గుడిలోకి ప్రవేశించినందుకు దళిత యువకుడిపై అగ్రకులస్తుల దాడి, బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్ ...

- రచయిత, రాజేష్ దోబ్రియాల్
- హోదా, బీబీసీ కోసం
చమోలికి చెందిన జోషీమఠ్‌లో ఒకవైపు ఇళ్లు భూమిలోకి కూరుకుపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఉత్తరకాశీలోని మారుమూల ప్రాంతమైన మోరిలో సామాజిక సామరస్యతకు భంగం కలిగించే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఆలయంలోకి ప్రవేశించినందుకు పది రోజుల క్రితం ఒక దళిత యువకుడిని కొట్టి, అతన్ని తగలబెట్టాలని చూశారు.
ఈ యువకుడు ప్రస్తుతం డెహ్రడూన్‌లోని డూన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని డాక్టర్లు చెప్పారు. ఈ సంఘటనపై దళిత యువకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసులో అయిదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన తర్వాత, మోరిలోని దళిత కమ్యూనిటీ ప్రజలు తమకు ఆలయాల్లోకి ప్రవేశించే హక్కును కల్పించాలని ఆందోళన చేయబోతున్నారు.

మోరి బ్లాక్‌లోని సర్లా గ్రామంలో జనవరి 9 రాత్రి జరిగిన సంఘటనలో మూడు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఒకటి దళిత యువకుడిని కొట్టారని, రెండు తమను కొట్టారంటూ అగ్రకులాల వారు ఆరోపించడం, మూడోది అడ్మినిస్ట్రేషన్ వాదన.
మొదట మనం ఈ మూడింటితో సంబంధం ఉన్న కామన్ అంశాల గురించి తెలుసుకుందాం.
సర్లా గ్రామంలో కౌల్ అనే ఆలయం ఉంది. సమీపంలోని 15 గ్రామాల వారు ఈ ఆలయంలోనే పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
సర్లా పక్క గ్రామం బైనోల్‌కు చెందిన 22 ఏళ్ల దళిత యువకుడు ఆయుష్ జనవరి 9న రాత్రి 8 గంటల సమయంలో ఆలయంలోకి వెళ్లారు.
ఆలయంలోకి వెళ్లిన ఆయుష్ టెంపుల్ హుండీని కొల్లగొట్టాడని, ఇతర వాటిని ధ్వంసం చేశాడని ఆరోపణలున్నాయి.
దీని తర్వాత బైనోల్ గ్రామానికి చెందిన అగ్రకులాల వ్యక్తులు అతన్ని కొట్టారు. మంటల్లో కాల్చాలని చూశారు. దీంతో ఆయుష్ తీవ్రంగా గాయపడ్డారు.
సర్లా, బైనోల్, సమీపంలోని ప్రాంతాల దళిత యువకులు ఆలయాల్లోకి ప్రవేశించడానికి వీలు లేదు. ఎన్నో శతాబ్దాల పాటు ఈ నిషేధం కొనసాగుతూ వస్తుందని స్థానిక ప్రజలు చెప్పారు.

