నెయ్యి తింటే కలిగే లాభాలు ఇవీ

నెయ్యి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆయేషా ఇంతియాజ్
    • హోదా, బీబీసీ ట్రావెల్

భారతీయ వంటకాల రచయత కల్యాణ్ కర్మకర్ భోజనంలో నెయ్యి తినకుండా కోల్పోయిన రోజుల్ని తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నారు.

ఇప్పుడాయన తన భోజనంలో అన్ని వంటకాల్లో నెయ్యి ఉండేటట్లు చూసుకుంటున్నారు. వేడి వేడి అన్నం నుంచి చేప వేపుడు, ఉడికించిన దుంపలు, గుడ్లలో కూడా నెయ్యి వేసుకుని తింటున్నారు. బియ్యం, పప్పుతో వండే కిచిడీ కూడా నెయ్యి లేకుండా పూర్తి అవ్వడం లేదు.

కానీ, గతంలో ఇలా ఉండేది కాదు.

"నెయ్యిని ఎక్కువగా తినడం అనారోగ్యానికి దారి తీస్తుందనే భావనతో పెరిగాను. అందుకే నెయ్యి తినకుండా కోల్పోయిన రోజులను పూరించుకునేందుకు ప్రస్తుతం ఆహారంలో నెయ్యి ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నాను. ఇది భూమిపై లభించే స్వచ్ఛమైన ఆహారం" అని అన్నారు.

సాట్యురేటడ్ ఫ్యాట్స్ (సంతృప్త కొవ్వు) పదార్ధాలు ఆరోగ్యానికి మంచివి కావని చెప్పడంతో నెయ్యి వాడకం క్రమేపీ తగ్గిపోయింది. కానీ, ప్రపంచ వ్యాప్తంగా సాట్యురేటడ్ ఫ్యాట్స్ పట్ల దృక్పథం మారుతూ ఉండటంతో భారతీయులు తిరిగి నెయ్యి వాడకాన్ని మొదలుపెడుతున్నారు. కొన్ని తరాలుగా వారి ఆహారంలో నెయ్యి అంతర్భాగంగా ఉంది.

నెయ్యి వాడకాన్ని భారతదేశంలో కొత్తగా ఊపందుకుంటున్న "బ్యాక్ టూ బేసిక్స్ (మూలాల్లోకి తిరిగి ప్రయాణం) ఉద్యమానికి సంకేతంగా కర్మకర్ చూస్తున్నారు. "ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో పాత అలవాట్లకు మళ్లే ప్రచారం బాగా ఎక్కువయింది.

మహమ్మారి సమయంలో ఆహారం తీసుకునే విషయంలో చాలా మంది జాగ్రత్త వహించడం మొదలుపెట్టారు" అని ఆయన వివరించారు.

"ఈ ఉద్యమం "స్లో ఫుడ్" వైపు మళ్లుతున్న ట్రెండ్ లో భాగం అని చెప్పొచ్చు. నెయ్యి లాంటి పదార్ధాలను స్థానికంగా, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చని ఇలాంటి ప్రచారాల ద్వారా చెబుతున్నారు. నెయ్యి వాడకానికి చాలా సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి" అని అంటారు కర్మకర్.

వీడియో క్యాప్షన్, అంకాపూర్ చికెన్‌‌కు అంత రుచి ఎలా వస్తుందో ఫార్ములా చెప్పేశారు

"నెయ్యి తయారీ చేయడం ప్రేమతో చేసే పని" అని గిర్ ఆర్గానిక్ డైరీ ఫార్మ్ సహ వ్యవస్థాపకులు నితిన్ ఆహిర్ అన్నారు.

వీరు గుజరాత్‌లో నెయ్యి తయారీ కూడా చేస్తారు.

విదేశీ జాతులైన జెర్సీ, హోల్ స్టీన్, ఫ్రీసియన్ లాంటి ఆవుల జాతులు కాకుండా ఆయన స్వదేశీ గిర్ ఆవుల నుంచి సేకరించిన పాల నుంచి మాత్రమే నెయ్యి సేకరిస్తారు. ఈ ఆవుల జాతి గిర్ పర్వతాలు, కథియావార్ ప్రాంతానికి చెందినవి.

ఈ ఆవులును గడ్డి మేసేందుకు స్వేచ్ఛగా వదిలేస్తారు. దూడలు తల్లి పాలు తాగిన తర్వాత మిగిలిన పాలను మాత్రమే తీస్తారని చెప్పారు.

ఈ సంస్థ తయారు చేసే ఏ2 నెయ్యి ఉత్తమ పోషకాలతో కూడుకుని ఉంటుందని చెబుతారు. దీనిని "బిలోనా విధానం" లో తయారు చేస్తారు. సంప్రదాయ చెక్క కవ్వంతో మజ్జిగ చిలికే మాదిరిగా ఒక మోటార్ సహాయంతో మజ్జిగను చిలికి వెన్న తయారు చేస్తారు. ఈ విధానం ఆర్ధికంగా లాభదాయకం కాకపోవడం మాత్రమే కాకుండా ఉత్పత్తి కూడా భారీ స్థాయిలో సాధ్యం కాదని ఆయన అంటారు.

