రిలయన్స్ జియో: టెలికాం కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతుంటే 'జియో'పై కాసుల వర్షం ఎలా?

రిలయన్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ
    • రచయిత, దినేష్ ఉప్రేతి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ టెలికాం వ్యాపారంలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్నారు.

అదే వ్యాపారంలో ఉన్న ఆయన తమ్ముడు అనిల్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా మాత్రం నష్టాల్లో కూరుకుపోయారు.

139 కోట్లకు పైగా జనాభా, పేదా గొప్పా తేడా లేకుండా దాదాపు అందరి చేతుల్లోకీ మొబైల్ ఫోన్లు, రోజు రోజుకూ అబివృద్ధి చెందుతున్న టెక్నాలజీ... ఇన్ని హంగులున్న అతి పెద్ద టెలికాం మార్కెట్‌లో లాభాలు ఆర్జించాలనే ఆశ ఎవరికి ఉండదు?

గత నాలుగేళ్లల్లో ఈ భారతీయ మార్కెట్ ముకేశ్ అంబానీ 'రిలయన్స్ జియో' నెట్‌వర్క్‌కు లాభాల పంట పండించింది.

కానీ, నాణేనికి మరోవైపు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కాం)తో ఇదే టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన అనిల్ అంబానీ, వోడాఫోన్ ఇండియా ప్రమోటర్ కుమార్ మంగళం బిర్లా మాత్రం పీకల్లోతు నష్టాల్లో ఉన్నారు.

నష్టాల్లో ఉన్న బిర్లా గ్రూప్‌కు చెందిన 'ఐడియా' మొబైల్ నెట్‌వర్క్ కొన్నేళ్ల క్రితం బ్రిటిష్ కంపెనీ 'వోడాఫోన్‌'తో చేతులు కలిపి మళ్లీ టెలికాం రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ విజయం దానికి అందని ద్రాక్షే అయింది.

వైర్‌లెస్ వ్యాపారంలో దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉన్న ఈ కంపెనీ, బ్యాంకులకు వేల కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది. అంతే కాక, రూ.58 వేల కోట్ల ప్రభుత్వ రుణాలు (లయబిలిటీస్) కూడా దీని నెత్తిన ఉన్నాయి. అవి కూడా అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) రుణాలు.

తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా

కొంప ముంచిన ఏజీఆర్ రుణాలు

భారత ప్రభుత్వం, టెలికాం కంపెనీల మధ్య ఏజీఆర్‌కు సంబంధించి చాలా కాలంగా వివాదం నడుస్తోంది.

టెలికాం కంపెనీలు ఆర్జించే మొత్తంలో కొంత భాగం ఫీజుల రూపంలో టెలికాం విభాగానికి చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) అంటారు.

ఏజీఆర్ నిర్వచనానికి సంబంధించి 2005 నుంచీ ప్రభుత్వం, టెలికాం కంపెనీల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.

టెలికాం వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఇందులో లెక్కించాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. కానీ, ప్రభుత్వం దీనిని విస్తృత పరిధిలో చూస్తోంది.

ఆస్తుల విక్రయం, డిపాజిట్లు లాంటి టెలికాం వ్యాపారేతర లావాదేవీల్లో వచ్చే వడ్డీని కూడా అందులో పరిగణించాలని ప్రభుత్వం చెబుతోంది.

ఈ వివాదం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. కోర్టు ప్రభుత్వ పక్షం వహిస్తూ టెలీకాం కంపెనీలు ఏజీఆర్ చెల్లించాల్సిందేనంటూ తీర్పు ఇచ్చింది.

దీంతో, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా వేరే దారి లేక, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్‌లో తన ప్రమోటర్ వాటా 27 శాతం వదులుకోవడానికి సిద్ధపడ్డారు.

