‘మనుషులను బలి తీసుకునే ఫ్యాక్టరీలు’.. వీటి లోపల పరిస్థితులు ఇలా ఉన్నాయి..

ముస్కాన్ (ఫైల్ ఫోటో)
ఫొటో క్యాప్షన్, ముస్కాన్ (పాత చిత్రం)
    • రచయిత, అర్చనా శుక్ల
    • హోదా, బీబీసీ బిజినెస్ కరస్పాండెంట్

‘‘ఇది మనుషులను బలి తీసుకునే ఫ్యాక్టరీ.’’

దిల్లీలో అగ్నికి ఆహుతైన భవనం రెండో అంతస్తును చూపిస్తూ మాట్లాడేటప్పుడు ఇస్మాయిల్ ఖాన్ చేతులు వణికాయి.

తన చెల్లెలిని చివరిసారి ఆయన ఈ ఫ్యాక్టరీలోనే చూశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భవనం నుంచి బయట పడేందుకు చాలా ప్రయత్నించారు. కానీ, మంటలు, పొగ వల్ల ఊపిరాడక ఆమె చనిపోయారు.

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారుచేసే ఈ నాలుగు అంతస్తుల భవనంలో గత మే నెలలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీనిలో 21ఏళ్ల ముస్కాన్‌తోపాటు 27 మంది మరణించారు.

ఈ ప్రమాదానికి కొన్ని రోజుల తర్వాత ఒక సీనియర్ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడారు. ఈ భవనంలో ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అవసరమైన అనుమతులను అగ్నిమాపక, పోలీసు విభాగాల నుంచి తీసుకోలేదని ఆయన వెల్లడించారు.

ఈ ఫ్యాక్టరీ యజమానులకు బీబీసీ చాలాసార్లు ఫోన్‌ చేసింది. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు ఫ్యాక్టరీ తరఫు న్యాయవాదిని బీబీసీ సంప్రదించింది. అయితే, బీబీసీ ప్రశ్నలను స్వీకరించేందుకు ఆ న్యాయవాది నిరాకరించారు.

దిల్లీలో అగ్ని ప్రమాదం జరిగిన భవనం
ఫొటో క్యాప్షన్, దిల్లీలో అగ్ని ప్రమాదం జరిగిన భవనం

పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ భారత ప్రభుత్వం కొత్త పథకాలు, సంస్కరణలను తీసుకొస్తోంది. దేశాన్ని ‘‘ఇండస్ట్రియల్ పవర్‌హౌస్’’గా మార్చాలని కూడా లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే, దిల్లీ అగ్ని ప్రమాదం లాంటి పారిశ్రామిక ప్రమాదాలు ఇటీవల ఎక్కువయ్యాయి. కార్మికులే వీటికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

పారిశ్రామిక ప్రమాదాల వల్ల ఏటా వందల మంది కార్మికులు చనిపోతున్నారు. ఈ విషయంపై 2021లో పార్లమెంటులో ఒక కేంద్ర మంత్రి స్పందించారు. ఫ్యాక్టరీలు, నౌకాశ్రయాలు, గనులు తదితర ప్రాంతాల్లో పనిచేస్తూ గత ఐదేళ్లలో 6,500 మందికిపైగా కార్మికులు మరణించారని వెల్లడించారు. అయితే, వాస్తవానికి ఈ మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని కార్మిక ఉద్యమకారులు బీబీసీతో చెప్పారు.

వస్తువుల తయారీ, రసాయనాలు, నిర్మాణ రంగంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంఘం ఇండస్ట్రీఆల్ వెల్లడించింది. ఒక్క 2021లోనే భారత్‌లో తయారీ పరిశ్రమల్లో నెలకు కనీసం ఏడు ప్రమాదాలు జరిగాయని, వీటిలో 162 మందికిపైగా కార్మికులు మరణించారని తెలిపింది.

చిన్నచిన్న, రిజిస్టర్ కానీ ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని వార్తలు, విశ్లేషణలు వస్తున్నాయి. వీటిలో పనిచేసేవారు ఎక్కువగా పేదలే ఉంటున్నారు. వీరు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వస్తుంటారు. కోర్టుల చుట్టూ తిరగడానికి వీరి దగ్గర డబ్బులు కూడా ఉండవు.

ఈ విషయంలో మరిన్ని వివరాల కోసం దిల్లీ మహా నగరపాలక సంస్థలోని కార్మిక కమిషనర్, కేంద్ర కార్మిక శాఖ అధికారులను బీబీసీ సంప్రదించింది. అయితే, వార్త రాసే సమయానికి ఎలాంటి స్పందనా రాలేదు.

