మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?

డార్క్ చాక్లెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డార్క్ చాక్లెట్
    • రచయిత, జెస్సికా బ్రాడ్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చాక్లెట్ మన ఆరోగ్యానికి మంచిది కాదని చాలా కాలంగా చెప్తూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..చాక్లెట్ ఎంత ముదురు రంగులో ఉంటే..మన ఆరోగ్యానికి అంత ఎక్కువ మేలు చేస్తాయని పరిశోధనల్లో తేలింది.

మనుషులు వందల ఏళ్లుగా ఏదో ఒక రూపంలో చాక్లెట్‌ను తింటూనే ఉన్నారు. ఈ చాక్లెట్ చాలా కాలం పాటు కోకో బీన్స్ నుండి తయారైన కోకో ద్రవం రూపంలో ఉండేది.

ఆ తర్వాత కొన్ని సంస్కృతుల్లో ఈ కోకో ద్రవానికి చక్కెర, పాలు జోడించటం.. అందంగా ప్యాక్ చేయటం మొదలైంది. అయితే, ఇప్పటికీ కోకోను సంప్రదాయకమైన ద్రవ రూపంలో తినే వారు..చాక్లెట్ వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందా అనే చర్చను రేకెత్తించారు.

''ఉదాహరణకు పనామాలోని శాన్ బ్లాస్ దీవులలో నివసించే కునా ఇండియన్లకు రక్తపోటు తక్కువగా ఉంటుంది. వారిలో వయస్సుతో పాటు ఈ రక్తపోటు పెరగదు కూడా. అంతేకాదు..వీరిలో గుండెపోటు, మెదడు పోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి జబ్బులు కూడా చాలా తక్కువగానే కనిపిస్తాయి. వారు ఆరోగ్యంగా వృద్ధాప్యంలో చనిపోతుంటారు'' అని అమెరికన్ క్యాన్సర్ సొసైటీలో ఎపిడెమియాలజీ రీసెర్చ్ విభాగంలో సీనియర్ సైంటిఫిక్ డైరెక్టర్‌గా ఉన్న మార్జి మెక్కల్లౌ చెప్తున్నారు.

అంతేకాదు..ఉప్పు అధికంగా ఉపయోగించటం వల్ల రక్తపోటు పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయంతో చెప్తుంటారు. కానీ.. శాన్ బ్లాస్ దీవుల్లో ఆరోగ్యంగా జీవించే కునా ఇండియన్లు.. ఓ సగటు అమెరికా వ్యక్తి ఉపయోగించేంత మోతాదులోనే ఉప్పు తీసుకుంటారు.

అసలు ఈ కునా ఇండియన్లు వారు రోజు వారీగా తినే ఆహారాలు ఏమిటనేది కచ్చితంగా తెలుసుకోవడానికి మెక్కల్లో వారిని సందర్శించారు. వారు ప్రతి రోజూ సగటున నాలుగు కప్పుల కోకో ద్రవాన్ని - కొంత నీరు, కొద్దిగా చక్కెర కలుపుకుని తాగుతారని ఆమె కనుగొన్నారు.

కానీ కునా ఇండియన్ల పటిష్ట ఆరోగ్యానికి, వారు తాగే కోకో ద్రవమే కారణమని మెక్కల్లో నిర్దిష్టంగా ఆపాదించలేదు. ఎందుకంటే.. వారు సగటు అమెరికన్ తీసుకునే ఆహారంకన్నా రెండు రెట్లు ఎక్కువ పండ్లు, నాలుగు రెట్లు ఎక్కువ చేపలు కూడా తింటారు.

పైగా పశ్చిమ దేశాలలో సాధారణ జీవనశైలితో పోలిస్తే.. కునా ఇండియన్ల జీవనశైలి మరింత ఎక్కువ క్రియాశీలంగా ఉంటుంది. అంటే వారు మరింత ఎక్కువగా శారీరక శ్రమ చేస్తుంటారు.