ఈ సమస్యపై కుమార్ మంగళం బిర్లా జూన్‌లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు లేఖ రాశారు. ఉనికిని కాపాడుకోడానికి కంపెనీలో తన వాటాను ఏదైనా ప్రభుత్వ లేక దేశీయ ఫైనాన్షియల్ కంపెనీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

అయితే, బిర్లా వాటా మొత్తం అమ్మేసినా కూడా ప్రభుత్వ రుణాలు సగం కూడా తీరవు. ఎందుకంటే ప్రస్తుతం ఈ కంపెనీ మూలధన మార్కెట్ విలువ సుమారు రూ. 24 వేల కోట్లు మాత్రమే ఉంది.

కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులను విశ్వాసంలోకి తీసుకోవాలని కుమార్ మంగళం బిర్లా అన్నారు.

వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌ను దేశంలోని 27 కోట్ల మంది ప్రజలు వాడుతున్నారు.

అధికారిక గణాంకాల ప్రకారం, వోడాఫోన్ ఇండియాపై ఉన్న ఏజీఆర్ రుణాలు మొత్తం రూ.58,254 కోట్లు. ఇందులో కంపెనీ ఇప్పటికే రూ.7,854 కోట్లు చెల్లించింది. ఇంకా దాదాపు రూ. 50,399 కోట్ల బకాయిలు ఉన్నాయి.

కుమార్ మంగళం బిర్లా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కుమార్ మంగళం బిర్లా

కంపెనీలు ఎందుకు లాభాలు ఆర్జించలేకపోతున్నాయి?

భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐడియా కంపెనీలు భారత టెలికాం రంగంలోకి దూసుకువచ్చాయి. ఇవి కాకుండా, ప్రభుత్వ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మొదటి నుంచీ ఉన్నాయి. ఈ రంగం అభివృద్ధి చెందుతున్నకొద్దీ టెలికాం కంపెనీల పంట పండాలి. కానీ, అలా జరగలేదు.

టెలికాం రంగం దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ, ధరల యుద్ధం, ఖరీదైన స్పెక్ట్రమ్, రోజురోజుకూ అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీ, నిర్వహణ లోపాలు ఈ కంపెనీల ఆర్థిక పరిస్థితిని దిగజార్చాయి.

"ఈ రంగంలోనే కొన్ని సమస్యలున్నాయి. ప్రభుత్వ నియమాలు, నియంత్రణ సక్రమంగా లేకపోవడంతో కొన్ని కంపెనీలు సమస్యలను ఎదుర్కుంటుంటే, కొన్ని లాభపడ్డాయి. అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వివక్ష పాటించిందని మాత్రం చెప్పలేం" అని టెలికాం రంగ నిపుణులు మహేశ్ ఉప్పల్ అన్నారు.

"రిలయన్స్ జియోతో సహా ఇతర రంగాల్లో కూడా వ్యాపారాలు కలిగి ఉన్న కంపెనీలు చాలా కాలం నష్టాలను భరించాయి. అయితే, జియో కాల్ రేట్లు, డేటా రేట్లు తగ్గించి ఇతర కంపెనీలపై ఒత్తిడి తెచ్చింది. దానివల్ల, నష్టాల్లో ఉన్నా కూడా ప్రత్యర్థులు ధరలను పెంచలేకపోయారు. ధర పెంచితే కస్టమర్లు తమ సర్వీస్ వదిలి వెళిపోతారనే భయం ఏర్పడింది" అని ఆయన వివరించారు.

జియోకే లాభాలు ఎందుకిలా

ఫొటో సోర్స్, Getty Images

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కూడా ఈ రంగంలో కొత్తగా అడుగుపెట్టిన కంపెనీలకు లాభదాయకంగా మారిందని నిపుణులు భావిస్తున్నారు.

"మొబైల్ నంబర్ పోర్టబిలిటీ వలన లాభం ఏమిటంటే, కస్టమర్లు మొబైల్ నంబర్ మార్చకుండానే ఏ కంపెనీలో తక్కువ ధరకు మెరుగైన కమ్యూనికేషన్ సేవలు అందిస్తోందో దానికి మారవచ్చు. మిగతా కంపెనీలు 2జీ, 3జీ నెట్‌వర్క్‌లు నడుపుతుంటే, జియో, 4జీ టెక్నాలజీ సేవలనే అందించింది. అందుకే ఆ కంపెనీ కాల్ రేట్లు తక్కువగా ఉన్నాయి."

