ప్రపంచ ఆహార దినోత్సవం: ఎలుకలు, ఎముకలు, బంకమట్టి, నాగజెముడు పండ్లు...ఆకలికి తట్టుకోలేక వీళ్లు ఇవే తింటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ న్యూస్
కరవు, పేదరికం, యుద్ధం, వ్యాధులు.. ఇవి మనం తీసుకునే ఆహారంపై తీవ్రమైన ప్రభావం చూపగలవు.
దారుణమైన పరిస్థితుల్లో బంకమట్టి, ముళ్ల చెట్టు నాగజెముడు పళ్లు, పువ్వులు, ఎలుకలు, ఎముకలు, జంతువుల చర్మాలను ఆహారంగా తీసుకొని కొందరు ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు.
తీవ్రమైన ఆకలి, పోషకాహార లోపం లాంటి సమస్యలు ప్రపంచంలోని చాలా ప్రాంతాలను వేధిస్తున్నాయి. నేడు వీటి స్థాయి విపరీతానికి పెరిగిపోయిందని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చెబుతోంది. ‘’82 కోట్ల మంది రోజూ ఆకలితో నిద్రపోవాల్సి వస్తోంది. 34 కోట్ల మందికి ఆహార కొరత సమస్య తీవ్రంగా ఉంది’’అని వివరిస్తోంది.
ప్రపంచ ఆహార దినోత్సవం (అక్టోబరు 16) నేపథ్యంలో ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు చెందిన నలుగురితో బీబీసీ మాట్లాడింది. విపరీతమైన ఆకలి అంటే ఏమిటో వీరు ప్రత్యక్షంగా చవిచూశారు. ఆ పరిస్థితులను దాటుకు వీరు ఎలా ముందుకు వచ్చారో చూద్దాం.

ఫొటో సోర్స్, Rani
‘‘ఎలుకలు మాత్రమే దొరుకుతాయి’’
‘‘నేను చిన్నప్పటి నుంచీ ఎలుకలు తింటున్నాను. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇప్పుడు నా రెండేళ్ల మనవరాలికి కూడా ఎలుకలే పెడుతున్నాను. మాకు ఇది అలవాటైపోయింది’’అని దక్షణ భారత దేశానికి చెందిన రాణి చెప్పారు.
49 ఏళ్ల రాణి చెన్నైలో జీవిస్తారు. అణగారిన వర్గానికి చెందిన ఆమె, ఐదేళ్లకే చదువు మానేయాల్సి వచ్చింది.
ఆమె కులానికి చెందిన ప్రజలకు ఏళ్లుగా వివక్ష ఎదురవుతోంది. వారికి సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థ ‘‘ద ఇరుళ’’తో ఆమె పనిచేస్తున్నారు. ముఖ్యంగా వెట్టిచాకిరీ వేధింపులు ఎదుర్కొనేవారికి ఆమె సాయం చేస్తున్నారు.
‘‘మేం ఎప్పుడూ పట్టణాలు, గ్రామాలకు వెలుపలే జీవిస్తాం. అసలు మాకు తినడానికి ఏమీ దొరికేదికాదని మా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు చెప్పేవారు. విపరీతమైన పరిస్థితుల్లో మాకు అవసరమైన పోషకాలను ఎలుకలే అందించేవి’’అని ఆమె చెప్పారు.
‘‘ఎలుకలను పట్టుకోవడం చిన్న వయసులోనే నేను నేర్చుకున్నాను’’అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Rani
చిన్నప్పుడు ఆమె నేర్చుకున్న నైపుణ్యాలే ఇప్పుడు తన కుటుంబానికి ఆహారం పెడుతున్నాయి. కనీసం వారంలో రెండుసార్లు వీరు ఎలుకలను వండుకుంటున్నారు.
ముఖ్యంగా పొలాల్లో కనిపించే ఎలుకలను ఇరుళ ప్రజలు తింటారు. ఇళ్లలో కనిపించే ఎలుకలను కాదు.
‘‘మేం ఎలుకల పైతోలు తీసేస్తాం. ఆ తర్వాత మాంసాన్ని చిన్న మంటపై వండుతాం. దాన్నే తింటాం. కొన్నిసార్లు వీటిని చిన్న ముక్కలుగా కూసి పప్పు, చింతపండు కలిసి వంటకాలు కూడా చేసుకుంటాం’’అని రాణి వివరించారు.