డార్క్ చాక్లెట్ వల్ల గుండెకు గల ప్రయోజనాల గురించి ఇంకా అనేక ఇతర అధ్యయనాలు కూడా నిర్వహించారు. అయితే అవి నిష్పక్షపాతంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే చాక్లెట్ ఎక్కువగా తినే వ్యక్తులకు తమ శరీర బరువు గురించి ఆందోళన తక్కువగా ఉంటుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో మెడిసిన్ ప్రొఫెసర్ జోఆన్ మాన్సన్ చెప్పారు. వారు కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు.

శాన్ బ్లాస్ ద్వీపం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శాన్ బ్లాస్ ద్వీపం

పరిశోధనల్లో ఏం తేలింది?

ఒక అధ్యయనంలో, పరిశోధకులు 20,000 మంది ఆహారాన్ని, వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. రోజుకు 100గ్రాముల చాక్లెట్ - మిల్క్ చాక్లెట్‌తో సహా - తినే వారిలో.. గుండె జబ్బులు, మెదడు పోటు (స్ట్రోక్) ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశాన్ని ప్రభావితం చేసే ధూమపానం, వ్యాయామం వంటి ఇతరత్రా కారణాలను కూడా వారు పర్యవేక్షించారు. అయితే ఈ ముప్పు తక్కువగా ఉండటానికి చాక్లెట్ కాకుండా ఇతర అంశాలు కూడా ఉండి ఉండవచ్చునని సదరు పరిశోధకులు చెప్పారు.

ఆ తర్వాత.. భారీ స్థాయి క్లినికల్ ప్రయోగం ఒకటి నిర్వహించారు. అందులో ఆహారం, జీవనశైలి వంటి ఇతర అంశాలను నియంత్రిస్తూ అధ్యయనం చేశారు. కోకోలో ఉండే అధిక స్థాయి ఫ్లేవనాయిడ్ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చుననే అంచనాతో ఈ అధ్యయనం చేపట్టారు. బెర్రీలు, తేయాకులో కూడా ఈ ఫ్లేవనాయిడ్లు ఉంటాయి.

ఈ కోకో సప్లిమెంట్ అండ్ మల్టీవిటమిన్ ఔట్కమ్స్ స్టడీని 21,000 మంది మీద నిర్వహించారు. రోజుకు 400 మిల్లీ గ్రాముల నుంచి 500 మిల్లీ గ్రాముల వరకూ కోకో ఫ్లేవనాల్ సప్లిమెంట్లు తీసుకోవటం వల్ల..శరీరంలో రక్తపోటు, ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి సదరు వ్యక్తి గుండె జబ్బుతో మరణించే ప్రమాదం కూడా తగ్గుతుందని ఈ అధ్యయనంలో గుర్తించారు.

వివిధ చాక్లెట్ బ్రాండ్లలో ఆ కోకోను పండించడం, తయారీ చేయటం, శుద్ధి చేసే ప్రక్రియల్లో తేడాల కారణంగా.. ఆ చాక్లెట్లలోని ఫ్లేవనాయిడ్ల మోతాదులో తేడాలు ఉండొచ్చు. కాబట్టి శాస్త్రవేత్తలు నిజం కోకోకు బదులుగా సప్లిమెంట్లను ఉపయోగించారని ఈ అధ్యయన సారథి మాన్సన్ చెప్పారు.

డార్క్ చాక్లెట్‌లో టీ (తేయాకు) కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఫ్లేవనాయిడ్లు ఉండవచ్చు. అయితే తయారీ ప్రక్రియలో ఫ్లేవనాల్ మోతాదు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

వీడియో క్యాప్షన్, అరకు కాఫీకి వందేళ్లు..

అందువల్ల..ఏవైనా ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే ఎంత మోతాదులో కోకో ఫ్లేవనాల్స్ అవసరమనే అంశం మీద ప్రస్తుతం శాస్త్రవేత్తల్లో ఏకాభిప్రాయం లేదని.. యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో పోషకాహారం, ఆహార శాస్త్రం ప్రొఫెసర్ గుంటర్ కున్లే చెప్పారు.