కంపెనీలు ప్రభుత్వ రుణాలకు సంబంధించిన సమస్యల్లో చిక్కుకోవడానికి కారణం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు.

"వివిధ టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టబద్ధమైన పోరాటాన్నే నమ్ముకున్నాయి. ఒకవేళ వారు ఏజీఆర్‌ను పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తే, ఎలా చెల్లిస్తారనే దానిపై సరైన ప్రణాళికలను రూపొందించుకోలేదు" అని ఉప్పల్ అన్నారు.

నియమ నిబంధనల కన్నా కంపెనీల నిర్వహణ లోపాలే వాటికి శాపంగా మారాయని మరో నిపుణుడు మనోజ్ గరోలా అభిప్రాయపడ్డారు.

"ఈ రంగంలో నిజంగానే సమస్య ఉంటే ఎయిర్‌టెల్, జియో లాభాలెలా ఆర్జించగలుగుతున్నాయి? అయితే, 2జీ, 3జీ స్పెక్ట్రమ్‌‌లపై ఏజీఆర్ భారం లేనప్పుడు జియో ఈ రంగంలో ప్రవేశించిందన్నమాట వాస్తవమే. కానీ, అది ముందుచూపుతో నెట్‌వర్క్, టెక్నాలజీలపై భారీ పెట్టుబడులు పెట్టింది" అని గరోలా అన్నారు.

జియో

ఫొటో సోర్స్, Getty Images

జియో లాభాలు ఎయిర్‌టెల్ కంటే 10 రెట్ల కన్నా ఎక్కువ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రిలయన్స్ జియో రూ. 3,651 కోట్ల లాభాలను ఆర్జించింది. భారతీ ఎయిర్‌టెల్ రూ. 284 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

మరోవైపు, మొదటి త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా కంపెనీకి రూ. 7,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

నిర్వహణ లోపాలు లేని కంపెనీలే లాభాలను ఆర్జిస్తున్నాయని, మిగతావి చతికిలబడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ కంపెనీలు ఎలాగూ ప్రయివేటు సంస్థలతో పోటీ పడవు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లు 4జీ స్పెక్ట్రమ్ వేలంలో కూడా పాల్గొనలేదు.

టెలికాం రంగంలో కింగ్ రిలయన్స్ జియో

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, టెలికాం రంగంలో కింగ్ రిలయన్స్ జియో

ముకేశ్ అంబానీకి లాభాల పంట

2019 వరకు రిలయన్స్ జియోకు 35 కోట్ల మంది వినియోగదారులే ఉండేవారు. వోడాఫోన్ ఐడియా నష్టాల్లోకి జారుకోవడం జియోకు కలిసొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2022 నాటికి జియో లాభాలు రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నారు. అప్పటికి దాని వినియోగదారుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు.

బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌లో ప్రస్తుతం జియో 54 శాతం మార్కెట్‌ను ఏలుతోంది. మొబైల్ సబ్‌స్క్రైబర్లలో దాని వాటా అన్నిటికంటే ఎక్కువగా 35 శాతం ఉంది.

ముకేశ్ అంబానీ, తన ఫ్లాగ్‌షిప్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కిందే రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టారు. నాలుగేళ్లల్లో ఈ రంగం ఎంత లాభదాయకమో నిరూపించారు.

"ముకేశ్ అంబానీ వ్యూహం గట్టిది. ఆయన మొదటే జియో టెక్నాలజీ, నెట్‌వర్కింగ్‌‌లపై కోట్ల పెట్టుబడి పెట్టారు. ఫలితంగా 30 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు ఆయన కంపెనీలోకి వచ్చి చేరాయి" అని గరోలా అన్నారు.

రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెడుతున్న వారిలో ఫేస్‌బుక్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, కేకేఆర్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ముఖేష్ అంబానీ వ్యూహం ఒక్క దెబ్బతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణాల నుంచి పూర్తిగా బయటపడేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)