కులాలు ఎక్కువగా ఉన్న గ్రామాలు, పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకాన్ని (PRIME MINISTER ADARSH GRAM YOJANA - PMAGY) అమలు చేస్తోందనే విషయం మీకు తెలుసా?
ఈ పథకం కింద ఒక్కో దళిత గ్రామానికి రూ.21 లక్షల నిధులతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే పనులు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం.
విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనతోపాటు ఆయా గ్రామాల్లోని యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందించే పథకం ఈ పీఎంఏజీవై.
ఈ పథకం ఏమిటి, దీన్ని గ్రామాలు ఎలా ఉపయోగించుకోవాలి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎలా అమలు చేస్తారు? దళిత గ్రామాల్లోని ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం ఎలా? తదితర వివరాలను సమగ్రంగా తెలుసుకుందాం.

ఏమిటీ పీఎంఏజీవై?
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు దాటిపోతున్నా దళిత పల్లెలు అభివృద్ధికి ఇప్పటికీ ఆమడ దూరంలోనే ఉంటున్నాయి.
చాలా గ్రామాలు కనీసం మంచినీటి సదుపాయాలకు నోచుకోనివి ఉన్నాయి. ఈ దళిత గ్రామాల దశ, దిశ మార్చి వాటిని అభివృద్ధి పథంలో పయనించేలా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2009లో ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ పథకం (PRIME MINISTER ADARSH GRAM YOJANA - PMAGY) ప్రవేశపెట్టింది.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూలు కులాల జనాభా 16.6 శాతం ఉంది
ఒక గ్రామంలోని జనాభాలో 50 శాతానికిపైగా దళితుల జనాభా ఉంటే అలాంటి గ్రామాన్ని ఈ PMAGY పథకం కింద ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేస్తారు.
ఇలాంటి గ్రామాలు మన దేశంలో మొత్తం 46,884 ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ గ్రామాలన్నిటీని ఈ పథకం కింద 2023-24 సంవత్సరానికల్లా అభివృద్ధి చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
పీఎంఏజీవైను రెండు దశలుగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ నేతృత్వంలో ఈ పథకం అమలవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎంపిక ఎలా?
ఈ పథకం కింద ఒక గ్రామం ఎంపిక కావాలంటే.. గ్రామంలో జనాభా 500 మంది కంటే ఎక్కువ ఉండాలి.
ఈ జనాభాలో 50శాతానికిపైగా ఎస్సీలు ఉండాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ గ్రామాలను ఎంపిక చేస్తాయి.
ఎలాంటి అభివృద్ధి చేస్తారు?
ఈ పథకం కింద ఎంపికైన గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నదే పథక లక్ష్యం.
ఇందు కోసం 50 రకాల సామాజిక, ఆర్థిక కొలమానాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
గ్రామంలో ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తారా?
ఈ పథకం అమలులో భాగంగా ఆయా గ్రామంలో ప్రతి ఇంటినీ సమగ్రంగా సర్వే చేస్తారు.
ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరి వివరాలు సేకరిస్తారు.
వారి సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత డబ్బు ఇస్తారు?
ఆదర్శ గ్రామంగా ఎంపికైన గ్రామానికి కేంద్ర రూ.20 లక్షలు మంజూరు చేస్తుంది.
దీనికి అదనంగా మరో లక్ష రూపాయలను పరిపాలనా, నిర్వహణ ఖర్చుల కోసం మంజూరు చేస్తుంది. ఇలా మొత్తం కలిసి ఒక గ్రామానికి రూ.21 లక్షల నిధులు వస్తాయి.
ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతారు?
ఈ నిధులు పూర్తిగా ఆ గ్రామాభివృద్ధికి వినియోగిస్తారు.
గ్రామంలో విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, రహదారులు, విద్యుత్తు తదితర మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తారు.
ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి?
ఆదర్శ గ్రామంలో బడికి వెళ్లే వయసున్న విద్యార్థులందరినీ తప్పనిసరిగా బడికి పంపేలా చర్యలు తీసుకుంటారు.
విద్యార్థులందరూ బడికి క్రమం తప్పకుండా హాజరయ్యేలా పర్యవేక్షిస్తారు.
తాగు నీటి సదుపాయం ఎలా చేస్తారు?
ఆదర్శ గ్రామంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆదర్శ గ్రామంలో ఇంకేమేమి ఉంటాయి?
ఈ పథకం కింద ఎంపికైన గ్రామంలో ఏ కుటుంబ కూడా పక్కా ఇల్లు లేకుండా ఉండకూడదు.
ఒకవేళ ఎవరికైనా పక్కా ఇల్లు లేకపోతే మంజూరు చేసి నిర్మించి ఇస్తారు.
ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు సదుపాయం కల్పిస్తారు.
గ్రామంలో అన్ని ఇళ్లకూ విద్యుత్తు సదుపాయం కల్పిస్తారు.
గ్రామంలో పోస్టాఫీసు, టెలిఫోను, ఇంటర్నెట్ తదితర కమ్యూనికేషన్ సదుపాయాలు కల్పిస్తారు.
బ్యాంకు శాఖ ఉంటే గ్రామస్థులందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారు.
గ్రామంలో బ్యాంకు లేకపోతే, ఆ గ్రామస్థులకు బిజినెస్ కరెస్పాండెంట్‌ను ఏర్పాటు చేసి బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తారు.
పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారా?
ఈ ఆదర్శ గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు.