ఫొటో సోర్స్, VIPENDRA SINGH
ఇరు వర్గాలు వాదనలు ఎలా ఉన్నాయి?
ఆస్పత్రిలో ఆయుష్‌ను చూసుకుంటున్న అతని పెద్ద అన్న వినేష్ కుమార్ ఏం చెప్పారంటే, జనవరి 9న రాత్రి 8 గంటలకు ఆయుష్ ఆలయంలోకి వెళ్లాడని, అక్కడ కూర్చుని ధ్యానం చేసుకున్నాడని తెలిపారు.
అది తెలిసిన బైనోల్ గ్రామంలోని అగ్రకులాల వ్యక్తులు అక్కడికి చేరుకుని, అతన్ని బాగా కొట్టినట్టు చెప్పారు.
వారు ఆ సమయంలో బాగా మద్యం సేవించి ఉన్నారని వినేష్ చెప్పారు. అగ్రకులాల వ్యక్తుల చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న ఆయుష్, తెల్లారి తీవ్ర గాయాలతో ఆలయం నుంచి బయటికి వచ్చినట్టు తెలిపారు.
సర్లాకు చెందిన మాజీ గ్రామ పెద్ద, అగ్రకుల వ్యక్తి కితాబ్ సింగ్ ఈ విషయంపై మరో విధంగా చెబుతున్నారు. ‘‘దళిత కమ్యూనిటీలోని కొందరు వ్యక్తులతో కలిసి కూర్చున్న ఆయుష్ అకస్మాత్తుగా ఆలయానికి వెళ్లాలని వారితో అన్నారు. ఆయనతో ఉన్న వారు ఆయుష్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన వారి మాట వినలేదు. వేగంగా ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయంలోకి వెళ్లిన తర్వాత, అక్కడ ఉన్న శంకాన్ని తన్నారు. హుండీని కొల్లగొట్టారు. వాచ్‌మ్యాన్‌ను కొట్టి ఆయుష్ గర్భగుడిలోకి వెళ్లారు’’ అని కితాబ్ సింగ్ చెప్పారు.
‘‘ఆలయానికి చెందిన 12 మంది పూజారుల్లో కేవలం ముగ్గురికే గర్భగుడిలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఏడాదిలో వచ్చే మూడు పండగలకు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లేందుకు వారికి అనుమతి ఉంటుంది’’ అని కితాబ్ సింగ్ తెలిపారు.
గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత ఎన్నో ఏళ్లుగా అక్కడ మండుతున్న హోమగుండం దగ్గర వెళ్లి, తన కాళ్ల చేతులతో ఆ మంటలను చెల్లాచెదురయ్యేలా చేశారు. ఇలా చేయడంతో అతని చేతులు, కాళ్లు కాలయ్యాయి. ఇలా చేసిన బయటికి వచ్చిన తర్వాత, ఆగ్రహం వ్యక్తం చేసిన బైనోల్ గ్రామస్తులు ఆయన్ని కొట్టారని వాచ్‌మ్యాన్ చెప్పినట్టు కితాబ్ సింగ్ తెలిపారు.
పోలీసు యాక్షన్
కితాబ్ సింగ్ చెప్పిన విషయాన్ని బైనోల్ గ్రామానికి చెందిన అగ్రకులాల పెద్ద విపేంద్ర సింగ్ కూడా ధ్రువీకరించారు. ‘‘ఆయుష్ ఆలయాన్ని ధ్వంసం చేయడంతోనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు పూజారులకు, అది కూడా ఏడాదిలో మూడు సార్లు మాత్రమే అనుమతి ఉన్న గర్భగుడిలోకి ఆయుష్ వెళ్లారు’’ అని విపేంద్ర సింగ్ చెప్పారు.
ఆ రోజు గ్రామంలో ఒకరింట్లో పార్టీ జరిగిందని, కొందరు వ్యక్తులు మద్యం సేవించి ఉంటారని విపేంద్ర సింగ్ బీబీసీతో అన్నారు. ఎవరో ఆలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేస్తున్నారని తెలుసుకున్న ప్రజలు గుడి దగ్గరికి పరిగెత్తారని, ఆయుష్‌ను కొట్టారని చెప్పారు.
ఉత్తరకాశీ సీఓ(ఆపరేషన్స్) ప్రశాంత్ కుమార్ దీనిపై విచారణ చేపడుతున్నారు.
అనుమానిత ప్రదేశం నుంచి ఆలయాన్ని ధ్వంసం చేసిన ఆధారాలను సేకరించారు.
ఈ కేసుపై ఫిర్యాదును పొందిన వెంటనే, అయిదుగురు వ్యక్తులన్ని అరెస్ట్ చేశామని, వారు ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారని ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఆయుష్‌ను కొట్టిన వారి విషయంలో కేసును వెనక్కి తీసుకోవాలని ఆయుష్ తండ్రి అత్తర్ లాల్‌ను కోరేందుకు తాము ప్రయత్నించామని, గ్రామంలో శాంతి, సామరస్యతల కోసం సాయం చేయాలని కోరుతున్నట్టు విపేంద్ర సింగ్ తెలిపారు.
ఇరు వర్గాల వారిని సముదాయించేందుకు స్థానిక చట్టసభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, VINESH KUMAR/BBC
ఆ రాత్రి ఏం జరిగింది..?
నైట్వాడ్ మోరి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులో ఆయుష్ కుమార్ పనిచేస్తున్నారు.
ఈయన పెద్ద అన్న వినేష్ ప్రాంతీయ రక్షణ దళంలో పనిచేస్తున్నారు. ఏడాదిలో కేవలం మూడు నెలల పాటే పని ఉంటుంది. ఆయుష్ సంపాదనపైనే వారి ఇల్లు గడుస్తుంది.
బైనోల్ గ్రామంలో ఉన్న 48 కుటుంబాల్లో 7 గ్రామాలు దళితులకు చెందినవి కాగా, 41 గ్రామాలు అగ్రకులాలకు చెందినవి.
మోరి ప్రాంతంలో ఉన్న దళిత జనాభా 17 శాతం నుంచి 18 శాతం ఉంటుందని స్థానిక పాత్రికేయుడు శైలేంద్ర గోదియాల్ చెప్పారు. ఈయనతో జరిపిన సంభాషణలో ఎప్పటి నుంచి దళితులు ఆలయంలోకి ప్రవేశించకూడదన్న నియమం ఉంది, ఆయుష్ ఎందుకు రాత్రి పూట 8 గంటలకు అకస్మాత్తుగా ఆలయంలోకి వెళ్లాడు? అనే ప్రశ్నలు పదేపదే చర్చలోకి వచ్చాయి.
ఆయుష్ మీదకి దేవుడు వచ్చినట్లుగా ఉందని ఈ గ్రామానికి చెందిన మరో దళిత యువకుడు ప్రకాశ్ బీబీసీకి చెప్పారు.
ఇలాంటి మూడనమ్మకాలు ఈ గ్రామంలో సర్వసాధారణం. ఆ సమయంలో ఆయన్ని అసలు ఆపలేకపోయామని, వేగంగా ఆలయంలోకి వెళ్లారని, తాను షూ వేసుకుని వచ్చేలోపే ఆయుష్ ఆలయంలోకి వెళ్లిపోయారని ప్రకాశ్ అన్నారు.
ఆయుష్ అన్న వినేష్ కూడా ఇదే సమాధానమిచ్చారు. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి రికార్డు సమాచారాన్ని బీబీసీకి అందించలేదు.

