ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-బైజూస్ ఒప్పందం: విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌తో బడికి వెళ్ళాలని ఆదేశాలు... ఇంకా రాబోయే మార్పులేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో4వ తరగతి చదువుతున్న పిల్లల నుంచి 10వ తరగతి వరకూ అందరూ స్మార్ట్ ఫోన్ తీసుకుని వెళ్లాలంటూ ప్రాథమిక విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిలో బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తారు. ఇకపై ఆ కంటెంట్ ఆధారంగా బోధన ఉంటుంది.
8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రం ప్రభుత్వమే ట్యాబ్ అందిస్తుంది. ఉచితంగా అందించే ఆ ట్యాబ్‌లో బైజూస్ సిలబస్ ఆధారంగా పాఠాలుంటాయి. వాటిని టీచర్లు పిల్లలకు బోధిస్తారు. 2023-24 విద్యా సంవవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల్లో రెగ్యులర్ పాఠాలతో పాటుగా బైజూస్ కంటెంట్ కూడా ముద్రించబోతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.
కరోనావైరస్ లాక్‌డౌన్ కాలంలోనే ఆన్‌లైన్ క్లాసుల మూలంగా విద్యార్థులు మొబైల్ ఫోన్లకు అలవాటుపడిన తీరు మీద తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కనిపించింది. ఆ సమయంలో ఫోన్ కొనుగోలు చేయలేక కొందరు తల్లిదండ్రులు ఇబ్బంది పడితే, తమ పిల్లలు ఫోన్లు వదిలిపెట్టడం లేదని మరికొందరు హైరానా పడ్డారు.
ఇప్పుడు పదేళ్ల లోపు పిల్లలు కూడా స్కూల్‌కి ఫోన్ తీసుకుని రావాలని ప్రభుత్వమే చెప్పడంతో దాని పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Byju'S
వేల రూపాయల కంటెంట్ ఉచితంగానే..
మార్కెట్లో వేల రూపాయలు వసూలు చేస్తున్న బైజూస్ సంస్థ ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ అందిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని గత జూన్‌లో బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ఒప్పందం అమలు గురించి అక్టోబర్ 13న పాఠశాల విద్యాశాఖ సమీక్షలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
బైజూస్ ఒప్పందం గురించి కొందరు వక్రీకరణలు చేస్తున్నారని, విద్యార్థులతో రాజకీయాలా అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
బైజూస్ ఇ–కంటెంటును 4 వ తరగతి నుంచి 10వ తరగతివరకూ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్‌లను ప్రభుత్వమే పంపిణీ చేయబోతున్నట్టు వెల్లడించారు. పిల్లలకు ఇచ్చే ట్యాబ్‌లు వస్తున్నాయని, తొలుత టీచర్లకు అందించి, వారికి కంటెంట్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతుందని అధికారులు తెలిపారు.
ట్యాబ్‌లు పొందిన వారు మాత్రమే కాకుండా ఇతర విద్యార్థులందరూ తమ సొంత ఫోన్లలో బైజూస్ కంటెంట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు వివరించారు.
పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ కంటెంట్ పొందుపరచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. డిజిటల్ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్ కాపీల రూపంలో కూడా ఈ కంటెంట్ అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఫొటో సోర్స్, https://blog.byjus.com/
స్మార్ట్ ఫోన్ భారం మోయలేం...
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే- 5 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో అర్బన్ ప్రాంతాల్లో 67.4 శాతం, రూరల్ లో 40.9 శాతం మంది మహిళలు మాత్రమే మెబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు.
మహిళా సాధికారిత గురించి సేకరించిన వివరాల్లో భాగంగా 15 నుంచి 49 ఏళ్ల వయసు కలిగిన వారి నుంచి సేకరించిన వివరాల ప్రకారం కేవలం 31 శాతం మందికి మాత్రమే ఇంటర్‌నెట్ అందుబాటులో ఉందని తేలింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరూ మొబైల్ ఫోన్ తీసుకోవాల్సిందేనని చెప్పడం పట్ల కొందరు తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
"మా ఆయన సైకిల్ మెకానిక్. నేను ఇంట్లో పాచిపనులకు వెళతాను. మా ఆయన దగ్గర ఒక ఓ ఫోన్ ఉంది. మా ఇంట్లో కూడా ఒక చిన్న ఫోన్ ఉంది. పిల్లలిద్దరూ ఒకరు 7, మరొకరు 5 వ తరగతి చదువుతున్నారు. మునిసిపల్ స్కూల్‌కే వెళతారు. ఆన్‌లైన్ క్లాసులు పెట్టినప్పుడే వాళ్లిద్దరికీ ఫోన్ ఇవ్వలేక నానా అవస్థలు పడ్డాం. అప్పుడు మా ఆయన కూడా ఇంట్లోనే ఉండేవారు కాబట్టి ఆ ఫోన్ చెరో కొంచెం సేపు వినేవాళ్లు. ఇప్పుడు బడికి ఫోన్ తెచ్చుకోవాలని అంటే మాకు ఎలా వస్తుంది. ఒక్క ఫోన్ కొనడమే మా లాంటి వాళ్లకు కష్టం. మనిషికో ఫోన్ అంటే మా వల్ల కాదు" అంటూ విజయవాడ రాణీగారితోటకు చెందిన ముల్లంగి జ్యోతి అన్నారు.