మరోవైపు ఎలుకలు తమ కలుగుల్లో దాచుకునే ఆహార ధాన్యాలను కూడా ఇరుళ ప్రజలు సేకరించి, ఆహారంగా తీసుకుంటారు.
‘‘నెలకు ఒకసారి మాత్రమే కోడి మాంసం లేదా చేపలు కొనుక్కోగలం. కానీ, ఎలుకలు ఎక్కువగా దొరుకుతాయి. పైగా వాటికి డబ్బులు అవసరం లేదు’’అని రాణి అన్నారు.

ఫొటో సోర్స్, Abdulkadir Mohamed/NRC
‘‘జంతు కళేబరాల మాంసాన్ని కూడా తింటాం’’
ఆఫ్రికా దేశం సోమాలియాను విపరీతమైన ఆహార కొరత వేధిస్తోందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. 40ఏళ్లలో ముందెన్నడూ చూడని కరవు వల్ల ఇక్కడ 50 లక్షల మంది వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు.
అలా సొంత ఇంటిని వదిలి వెళ్లిపోయిన వారిలో ఏడుగురు పిల్లల తల్లి షరీఫో హసన్ అలీ ఒకరు.
షబేల్ ప్రాంతంలోని తన ఇంటిని వదిలి ఆమె 200 కి.మీ. పిల్లలను పట్టుకొని నడుచుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం రాజధాని మొగదిషుకు శివార్లలోని ఒక శిబిరంలో ఆమె జీవిస్తున్నారు.
‘‘ఐదు రోజులపాటు మేం నడుచుకుంటూ వచ్చాం. రోజుకు ఒకసారి మాత్రమే మేం తినేవాళ్లం. ఎక్కువ ఆహారం దొరికేది కాదు. పిల్లలకు ముందు ఆహారం పెట్టేదాన్ని. అప్పటికీ వారు ఆకలితో ఉండేవారు’’అని ఆమె చెప్పారు.
రాజధానికి వచ్చే దారిలో ఆమె కొన్ని దారుణమైన పరిస్థితులను చూశారు.
‘‘ఆ నది పూర్తిగా ఎండిపోయింది. కొన్నేళ్లుగా నదిలో నీరు తగ్గిపోతూ వచ్చింది. దీంతో మురికి నీరు తాగాల్సి వచ్చింది’’అని హసన్ అలీ చెప్పారు.
‘‘మొగదిషుకు వెళ్లే దారిలో వందల సంఖ్యలో జంతు కళేబరాలు కనిపించాయి. వాటిని కూడా ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. జంతు చర్మాలను కూడా కొందరు తింటూ కనిపించారు’’అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Abdulkadir Mohamed/NRC
హసన్ అలీకి 25 ఆవులు, 25 మేకలు ఉండేవి. కరవు వల్ల ఇవన్నీ చనిపోయాయి.
‘‘అసలు వర్షమే లేదు. దీంతో మా పొలం పూర్తిగా ఎండిపోయింది’’అని ఆమె చెప్పారు.
ఇప్పుడు ఇతరుల బట్టలు ఉతకడం ద్వారా రోజుకు రెండు డాలర్ల (రూ.160) కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఈ డబ్బులు ఆమెకు ఆహారం కొనడానికి కూడా సరిపోవడం లేదు.
‘‘నేను రోజుకు కేజీ బియ్యం, కూరగాయలు కూడా కొనలేకపోతున్నాను. అవి అస్సలు సరిపోవడం లేదు. మాపై కరవు విపరీతమైన ప్రభావం చూపిస్తోంది’’అని ఆమె చెప్పారు.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా తమకు సాయం చేస్తాయని, అయినా తమకు ఆహారం సరిపడా దొరకడంలేదని ఆమె వివరించారు.
‘‘మా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు’’అని హసన్ అలీ వివరించారు.

