ప్రధాన మంత్రి పదవికి నితీశ్ కుమార్ బరిలో ఉన్నారా? ఆయన సొంత ఊరి ప్రజలు ఏం అంటున్నారు?

నీతీశ్ కుమార్

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

    • రచయిత, విష్ణు నారాయణ్
    • హోదా, బీబీసీ కోసం

బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ తాజాగా ఎనిమిదోసారి ప్రమాణం చేశారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)తో ఆయన జతకట్టారు.

దాదాపు గత ఐదేళ్లుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలిసి రాష్ట్రంలో నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని మళ్లీ ఆర్జేడీతో కలిశారు.

ఈ కొత్త రాజకీయ సమీకరణాలతోపాటు మరోసారి నితీశ్ సీఎం పదవి చేపట్టడంపై ఆయన సొంత ఊరి ప్రజలు ఏం అనుకుంటున్నారు?

నలంద జిల్లా హరనౌత్ బ్లాక్‌లోని కల్యాణ బిగహా.. నితీశ్ సొంత ఊరు.

ఇంద్రదేశ్ ప్రసాద్ సిన్హా

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, ఇంద్రదేశ్ ప్రసాద్ సిన్హా

కల్యాణ బిగహాలోని 65ఏళ్ల ఇంద్రదేవ్ ప్రసాద్ సిన్హాను మేం కలిశాం. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన బీబీసీతో మాట్లాడారు. ''పదవి అయితే అదే కదా? ఇందులో ఏమీ మారలేదు. అలాంటప్పుడు సంతోషం లేదా దుఃఖం ఏం ఉంటాయి?''అని ఆయన వ్యాఖ్యానించారు.

''ఒక పార్టీని వదిలి వెళ్లి, మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం గురించి మీరు అడగాలని అనుకుంటే, నా అభిప్రాయం కాస్త భిన్నంగా ఉండొచ్చు. ఇదివరకు వదిలిపెట్టిన వారితోనే ప్రస్తుతం ఆయన మళ్లీ చేతులు కలిపారు. ఆనాడు ప్రస్తావించిన సమస్యలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. అయినప్పటికీ, మళ్లీ వారితోనే పొత్తు పెట్టుకున్నారు. ఇది నాకు నచ్చలేదు''అని ఇంద్రదేవ్ అన్నారు.

ఇంద్రదేవ్‌ తర్వాత మేం 75ఏళ్ల సీతారామ్ సింగ్‌ను కలిశాం.

నితీశ్ కుమార్‌కు సన్నిహితుల్లో సీతారామ్ సింగ్ కూడా ఒకరు. వీరిద్దరూ మంచి స్నేహితులని గ్రామస్థులు చెప్పారు. అయితే, సీతారామ్ మాత్రం తాను నితీశ్ సేవకుడినని చెప్పుకుంటున్నారు.

వేరే పార్టీతో కలిసి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై సీతారామ్ సింగ్‌ను బీబీసీ ప్రశ్నించింది. ''నితీశ్ చాలా నిజాయితీపరుడు. ఆయన మాటపై నిలబడతారు. డబ్బుపై ఆయనకేమీ వ్యామోహం లేదు''అని సీతారామ్ అన్నారు.

అయితే, తరచూ పార్టీలతో పొత్తులను మార్చడంపై నితీశ్ కుమార్‌ను ''పాల్తు రామ్'', ''కుర్సీ కుమార్''లాంటి పదాలతో ఆర్జేడీ నాయకులు విమర్శించేవారు. ప్రస్తుతం ఆ పార్టీతోనే నితీశ్ జతకట్టారు. దీనిపై సీతారామ్ స్పందిస్తూ.. ''ప్రజలకు నితీశ్ ఎంత సేవ చేశారో రాష్ట్రంతోపాటు దేశం మొత్తం చూసింది. నీతీశ్ కుమార్ పొత్తులు పెట్టుకుంటున్న నాయకులేమీ దొంగలు, దోపిడీదారులు కాదు. రాజకీయాల్లో విభేదాలు సహజం''అని ఆయన అన్నారు.