అగ్ని ప్రమాదంలో రాకేశ్ కుమార్ ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు
ఫొటో క్యాప్షన్, అగ్ని ప్రమాదంలో రాకేశ్ కుమార్ ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు

‘‘మాకు న్యాయం కావాలి’’

రాకేశ్ కుమార్ ఒక్కోసారి నిద్రలో మధ్యలో లేచి అరుస్తుంటారు. దిల్లీ ఫ్యాక్టరీ ప్రమాదంలో తన ముగ్గురు కుమార్తెలను ఆయన కోల్పోయారు. ఒక్కొక్కరు నెలకు రూ.8000 వేతనం కోసం ఆ ముగ్గురు అమ్మాయిలు అక్కడ పనిచేసేవారు.

‘‘నా కుమార్తెలు నరకాన్ని చూసి ఉంటారు’’అని ఆయన బీబీసీతో అన్నారు.

అగ్ని ప్రమాదం తర్వాత వారికి ఏం జరిగిందో తెలియడానికి రోజుల సమయం పట్టింది. బాగా కాలిపోయిన మృతదేహాలను గుర్తుపట్టేందుకు డీఎన్ఏ పరీక్షల కోసం రావాలని పోలీసులు పిలిచినప్పుడు వారికి పరిస్థితి అర్థమైంది. ప్రమాదానికి నెల రోజుల తర్వాత తన ముగ్గురు కుమార్తెలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

‘‘వారిని న్యాయం జరగాలి’’అని కుమార్ అన్నారు.

ఈ కేసులో ఐదుగురి నిందితులపై ఆగస్టులో దిల్లీ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. నిర్లక్ష్యం వల్ల మృతి, హత్య తదితర ఆరోపణలు వారిపై మోపారు.

దిల్లీ చుట్టుపక్కల చాలా ఫ్యాక్టరీల్లో నిబంధనల పరిస్థితి ఇలానే ఉంటుందని, కానీ ఎప్పుడోకానీ, అధికారులు చర్యలు తీసుకోరని దిల్లీకి చెందిన కార్మిక సంఘం నాయకుడు రాజేశ్ కశ్యప్ అన్నారు.

చాలా పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించిన కేసుల విచారణ కోర్టులలో ఏళ్లపాటు జరుగుతుందని, నిందితులు మాత్రం త్వరగానే జామీనుపై బయటకు వచ్చేస్తారని కశ్యప్ వ్యాఖ్యానించారు.

దిల్లీలోని గత ఐదేళ్లలో మొత్తంగా 663 పారిశ్రామిక ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఐదేళ్లలో మొత్తంగా 245 మంది ఈ ప్రమాదాల్లో మరణించారని, ఈ కేసులకు సంబంధించి 84 మంది అరెస్టు చేశారని వివరించారు.

అయితే, ఈ కేసుల్లో విచారణ సవ్యంగా జరగడంలేదని కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ఆరోపణలపై దిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘నిందితులపై సత్వరమే చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నాం’’అని అన్నారు. అయితే, ఫొరెన్సిక్ ఆధారాలు, సాంకేతిక నిపుణుల విశ్లేషణలు రావడం ఆలస్యం కావడంతో కొన్ని కేసుల్లో జాప్యం చోటుచేసుకుంటోందని వారు అంగీకరించారు.

సంగీత రాయ్
ఫొటో క్యాప్షన్, సంగీత రాయ్

పరిహారం ఎలా?

ఇలాంటి ప్రమాదాల్లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలతో బీబీసీ మాట్లాడింది. ఈ కుటుంబాలు చాలావరకు ప్రమాదంలో ఇంటి యజమానిని కోల్పోయాయి.

అయితే, కొన్ని చట్టపరమైన చిక్కులు, అవరోధాల వల్ల కంపెనీల నుంచి పరిహారం రావడం ఆలస్యం అవుతోందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.

ఇలాంటి కేసులు పరిష్కారం అయ్యేందుకు ఏళ్ల సమయం పడుతుందని సీనియర్ న్యాయవాది ఒకరు బీబీసీతో చెప్పారు.

కొన్ని కేసుల్లో బాధిత కుటుంబాలకు తామే పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీంతో ఆ కంపెనీల చుట్టూ బాధితులు తిరగకుండా ప్రభుత్వం ఇచ్చేది తీసుకొని వెళ్లిపోతుంటారు.

మరోవైపు ఈ కేసుల్లో కోర్టు తీర్పు వచ్చే సమయానికి ఆ బాధిత కుటుంబాలు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతుంటాయి.

‘‘నిజానికి కార్మికులకు న్యాయ వ్యవస్థపై అంత నమ్మకం ఉండదు. ఎందుకంటే ఇది సుదీర్ఘ, క్లిష్టతరమైన ప్రక్రియ. అందుకే వారికి అప్పటికప్పుడు వచ్చిన పరిహారాన్ని ప్రభుత్వం నుంచి తీసుకొని వారు అక్కడి నుంచి వెళ్లిపోతారు’’అని కార్మికుల కోసం పనిచేస్తున్న ప్రజా సంఘం నాయకుడు చందన్ కుమార్ అన్నారు.

