ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
- రచయిత, ఆనంద్ దత్
- హోదా, బీబీసీ కోసం
మధ్యాహ్నం ఒంటి గంట అవుతోంది. ఐదేళ్ల ఇషాంత్ ముండా స్కూలు నుంచి అడవికి ఐదు లీటర్ల ప్లాస్టిక్ డబ్బా పట్టుకొని బయలుదేరాడు.
అతడితోపాటు మరో 40 మంది పిల్లలు కూడా ఉన్నారు.
అందరి చేతుల్లోనూ ఆ ప్లాస్టిక్ డబ్బాలు కనిపిస్తున్నాయి. ఆ డబ్బాలు దేని కోసం? అని అడిగినప్పుడు, మంచినీళ్ల కోసం అని వారిలో ఒకరు చెప్పారు.
ఈ రెసిడెన్షియల్ స్కూలులో మంచి నీళ్ల కుళాయి లేదా హ్యాండ్‌పంపు లేదా?
‘‘లేదు. మేం రోజూ ఇలా అడవి గుండా ఒకటిన్నర కిలోమీటరు నడుస్తాం. అప్పుడు ఒక కొండ పైనుంచి నీరు వచ్చే ప్రాంతం కనిపిస్తుంది. అక్కడ నీరు పట్టుకొని తిరిగివస్తాం. రోజూ ఉదయం సాయంత్రం ఇలానే నీటి కోసం వెళ్తాం. వర్షం పడినా, ఎండ ఉన్నా.. నీటి కోసం ఇలా రోజు వెళ్లాల్సిందే’’అని వారు వివరించారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA
తాము ఎనిమిదేళ్ల నుంచి ఇలానే మంచి నీటి కోసం వెళ్తున్నట్లు ఇషాంత్ సీనియర్, పదో తరగతి విద్యార్థి రాహుల్ ఉరావ్ చెప్పారు.
వీరంతా గవర్నమెంట్ షెడ్యూల్ ట్రైబల్ హైస్కూల్ విద్యార్థులు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 122 కి.మీ. దూరంలో గుల్మా జిల్లాలోని నేతర్‌హాట్ అటవీ ప్రాంతంలోని జోభీపాట్ గ్రామంలో ఈ స్కూల్ ఉంది.
స్కూలు పరిసరాల్లోనే బాక్సైట్ మైనింగ్ జరుగుతోంది. అందుకే ఇక్కడ మంచి నీరు అందుబాటులో లేదు. మరుగుదొడ్డి కూడా లేదు. పిల్లలంతా ఆరుబయటే మల, మూత్ర విసర్జన చేస్తారు.
248 మంది గిరిజన విద్యార్థులు ఉన్న ఈ స్కులులో కేవలం నలుగురు పూర్తికాల టీచర్లు, 12 మంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు.
వారంలో మూడు రోజులు మాత్రమే ఇక్కడ ప్రశాతంగా చదువుకోగలమని ఎనిమిదో తరగతి విద్యార్థి విక్రమ్ ఉరావ్ చెప్పాడు. మిగతా రోజుల్లో అయితే, రెండు గంటలు, లేదా మూడు గంటలే తాము చదువుకుంటామని వివరించాడు.
గిరిజన విద్యార్థుల కోసం 1955లో ఈ స్కూలు నిర్మించారు. అప్పటినుంచి విద్యార్థులు, టీచర్లను నీటి సమస్య వెంటాడుతోంది.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
బిర్సా ముండా గ్రామంలోనూ ఇదే పరిస్థితి
రాంచీకి 64 కి.మీ. దూరంలోని ఖూంటీ జిల్లా ఉలిహాతూ గ్రామంలో బిర్సా రెసిడెన్షియల్ హైస్కూల్ ఉంది. ఇక్కడ కూడా మంచి నీరు లేకపోవడంతో పిల్లలు బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్నారు.
సమీపంలోని చెరువుకు స్నానం కోసం పిల్లలు వెళ్తారు. గత ఏడాది స్నానం చేస్తుండగా ఒక విద్యార్థికి పాము కూడా కరిచింది. మెస్‌లో కేవలం రెండే బెంచీలు ఉన్నాయి. దీంతో పిల్లలు నేలపై కూర్చొనే తింటున్నారు. ఇక్కడ కూడా పూర్తికాల టీచర్లు ముగ్గురే ఉన్నారు. మిగతా 13 మంది రోజువారీ వేతనంపై పనిచేస్తున్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా ఉలిహాతూ గ్రామానికి చెందినవారే. ఆయన జయంతి రోజున, నవంబరు 15న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ గ్రామాన్ని సందర్శించారు. మరోవైపు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా సొంత నియోజకవర్గంలో ఉలిహాతూ ఉంది.
ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో 20 శాతం ప్రభుత్వ స్కూళ్లు ఒకేఒక పూర్తికాల టీచర్‌తో నడుస్తున్నాయి. ఈ స్కూళ్లలో 90 శాతం దళితులు, లేదా గిరిజనుల కోసం ఏర్పాటుచేసినవే.