సీతారామ్ సింగ్

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, సీతారామ్ సింగ్

''ముఖ్యమంత్రిగా గర్వకారణం''

ప్రధాన రహదారిని వదిలిపెట్టి కల్యాణ్ బిగహా రోడ్డు గుండా మేం మరింత లోపలకు వెళ్లాం. అక్కడ ఔషధాలు విక్రయించే దుకాణం, ఇండోర్ షూటింగ్ రేంజ్ కనిపించాయి.

ఇక్కడకు సమీపంలోనే నీతీశ్ కుమార్ తండ్రి ఆయుర్వేద వైద్యుడిగా పనిచేసేవారు.

నితీశ్ పూర్వీకుల ఇంటి ముందు మాకు ఒక బోర్డు కనిపించింది. ''15ఏళ్లపాటు తిరుగులేని పాలన. బిహార్‌లో సుదీర్ఘ కాలం సీఎంగా సేవలు అందించడం మాకు గర్వకారణం''అనే వ్యాఖ్యలతో నితీశ్ బొమ్మతో ఉన్న ఒక బోర్డు కనిపించింది.

గ్రామానికి మొదట్లోనే నితీశ్ తల్లిదండ్రులు, భార్య స్మారకాలు కనిపించాయి. ముఖ్యమైన రోజుల్లో నితీశ్ కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తుంటారు.

రంజన్

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, రంజన్

''అనుభవం అలాంటిది''

నితీశ్ కుటుంబ సభ్యుల స్మారకాలకు సమీపంలో 24ఏళ్ల రంజన్‌ను మేం కలిశాం. నితీశ్ మళ్లీ సీఎం కావడాన్ని ఎలా చూస్తున్నారని మేం ప్రశ్నించాం. ''మేం ఈ గ్రామంలో ఉండేవాళ్లం. ఆయన ఎనిమిదోసారి సీఎం అయ్యారు. మాకు ఇంతకంటే ఏం కావాలి. మేం చాలా సంతోషంగా ఉన్నాం''అని రంజన్ అన్నారు.

ప్రధాన మంత్రి పదవికి నితీశ్ బరిలో ఉన్నారనే వార్తలపై స్పందించాలని రంజన్‌ను అడిగాం. దీనిపై ఆయన స్పందిస్తూ..''దేశంలోని ముఖ్యమంత్రులందరినీ గమనించండి. ఒకరిద్దరు మినహా మిగతావారు అంత ప్రతిభావంతులేమీ కాదు. అత్యుత్తమ సీఎం ఎవరని అడిగితే, అందరూ నితీశ్ పేరే చెబుతారు. అనుభవంలోనూ ఆయనకు ఎవరూ సాటిరారు. ప్రధాన మంత్రి అయ్యేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి''అని రంజన్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం బిహార్‌కు ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణం చేశారు. రాష్ట్రానికి సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన రికార్డు ఆయన పేరిటే ఉంది. అయితే, ఆయన ఒక్కోసారి ఒక్కో పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.

వీడియో క్యాప్షన్, కాళి: ఈ వివాదం ఎందుకు?

సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ఆయనకు ప్రధాన మంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి పదవికి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించే సమయంలో నితీశ్‌ను జర్నలిస్టులు ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పదవిని మీరు ఆశిస్తున్నారా? అని అడిగారు. కానీ, ఆయన స్పందించలేదు.

అయితే, ''2014లో అధికారంలోకి వచ్చినవారు 2024లో గద్దె దిగక తప్పదు. నేను ఎక్కడ ఉంటాను అనేది కాలమే నిర్ణయిస్తుంది''అని గతంలో నీతీశ్ వ్యాఖ్యానించారు.

నిజమే అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. అయితే, గ్రామానికి చెందిన 75ఏళ్ల రామ్‌సోహారన్ భిన్నంగా స్పందించారు. ''నరేంద్ర మోదీ చాలా పెద్ద, తెలివైన నాయకుడు''అని ఆయన వ్యాఖ్యనించారు.

