తెలంగాణ: కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?

ఫొటో సోర్స్, Komatireddy Raj Gopal Reddy/Facebook
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
"బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సంబురం జరిగి చాన్నాళ్లయింది. దాని ప్రభావం సన్నగిలిపోతున్నది.
బీజేపీ చీఫ్ బండి సంజయ్ 'ప్రజాసంగ్రామ యాత్ర' లో ప్రసంగాలు ఎంత వాడిగా వేడిగా ఉన్నా, జనం విపరీతంగా వచ్చినా, క్యాడర్‌ను మాత్రమే అది ఉత్సాహపరుస్తుంది. తెలంగాణ భూమి దద్దరిల్లే సంఘటన ఎపుడో గత ఏడాది నవంబర్ హుజూరాబాద్ ఎన్నికల్లో ఎదురైంది. పది నెలల తర్వాత ఇపుడు దాని ప్రభావం విశ్లేషకులకే పరిమితమైంది. అందువల్ల బీజేపీని మళ్లీ 2023 దాకా నడిపించే బూస్టర్ డోస్ అవసరం. దీన్నుంచి వస్తున్నదే మునుగోడు ఉప ఎన్నిక" అని బీజేపీ సీనియర్ నాయకుడు రానున్న మునుగోడు ఎన్నికల మీద వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఒక పథకంలో భాగమా?
ఈ వ్యాఖ్య చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా, మునుగోడు ఉప ఎన్నిక ఒక పథకంలో భాగమనేనని పిస్తుంది. మునుగోడు అనుకోకుండా వస్తున్న ఉప ఎన్నిక కాదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌తో సైద్ధాంతికంగా విబేధించి, బీజేపీలోకి వెళ్లాలనుకోవడంతో వస్తున్న ఉప ఎన్నిక కాదు.
తెలంగాణలో పేరుమోసిన కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఆడుతున్న దోబూచులాట చూస్తే, భారతీయ జనతా పార్టీ అదును చూసి, ఎరవేసి మునుగోడును లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నంలాగా కనిపిస్తుంది. అన్ని వనరులు సమకూర్చుకుని, గెలుపు ఓటములు బేరీజు వేసుకుని బీజేపీ కదుపుతున్న పావులాగా కనిపిస్తుంది.
తాను కాంగ్రెస్‌కు ఎందుకు రాజీనామా చేస్తున్నాడో ఈ రోజు రాజగోపాల్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన ఒక లేఖలో ఇలా పేర్కొన్నారు:
"...అందరి చొరవతో సాకారమయిన తెలంగాణ రాష్ట్రం ఇపుడు కెసిఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది. ఈ బందీ నుండి విడిపించేందుకు తెలంగాణలో మరొక ప్రజాస్వామిక పోరాటం అవసరమని నేను భావిస్తున్న. తెలంగాణలో ప్రజస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నేను నిర్ణయించిన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎంఎల్ఏ పదవితోపాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను."
ఆయన అసెంబ్లీకి రాజీనామా చేస్తూ ఆగస్టు ఎనిమిదో తేదీన స్పీకర్ లేఖ సమర్పించనున్నారు.
అయితే, మునుగోడులో బీజేపీకి, టీఆర్‌ఎస్‌కు నిరాశే ఎదురవుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి మల్లు రవి అన్నారు. "ఈ ఉప ఎన్నిక బిజెపి దుష్ట రాజకీయానికి నిదర్శనం. అదే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలను మునుగోడు ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఆయన ప్రమాదకరమయిన బిజెపికి పాలుపోస్తున్నారు. ఇదే అదనుగా చేసుకుని టిఆర్‌ఎస్ లబ్ధి పొందాలనుకుంటున్నది. ఈ రెండు పార్టీలకు నిరాశే ఎదురవుతుంది" అని మల్లు రవి అన్నారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పేరాల శేఖర్ రావు మాత్రం రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు మరొక వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోరాటం చేసేందుకు కాంగ్రెస్ అనుకూలంగా లేకనే రాజగోపాల్ రెడ్డి బిజెపిని ఎంచుకున్నారని అన్నారు.