ఫొటో సోర్స్, FELIX LIMA/ BBC NEWS BRASIL
‘‘పారేసే మాంసపు ఎముకలు, తోళ్లే మాకు ఆధారం’’
బ్రెజిల్‌లోని సవ్‌పాలోలో గత రెండేళ్లుగా మాంసం దుకాణాలు పారేసే ఎముకలు, తోళ్లను 63ఏళ్ల మారియా డాసిల్వా నసిమెంటో ఆహారంగా తీసుకుంటున్నారు.
ఆమెకు వచ్చే పింఛను సరాసరిన రోజుకు నాలుగు డాలర్లు (రూ.320) వస్తుంది. భర్త, కుమారుడు, ఇద్దరు మనవళ్లకు ఇదే ఆధారం. దీంతో ఆమెకు మాంసం కొనుక్కోవడానికి డబ్బులు సరిపోవడం లేదు. నగరంలోని వివిధ రకాల మాంసపు దుకాణాలకు వెళ్లి వారు పారేసే ఎముకలు, తోళ్లను ఆమె తెచ్చుకుంటారు. కొందరు వీటిని కూడా కేజీ 0.70 డాలరు (రూ.50)కు అమ్ముతారని ఆమె చెప్పారు.
‘‘ఈ ఎముకలను వాటిలో ఉండే కొంచెం మాంసంతో కలిపి వండుతాను. చివరగా కొన్ని బీన్స్ కలుపుతాను’’అని ఆమె వివరించారు.
‘‘కోడి తోలును నూనె లేకుండా పెనం పై పెట్టి వేయిస్తారు. దాని నుంచి వచ్చే కొవ్వును విడిగా సేకరిస్తాను’’అని ఆమె తెలిపారు. పెరుగు డబ్బాల్లో ఈ కొవ్వును నిల్వచేసి వంటల్లో ఆమె ఉపయోగిస్తారు.
‘‘పళ్లు, కూరగాయలు, స్వీట్లు లాంటివి కొనడం గురించి మేం అసలు ఆలోచించం. ఒకప్పుడు మా ఇంట్లో ఫ్రిజ్ నిండా మాంసం, కూరగయాలు ఉండేవి. క్యాబేజీ, టమాట, ఉల్లిపాయలు ఇలా అన్ని ఉండేవి’’అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, BBC
‘‘నేడు మా ప్లేట్లు ఖాళీ అయిపోయాయి. ఫ్రూట్ బౌల్‌లో ఒక ఉల్లిపాయ మాత్రమే ఉంటోంది’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
కోవిడ్ సమయంలో నడుమ ఆమె ఉద్యోగం కోల్పోయారు. తన కొడుకు కూడా నిరుద్యోగే.
‘‘ప్రజలు వితరణచేసే ఆహార పదార్థాల కోసం ఎదురుచూస్తుంటాను. స్థానిక క్యాథలిక్ చర్చి మాకు అప్పుడప్పుడు సాయం చేస్తుంది’’అని ఆమె తెలిపారు.
బ్రెజిల్‌లో 3.3 కోట్ల మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారని బ్రెజిల్ నెట్‌వర్క్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ వెల్లడించింది.
‘‘కొన్నిసార్లు మా దగ్గర ఎముకలు లేవని మాంసం దుకాణాల యజమానులు చెబుతుంటారు’’అని మారియా వివరించారు.

ఫొటో సోర్స్, Unicef/Rakoto/2022
‘‘ముళ్లచెట్ల పళ్లే మాకు ఆధారం’’
‘‘ఇక్కడ వర్షం లేదు. పంటలూ లేవు. అమ్మడానికి మా దగ్గర ఏమీ లేవు. డబ్బులు కూడా లేవు. మరి అన్నం మాత్రం ఎలా దొరుకుతుంది?’’అని మడగాస్కర్‌కు చెందిన 25ఏళ్ల ఫెఫినియాయినా చెప్పారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గత రెండేళ్లపాటు వర్షం కురవకపోవడంతో ఇక్కడి పంటలు ఎండిపోయాయి. పశు సంపదపై కూడా కరవు తీవ్రమైన ప్రభావం చూపింది. ఇక్కడ పది లక్షల మందికిపైగా ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
కరవుతో తీవ్రంగా ప్రభావితం అవుతున్న అంబోసరీ పట్టణంలో ఫెఫినియాయినా జీవిస్తున్నారు. భర్తతోపాటు కలిసి ఆమె మంచి నీటిని అమ్ముతుంటారు.