అగ్రకులాల వారినైతే శిక్షిస్తారా?
‘‘దేవుడు ఆయన్ని తీసుకెళ్లాడు, అందుకే ఆయన వెళ్లాడు. లేకపోతే ఎందుకెళ్తాడు?’’ అని వినేష్ అన్నారు.
గ్రామంలో ఉన్న అగ్రకులాల వారు దీన్ని అర్థం చేసుకోరని అన్నారు.
ఆయుష్ గుడిలోకి ప్రవేశించిన తర్వాత, ఆలయాన్ని అపవిత్రం చేశాడన్న కారణంతో గ్రామస్తులు తమ కుటుంబానికి రూ.1.25 లక్షల జరిమానా, మేకపోతును ఇవ్వాలని ఆదేశించినట్టు వినేష్ చెప్పారు.
అంతేకాక ఆలయాన్ని శుద్ధి చేసేందుకు అయ్యే ఖర్చును కూడా భరించాలని అన్నారని వినేష్ తెలిపారు.
12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కేదర్‌నాథ్ సంప్రోక్షణకి ఖర్చు రూ.20 లక్షల వరకు అవుతుందన్నారు.
అంత డబ్బును తామెక్కడ నుంచి తేగలని అడిగామని, కానీ అగ్రకులాల వారు ఒప్పుకోవడం లేదని వినేష్ అన్నారు.
ఆ తర్వాతనే ఆయుష్‌ను కొట్టిన అగ్రకులాల వారిపై తమ కుటుంబం కేసు పెట్టిందని చెప్పారు.

ఫొటో సోర్స్, SHAILENDRA GODIYAL
రాజకీయ రంగు పులుముకున్న సంఘటన
ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. దళితులకు ప్రవేశాన్ని నిరాకరిస్తున్న ఈ ఆలయాన్ని తాను కూల్చివేస్తానంటూ భీమ్ ఆర్మీ నేషనల్ ప్రెసిడెంట్ మంజిత్ సింగ్ నౌటియాల్ బైనోల్ గ్రామస్తులతో అన్నారు.
నౌటియాల్ వ్యాఖ్యలను స్థానిక ప్రజలతో పాటు, కర్ణిసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
నౌటియాల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మోరి బజార్‌లో కర్ణిసేన నాయకుడు శక్తి సింగ్ నాయకత్వంలో సోమవారం ఆందోళన చేపట్టారు.
మత భావాలను దెబ్బతీశారన్న కారణంతో నౌటియాల్‌పై పోలీసులు కేసు దాఖలు చేశారు.
ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యుడు అంజుబాలా, బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ కూడా బైనోల్ చేరుకుని, బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. ఆ తర్వాత డెహ్రడూన్‌లో ఆయుష్‌ను కలిశారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఇరు వర్గాల వారితో చర్చలు జరుపుతున్నట్టు సీఓ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
దళితులకు ప్రవేశం లేని ఆలయాల జాబితాను తీయాలని ఉత్తరకాశీ ఎస్‌పీ, డీఎంకు తాము ఆదేశాలు జారీ చేసినట్టు షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ ముకేశ్ కుమార్ చెప్పారు.
వారికి ప్రవేశం కల్పించేలా వివరించాలని, ఒకవేళ వారు ఒప్పుకోకపోతే, వారికి వ్యతిరేకంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ఆయుష్‌ను కొట్టిన వారిపై సెక్షన్ 307(హత్యాయత్నం) కింద కేసు రిజిస్టర్ చేయాలని వినేష్ కోరారు.
డాక్టర్ల రిపోర్టు బట్టి సెక్షన్ 307ను రిజిస్టర్ చేద్దామనుకున్నామని ఈ కేసును విచారించే సీఓ ప్రశాంత్ కుమార్ తెలిపారు. కానీ ఆయుష్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్లు అతనికి ఎలాంటి ప్రమాదకరమైన గాయాలు కానట్టు చెప్పడంతో, ఈ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేయలేదని పేర్కొన్నారు.
ఆయుష్‌తో పాటు ఆయన తల్లి, సోదరుడు ఇద్దరూ రాత్రింబవళ్లు ఆస్పత్రిలో ఉన్నారు. ఆయుష్ త్వరగా కోలుకుని ఇంటికి రావాలని వారు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కూర్మగ్రామం: ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- లెస్బియన్‌గా జీవితం ఎలా ఉంటుంది... ఇందులోనూ మోసాలు ఉంటాయా
- భారత్‌లో మతపరమైన హింస తగ్గుతోందా, చరిత్ర ఏం చెబుతోంది?
- సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయారు, ఒక దీవిలో చిక్కుకున్నారు.. తరువాత ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