గ్రామంలో అంగన్వాడీ ఏర్పాటు చేస్తారు.
అంగన్వాడీకి సొంత భవనం ఏర్పాటు చేస్తారు.
గ్రామంలో పౌరులందరి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
కాన్పులన్నీ ప్రసూతీ కేంద్రాల్లో జరిగేలా చర్యలు తీసుకుంటారు.
ఆదర్శ గ్రామంలో ప్రజల భాగస్వామ్యం ఉంటుందా?
ఈ పథకంలో ఎంపికైన గ్రామంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది.
గ్రామంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తారు.
ఇందుకోసం గ్రామ సభలను ఏర్పాటు చేస్తారు.
సెల్ప్ హెల్ప్ గ్రూపులు, గ్రామ యువజన సంఘాలు, మహిళలు, మహిళా మండళ్ల భాగస్వామ్యం ఉండేలా చూస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రామంలో ఉపాధి కల్పిస్తారా?
ఆదర్శ గ్రామంలో యువత, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రత్యేక కార్యక్రమాలుంటాయి.
యువతలో నైపుణ్యం పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్య శిక్షణ ఇస్తారు.
గ్రామస్థులకు చేతివృత్తుల్లో, ఇతరత్రా ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తారు.
రుణ సదుపాయాలు కల్పిస్తారా?
ఆదర్శ గ్రామంలో నైపుణ్య శిక్షణ తీసుకున్న యువత, గ్రామస్థులకు స్వయం ఉపాధి చేసుకోవడానికి వీలుగా బ్యాంకుల నుంచీ రుణాలు కూడా ఏర్పాటు చేస్తారు.
వ్యవసాయానికి సాయం చేస్తారా?
గ్రామంలో ప్రతి భూమిలోనూ భూసార పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ భూసార పరీక్షలకు సంబంధించి సాయిల్ హెల్త్ కార్డులను క్రమం తప్పకుండా జారీచేస్తారు.
సంప్రదాయ సాగు, ఆర్గానిక్ సాగు, ఆధునిక సాంకేతికతతో సాగు చేయడంపై గ్రామస్థులకు మెలకువలు నేర్పుతారు.
ఎంతకాలం ఈ పథకం అమలు చేస్తారు?
ఆదర్శ గ్రామ పథకానికి ఎంపికైన గ్రామంలో 2 సంవత్సరాలు ఈ పథకాన్ని అమలు చేస్తారు.
ఈ రెండేళ్లలో ఈ గ్రామంలో ఈ పనులన్నీ నిర్వహిస్తారు.
అవసరాన్ని బట్టి ఆయా గ్రామంలో మరో ఏడాది పొడిగింపు కూడా ఉంటుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలోపు ఈ పథకం కింద అర్హత ఉండే అన్ని గ్రామాల్లోనూ ఈ పథకం అమలు పూర్తి చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
ఎన్ని గ్రామాలు ఎంపికయ్యాయి?
21,850 గ్రామాలు ఇప్పటి వరకు ఆదర్శ గ్రామ పథకానికి ఎంపికయ్యాయి.
ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు?
2,487 గ్రామాలను ఇప్పటివరకు ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
ఇందులో ముందు వరుసలో ఒడిశా ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 83 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
మా గ్రామం ఈ పథకంలో ఉందా లేదా తెలుసుకోవచ్చా?
తెలుసుకోవచ్చు.
ఎలా తెలుసుకోవాలి?
ఈ పథకం కింద మీ గ్రామం ఎంపికైంది లేందీ మీరు తెలుసుకోవచ్చు.
ఒక వేళ ఎంపికై ఉన్నట్లయితే అక్కడ ఏమేమీ చేస్తున్నారనేది కూడా తెలుసుకోవచ్చు.
దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యే వెబ్‌సైటును కూడా నిర్వహిస్తోంది.
https://pmagy.gov.in/new-dashboard/
వెబ్‌సైటుకు వెళ్లి అందులో మీ రాష్ట్రం మీ జిల్లాలో మీ గ్రామానికి సంబంధించిన స్థితిని తెలుసుకోవచ్చు.
ఏమేం తెలుస్తాయి?
- గ్రామాన్ని ఈ పథకం కింద ఎప్పుడు ఎంపిక చేశారు?
- గ్రామానికి ఎంత నిధులు ఇచ్చారు?
- గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టారు?
- చేస్తున్న పనులు ఏ దశలో ఉన్నాయి?
తదితర పూర్తి వివరాలను ఇందులో తెలుసుకోవచ్చు.
ఎలా సంప్రదించాలి?
ఈ పథకంలో మీ గ్రామం గురించి మరింత తెలుసుకోవాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసింది.
హెల్ప్ డెస్కు నంబరు
+91-11-23070579
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.00 గంటల నుంచీ సాయంత్రం 6.00 గంటల వరకు సంప్రదించవచ్చు.
ఏవైనా ఫిర్యాదులు చేయదలచిన వారు
చిరునామాకు ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
- అవసరాల శ్రీనివాస్: 'అవతార్-2 కోసం పనిచేసే అవకాశం అలా వచ్చింది'
- పాకిస్తాన్లో డాలర్ విలువ 250 రూపాయలు దాటింది... ఈ దేశం ఎటు వెళ్తోంది?
- కేంద్ర బడ్జెట్ 2023: గత ఏడాది బడ్జెట్ హామీలు ఏమయ్యాయి?
- బిల్ గేట్స్: ఆవు తేన్పులు పర్యావరణహితంగా ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