‘‘డబ్బులు వచ్చినప్పుడు మేం బియ్యం లేదా చిలగడ దుంపలు కొనుక్కుంటాం. మా దగ్గర ఏమీలేనప్పుడు ముళ్లచెట్లు అయిన నాగజెముడు చెట్లకు కాసే పళ్లను తింటాం. ఒక్కోసారి అవి కూడా మాకు దొరకవు’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Unicef/Rakoto/2022
‘‘ఇక్కడ చాలా మంది నాగజెముడు పళ్లే తింటారు. అవి కాస్త చింతపండులా అనిపిస్తాయి’’అని ఆమె వివరించారు.
‘‘గత నాలుగు నెలలుగా వాటినే మేం తింటున్నాం. దీంతో మా ఇద్దరు పిల్లలకు డయేరియా సోకింది’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
మరోవైపు దక్షిణ మడగాస్కర్‌లో ప్రజలు ఆకలిని తట్టుకునేందుకు బంకమట్టికి చింతపండు రసం, నాగజెముడు ఆకులు, అడవి దుంపలు కలిపి తింటున్నారని డబ్ల్యూఎఫ్‌పీ ఒక కథనాన్ని గత ఏడాది ప్రచురించింది.
నాగజెముడు పళ్లు ఆకలిని నియంత్రిస్తాయి. కానీ, వాటిలో కావాల్సిన విటమిన్లు, మినరల్స్ లభించవు. దీంతో ఫెఫినియాయినా నాలుగేళ్ల కుమార్తెకు డయేరియా తీవ్రమైంది.
‘‘కొంచెం వర్షం పడితే, పంటలు వేసుకోవచ్చు. చిలగడ దుంపలు పండించుకోవచ్చు. పళ్లు కూడా పండుతాయి’’అని ఫెఫినియాయినా చెప్పారు.
నేడు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆకలి సమస్యలు ముందెన్నడూ లేనిరీతికి పెరిగాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్‌పీ) చెబుతోంది.
ఈ సమస్యకు నాలుగు కారణాలు ఉన్నాయని ఐరాస వివరిస్తోంది. వీటిని ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక పరమైన సంక్షోభాలు, ద్రవ్యోల్బణాలుగా పేర్కొంది.
‘‘డబ్ల్యూఎఫ్‌పీ ఈ సమస్యను పరిష్కరించేందుకు నెలకు 73.6 మిలియన్ డాలర్లు (రూ.6,096,497,760 ) ఖర్చుపెడుతోంది. 2019తో పోలిస్తే ఇప్పుడు ఈ మొత్తంలో 44 శాతం పెరుగుదల కనిపిస్తోంది’’అని ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది.
అయితే, డబ్బులతో ఆహార సంక్షోభానికి ముగింపు పడదని డబ్ల్యూఎఫ్‌పీ చెబుతోంది. ‘‘ఘర్షణలు, వాతావరణ మార్పులు అడ్డుకునేందుకు రాజకీయ నాయకులు కలిసి పనిచేయాలి. ఈ రెండింటికీ కళ్లెం వేయకపోతే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది’’అని ఆ నివేదిక వివరించింది.
(ఫెలిప్ సౌజా అదనపు సాయం అందించారు)
ఇవి కూడా చదవండి:
- కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంతో మంది విద్యార్థుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించిందంటే...
- Income Tax: ఆదాయ పన్నును మ్యాగ్జిమం తగ్గించుకోవడం ఎలా?
- 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుగుడు ఏంటి?
- ప్రశ్న పత్రంలో ఇస్లాంను దూషించారంటూ టీజే జోసెఫ్ చేయి నరికారు, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఎలా ఉన్నారు?
- PMBJP-జనరిక్ మందులు: కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా ఏ మందులైనా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే.. అయినా వీటిని ఎందుకు కొనట్లేదు?‘హిందీని రుద్దుతున్నారు’ అంటూ ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి,అమిత్ షా కమిటీ సిఫారసుల్లో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












