సైదాబాద్ అత్యాచార కేసు: రాజు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఆత్మహత్య చేయబడ్డాడా?

ఫొటో సోర్స్, Telangana police
- రచయిత, మాడభూషి శ్రీధర్
- హోదా, డీన్, మహింద్ర యూనివర్సిటీ - హైదరాబాద్
ఎవరికీ ఏమీ తెలియదు. రాజే నేరస్తుడని మాత్రం చాలా గట్టిగా అనుమానం ఉంది. ఎంత గట్టి అనుమానమైనా నిజానికి ప్రత్యామ్నాయం కాబోదనేది ప్రాథమిక న్యాయసూత్రం.
మిగతా అనుమానాల మాట ఎట్లా ఉన్నా, క్రిమినల్ కేసుల్లో నేరారోపణలకు రుజువులు వెతికే సమయంలో అనుమానాలు నమ్మకాలకన్నా సాక్ష్యాలు అవసరమవుతాయి.
ఆరేళ్ల చిన్నారిని ఇంత దారుణంగా లైంగిక దాడికి గురిచేసి చంపేయడం అనేది మరణ శిక్ష ఇవ్వదగిన నేరం అని భారతీయ శిక్షాస్మృతిలో ఉంది.
అయితే మరణ శిక్షే ఇచ్చి తీరాలని లేదు. న్యాయాధికారి సాక్ష్యాల ఆధారంగా నేరం రుజువు స్థాయిని బట్టి, అతని నేరపూరిత ఆలోచన గాఢతను బట్టి శిక్ష తీవ్రత ఆధారపడి ఉంటుంది. మరణ శిక్షను అరుదైన నేరాలలోకెల్లా అరుదైన నేరమని రుజువైన సందర్బాలలో మాత్రమే విధించాలని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాలలో నిర్దేశించింది. అది శాసనం.
ఐపిసిలో యావజ్జీవ కారాగార శిక్షనుంచి మరణ శిక్షదాకా అనే వాక్యం ఉండడం వల్ల జడ్జిగారి విచక్షణతో సహా అనేకానేక అంశాల మీద ఆధారపడి యావజ్జీవ శిక్షగానీ మరణ శిక్ష గానీ విధిస్తారు.
సందేహానికి అతీతంగా ఒకరి నేరం రుజువై అతని దురుద్దేశం తేటతెల్లమయితే, ఆ నేరం కూడా అరుదైనవాటిల్లోకెల్లా అరుదైనదైతే ఉరిశిక్ష ప్రకటించడం, దానిపైన నిందితుడు అప్పీలుకు వెళ్లకపోయినా, ప్రభుత్వమే అపీలుకు తీసుకువెళ్లి హైకోర్టుచేత ధృవీకరింపజేయాలని, అందాకా ఉరి శిక్ష అమలు చేయరాదని ముందు జాగ్రత్త చర్యలు అనేకం ఉన్నాయి.
ఆ తరువాత నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. అక్కడ కూడా ఉరి ఖరారు అయితే, సమీక్ష కోరవచ్చు, ఆ తరువాత రాష్ట్రపతి క్షమాభిక్ష కోరవచ్చు. తిరస్కారాన్ని సవాలు చేయవచ్చు. అన్నీ ముగిసిన తరువాతనే మరణ శిక్ష అమలు చేయాలి.
ఇంత తతంగం ఎందుకంటే పొరపాటున కూడా నిర్దోషికి, తక్కువ దోషికి లేదా సాక్ష్యాలు సరిపోయేంతగా లేనిదశలో నిందితుడికి అన్యాయంగా మరణశిక్ష ఇవ్వకుండా న్యాయాన్ని కాపాడడానికి మాత్రమే.

ఫొటో సోర్స్, UGC
న్యాయమైన మార్గమా?
వ్యక్తి స్వేచ్ఛ ప్రాణాన్ని న్యాయమైన మార్గాల ద్వారా మాత్రమే హరించే అధికారం కోర్టులకు ఇచ్చింది రాజ్యాంగం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 వివరించేది అదే.
మన న్యాయశాసనాలు పోలీసులకు మరణ శిక్ష విధించే అధికారం ఇవ్వలేదు. మరొకరిని కొట్టే అధికారం కూడా ఎక్కడా ఇవ్వలేదు. కొడితే పోలీసు అధికారిపైన కూడా క్రిమినల్ కేసుపెట్టాలని 1860 నుంచి మన ఐపిసిలో ఉంది. ఈ సెక్షన్ కొట్టేయాలని పోలీసులెవరూ అడగలేదు. కోర్టుకూడా చెప్పలేదు.