పిల్లలు ఫోన్ తెచ్చుకోవాలని మాకు ఇంకా చెప్పలేదని, ఒకవేళ చెబితే తాము తెచ్చుకోలేమని చెబుతామని ఆమె బీబీసీతో అన్నారు. తమకు మరో మార్గం లేదని తెలిపారు.

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY
అప్పుడు టీచర్లకే వద్దని, ఇప్పుడు పిల్లలకా...
ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో టీచర్లకు కూడా మొబైల్ ఫోన్ అనుమతి లేదని కొద్దికాలం క్రితం ఆదేశాలు వచ్చాయి. టీచర్లు ఫోన్లు వాడుతూ, పిల్లలకు పాఠాలు బోధించడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే కొందరి విమర్శలను దృష్టిలో ఉంచుకొని గతంలో అలాంటి ఉత్తర్వులు అమలయ్యాయి.
నేటికీ మొబైల్ ఫోన్‌తో పిల్లలను పాఠశాలల్లోకి అనుమతించడం లేదు. వాటి వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందనే అభిప్రాయం ఉంది. కానీ తాజా ఉత్తర్వులు అమలులోకి వస్తే స్కూల్లో మొబైల్ ఫోన్ అనివార్యం అవుతుంది.
అంత చిన్న వయసు నుంచే మొబైల్ ఫోన్ వాడకం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు వస్తాయనే ఆందోళన తల్లిదండ్రుల్లో ఉంది.
డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పేరుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2021లో 66 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. వారిలో 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు సూచించారు. 2,621 మందికి తీవ్ర కంటి సమస్యలున్నట్టు గుర్తించారు. 309 మందికి సర్జరీ కోసం సిఫార్సు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కేవలం ఫోన్ వాడకం వల్లనే కంటి సమస్యలు వస్తాయనే స్పష్టత లేకపోయినప్పటికీ కంటి సమస్యలతోపాటు మొబైల్ ఫోన్ వాడకం వల్ల విద్యార్థుల్లో మానసిక, శారీరక సమస్యలు చాలా ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు అంటున్నారు. చిన్నతనం నుంచే మొబైల్ అలవాటు అనేక సమస్యలకు దారితీస్తుందనే అభిప్రాయాన్ని చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రమేశ్ కుమార్ అన్నారు.
"పిల్లలకు ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే కొన్ని ఉపయోగాలున్నాయి. అదే సమయంలో ఇబ్బందులు కూడా ఉన్నాయి. సమాచార విప్లవంలో అన్ని అంశాలు తెలుసుకునే అవకాశం కల్పించడం మంచిదే గానీ చిన్న వయసులో ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలియని వారిని పూర్తిగా మొబైల్‌కు పరిమితం చేస్తే సమస్యలు అనివార్యం. ప్రభుత్వం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ట్యాబ్ అంటే, అందులో పాఠాలు తప్ప ఇతర అంశాలకు అవకాశం ఉండకుండా నియంత్రించవచ్చు. కానీ మొబైల్ ఫోన్ చేతికిచ్చిన తర్వాత అందులో వారు దేనిని అనుసరిస్తున్నారన్నది నిత్యం కనిపెట్టడం సమస్య అవుతుంది" అని డాక్టర్ రమేశ్ అభిప్రాయపడ్డారు.
ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం అయిన సమయంలో అనేక మంది గేమ్స్, ఇతర సోషల్ యాప్స్‌కు అలవాటుపడి వాటి నుంచి బయటపడేందుకు సతమతమయిన అనుభవాలు మరచిపోకూడదని ఆయన బీబీసీకి తెలిపారు. 4వ తరగతి పిల్లలు కూడా మొబైల్ స్కూల్‌కు తీసుకెళ్లడం మూలంగా ఇతర ప్రభావాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందనే విషయం గుర్తించాలని సూచించారు.

ఉపాధ్యాయ నియామకాల మీద ప్రభావం
బైజూస్ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లో వచ్చే ఏడాది 9, ఆపై ఏడాది 10 తరగతి కంటెంట్ అప్‌లోడ్ చేస్తారు.
ఆ ట్యాబ్‌ల కొనుగోలు కోసం ఒక్కోటి సుమారుగా రూ. 10 వేలు చొప్పున రూ. 500 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తోంది.