కానీ, మహమ్మారి తర్వాత సంస్థ ఉత్పత్తులకు 25-30% డిమాండ్ పెరిగిందని చెప్పారు.

అధిక ఉష్ణోగ్రతల్లో వెన్న పాడవకుండా ఉండేందుకు దానిని కరిగించి నెయ్యి గా మార్చే విధానం భారతదేశంలో పుట్టి ఉండొచ్చు.

గిర్ ఆవు

ఫొటో సోర్స్, Alamy

చాలా మంది భారతీయులకు నెయ్యిని కేవలం వంట పదార్థంగా కాకుండా పవిత్రంగా కూడా భావిస్తారు.

"పాల నుంచి వచ్చే చివరి పదార్ధం నెయ్యి" అని చరిత్రకారులు, రచయత ప్రిథా సేన్ చెప్పారు.

"ఇది భగవంతునికి సమర్పించే స్వచ్ఛమైన నైవేద్యంగా భావిస్తారు. నెయ్యితో చేసే ప్రార్ధనలు నేరుగా స్వర్గానికి చేరుతాయని నమ్ముతారు" అని చెప్పారు.

నెయ్యి చరిత్ర కొన్ని శతాబ్దాల పురాతనమైంది. "4000 సంవత్సరాల పురాతనమైన ఋగ్వేదంలో నెయ్యి గురించి ప్రస్తావన కనిపిస్తుంది" అని చికాగోకు చెందిన ఫుడ్ హిస్టోరియన్ కొలీన్ టేలర్ సేన్ చెప్పారు. ఈయన ఫీస్ట్స్ అండ్ ఫాస్ట్స్: ఏ హిస్టరీ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా" అనే పుస్తకాన్ని రాశారు.

సృష్టికర్త కూడా తన రెండు అర చేతులను ఒకదానితో ఒకటి రుద్దుకుని మొదటి సారి పుట్టిన నెయ్యిని ఆజ్యంలో పోయడం ద్వారా ఈ సృష్టిని సృష్టించారని చెబుతారు" అని అన్నారు.

"భారతీయ సంస్కృతిలో నెయ్యి అంతర్భాగంగా ఉంది. హిందూ వివాహాల్లో, అంత్యక్రియల సమయంలో, ఇతర హిందూ క్రతువుల్లో నెయ్యి వాడకం కనిపిస్తుంది. నెయ్యిని పవిత్రంగా భావిస్తారు".

భారతీయ సంప్రదాయ వైద్య విధానం ఆయుర్వేదంలో కూడా నెయ్యిని చాలా రోగాలకు ఔషధంగా భావిస్తారు. నెయ్యిలో ఉండే లక్షణాలను కొన్ని తరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు అర్ధం చేసుకున్నారు.

భారతీయ సంస్కృతిలో నెయ్యి అంతర్భాగంగా ఉంది

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలకు ఆహారంలో నూనె పదార్ధాలు చేర్చాల్సిన వయసు వచ్చినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా నెయ్యి పెట్టినట్లు అమెరికాలో ఉంటున్న 'బోంగ్ మామ్స్ కుక్ బుక్' రచయత సందీపా ముఖర్జీ దత్త అన్నారు. "ఇది చిన్న పిల్లల ఎముకలు, మెదడు ఎదుగుదలకు తగిన పోషకాలను అందించేందుకు ఆరోగ్యకరమైన కొవ్వులా పని చేస్తుంది" అని చెప్పారు.

ఆమె తల్లి ఇంట్లో చేసిన నెయ్యిని మాత్రమే వాడతారు. ఇండియాలో తయారు చేసిన నెయ్యిని సీసాల్లో ప్యాక్ చేసి అమెరికాకు పంపిస్తారని చెప్పారు. "అది చాలా శుద్ధంగా ఉండి దాని రుచి స్వర్గానికి చేరువలో ఉంటుంది" అని చెప్పారు.

"నెయ్యిని కేవలం వంట చేసేందుకు లేదా కూరలు వేపేందుకు మాత్రమే వాడరు. చిన్న పిల్లల కోసం ఫ్యాన్సీ ఆహారం అందుబాటులోకి రాక ముందు బెంగాల్ లో పిల్లలందరికీ అన్నం, ఉడికించిన బంగాళా దుంపలు, నెయ్యి కలిపి పెట్టేవారు" అని దత్త చెప్పారు.

"ఇది బెంగాల్ అనధికార రాష్ట్ర ఆహారం అని చెప్పొచ్చు" అని అన్నారు.

కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఆరోగ్యానికి హాని చేస్తాయనే ప్రచారం మొదలు కాక ముందు చాలా మంది తల్లులు తమ పిల్లలు రోజంతా బలంగా ఉండేందుకు ఈ వంటకం బాగా పని చేస్తుందని భావించేవారు.

"అయితే, సాట్యురేటడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తాయి అని చెప్పడంతో ఆ ప్రభావం నెయ్యి పై కూడా పడింది. నెయ్యి లో 50 - 70% సాట్యురేటడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కొన్ని దశాబ్దాల పాటు భారతదేశంలో కూడా చాలా ఇళ్లల్లో నెయ్యి వాడకం మానేశారు.