రోజుకు సుమారు 200 మిల్లీగ్రాముల కోకో ఫ్లేవనాయిడ్లు, లేదా 10గ్రాముల డార్క్ చాక్లెట్ తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుందని యూరోపియన్ ఫుడ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) చెబుతోంది. తాజా సమాచారం సూచిస్తున్నట్లుగా.. రోజుకు 500 మిల్లీగ్రాముల డార్క్ చాక్లెట్‌తో మన ఆరోగ్యానికి మేలు జరగవచ్చు. అది దాదాపుగా ఒక చిన్న 30 గ్రాముల చాక్లెట్ బార్‌తో సమానం.

"చాక్లెట్‌లలో ఫ్లేవనాల్ మోతాదును పెంచటం వల్ల అవి 'ఆరోగ్యకరమైన ఆహారం'గా మారతాయని నేను అనుకోను" అని కున్లే పేర్కొన్నారు.

డార్క్ చాక్లెట్‌లో మనకు అంతగా తెలియని మరో పదార్థం కూడా ఉంటుంది. కాఫీ మొక్కలో కూడా కనిపించే థియోబ్రోమిన్ అనే మూలకం ఈ డార్క్ చాక్లెట్‌లోనూ ఉంటుంది.

థియోబ్రోమిన్ అనేది ఒక సైకోయాక్టివ్ పదార్ధం. కెఫీన్ కుటుంబానికి చెందిన పదార్థం. అయితే ఇది కెఫీన్ కంటే "మృదువైన అనుభూతి"ని ఇస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్‌లో అప్లైడ్ సైకాలజీ ప్రొఫెసర్ క్రిస్ ఆల్ఫోర్డ్ చెప్పారు. చాక్లెట్ ఎంత ముదురు రంగులో ఉంటే.. అంత మృదువుగా ఆ అనుభూతి ఉంటుంది.

"మనం డార్క్ చాక్లెట్ ఎక్కువగా తింటున్నట్లయితే.. మనం నిజమైన అనుభూతి పొందవచ్చు. కెఫీన్ అనుభూతి కన్నా కూడా థియోబ్రోమిన్ అనుభూతి చాలా బాగా ఉండవచ్చు" అని ఆయన చెప్పారు.

చాక్లెట్ వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని ఆందోళన చెందుతున్న వారు.. వాస్తవానికి ఆ చాక్లెట్ కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని పరిశోధకులు చెప్తున్నారు.

డార్క్ చాక్లెట్‌లో సాధారణంగా చక్కెర కూడా ఉంటుంది. అయితే దీనిని నివారించడానికి ఒక మార్గం ఉంది. మిల్క్ చాక్లెట్‌లో కనిపించే నిష్పత్తి కంటే అధిక శాతం కోకో ఉన్న చాక్లెట్‌ను ఎంచుకోవడం.

డార్క్ చాక్లెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డార్క్ చాక్లెట్

చాక్లెట్ చీకటి కోణం

కోకో ఫ్లేవనాల్ సప్లిమెంట్ల ప్రభావాలను పరీక్షల్లో.. డార్క్ చాక్లెట్‌లోని ఇతర పదార్థాలైన చక్కెర, సాచురేటెడ్ ఫ్యాట్ ప్రభావాలను పరీక్షించలేదు. డార్క్ చాక్లెట్‌లో సాధారణంగా కోకో బటర్ ఉంటుంది. ఇందులో.. గుండె జబ్బుల ప్రమాదం పెరగటానికి కారణమని భావించే సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.

"చాక్లెట్‌లోని కొవ్వులన్నీ కోకో బటర్లో ఉంటాయి. అయితే కొలెస్ట్రాల్‌ను స్టెరిక్ యాసిడ్ నిర్వీర్యం చేస్తుందని ఆధారాలు చెబుతున్నాయి. కానీ.. కోకో బటర్‌లో మూడో వంతు సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అది ఆరోగ్యానికి హానికరం" అని బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్స్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఏడిన్ కాసిడీ చెప్పారు.

గుండె జబ్బులను దూరంగా ఉంచటానికి చాక్లెట్ తినవచ్చునని పరిశోధకులు స్పష్టంగా సిఫారసు చేయనప్పటికీ.. డార్క్ చాక్లెట్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుందని, గుండె ఆరోగ్యానికి అది మేలు చేస్తుందని బలమైన ఆధారాలు ఉన్నట్లు ఒక అధ్యయన పత్రం నిర్ధారించింది.