దిల్లీలోని 2018లో 17 మంది మృతి చెందిన అగ్ని ప్రమాదానికి చెందిన బాధిత కుటుంబాలను కలిసేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, వీరంతా ఇప్పుడు దిల్లీని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు.

ఇలాంటి ప్రమాదాలకు బాధితులైన మిగతావారి పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది.

అమృత్‌సర్‌లో అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

మూడేళ్ల క్రితం తన కంపెనీలో అట్టలు కత్తిరించే మెషీన్‌పై పనిచేస్తుండగా 50ఏళ్ల సంగీత రాయ్ తన చేయిని కోల్పోయారు. అయితే, తన కంపెనీ నుంచి ఆమెకు ఎలాంటి పరిహారం లభించలేదు. మరోవైపు క్షతగాత్రులైన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే పింఛను మంజూరు కోసం ఆమె మూడేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.

పారిశ్రామిక ప్రమాదాల వల్ల గాయపడిన కార్మికులకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. అయితే, స్వచ్ఛంద సంస్థ ‘‘సేఫ్ ఇన్ ఇండియా ఫౌండేషన్’’ సమాచారం ప్రకారం.. ఉత్తర భారత దేశంలోని వాహనాల విడి భాగాలు తయారుచేసే పరిశ్రమల్లో 2016 నుంచి 2022 మధ్య ఇలాంటి తీవ్రమైన ప్రమాదాలు 3,955 చోటుచేసుకున్నాయి. వీటిలో 70 శాతం కేసుల్లో బాధితులు తమ చేతి వేళ్లు లేదా పూర్తిగా చేతులను కోల్పోయారు.

దక్షిణాసియాలో వాహనాలను తయారీచేస్తున్న ప్రముఖ దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ రంగంలో దాదాపు కోటి మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, చాలా తయారీ ప్రక్రియలను ఒప్పంద కార్మికులతో చేయిస్తున్నారు. లేదా చిన్న చిన్న సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చేస్తున్నారు.

దీంతో చాలా రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు పూర్తిగా వెలుగులోకి రావడం లేదని సామాజిక ఉద్యమకారుడు సందీప్ సచ్‌దేవ చెప్పారు.

వీడియో క్యాప్షన్, సికింద్రాబాద్ క్లబ్‌‌లో భారీ అగ్ని ప్రమాదం

భవిష్యత్ కోసం ఆందోళన

భారత్‌లో కార్మిక చట్టాలను సవరిస్తూ నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకొచ్చారు. వీటిలో కార్మికుల భద్రత, ఆరోగ్యం, పనిచేసే పరిస్థితులకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.

అయితే, ఈ కోడ్‌లతో కార్మికులకు మరింత అన్యాయం జరుగుతుందని కొందరు సామాజిక హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.

ఇదివరకు పది కంటే ఎక్కువ మంది ఉద్యోగులుంటే భద్రతా కమిటీ ఏర్పాటుచేయాలని చట్టాల్లో నిబంధనలు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్యను 250కి పెంచారు.

2016 ఆర్థిక గణాంకాల ప్రకారం.. వ్యవసాయ కంపెనీల్లో 1.66 శాతం, తయారీ కంపెనీల్లో 2 శాతం, నిర్మాణ సంస్థల్లో 1.25 శాతం సంస్థలు మాత్రమే పది మంది కంటే ఎక్కువ మందిని విధుల్లోకి తీసుకుంటున్నాయి. అంటే ఇక్కడ చాలా సంస్థలు పది కంటే తక్కువ మందితోనే పనిచేస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి.

వీడియో క్యాప్షన్, ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి

మరోవైపు మొత్తం కార్మికుల్లో 90 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.

చాలా సంస్థలు శాశ్వత ఉద్యోగులకు బదులుగా ఒప్పంద కార్మికులను తీసుకుంటున్నాయి. ఫలితంగా కార్మికుల హక్కులు మరింత నీరుగారిపోతున్నాయని కార్మిక హక్కుల ఉద్యమకర్త సుధా భరద్వాజ్ అన్నారు.

ఎలాగైనా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకునే వారు కార్మిక సంఘాలను ఆశ్రయించే ధైర్యం చేయలేకపోతున్నారని సుధ వివరించారు.

మరోవైపు కార్యాలయాల్లో తనిఖీలకు సంబంధించిన ప్రోటోకాల్స్‌లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం కార్మిక అధికారులపై తనిఖీలు, నిబంధనల అమలు పర్యవేక్షణ బాధ్యతలు ఉన్నాయి. అయితే, కొత్త కోడ్‌లు అమలులోకి వచ్చిన తర్వాత వీరు కేవలం మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఫలితంగా సంస్థలకు మరింత అనుకూలంగా ఉంటుంది.

‘‘క్రమంగా కార్మికుల భద్రత అనే బాధ్యత ఎవరి భుజాలపైనా ఉండకుండా పోతోంది’’అని కార్మిక హక్కుల ఉద్యమకారుడు సిద్ధేశ్వర్ ప్రసాద్ శుక్ల వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)