స్వచ్ఛంద సంస్థ ‘‘జ్ఞాన్ విజ్ఞాన్ సమితి’’ ఈ సర్వేను చేపట్టింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 138 స్కూళ్లలో పరిస్థితులను దీనిలో అధ్యయనం చేశారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
జీన్ ద్రెజ్ నివేదిక ఏం చెబుతోంది?
ప్రముఖ ఆర్థికవేత్త జీన్ ద్రెజ్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సర్వేలో ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి.
సర్వేలో పరిశీలించిన 40 శాతం ప్రాథమిక స్కూళ్లలో ఒక్క పూర్తికాల టీచర్ కూడా లేరు. మరో 55 శాతం ప్రైమరీ స్కూళ్లలో అందరూ ఒప్పంద టీచర్లే కనిపిస్తున్నారు. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఒప్పంద టీచర్ల శాతం 37 శాతం వరకూ ఉంది.
మొత్తం 138 స్కూళ్లలోని 53 శాతం ప్రైమరీ, 19 శాతం అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థులు, టీచర్ నిష్పత్తి విద్యాహక్కు చట్టంలో నిర్దేశించిన 30 కంటే తక్కువగా ఉంది.
ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం 68 శాతం ఉండగా, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఇది 58 శాతంగా ఉంది. ఫిబ్రవరి 2022లో స్కూళ్లను సెలవులు తర్వాత తెరచినప్పుడు చాలా మంది విద్యార్థులు చదవడం, రాయడం మరచిపోయారని టీచర్లు చెబుతున్నారు.
అన్నింటికంటే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ 138 స్కూళ్లలో ఒక్క దానిలోనూ మరుగుదొడ్లు, విద్యార్థులు, నీరు లాంటి సదుపాయాలు పూర్తిగా అందుబాటులో లేవు.
64 శాతం ప్రైమరీ, 39 శాతం అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు ప్రహరీ గోడలు లేవు. మరో 64 శాతం స్కూళ్లకు ఆట మైదానం, 37 శాతం స్కూళ్లకు లైబ్రరీ లేవు.
మరోవైపు మధ్యాహ్న భోజన పథకానికి సరిపడా డబ్బులు కూడా తమకు ఇవ్వడంలేదని సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది టీచర్లు వెల్లడించారు. పది శాతం స్కూళ్లు వారానికి రెండుసార్లు పిల్లలకు గుడ్లు కూడా ఇవ్వడం లేదు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
గిరిజన చిన్నారుల విషయంలో ఎందుకిలా?
వెనుకబడిన వర్గాలకు చెందిన పాఠశాలల విషయంలోనే ఇలా ఎక్కువగా జరుగుతోందని జీన్ ద్రెజ్ బీబీసీతో చెప్పారు. ‘‘ఈ స్కూళ్లలో చాలావరకు షెడ్యూల్ కులాలు, తెగల పిల్లల కోసం ఏర్పాటుచేసినవే. ఈ పిల్లల తల్లిదండ్రులు తమ హక్కుల కోసం మాట్లాడలేరు. డబ్బున్న, అగ్రవర్ణాల పిల్లలు ఈ స్కూళ్లకు రారు’’అని ఆయన వివరించారు.
‘‘దేశంలో టీచర్ల కొరత భారీగా ఉన్న రాష్ట్రాల జాబితాలో జార్ఖండ్ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ మూడో వంతు ప్రైమరీ స్కూళ్లను ఒకే టీచర్‌తో నడిపిస్తున్నారు. అది కూడా తాత్కాలిక టీచర్ అయ్యుంటారు. సగటున ఒక్కో స్కూలులో 51 మంది విద్యార్థులు చేరుతున్నారు. వీరిలో ఎక్కువ మంది దళిత లేదా గిరిజన విద్యార్థులే’’అని ఆయన తెలిపారు.
‘‘ఏళ్ల నుంచి విద్యపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్లే ఇక్కడ సదుపాయాలు ఇలా ఉన్నాయి. నిజానికి ఇది పిల్లలకు అన్యాయం చేయడమే. వెనుకబడిన కులాలు, తెగలకు చెందిన పిల్లలకు దీని వల్ల చాలా చేటు జరుగుతోంది’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
ఖాళీలు ఎన్ని ఉన్నాయి?
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి డిసెంబరు 18న రాష్ట్ర విద్యా విభాగం అధికారులతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 90,000 మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆమె చెప్పారు.
ఇటీవల 50,000 టీచర్ల నియామకాలకు ప్రక్రియలు కూడా మొదలయ్యాయి. జార్ఖండ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణత కావడం తప్పనిసరని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఈ నిబంధనను కోర్టులో సవాల్ చేశారు. దీంతో నియామక ప్రక్రియలపై జార్ఖండ్ హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులు కూడా నిర్వహించలేదు.
‘‘రాష్ట్రంలో 2011 నుంచి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తున్నప్పటికీ, పరిస్థితులు ఆశించనట్లుగా మారలేదు’’అని 12 ఏళ్లుగా విద్య విభాగాలపై వార్తలు రాస్తున్న జర్నలిస్టు సునీల్ ఝా బీబీసీతో చెప్పారు.