1980లలో వెజిటబుల్ ఆయిల్స్ వాడకాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో, వీటి వాడకం పెరిగి నెయ్యి వాడకం తగ్గింది".

రణవీర్ బ్రార్

ఫొటో సోర్స్, NAJEEB aZIZ

"ఈ ప్రకటనలు మనల్ని కుదిపేస్తాయి. అర్బన్, పశ్చిమ దేశాల జనాభా సంప్రదాయ నూనెల వాడకాన్ని తక్కువగా చూడటం మొదలుపెట్టి వెజిటబుల్ ఆయిల్ వాడకాన్ని మొదలుపెట్టారు" అని అన్నారు.

కాలం గడిచే కొద్దీ, వెజిటబుల్ ఆయిల్స్ వాడకం ఎక్కువయి, నెయ్యి వాడకం తగ్గింది.

"1980ల నుంచి సాట్యురేటడ్ ఫ్యాట్స్ గురించి మొదలైన చర్చ నెయ్యి ని ఒక విలన్ లా చూడటం మొదలయింది. కానీ, అదృష్టవశాత్తు కొవ్వు, కొలెస్టరాల్ గురించి మరింత మెరుగ్గా అర్ధం అయింది" అని రచయత, చెఫ్ రణవీర్ బ్రార్ అన్నారు.

అధిక కొవ్వులతో కూడిన ఆహారాన్ని తీసుకోవద్దని నిపుణులు చెబుతారు. కానీ, కొంత మంది సాట్యురేటడ్ ఫ్యాట్స్ వల్ల కలిగే ముప్పును కాస్త తగ్గించి చూడటం మొదలుపెట్టారు. అధిక కొవ్వులు తీసుకోమని చెప్పే కీటో డైట్ వల్ల కూడా అమెరికా లాంటి దేశాల్లో నెయ్యికి డిమాండ్ పెరిగింది.

నెయ్యిని వంటకాల్లో వాడటం వల్ల వంట రుచి పెరుగుతుంది అని బ్రార్ అంటారు.

భారతదేశంలో నెయ్యి వాడకం ఒక మోతాదులో, వంటకాన్ని సమతుల్యం చేసేందుకు వాడతారు. దీనిని చాలా వంటకాల్లో వంట పూర్తైన తర్వాత చివరన చేరుస్తారు.

నెయ్యి ఎలా వాడాలి. దీనిని పప్పులు లేదా పాల పదార్ధాలతో చేసే కుర్మా వంటకాల్లో వాడితే రుచిగా ఉంటుందని బ్రార్ సూచించారు.

"శీతాకాలంలో తాగే సూపుల్లో తక్కువ మోతాదులో లేదా బ్రెడ్ తో కలిపి వాడొచ్చు. వంటల తాలింపులో వాడుకోవచ్చు. దీంతో, ఇది వంటలో భాగమైపోతుంది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోనే అరుదైన పంట జాపత్రి

నెయ్యితో వంటకాలు తన మెనూలో కచ్చితంగా ఉండేలా చూసుకుంటానని ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్స్ కలినరీ డైరెక్టర్ మనీష్ మల్హోత్రా చెప్పారు. భారతీయ వంటకాలను ప్రపంచం అర్ధం చేసుకుని గుర్తిస్తుందని ఆయన నమ్ముతున్నారు.

ఆయన చేసే సిగ్నేచర్ డిష్ నేతిలో వేపిన మాంసం బోటీ కూరను చాలా మంది ఇష్టంగా తింటారని చెప్పారు.

భారతదేశంలోని రెస్టారంట్‌లలో వడ్డించే చాలా రకాల వంటకాల్లో నెయ్యి ఉంటుంది.

నెయ్యి గురించి అర్ధం చేసుకోవడం భారతీయ ఉనికి గురించి అర్ధం చేసుకోవడం లాంటిదే. ఇక్కడ ఆహారాన్ని ఒక సమగ్రమైన, సమతుల్యమైన విధానంగా భావిస్తారు. నెయ్యిని ఏదో మొక్కుబడిగా లేదా మొత్తం ఆహారంలో ప్రధాన పదార్థంగా వాడరు. నెయ్యి తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే మెరుగైన ఫలితాలు తప్పనిసరిగా కనిపిస్తాయి.

బ్రార్ స్టవ్ దగ్గర చేతికందే దూరంలో నెయ్యి ఎప్పుడూ ఉంటుంది. "నా చిన్నప్పుడు మా అమ్మమ్మ కొంగు పట్టుకుని తిరిగేటప్పుడు మా ఇళ్లంతా కమ్మని నెయ్యి వాసన వస్తూ ఉండేది. నేను నెయ్యి కోసం వెతుకుతున్నప్పుడు, ఒక నూనె పదార్ధం కోసం చూస్తున్నట్లుగా కాకుండా నా బాల్యాన్ని వెతుక్కుంటున్నట్లుగా ఉంటుంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)