అలాగే.. డార్క్ చాక్లెట్‌ను కొద్ది మోతాదులో తినడం.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అధిగమించడానికి దోహదపడుతుందని ఆస్టన్ మెడికల్ స్కూల్లో డైటీషియన్ డువాన్ మెల్లర్ చెప్పారు.

''చిన్న మోతాదులో చాక్లెట్ తినటం హానికరం కాదు. మనం కొద్ది మొత్తంలో చాక్లెట్ తిని ఆనందించవచ్చు. అపరాధ భావమూ ఉండదు'' అంటారు. అందులో ఉండే చేదు రుచివల్ల దాని మోతాదు ఆటోమేటిక్‌గా పరిమితమవుతుంది" అని పేర్కొన్నారు.

సమస్య ఏమిటంటే.. చాక్లెట్ బార్‌లో కోకో ఫ్లేవనాయిడ్ మోతాదు ఎంత ఎక్కువగా ఉంటే, దాని రుచి అంత ఎక్కువ చేదుగా ఉంటుంది. దాని మార్కెట్ కూడా తక్కువగా ఉంటుంది.

"కోకోలో మేలైన పదార్థాలకు.. దానిని మనం తిని ఆనందించేలా చేయడానికి అందులో కలిపే పదార్థాలకు మధ్య ఘర్షణ ఉంటుంది" అని మెల్లర్ చెప్పారు.

మరింత సంక్లిష్టమైన అంశం ఏమిటంటే.. చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్లను మన శరీరం మరింత సులభంగా స్వీకరించటానికి.. అందులోని కొవ్వు, చక్కెర సాయపడతాయి.

"ఈ ఫ్లేవనోల్స్ కొన్ని సంక్లిష్ట సేంద్రియ సమ్మేళనాలు. అవి మనకు అందేలా చేసే ఒక మార్గం ఏమిటంటే.. వాటికి చక్కెరను అంటించటం" అని మెల్లర్ పేర్కొన్నారు.

అయితే, మనకు ఎంత మోతాదులో కోకో ఫ్లేవనాల్స్ అందుతున్నాయో తెలుసుకోగలిగే మార్గం కూడా ఇప్పటి వరకూ ఏదీ లేదు.

"చాక్లెట్ అనేది ఆరోగ్యకరమైన ఆహారం కాదు. చాలా చాక్లెట్లలో ఉండే చక్కెర, కొవ్వు పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఆ చాక్లెట్లను అతిగా తినడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలతో పోలిస్తే ఫ్లేవనాల్స్ వల్ల లభించే ప్రయోజనం ఏదైనా ఉన్నా చాలా తక్కువగా ఉంటుంది" అని కున్లే పేర్కొన్నారు.

కోకో ఫ్లేవర్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందన్నదానిపై స్పష్టత లేదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోకో ఫ్లేవర్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందన్నదానిపై స్పష్టత లేదు

రుచి కోసం అన్వేషణ

ఆరోగ్య ప్రయోజనాల కంటే రుచిని కాపాడటం మీద ఎక్కువ దృష్టి సారించి..కోకో గింజను నేరుగా చాక్లెట్‌లోకి తీసుకువస్తూ.. కోకో మోతాదు ఎక్కువగా గల చాక్లెట్ బార్లను ఉత్పత్తి చేసే చిన్న కంపెనీలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

అయితే కోకో బీన్ రుచిని సంరక్షించే ప్రక్రియ వల్ల.. ఆరోగ్యకరమైన చాక్లెట్ తయారైతే?

పసిఫిక్‌లోని సోలమన్ దీవుల్లో పండించే కోకో గింజలను.. అవి సరిగ్గా పక్వానికి వచ్చిన సమయంలో సేకరిస్తారని.. ఫైర్ట్రీ చాక్లెట్ సహ వ్యవస్థాపకుడు మార్టిన్ ఓడేర్ చెప్పారు.

ఆ తర్వాత రైతులు కోకో గింజలను ఆరు రోజుల పాటు పులియబెట్టి, అనంతరం ఎండబెడతారు. అలా ఎండబెట్టిన కోకో గింజల్లో కొన్నింటిని బ్రిటన్‌లో ఫైర్‌ట్రీ సంస్థకు పంపిస్తారు. అక్కడ వాటిని వేయిస్తారు.

