నితిన్ గడ్కరీ: యూట్యూబ్‌తో లక్షలు సంపాదిస్తున్న కేంద్ర మంత్రి - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/nitingadkary
యూట్యూబ్ నుంచి తనకు ప్రతినెలా రూ.4 లక్షలు రాయల్టీగా వస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
తన వీడియోలకు వ్యూవర్‌షిప్ పెరిగిన కారణంగా యూట్యూబ్ తనకు ఆ రాయల్టీని చెల్లిస్తోందని గడ్కరీ చెప్పారు.
గుజరాత్‌లోని భరూచ్‌లో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
''కరోనా మహమ్మారి కాలంలో నేను చెఫ్‌గా మారి ఇంట్లో వంటలు వండాను. దాంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా లెక్చర్లు ఇచ్చాను. విదేశీ యునివర్సిటీల విద్యార్థులకూ పాఠాలు చెప్పాను. ఆన్‌లైన్‌లో 950పైగా లెక్చర్లు ఇచ్చాను. ఆ వీడియోలన్నీ యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేయడంతో వాటిని చూసేవారు పెరిగారు, దాంతో యూట్యూబ్ ప్రతినెలా రూ.4 లక్షలు రాయల్టీగా చెల్లిస్తోంది'' అని గడ్కరీ వివరించారు.

ఫొటో సోర్స్, facebook/dgptelangana
'పల్లంకొండ రాజుది ఆత్మహత్యే.. ఆరుగురు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు' - తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజుది ముమ్మాటికీ ఆత్మహత్యేనని, దీనిపై ఎలాంటి అనుమానాలకు తావులేదని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఈ ఘటనకు ఆరుగురు ప్రత్యక్ష సాక్ష్యులు ఉన్నారని డీజీపీ తెలిపారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు.
'గురువారం కోణార్క్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ వైపు వస్తున్నప్పుడు ఉదయం 9-05 గంటలకు ఈ ఘటన జరిగింది. రాజు రైలు కింద పడటం ఆ రైలు నడుపుతున్న ఇద్దరు లోకో పైలట్లు చూశారు. వాళ్లు వెంటనే స్టేషన్‌ఘన్‌పూర్‌లో స్టేషన్ మాస్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. మళ్లీ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత వాళ్ల అంతర్గత సమాచారంలోనూ ప్రమాద విషయాన్ని నమోదుచేశారు. రైల్వే ఉన్నతాధికారులకు కూడా అధికారికంగా సమాచారం ఇచ్చారు. వీరిద్దరితోపాటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో పనిచేస్తున్న రైతులు కూడా కండ్లారా ఈ విషయాన్ని చూశారు. గురువారం ఉదయం 6-30 గంటల సమయంలో ఓ గ్యాంగ్‌మెన్ ట్రాక్ చెక్ చేసుకొంటూ వెళ్తున్నప్పుడు రాజు అతడికి తారసపడినట్టు చెప్పారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజును ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయినట్టు తెలిపారు. ఆ గ్యాంగ్‌మెన్ పనిపూర్తిచేసుకొని తిరిగి వచ్చేటప్పుడు అతడికి ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందని చెప్పారు. ఇట్లా ఆ పక్కన పొలాల్లో ఉన్న ముగ్గురు రైతులు, ఇద్దరు లోకో పైలట్లు, గ్యాంగ్‌మెన్ ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్ష్యులు. అందరి వాగ్మూలం వీడియో రికార్టు చేశాం. ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు'అని డీజీపీ వివరించారు.
రాజు ఆత్మహత్యపై ప్రజల్లో అనవసర అనుమానాలకు తావిచ్చేలా ఎవరూ మాట్లాడకూడదని సూచించారు.
రాజు మృతిపై న్యాయ విచారణ
పల్లకొండ రాజు ఆత్మహత్యపై న్యాయవిచారణకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రాజు ఆత్మహత్యపై వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విచారణ జరపాలని ఆదేశించింది. నాలుగువారాల్లోగా విచారణ పూర్తిచేసి సీల్డ్‌కవర్‌లో నివేదిక అందజేయాలని స్పష్టంచేసింది.

ఫొటో సోర్స్, facebook/CPIMTelangana
తెలంగాణ సాయుధ పోరాటంతో మీకు సంబంధముందా? - అమిత్‌షాకు రాఘవులు ప్రశ్న
నిజాం నిరంకుశ పాలనను కూల్చింది కమ్యూనిస్టులేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారని నవ తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో దేశవ్యాప్త రైతు ఉద్యమానికి మద్దతుగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సభ జరిగింది.
ముఖ్యఅతిధిగా హాజరైన రాఘవులు మాట్లాడుతూ.. 'కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్మల్ సభలో పాల్గొన్నారు. నిజంగా ఆయన దేశభక్తుడు అయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి పాత్ర ఉందా?. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వారి పూర్వీకులు పనిచేశారా?లేదా?. ఒక్క కార్యక్రమమైనా చేశారా. నిజాం దుర్మార్గాలను, ఫ్యూడల్ విధానాలను ప్రశ్నించారా?. అమిత్‌షా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. లేదంటే నోరుమూసుకుని ఇంట్లో కూర్చోవాలి. కానీ ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు పోరాటం చేశారని అబద్ధాలు ప్రచారం చేయొద్దు. చరిత్రను వక్రీకరించొద్దు. నిజాంకు వ్యతిరేకంగా బందగీ, మఖ్దూం మోహియుద్దీన్, షోయబుల్లాఖాన్, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ ఇలా హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు.కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా ఐక్యంగా పోరాటం జరిగింది' అని రాఘవులు అన్నారు.

ఫొటో సోర్స్, facebook/IamYVSubbaReddy
ఏకాంతంగానే శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈసారీ ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
తిరుమల అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులకు మాత్రమే స్వామి దర్శనం కల్పిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి:
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