చంపేసే అధికారం జైల్లో ఉరితీసే తలారికే గాని మరెవరికీ లేదు. ఆ తలారి కూడా ఎన్నో అనుమతుల తరువాత, అన్ని ఆదేశాలు అందిన తరువాత, ప్రాణాలు కాపాడుకోవడానికి చట్టంలో ఉన్న అన్ని అవకాశాలు ముగిసిన తరువాత, గానీ ఆ తలారి కూడా ఉరితీయడానికి వీల్లేదు.
ఆత్మరక్షణ కోసం చంపే అధికారం సెక్షన్ 100 (ఐపిసి) ప్రకారం ప్రతి వ్యక్తికీ ఉంది. ప్రతి ఎన్ కౌంటర్ మరణానికి పోలీసులు ఈ సెక్షన్ ఆత్మరక్షణాధికారాన్నే వాడుకుంటారు. నిజంగా ఎదురుకాల్పులు జరుపుతుంటే పోలీసులు తమ తుపాకీలకు పని చెప్పవలసిందే. పోలీసులు తమను, జనులను రక్షించాల్సిందే.
దిశ కేసు ఎన్కౌంటర్ విచారణ
ఇబ్బంది ఎక్కడ అంటే కట్టుకథలు చెబితేనే. నకిలీ ఎన్‌కౌంటర్ అయితే దాన్ని కరడుగట్టిన హత్యానేరం అంటారే కాని ఎన్‌కౌంటర్ అనడానికి వీల్లేదు. హత్యానేరం కింద కేసు బుక్ చేసి దర్యాప్తు జరపాలని చట్టం నిర్దేశిస్తున్నది. కాని పోలీసులే పోలీసులపైన కేసు పెట్టి దర్యాప్తు చేయడమనేది జరగని పని అని అందరికీ తెలుసు. ఈవిధమైన వాస్తవిక ఆచరణ సౌకర్యం వల్ల పోలీసులు హత్యలు చేస్తే వాటిని ఎన్‌కౌంటర్లంటున్నారు.
దాదాపు రెండేళ్ళ కిందట డాక్టర్ దిశ కేసులో మానభంగం, హత్య నిందితులను పట్టుకుని, తరువాత నేరస్థలానికి తీసుకువెళ్లి అక్కడి నుంచి పారిపోతున్నారని చెప్పి కాల్చేశామన్నారు.
అంతకుముందు వరంగల్ యాసిడ్ దాడి చేసిన నిందితులు ఇద్దరిని ఈ విధంగానే కాల్చివేసారు. దాని పైనా విచారణలు జరగలేదు.
కానీ దిశ సంఘటనలో కూడా అదేవిధంగా మట్టుబెట్టడంతో న్యాయవ్యవస్థ, సమపాలనకు అది సవాలుగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై దర్యాప్తు మొదలైంది. ఇటీవల సాక్ష్యాల విచారణ కూడా జరిగింది.
అంతకుముందు హత్యలపైన నిరసన తీవ్రంగా ఉండి ఉంటే రెండోసారి ఎన్‌కౌంటర్ హత్య చేయడానికి పోలీసులు వెనుకాడే వారు. కాని సెప్టెంబర్ 9 సంఘటన తరువాత వ్యూహాలు మారినట్టు కనిపిస్తున్నాయి.
తల్లిదండ్రులు వినాయక చవితి వేడుకలలో కొంతదూరం వెళ్లిన సమయం చూసుకుని ఆరేళ్ల అమ్మాయిని సెప్టెంబర్ 9న తన ఇంట్లో అత్యాచారం, హత్య చేసిన సంఘటనపై జనం ఆగ్రహించారు. రాజు అనే వ్యక్తి పారిపోయాడు. జనం దాడిచేస్తే లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అనుమానితుడైన రాజును ఎన్‌కౌంటర్ చేయాలని జనం డిమాండ్ చేశారు. ఇది ప్రజల ఆలోచనా విధానంలో వచ్చిన కొత్త మార్పు.
సన్నగిల్లిన నమ్మకాలు
పోలీసులు దర్యాప్తు చేసి సమర్థవంతంగా సాక్ష్యాలు సేకరించి, నిందితుడిని ప్రాసిక్యూట్ చేసి శిక్ష పడేట్లు చేయాలని ఇదివరకు కోరేవారు. ఇప్పుడా నమ్మకాలు సన్నగిల్లాయి.
