తెలంగాణ: కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలేంటి, దానిపై విమర్శలేంటి?

ఫొటో సోర్స్, @TelanganaCMO
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం కోసం కొత్తగా నిర్మించిన 'ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్'ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 'త్రినేత్రం' భవనాన్ని నిర్మించారు.
ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సమన్వయం, వేగం పెరుగుతుందని పోలీస్ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో విపత్తుల సమయంలో వేగంగా సహాయ చర్యలు చేపట్టటానికి, ప్రణాళికలను అమలు చేయడానికి ఇది ఉపయోగ పడుతుందని ప్రభుత్వం చెప్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దీని గురించి వివరిస్తూ.. ‘‘అన్ని సీసీటీవీ కెమెరాలనూ అనుసంధానం చేయడం వల్ల కేసుల్ని త్వరితగతిన ఛేదించవచ్చు’’ అని చెప్పారు. ఎక్కడైనా ప్రజలు గుమిగూడుతుంటే ముందుగా సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుసుకొని అక్కడ శాంతి భద్రతల సరిగ్గా ఉండేలా త్వరగా తగినంత పోలీసులను పంపించవచ్చునని పేర్కొన్నారు.
అయితే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్.. సామాన్యుల హక్కులను హరిస్తుందని పౌర హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.
అసలు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేమిటి? దీనిపై వస్తున్న విమర్శలు ఏమిటి? అనేవి చూద్దాం.

ఫొటో సోర్స్, @TelanganaCMO
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలేమిటి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీస్ విభాగాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడానికి కృషి చేస్తామని కేసీఆర్ గతంలో పలుమార్లు చెప్పారు. అందులో భాగంగా షీ టీమ్స్ దగ్గర నుండి, పోలీసు వాహనాల వరకూ.. పోలీసు విభాగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిఘా కోసం సీసీటీవీ కెమెరాల సంఖ్య పెంచింది.
ఇప్పుడు ఈ సీసీటీవీలను, ఇతర విభాగాలను అనుసంధానిస్తూ.. పోలీసు శాఖలోని అన్ని ముఖ్య విభాగాలను ఒకే గూటి కిందకు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
ఈ కంట్రోల్ సెంటర్‌ని సుమారు రూ. 600 కోట్ల ఖర్చుతో నిర్మించారు. "సెంటర్‌కు ఎడమ వైపున ఉన్న టవర్ Aలో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంతో పాటు పరిపాలనా విభాగాలు ఉంటాయి. తెలంగాణలోని ప్రతి కెమెరా అనుసంధానమై ఉండే రాష్ట్ర స్థాయి నిఘా.. కుడివైపున B టవర్‌లో ఉంటుంది.
షీ టీమ్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సంబంధిత ఏజెన్సీలు, హాక్ ఐ అసిస్టెన్స్, ట్రాఫిక్ కమాండ్ సెంటర్ కూడా ఈ టవర్‌లోనే ఉంటాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
టవర్ Cలో ఆడిటోరియం ఉంది. టవర్ Dలో ఇతర విభాగాలు, డేటా సెంటర్‌లు ఉంటాయి."
టవర్ Aలో మొత్తం 20 అంతస్తులు ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ ఇందులోనే ఉంటుంది.
టవర్ Bలో 15 అంతస్తులు ఉంటాయి. దీనిలోనే టెక్నాలజీ ఫ్యూజన్ టవర్‌తో పాటు, డయల్ 100కి సంబంధించిన ఆఫీసు, షీ టీమ్స్‌తో పాటు, సైబర్ నార్కోటిక్స్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటాయి.
టవర్ Cలో 480 మంది కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ టవర్ మూడు అంతస్తులు ఉంటుంది.
టవర్ D లో మీడియా, ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది.
టవర్ E లోని 4, 5, 6, అంతస్తుల్లో కమాండ్ కంట్రోల్, డేటా సెంటర్‌తో పాటు మల్టీ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేషన్, సీసీటీవీ మానిటరింగ్, వార్ రూమ్, రిసీవింగ్ రూంలు ఉంటాయి.
హెలికాఫ్టర్ దిగటానికి ఇక్కడ హెలిపాడ్ కూడా ఏర్పాటు చేశారు. 14 ,15 అంతస్తుల్లో తెలంగాణ పోలీస్ చరిత్ర గురించి తెలియపరిచే మ్యూజియం కూడా ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దీనిని ఎందుకు ప్రత్యేకంగా భావిస్తున్నారు?
నేరాల మీద పోరాటంలో తెలంగాణ పోలీసులు ఇప్పుడు సాంకేతికతను తమ అత్యంత ముఖ్యమైన ఆయుధాల్లో ఒకటిగా ఉపయోగిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. సింగపూర్, న్యూయార్క్‌లలో మాత్రమే ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయని, దేశంలోనే ఈ భవనం ప్రత్యేకమైనదని చెప్తున్నారు.
ఈ ఐకానిక్ సీసీసీ (కమాండ్ కంట్రోల్ సెంటర్) ఒక ఫ్యూజన్ సెంటర్ ఆఫ్ టెక్నాలజీగా పని చేయబోతోందని.. రాష్ట్రవ్యాప్తంగా అమర్చిన 9.21 లక్షల కెమెరాల నెట్‌వర్క్‌తో అధునాతన పర్యవేక్షణతో పోలీసులకు సహాయం చేస్తుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వివరించారు.
"అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఒకరు ఒకేసారి లక్ష నిఘా కెమెరాల ఫుటేజీని నిల్వ చేయవచ్చు, వీక్షించవచ్చు. ఇక్కడ ప్రవేశపెట్టిన సాంకేతికత, కాన్సెప్ట్‌లు దేశంలోని ఏ పోలీసు దళంలో ఎక్కడా అందుబాటులో లేవు. బ్యాకెండ్ కార్యకలాపాలను అమలు చేయడానికి అన్ని సంబంధిత కార్యాలయాలు ఇక్కడ ఉంటాయి" అని డీజీపీ అన్నారు.
మల్టీ-ఏజెన్సీ కార్యకలాపాల కేంద్రం, డేటా సెంటర్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని పెంపొందించడానికి ప్రజలతో అనుసంధానం గల వివిధ శాఖల ప్రతినిధులు ఇక్కడ ఉంటారని పోలీస్ అధికారులు చెప్పారు. ఈ భవనంలో ఒక వార్ రూమ్, సిబ్బంది పర్యవేక్షణ కార్యకలాపాలు, సామర్థ్యాలను పెంపొందించడం కోసం ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆడిటోరియం, మ్యూజియం కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంటాయన్నారు.