‘‘నిజానికి సర్వ శిక్షా అభియాన్‌లో స్కూళ్లను అప్‌గ్రేడ్ చేయాలి. మాధ్యమిక పాఠశాలలకు హైస్కూళ్లుగా, హైస్కూళ్లను ఇంటర్మీడియట్‌కు అప్‌గ్రేడ్ చేయాలి. ఇక్కడ పేపర్‌పై మాత్రమే అప్‌గ్రేడ్ ప్రక్రియలు పూర్తయ్యాయి. కానీ, సదుపాయాలు అలానే ఉన్నాయి’’అని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని 510 హైస్కూళ్లను ఇంటర్మీడియట్ స్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేశారు. కానీ, ఇక్కడ కొత్త టీచర్లు గానీ, ల్యాబ్‌లు కానీ లేవు.
2016లో చివరిసారిగా ఇక్కడ ఒకటి నుంచి ఐదు, ఆరు నుంచి ఎనిమిది తరగతుల టీచర్లను నియమించారు. 2018లో హైస్కూల్ టీచర్ల భర్తీ ప్రక్రియలు చేపట్టారు.

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC
ప్రభుత్వం ఏం చెబుతోంది?
తమ ప్రభుత్వం 50,000 టీచర్ల నియామక ప్రక్రియలు చేపట్టేందుకు నోటిఫికేషన్ ఇచ్చిందని, కానీ, హైకోర్టు ప్రస్తుతం నిలుపుదల ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగన్నాథ్ మహతో బీబీసీకి చెప్పారు.
‘‘అందుకే నియామక ప్రక్రియలు ఆగిపోయాయి. మేం పాఠశాలల్లో సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. 50 స్కూళ్లలో సీబీఎస్‌సీ పాఠ్యాంశాల బోధనను కూడా మొదలుపెడుతున్నాం’’అని ఆయన వివరించారు.
అయితే, లాతేహార్ జిల్లాలోని ఎజామర్ గ్రామంలోని పాఠశాలలో సర్వే నిర్వహించిన పరమ్ అమితవ్ మాట్లాడుతూ.. ‘‘మేం అక్కడి ప్రైమరీ స్కూలుకు వెళ్లినప్పుడు ఒకే ఒక టీచర్ కనిపించారు. ఐదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి మాట్లాడుతూ చివరిసారిగా తమకు మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఎప్పుడు పెట్టారో గుర్తులేదని అన్నారు’’అని చెప్పారు.
‘‘స్కూలులో ఏం చెబుతున్నారో చాలా మంది పిల్లలకు అర్థం కావడం లేదు. వంటచేసే మహిళకు కూడా గత ఏడు నెలలుగా జీతం ఇవ్వలేదు. స్కూలు పక్కన ఉండే ఇంట్లో పొయ్యిపై ఆమె వంట చేస్తున్నారు’’అని పరమ్ వివరించారు.
‘‘నిజానికి ప్రాథమిక విద్య స్థాయిలోనే పిల్లలకు పునాది పడుతుంది. కానీ, ఇక్కడి ప్రాథమిక స్కూళ్లు చాలా దారుణంగా ఉన్నాయి’’అని ఆయన చెప్పారు.
దుమ్కా జిల్లాలోని ధన్‌బాషా ప్రాంతంలో సర్వే నిర్వహించిన అమన్ మరండీ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
‘‘ఈ ప్రాంతంలో రోడ్డు లేదు. పిల్లలు మట్టి రోడ్డు మీదే స్కూలుకు వస్తున్నారు. తరగతి గదుల్లో కింద కూర్చోవడానికి చాప కూడా లేదు. ఉన్న ఒక్క టీచర్ ఒప్పంద ఉద్యోగే’’అని ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని 98 శాతం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. 97 శాతం స్కూళ్లలో బాలికల కోసం ప్రత్యేకంగా విడిగా టాయిలెట్లు ఏర్పాటుచేశారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
సర్వే చేపట్టిన స్కూళ్లలో 15 శాతం ప్రైమరీ స్కూళ్లు, 5 శాతం అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో మరుగుదొడ్లు ఉపయోగించేలా లేవు. కొన్ని స్కూళ్లలో మరుగుదొడ్లు బావున్నాయి. కానీ, వీటిని టీచర్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ: కారుతో 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళి చంపేసింది ఈ అమ్మాయినే
- గుండెపోటు: 40వేల అడుగుల ఎత్తులో విమానప్రయాణికునికి హార్ట్స్ట్రోక్... 5 గంటల పాటు వైద్యం చేసి బతికించిన డాక్టర్
- స్కూలుకు పంపించడానికి ఒక బిడ్డనే ఎంచుకోవాలి... ఓ అయిదుగురు పిల్లల తల్లి కథ
- ఆంధ్రప్రదేశ్: ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎలా అమలవుతోంది, పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- మోదీ బీజేపీ మీద పోరాటంలో హిందువులు, ముస్లింల మధ్య నలిగిపోతున్న కాంగ్రెస్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