"రాష్ట్ర ప్రభుత్వం పథకాలు గాని, కేంద్ర పథకాలు గాని మునుగోడు పేదలకు అందడం లేదు. కాంగ్రెస్‌లో ఉంటూ ఆయన కెసిఆర్ అప్రజాస్వామిక పాలన మీద, పేదల హక్కుల కోసం పోరాటం చేయలేకపోతున్నారు. గెల్చినప్పటినుంచి ప్రజల తరఫున రాజగోపాల్ రెడ్డి పోరాడుతూనే ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తారనగానే టిఆర్ఎస్ ప్రభుత్వం నియోజవర్గానికి నిధులు కేటాయిస్తూ ఉంది. పెన్షన్లు మంజూరు చేస్తూ ఉంది. ప్రజలు దీనిని గమనించలేరా? దీని క్రెడిట్ రాజగోపాల్ ఖాతాలోనే పడుతుంది. మునుగోడులో కాంగ్రెసే లేదు. కాంగ్రెస్‌ను జనం మర్చిపోయారు. ఉండేదంతా టిఆర్‌ఎస్ మీద వ్యతిరేకతే. అందువల్ల మునుగోడులో విజయం రాజగోపాల్ దే" అని శేఖర్ రావు అన్నారు.
మునుగోడు నల్గొండ జిల్లాలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గం. 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఈ ఎన్నికలో కోమటిరెడ్డికి 44.51 శాతం ఓట్లు పోలయితే, రెండో స్థానంలో ఉన్న టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 34.13 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 5.81 శాతం ఓట్లు దక్కించుకుని బిజెపి ఎక్కడో దూరాన మూడో స్థానంలో పడిపోయింది.
కోమటిరెడ్డి రాకతో బిజెపి ఏకంగా నియోజకవర్గాన్ని దక్కించుకోవాలనుకుంటున్నది. 2014లో ఇక్కడ టిఆర్‌ఎస్ (ప్రభాకర్ రెడ్డి 36.6 శాతం ఓట్లు) గెలిచింది. అపుడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కేవలం 16 శాతం ఓట్లు పొందారు. చిత్రమేమిటంటే అపుడు బిజెపికి అంతే శాతం ఓట్లు పోలయ్యాయి.

ఫొటో సోర్స్, @bandisanjay_bjp
ఉప ఎన్నికలే బీజేపీ వ్యూహం
ఉప ఎన్నికల వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌కు గట్టిగా ధమ్కీలివ్వడం, ఆర్థిక భారం లేకుండా డబ్బున్న అభ్యర్థుల ఖర్చుతో కెసిఆర్‌కు వ్యతిరేకంగా ప్రచార సునామీ సృష్టించడం. ఈ లెక్కన 2023 నాటికి మరొకటో రెండో ఉప ఎన్నికలు వచ్చేలా ధనబలం, జనబలం ఉన్న ఎమ్యెల్యేలకు బిజెపి గాలం వేసినా ఆశ్చర్యం లేదు.
గురువారం నాడు 'ప్రజా సంగ్రామ యాత్ర' లో విలేకరులతో మాట్లాడుతూ ఈసారి గాలానికి టిఆర్‌ఎస్ చేపలు దొరకబోతున్నాయని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ కుమార్ పరోక్షంగా చెప్పారు. "2023లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి మరిన్ని ఉప ఎన్నికలు జరుగుతాయి. 12 మంది టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీతో సంప్రదింపుల్లో ఉన్నారు" అని సంజయ్ అన్నారు.
దీనిని టిఆర్‌ఎస్ క్యాడర్‌లో తత్తర పుట్టించేందుకు చెప్పిన రాజకీయ చెణుకు అని అనుకోనవసరం లేదు. మునుగోడులో పార్టీ గెలిస్తే, ఈ వేట విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి. ప్రస్తుతానికి పదవుల్లో లేనోళ్ల పేర్లు మాత్రం బయటకు వచ్చాయి. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్, జూపల్లి కృష్ణారావులు బిజెపిలో చేరతారని మీడియా రాస్తున్నది.
"టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో డీలింగ్ మరో విధంగా టుంది. అవి బయటకు చెప్పే విషయాలు కాదు. మునుగోడు ఎన్నిక తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి" అని ప్రజా సంగ్రామ యాత్ర నుంచి మాట్లాడుతూ బిజెపి నేత ఒకరు 'బిబిసి-తెలుగు'కు చెప్పారు.
పేరు రాసేందుకు అంగీకరించని ఈ నాయకుడు మరిన్ని ఆసక్తికరమయిన విషయాలు చెప్పారు. "వేములవాడ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం చిక్కుల్లో చిక్కుకున్నారు. దాని మీద కేంద్ర హోంశాఖ ఆయన విదేశీ పౌరుడేనని తెల్చింది. దీనివల్ల ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకటిస్తే వేములవాడకూ ఉప ఎన్నిక రావచ్చు. అంతేకాదు, అధిష్టానం ధోరణి నచ్చక, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పొసగక ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తొందర్లోనే కాంగ్రెస్‌కే గుడ్ బై కొట్టబోతున్నారు. అపుడు అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఈ రెండింటిలో కూడా బిజెపి అఖండ విజయం సాధిస్తుంది" అని అన్నారు.
"తెలంగాణలో పార్టీ బలపడుతూ ఉందని చెప్పేందుకు వరుస ఉప ఎన్నికలను బిజెపి ఒక వ్యూహంగా పెట్టుకుందనిపిస్తుంది. ఇది సులభమార్గం. ఉన్న పార్టీలో ఇక్కట్లలో ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానించి బిజెపి వాళ్లకి ఆశ్రయమిస్తూ ఉంది. అక్కడ ఉప ఎన్నిక వచ్చేలా చేసి బిజెపి లబ్ధి పొందాలనుకుంటున్నది. హుజూరాబాద్ తర్వాత మునుగోడుని ఎన్నుకోవడం ఈ వ్యూహంలో భాగమే అనిపిస్తుంది. ఎన్నికల వ్యయంలో ఆంధ్ర, తెలంగాణలు ఇండియాలోనే నెంబర్ వన్. బిజెపి ఆహ్వానం అందుకుంటున్న వారంతా తెలుగు మిలియనీర్లే. ఇలా 2023 నాటికి డబ్బున్న అభ్యర్థులు అందుబాటులో ఉన్న చోట్ల మరిన్నిఉప ఎన్నికలు రావచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒక ఉప ఎన్నికలో గెలిస్తే, దాని ప్రభావం 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా పడవచ్చని బిజెపి నమ్ముతున్నట్లుంది" అని హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతి శాస్త్ర విభాగానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ ఇ.వెంకటేశ్వర్లు అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాంగ్రెస్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్
తెలంగాణ కాంగ్రెస్‌లో బాగా అనుమానాలు రేకెత్తిస్తూ వచ్చిన నాయకులు ఇద్దరు. వాళ్లు కోమటిరెడ్డి సోదరులు. ఇందులో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపి. ఇద్దరు వ్యాపారస్తులే. వ్యాపారాల్లో ఉన్నవాళ్లు ఏదో విధంగా పవర్ సెంటర్‌కు దగ్గరగా ఉండాలనుకుంటారు.
పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రత్యర్థి పార్టీల్లో ఆర్థికంగా బలమైన నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తోందనేది అంతటా వినిపిస్తోంది. కారణాలేవైనా దాడుల ఆనవాళ్లైతే చాలా ఉన్నాయి. సొంత పార్టీ వచ్చే పవర్లోకి సూచనలు లేవని తెలిసినపుడు వచ్చే అస్థిరత ఏదో ఒక రూపంలో బయటపడుతూ ఉంటుంది.
పిసిసి అధ్యక్షుడితో గొడవకావచ్చు, పార్టీలో గుర్తింపులేదనే ఆవేదన కావచ్చు. కోమటిరెడ్ది బ్రదర్స్ ఎపుడూ పిసిసి అధ్యక్షుడితో హ్యాపీగా ఉన్నట్లు లేదు. వాళ్లు అంతకు ముందటి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో హ్యాపీగా లేరు. తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డితో సర్దుబాటు చేసుకోలేకపోయారు. దీన్నుంచి వాళ్లు కాంగ్రెస్ వదిలేస్తారని, టిఆర్‌ఎస్‌లో చేరతారనే వార్తలు వచ్చాయి. తర్వాత బిజెపిలో తీర్థం పుచ్చుకోవటం లేదా అవసరమయితే కొత్త పార్టీ పెడతామని కూడా ఒక దశలో వాళ్లు హెచ్చరించారు.