మొదట వాస్తవంగా ఇలాగే జరిగేదని, కానీ 20వ శతాబ్దం ప్రారంభంలో పరిస్థితులు మారాయని ఓ'డేర్ పేర్కొన్నారు.

''చాక్లెట్ కంపెనీలు రైతులు పండించే రెండు పంటలపై ఆధారపడ్డాయి. ఒకటి.. నవంబర్ నుండి జనవరి వరకు పండించే ప్రధాన పంట. రెండోది.. జనవరి నుండి జూన్ వరకు పండించే మధ్య పంట'' అని ఆయన వివరించారు.

"మధ్య పంటలో కోకో గింజలు చిన్నవిగా కొద్దిగా నాసిరకంగా ఉంటాయి. తొలుత వాటిని అమ్మేవారు కాదు. ఆ తర్వాత, కంపెనీలు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయడం ప్రారంభించాయి. మంచి గింజలను తాము తక్కువ ధరకు విక్రయిస్తున్నామని రైతులు గ్రహించారు. దీంతో ప్రధాన పంటతో మధ్య పంటను కలపడం ప్రారంభించారు'' అని ఆయన తెలిపారు.

"అంటే చాక్లెట్ కంపెనీలకు వేర్వేరు పరిమాణాలున్న కోకో గింజలు వస్తున్నాయి. కోకో గింజలను వాటి పరిమాణాన్ని బట్టి వేయించే సమయం కూడా మారుతుంది. కాబట్టి కోకో కాయల పొట్టును పగలగొట్టి, లోపలి గింజలను కలిపి వేయించటం ప్రారంభించారు."

డార్క్ చాక్లెట్‌లకు పంచదార, పాలు కలపడం వల్ల మరింత ఫ్లేవర్ లభిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డార్క్ చాక్లెట్‌లకు పంచదార, పాలు కలపడం వల్ల మరింత ఫ్లేవర్ లభిస్తోంది

కోకో ను ఎలా కాలుస్తారు?

ఈ కథనం నిజమో కాదో తెలీదు కానీ.. చాక్లెట్ తయారు చేసే చిన్న కంపెనీలు.. కేవలం లోపలి గింజలను కాకుండా.. మొత్తం కోకో కాయలను కాల్చుతారని, తక్కువ వేడి మీద ఎక్కువ సేపు కాలుస్తారనేది వాస్తవం.

మనం కూరగాయలను ఎక్కువసేపు ఉడికించినట్లయితే.. అందులో మిగిలే పోషకాలు తగ్గిపోతాయని మనకు తెలుసు. డార్క్ చాక్లెట్, కోకో కాయలకు కూడా ఇది వర్తిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉంది.

చాక్లెట్‌తో పాటు అనేక రకా ఆహారాలలో మనకు ఫ్లేవనాల్స్ లభిస్తాయి. అయితే.. డార్క్ చాక్లెట్ అనేది ఆరోగ్యకరమైన ఆహారంగా సరితూగగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

"అధిక కేలరీలను నివారించినంత వరకూ..ఎక్కువ మోతాదున్న డార్క్ చాక్లెట్‌ను వారానికి కొన్నిసార్లు తీసుకోవడం సహేతుకమే. కానీ ఇది ఆరోగ్యకరమైన ఆహారమని, ఎక్కువగా తినవచ్చునని భావించరాదు'' అని మాన్సన్ చెప్పారు.

"ఆహారం ద్వారా, టీ, బెర్రీలు, ద్రాక్ష, ఇతర పండ్లతో పాటు..మితమైన అధిక కోకో చాక్లెట్‌తో ఫ్లేవనాల్స్‌ను పెంచడానికి ప్రయత్నించండి" అని ఆమె సూచించారు.

వీడియో క్యాప్షన్, 14 ఏళ్లుగా రెండుపూటలా ఇంటి వద్దకే భోజనం.. ఆకలి అంటే అన్నం వండి క్యారేజ్ పంపిస్తారు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)