విపరీతమైన ఆలస్యాలు, సంపన్నులు చట్టాల్లో లొసుగులను వాడుకుంటూ సాక్ష్యాలను కొనుక్కుంటూ లేదా బెదిరిస్తూ లేదా ప్రాసిక్యూటర్లకు లంచాలిచ్చి ఇంకా ఎక్కడ వీలయితే అక్కడ అవినీతికి పాల్పడి చట్టాల చట్రం నుంచి బయటపడుతున్నారు. పేదవారికి ఆ ఆస్కారం లేదు.
హీరో ఎవరో వచ్చి విలన్లను చితకబాదే సినిమాల్లో గంటలో నేరగాడికి శిక్ష వేసే సీన్లకు జనం అలవాటు పడినట్టుంది. తమ చదువును, రాజ్యాంగాన్ని పక్కన బెట్టి సినిమా ఫక్కీలో నేరస్తుడని అనుకున్నవాడిని చంపేసి లేదా చంపేయించి తృప్తి పొందే కొత్త నాగరికత విస్తరిస్తున్నది.
ఆరేళ్ల బాలిక విషయంలో వ్యవస్థ, పద్ధతి, పూర్తి స్థాయి విచారణ జరగాలన్న న్యాయ ప్రక్రియ ధ్యాసే ఎవరికీ లేదు. చాలా దురదృష్టకరమైన స్థితి ఏమిటంటే అధికార, ప్రతిపక్షాలు కూడా బాధ్యతారహితమైన సినిమా మూర్ఖత్వంతో సమానమైన డిమాండ్లనే చేయడం.
పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఈ కేసులో నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యం. రాజ్యాంగ వ్యవస్థను రక్షిస్తామని ప్రమాణం చేసిన మంత్రి మల్లారెడ్డి ఆ నేరస్తుడు దొరికితే ఎన్‌కౌంటర్ చేస్తామని వాగ్దానం చేయడం మరింత ఆశ్చర్యం.
రాష్ట్రంలో కీలకమైన మంత్రి కేటీఆర్ ఈ ఘోరం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ సెప్టెంబర్ 12న రాజు దొరికాడని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆ తరువాత రాజును పట్టుకుంటే 10 లక్షలు రూపాయల రివార్డు ఇస్తామని 14వ తేదీన తెలంగాణ డీజీపీ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Hyderabad police
మంత్రి ట్వీట్‌కు డీజీపీ ప్రకటనకు తేడాను ఎంపీ రేవంత్ రెడ్డి ఎత్తిచూపితే, తనకు తప్పుడు సమాచారం అందిందనీ, పాత ట్వీట్‌కు క్షమాపణ కోరుతున్నాననీ అంటూ కేటీఆర్ మరొక ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ 16న డీజీపీ ఒక ట్వీట్ చేస్తూ రాజు రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించారు.

ఫొటో సోర్స్, twitter/dgp Telangana police
రాజును సెప్టెంబర్ 12ననే పోలీసులు సమర్థవంతంగా పట్టుకోగలిగి ఉండవచ్చుననీ, వెంటనే ఆ విషయం మంత్రి బయటపెట్టేసరికి ఆందోళన చెంది ఉంటారనీ, ఇంకా అతను దొరకనట్టు పరిస్థితులను సృష్టించక తప్పదని కేవలం అందుకే త్వరత్వరగా రాజు తలపైన 10లక్షల రివార్డు ప్రకటించి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఎంపీ కోరడం, వెంటనే మంత్రిగారు ఎన్‌కౌంటర్ చేస్తామని హామీ ఇవ్వడం ఈ అనుమానాలను బలోపేతం చేశాయి.
ఇక రాజును ఏ విధంగా చంపేస్తారో చూడాలన్న ఉత్కంఠ రాష్ట్రమంతా నెలకొన్నది. అతన్ని ఆత్మహత్య చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు చాలామంది సోషల్ మీడియాలో దుర్మార్గుడికి తగిన శిక్ష పడిందని సంతోషం ప్రకటించారు. హడావుడిగా పోస్టుమార్టం జరిపించి సాయంత్రానికి అతని దేహాన్ని దహనం చేశారు. అంతకుముందే మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘ కార్యకర్తలు తాత్కాలిక సీజేఐ ఇంటికి వెళ్లి రాజు దేహానికి హడావుడి అంత్యక్రియలు ఆపాలని, నిష్పాక్షికంగా పోస్టుమార్టం జరపాలని కోరారు. హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా 'ఆత్మహత్య' సంఘటనపై దర్యాప్తు జరిపించాలని కోరారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
వింత విషయాలు
ఇక ఈ సంఘటనలో మనం నమ్మడానికి వీల్లేకపోయినా నమ్మవలసిన వింత విషయాలు చాలా ఉంటాయి.