మొత్తానికి దీనిని రాజగోపాల్ రెడ్డి నిజం చేశారు. తొందర్లోనే అన్న వెంకటరెడ్డి కూడా నిజం చేస్తారని ఎవరో కాదు, స్వయాన బిజెపి అధ్యక్షుడు బండి సంజయే ఆశాభావం వ్యక్తం చేశారు.
"భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మే వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తాము" అని బండి చాలా మురిపెంగా చెప్పారు. ఆయన ఈమాట చెప్పిన మరుసటి రోజే కోమటిరెడ్డి సోదరులు బీజేపీ అగ్ర నేత అమిత్ షాను కలిశారు.
మునుగోడు పర్యవసానం
పార్లమెంటులో టిఆర్‌ఎస్ సహకారం ఉన్నందున తెలంగాణలో పార్టీని బలపర్చేందుకు బిజెపి మొదట్లో శ్రద్ధ చూపలేదు. పార్టీని లోకల్ లీడర్లకు వదిలేసింది. ప్రాంతీయ వాదం బలంగా ఉన్న తెలంగాణలో పార్టీ బలపడుతుందన్న ఆశ కూడా అపుడు జాతీయ నాయకత్వంలో లేదు.
అయితే, దుబ్బాక ఉప ఎన్నికతో బిజెపి ఆలోచనల్లో పడిపోయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ పొరుగిల్లు లాంటి దుబ్బాకలో బిజెపి జండా ఎగరడంతో తెలంగాణలో ఏదో జరుగుతూ ఉందని ఒక కన్ను వేయాల్సిందేననే నిర్ణయానికి వచ్చింది. దీనితో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ ప్రచారాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకుంది. జాతీయ నాయకులను ఇన్‌చార్జీలుగా డివిజన్లకు నియమించింది. టిఆర్ఎస్‌కు గట్టి సవాల్ విసిరి ప్రతిపక్ష హోదా కొట్టేసింది. దీనితో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుచేయడమే లక్ష్యం అని క్యాంపెయిన్ మొదలుపెట్టింది.
అప్పటినుంచే ఇతర పార్టీలలో ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యేలకు గాలం వేయడం మొదలుపెట్టారు. ఇలా అనుకోకుండా టిఆర్‌ఎస్ రెబెల్ ఈటెల రాజేందర్ దొరికారు. ఇపుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిక్కారు. దుబ్బాక, జిహెచ్‌ఎంసి, హూజూరాబాద్‌లలో ఎదరయిన పరాజయం నుంచి టిఆర్‌ఎస్ ఇంకా కోలుకోలేకపోతున్నది. ఈ మూడు ఎన్నికలు ముగిసి ఎడాది గడుస్తున్నా జాతీయ పత్రికల్లో విశ్లేషణల్లో నలుగుతూనే ఉన్నాయి.
"తెలంగాణలో బిజెపి బలపడుతూ ఉంది, బిజెపియే కెసిఆర్‌కు నిజమయిన ప్రత్యర్థి" అని తేల్చని విశ్లేషణే లేదు.
ఈ నేపథ్యంలో మునుగోడులో గెలిస్తే, దాని ప్రభావం 2023 ఎన్నికల దాకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంటుంది. అందుకే మునుగోడు విజయం బూస్టర్ డోస్ లాగా 2023 దాకా పనిచేస్తూ ఉంటుందని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. బూస్టర్ డోస్‌కు అనువయిన సమయమిదే అని భావించే.. రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నిక వచ్చేలా చేశారని పార్టీలో చాలా మంది నమ్ముతున్నారు.
ఇవి కూడా చదవండి:
- చీతా: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ వస్తోంది
- పాము, కప్ప: ప్రపంచానికి 1,39,087 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని కలిగించిన రెండు జీవులు..
- క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














