పాము, కప్ప వల్ల ప్రపంచానికి రూ.లక్షా 39 వేల కోట్ల నష్టం కలిగింది, ఎలాగంటే...

గువామ్ అనే చిన్న పసిఫిక్ దీవిలోనే 20 లక్షలకు పైగా బ్రౌన్ ట్రీ స్నేక్స్ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లియో సాండ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచవ్యాప్తంగా తెగుళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని అంచనా వేసే శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. కేవలం రెండు జాతులు మాత్రమే మిగతా అన్ని జీవుల కన్నా అధికంగా హాని కలిగిస్తున్నాయని కనుగొన్నారు.

'అమెరికన్ బుల్ ఫ్రాగ్' అనే కప్ప, 'బ్రౌన్ ట్రీ స్నేక్' అనే పాములు 1986 నుంచి ప్రపంచవ్యాప్తంగా రూ. 1,39,087 కోట్ల (16.3 బిలియన్ డాలర్లు) నష్టాన్ని కలిగించాయి.

ఈ రెండు జాతులు, పర్యావరణానికి హాని కలిగించడంతో పాటుగా వ్యవసాయ పంటలను నాశనం చేశాయి. విద్యుత్ అంతరాయాలను కలిగించాయి.

కేవలం 'బ్రౌన్ ట్రీ స్నేక్' వల్లే రూ. 81,570 కోట్ల నష్టం వాటిల్లిందని సైంటిఫిక్ రిపోర్టులో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ దీవుల్లో ఈ పాములు విచ్చలవిడిగా ఉన్నాయి.

అమెరికాలోని గ్వామ్ ప్రాంతంలో అమెరికా నావికా దళాలు గత శతాబ్ధంలో అనుకోకుండా ఈ పాము జాతిని గుర్తించాయి. ప్రస్తుతం వీటి సంఖ్య భారీగా పెరిగింది. ఇవి భారీ ఎత్తున విద్యుత్ కోతలకు కారణమవుతున్నాయి. ఈ పాములు విద్యుత్ తీగలపై జారి పడిపోతూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.

చిన్నదైన పసిఫిక్ ద్వీపంలోనే ఈ పాముల సంఖ్య 20 లక్షలకు పైగా ఉంది. ఈ జాతుల వల్ల దీవుల్లోని పర్యావరణ వ్యవస్థకు మరింత హాని కలుగుతుందని భావిస్తున్నారు. స్థానిక జంతువులు, జీవ జాలానికి ఇవి ముప్పును కలిగిస్తాయి.

అమెరికన్ బుల్ ఫ్రాగ్‌, తమ జాతికే చెందిన ఇతర కప్పలను కూడా తింటుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికన్ బుల్ ఫ్రాగ్‌, తమ జాతికే చెందిన ఇతర కప్పలను కూడా తింటుంది

యూరప్‌లో వేగంగా పెరుగుతోన్న అమెరికన్ బుల్ ఫ్రాగ్‌ల కోసం ఖరీదైన, పటిష్టమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ కప్పలు 30 సెం.మీ వరకు పెరుగుతాయి. అరకిలో బరువు వరకు ఉంటాయి.

వీటి వ్యాప్తిని నియంత్రించడానికి అధికారులు ఖరీదైన ఫ్రాగ్ ప్రూఫ్ ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

కప్పలు తప్పించుకోకుండా నిరోధించడానికి 5 చెరువులకు వేసిన కంచె కోసం జర్మన్ అధికారులు రూ. 2.18 కోట్లు ఖర్చు చేసినట్లు ఒక పాత ఈయూ అధ్యయనం పేర్కొంది.

ఇవి ప్రతీదాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి. ఇతర బుల్ ఫ్రాగ్స్‌ను కూడా ఇవి తింటాయి.

కోకి ఫ్రాగ్ అనే మరో కప్ప జాతి కూడా విభిన్న తరహాలో ఆర్థిక నష్టం కలిగిస్తుందని తెలిసింది. అవి చేసే శబ్ధాల కారణంగా సమీప ప్రాంతాల్లోని భూములు కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్తుల విలువ పడిపోయినట్లు నమ్ముతారు.

భవిష్యత్‌లో తెగుళ్ల నియంత్రణతో పాటు ఇతర బయో సెక్యూరిటీ చర్యల్లో మరింత పెట్టుబడులు పెట్టేలా తమ పరిశోధనలు అధికారులను ప్రోత్సహిస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పాము, కప్ప కలిసి ప్రపంచానికి 1.4 లక్షల కోట్ల నష్టాన్ని కలిగించాయి, ఎలాగంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)