కేటీఆర్‌గారికి తప్పుడు సమాచారం అందడం, ఆయన అందుకు క్షమాపణ కోరడం, మరో మంత్రిగారు ఎన్‌కౌంటర్ చేస్తామని జనానికి హామీ ఇవ్వడం, ఎంపీగారు ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేయడం, ఇంకా దొరకలేదని వార్తలు అల్లి ఇంగ్లీషు తెలుగు మీడియాలో వార్తలు రాయడం కొన్ని వింతలు.
హైదరాబాద్‌లో ఉన్న నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడానికి హైదరాబాద్‌లో పట్టాలే లేనట్టు జనగామ దగ్గరున్న నష్కల్ దాకా వచ్చాడన్నది మరొక అద్భుతం.
పోలీసులు చెప్పినట్టు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తూ ఉంటే దానిముందు దుమికాడని అనుకుంటే, ఆ తాకిడి తరువాత కూడా శరీరం శరీరంవలెనే ఉండడం, రైలు ఢీకొన్నా ముఖం మీద గాయాలు, మణికట్టుదాకా ఒక చేయి తెగడం మాత్రమే జరిగిందన్నా నమ్మాలి.
ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న తరువాత కూడా శరీరం జాగ్రత్తగా ఎక్కడో విసిరి పడకుండా రైలు పట్టాల మధ్య ఉండడం మరో ఆశ్చర్యం. రాజు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఆత్మహత్య చేయబడ్డాడా? ఈ ఆత్మహత్యను ఎవరు విచారిస్తారు? ఎవరిని విచారిస్తారు?
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
నేరస్తుడని రుజువుచేసిందెవరు?
మరి నేరం రుజువైందా? రాజు మాత్రమే ఈ నేరం చేసాడని పోలీసులు ఏ విధంగా నిర్ధారించారు. జనం ఏ విధంగా అతన్ని నిందితుడిని చేశారు? చార్జీషీట్ వచ్చేదాకా అతడిని నిందితుడని కూడా అనడానికి వీల్లేదు. అతనే నేరం చేసాడనీ ఇంకెవరూ నేరంలో భాగస్వాములు లేరని జనం గానీ, పోలీసులు గానీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు గానీ గ్యారంటీగా చెప్పగలరా? పోలీసులు చెప్పినట్టు అతను దొరకనే లేదంటే నేరం చేసింది అతనే అని ఎలా చెప్పగలుగుతారు?
చుట్టు పక్కల జనం, పోలీసులు, కొందరు మీడియా వ్యక్తులు రాజు నేరం చేసాడంటే సరిపోతుందా? అంటే నేరం ఎవరు చేసారో తెలియదు, రుజువులు సరిపోతాయో లేదో తెలియదు. కాని పత్రికల్లో, టివీల్లో సోషల్ మీడియాలో నేర నిర్ధారణ జరిగిపోయింది. రాజు నేరస్తుడని తేల్చేసారు. దీన్ని జన విచారణ అనాలా, మీడియా ట్రయల్ అనాలా లేక పోలీసు కోర్టు న్యాయనిర్ణయం అనాలా?
ఇక శిక్ష. ఏ నేరానికి ఎంత శిక్ష? ఎవరికి అనే ప్రశ్నలతో సంబంధం లేకుండా అధికారం అతనికి ఆత్మహత్య శిక్ష విధించిందా? పద్ధతి ప్రకారం బహిరంగ విచారణ జరిపే న్యాయస్థానాల్లో కాకుండా రహస్యంగా అధికారిక యంత్రాంగంలో కొందరు మాత్రం నేరనిర్ధారణ చేసి, శిక్ష అమలుకు వ్యూహరచన చేసారా?
బాధితురాలైన ఆరేళ్ల అమ్మాయి తల్లిదండ్రులు న్యాయం జరిగిందని మిఠాయిలు పంచుకోవచ్చు. కాని విచారణ లేకుండా దర్యాప్తు చేయకుండా, తన కొడుక్కు మరణశిక్ష విధించి ఆత్మహత్యగా అమలుచేసారని తల్లి చెందే ఆవేదనకు, భార్య శోకానికి ఏ వ్యవస్థ సమాధానం చెబుతుంది? నకిలీ ఎన్‌కౌంటర్లు ఆత్మహత్యరూపంలోకి క్రమంగా మారే ఈ పరిణామాన్ని సమపాలన, న్యాయపాలన నాగరికత అనే పిలుచుకుందామా?
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