మున్‌చున్ దేవి

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, మున్‌చున్ దేవి

మహిళలు ఏం అంటున్నారు?

నితీశ్ కుమార్ ప్రధాన బలాల్లో మహిళా ఓటర్ల భారీ మద్దతు కూడా ఒకటని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తుంటారు.

మరోవైపు ''మద్యంపై నిషేధం''లాంటి విధానాలను నితీశ్ తీసుకురావడానికి మహిళా ఓటర్లను మళ్లీ తనవైపు తీసుకురావడమూ ఒక ప్రధాన కారణమని విశ్లేషణలు వచ్చాయి.

ప్రస్తుతం నితీశ్ రాజకీయ సమీకరణాలపై ఇదే గ్రామానికి చెందిన మున్‌చున్ దేవి మాట్లాడారు. ''నితీశ్ మరీ అంత మేధావి కాకపోవచ్చు. కానీ, ఆయన మంచి పనులే చేస్తారు''అని ఆమె అన్నారు.

మద్యంపై నిషేధం మీద అడిగిన ప్రశ్నలకూ మున్‌చున్ దేవి స్పందించారు. ''నిషేధం ఎక్కడుంది? మద్యం విక్రయాలు జరుగుతున్నాయి కదా. ఒకవైపు దుకాణాలు మూస్తున్నారు. మరోవైపు అమ్మకాలు కొనసాగుతున్నాయి. మూసేయాలని భావిస్తే, పూర్తిగా మూసేయాలి''అని ఆమె అన్నారు.

మరోవైపు నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కావడంపై కల్యాణ్ బిగహా గ్రామంలో జీవించే ఆయన వదిన మీనా దేవి మాట్లాడారు. ''నితీశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామానికి చాలా మంచి చేశారు. ఒక ఆసుపత్రి కూడా కట్టారు. నాతోపాటు చాలా మంది మందుల కోసం అక్కడికే వెళ్తుంటారు''అని ఆమె చెప్పారు.

మీనా దేవి

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, మీనా దేవి

ప్రధాన మంత్రి పదవికి నితీశ్ బరిలో నిలుస్తారా? అనే ప్రశ్నపై మీనా స్పందిస్తూ.. ''ఆయన ముఖ్యమంత్రిగా మంచి పనులు చేశారు. ఆయన ప్రధాన మంత్రి అయితే ఇంకేం కావాలి''అని ఆమె అన్నారు.

మరోవైపు బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంపై గ్రామానికి చెందిన రింకీ దేవి కూడా సంతోషం వ్యక్తంచేశారు.

ఎందుకు ఇన్ని పార్టీలతో పొత్తులు మారుస్తున్నారు? అనే ప్రశ్నకు రింకీ స్పందిస్తూ.. ''రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజం. కొందరు మాటలు మాత్రమే చెబుతారు.. పనులు చేయరు. కానీ, నితీశ్ అలా కాదు. పరిస్థితులను అర్థం చేసుకుంటారు''అని ఆమె వ్యాఖ్యానించారు.

మొత్తానికి గ్రామంలో వాతావరణాన్ని పరిశీలిస్తే, ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయని చెప్పాలి. కొందరు నితీశ్‌ను పొగుడుతుంటే, మరికొందరు పార్టీలతో పొత్తులు మార్చడంపై విమర్శిస్తున్నాయి. ఇంకొందరు అసలు దీనిపై మాట్లాడేందుకు ముందుకురావడం లేదు.

అయితే, తదుపరి ప్రధాన మంత్రి పదవి రేసులో నితీశ్ కంటే నరేంద్ర మోదీ చాలా ముందుంటారని ఈ గ్రామానికి చెందిన కొందరు అభిప్రాయం వ్యక్తంచేశారు.

వీడియో క్యాప్షన్, వంట గ్యాస్‌ వాడకం ఆపేసిన మహారాష్ట్ర ఆదివాసులు.. మళ్లీ కట్టెల పొయ్యి వైపు గ్రామీణులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)