విద్యార్థులకు వ్యక్తిగతంగా ట్యాబ్‌తో పాటు ప్రతి తరగతి గదిలో టీవీ ఏర్పాటు చేస్తారు. నాడు-నేడు పథకంలో భాగంగా టీవీ సెట్లు కొనుగోలు చేస్తున్నారు.
సీబీఎస్ఈ సిలబస్‌లో బోధన ఈ ఏడాది నుంచి మొదలయ్యింది. 2025లో మొదటి బ్యాచ్ పదో తరగతి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. అప్పటికి వరుసగా మూడేళ్ల పాటు డిజిటల్ విద్యాబోధన ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ప్రభుత్వం అంటోంది.
ప్రస్తుతం ప్రైవేటు యూజర్లకు రూ. 20 వేల నుంచి 25 వేలు చెల్లిస్తే అందిస్తున్న బైజూస్ కంటెంట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించడం ద్వారా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లలతో సమానంగా ప్రభుత్వ బడుల విద్యార్థులు ఎదుగుతారని, ఇదో గేమ్ చేంజర్ అని కూడా సీఎం జగన్ చెప్పారు.
"డిజిటలైజేషన్ పేరుతో ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు కుదించే యత్నంలో ఉందనే అనుమానాలు టీచర్లందరిలో ఉన్నాయి. ఏటా డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చినప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. పైగా రేషనలైజేషన్, స్కూళ్ల విలీనం పేరుతో అనేక పోస్టులు రద్దు చేశారు. ఇప్పుడు బైజూస్ ద్వారా బోధన పేరుతో మరింతగా టీచర్ పోస్టులు కుదించే ప్రమాదం కనిపిస్తోంది"అంటూ ఉపాధ్యాయ నేత కేఎస్ఎస్ ప్రసాద్ అన్నారు.
బైజూస్‌కు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారనే అంశంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని యూటీఎప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రసాద్ కోరారు. ఉపాధ్యాయ నియామకాల మీద ఉన్న అపోహలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానేదినన్నారు.
ఫోన్లు తప్పదు.. టీచర్ నియామకాల గురించి చెప్పలేం..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్నింటా ముందంజ వేస్తున్న విషయం గమనించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కే సురేశ్ కుమార్ అన్నారు. అలాంటి వారికి మరింత ప్రోత్సహం అందించి, ముందుకు నడిపించేందుకే ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందం కుదర్చుకుందని ఆయన బీబీసీతో అన్నారు.
"బైజూస్ ఒప్పందం చేసుకున్న నాడే 4వ తరగతి నుంచి అందరికీ కంటెంట్ అందిస్తామని చెప్పాం. ఇప్పుడు పిల్లలంతా ఫోన్లు తెచ్చుకోవాలి. తల్లిదండ్రులదే ఆ బాధ్యత. డిజిటల్ విద్యలో ముందుడుగు వేస్తున్నాం. ప్రారంభంలో కొందరికి అర్థంకాకపోవచ్చు గానీ అది చాలా ప్రాధాన్యతతో కూడుకున్న నిర్ణయం. ఏజన్సీ ప్రాంతాల్లో అందరూ ఫోన్ వాడకానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనంటూ" ఆయన తెలిపారు.
4వ తరగతి నుంచి అందరికీ కంటెంట్ అందిస్తామని బైజూస్ ఒప్పందం చేసుకున్న రోజే ప్రభుత్వం ప్రకటించిన మాట వాస్తవమే. అయితే స్మార్ట్ ఫోన్లు విద్యార్థులే తెచ్చుకోవాల్సి ఉంటుందనే మాట ఆ రోజు చెప్పలేదు.
నెట్ అందుబాటులో లేని ప్రాంతాల విద్యార్థుల పరిస్థితి గురించి ప్రశ్నించగా ఇంటర్ నెట్ సదుపాయం కల్పించే బాధ్యత పాఠశాల విద్యాశాఖది కాదంటూ ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియామకాలుండవని సాగుతున్న ప్రచారంపై స్పష్టత నివ్వమని కోరగా.. అది అనుమానాలున్న వారికే తెలియాలంటే కమిషనర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ నాటికి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తామని కమిషనర్ బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా: 'శారీరక శక్తి కన్నా మెదడు ప్రమాదకరం' అన్న సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టు తీర్పు రద్దు
- కాంతార మూవీ రివ్వూ: సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే చివరి పది నిమిషాలది మరో లెవెల్
- ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు, స్థానికుల జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి
- ఎలుకలు, ఎముకలు, బంకమట్టి, నాగజెముడు పండ్లు...ఆకలికి తట్టుకోలేక వీళ్లు ఇవే తింటున్నారు
- కేరళలో నరబలి: నిందితుడి ఇంటి వెనుక 61 శరీర భాగాలు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