ఫొటో సోర్స్, @KTRTRS
అంతే కాదు, ఈ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం విపత్తు పరిస్థితులలో సెంటర్‌గా మార్చుకునేలా ఏర్పాట్లు చేశారు. అంటే, ఇక్కడే ముఖ్యమంత్రి, హోంశాఖ, ఇతర ముఖ్యశాఖల మంత్రులు, అధికారులకు ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేశారు. దీనితో పాటు హెలికాప్టర్ కోసం హెలిపాడ్ కూడా ఏర్పాటు చేశారు.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం సుమారు 9 లక్షల సీసీ కెమెరాలు ఉంటే..ఒక్క హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో సుమారు 7 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అయితే అన్ని కెమెరాలు పని చేస్తున్నాయా అన్నది ముఖ్యమైన ప్రశ్న అని అంటున్నారు న్యాయవాది రచనా రెడ్డి.
"మనకు సిటీ లోనే ఎన్నో కెమెరాలు కనిపిస్తున్నా, వాటిలో చాలా కెమెరాలు పని చేయడం లేదు. మరి తెలంగాణ అంతటా పని చేయని సీసీ కెమెరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని అనుసంధానం చేస్తే కలిగే ప్రయోజనాలు నామమాత్రమే" అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, @TelanganaCMO
సీసీకెమెరాలతో పౌరుల గోప్యతకి భంగం: హక్కుల సంఘాలు
ఉదయం లేచినప్పటి నుండి, మనం మళ్ళీ ఇంటికి చేరేదాకా నీడలా మన పై ఒక్క కన్ను వేసి ఉంటాయి ఈ సీసీటీవీ కెమెరాలు. నేరం జరిగినప్పుడు దానిని ఛేదించడానికి సీసీటీవీ కెమెరాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, అలా అని సీసీటీవీ ఫుటేజ్ లేకుంటే కేసుల విషయంలో పోలీసులు ప్రాధమిక దర్యాప్తు చేయడం మానేశారని మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు కొందరి వాదిస్తున్నారు.
ఇలాంటి కంట్రోల్ సెంటర్‌ల నుండి సీసీటీవీ ఫుటేజీని వీక్షించడం ద్వారా నేరస్తులను గుర్తించగలుగుతారనేది ఒక ఎత్తు అయితే.. త్వరిత గతిన కేసులు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజి లేనప్పుడు కూడా కేసులను దర్యాప్తు చేసి ఛేదించడం ఎలా అన్నది పోలీసులు మర్చిపోతున్నారనేది మరో వాదన.
ఈ విషయంపై మానవ హక్కుల కార్యకర్త, ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ పరిశోధకుడు శ్రీనివాస్ కొడాలి బీబీసీతో మాట్లాడుతూ.. "సీసీటీవీ కెమెరాలు వద్దు అనడం లేదు. కానీ ఇవి ఎవరి అధీనంలో ఉన్నాయి అన్నది ప్రశ్న. వాటిని ఎలా ఎప్పుడు ఎందుకు వాడుతున్నారు అన్నదే సమస్య. పోలీసులు తమకు అవసరమైనప్పుడు, తమకు అనుకూలంగా ఈ సీసీటీవీ ఫుటేజీని వాడుకునే సందర్భాలు వస్తే, న్యాయం ఎలా జరుగుతుంది?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"స్థానిక ఐటీ కంపెనీలకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అనుభవం పొందడానికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేసింది. వారు అభివృద్ధి చేసిన ఏదైనా సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు వారు ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలు, ఇతర టెక్నాలజీలను అభివృద్ధి చేసినప్పుడు, పౌరులపై ప్రయోగాలు చేయడానికి ప్రభుత్వం దానిని సంతోషంగా కొనుగోలు చేస్తుంది. కానీ ఇలాంటి ఎన్నో సాఫ్ట్‌వేర్లు పౌర హక్కులకు విరుద్ధం. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇప్పుడు అలాంటి వాటిని ఉపయోగిస్తున్నారు" అని కొడాలి శ్రీనివాస్ విమర్శించారు.
ఇలాంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ రావడం కారణంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోటుకి రావడంతో పని వేగవంతం అవుతుంది అన్నదానిలో సందేహం లేనప్పటికీ.. అసలు వారు ఏఏ టెక్నాలజీ వాడుతున్నారు? దాని కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? అలానే వారి హక్కులకి భంగం కలగకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాలన్నది పౌర హక్కుల సంఘాల వారి వాదన.
ఇవి కూడా చదవండి:
- చీతా: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ వస్తోంది
- పాము, కప్ప: ప్రపంచానికి 1,39,087 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని కలిగించిన రెండు జీవులు..
- క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















