Jail for Pet Dogs: ఈ దేశంలో కుక్కలు, పిల్లుల్ని పెంచితే జైలుకే.. పార్లమెంటుకు 'జంతువుల నుంచి మానవ హక్కుల పరిరక్షణ' బిల్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలీ హమెదానీ
- హోదా, బీబీసీ న్యూస్
''తన అందమైన కళ్లతో అమాయకంగా నావైపు చూస్తూ బయటకు వాకింగ్‌కు తీసుకెళ్లమని వాడు అడుగుతున్నాడు. కానీ, అలా చేసేంత ధైర్యం నాకు లేదు. అలా చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారు.''
టెహరాన్‌కు చెందిన మహ్సా అనే మహిళ తన ఇంట్లో కుక్కను పెంచుతున్నారు. నగరంలో పెంపుడు జంతువులను స్వాధీనం చేసుకోవడానికి, యజమానులను అరెస్ట్ చేయడానికి ఉద్దేశించిన కొత్త ఉత్తర్వుల గురించి చెబుతూ మహ్సా పైవిధంగా స్పందించారు.
ఇరాన్ రాజధాని టెహరాన్‌లోని పార్కుల్లో పెంపుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకురావడం నేరం అని ఇటీవలే పోలీసులు ప్రకటించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిబంధన అత్యంత అవసరమని వారు తెలిపారు.
మరోవైపు, అక్కడి పార్లమెంట్, త్వరలోనే 'జంతువుల నుంచి మానవ హక్కుల పరిరక్షణ' అనే బిల్లును ఆమోదించబోతోంది. ఈ బిల్లుకు ఆమోదం దక్కిన తర్వాత, ఇళ్లలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులను పెంచడం ఇరాన్‌లో నేరంగా మారుతుంది.

ఫొటో సోర్స్, COURTESY OF DR PAYAM MOHEBI
భారీ జరిమానాలు
ప్రతిపాదిత చట్టంలోని నిబంధనల ప్రకారం, దీని కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నుంచి అనుమతి పొందిన వారు మాత్రమే పెంపుడు జంతువులను పెంచుకోవచ్చు.
పిల్లులు, తాబేళ్లు, కుందేళ్లు వంటి జంతువులను అమ్మడం, దిగుమతి చేసుకోవడం, పెంచుకోవడం, రవాణా చేసుకుంటే కనీసం 800 డాలర్ల (రూ. 63,776) జరిమానా విధించవచ్చని చట్టంలో పేర్కొన్నారు.
ఇరాన్ వెటర్నరీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పయమ్ మొహెబీ, ఈ బిల్లును వ్యతిరేకించారు. దీని గురించి బీబీసీతో ఆయన మాట్లాడారు.
''దశాబ్దం క్రితమే ఈ బిల్లుపై చర్చ మొదలైంది. అప్పుడు పార్లమెంట్ సభ్యుల్లోని ఒక బృందం, దేశంలోని కుక్కలు అన్నింటినీ స్వాధీనం చేసుకొని వాటిని జూలకు ఇవ్వడం లేదా ఎడారుల్లో వదిలిపెట్టేలా ఒక చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నించింది. ఇన్నేళ్లలో ఈ బిల్లును రెండుసార్లు సవరించారు. పెంపుడు కుక్కల యజమానులను దండించాలనే అంశంపై కూడా చర్చించారు. అయినప్పటికీ, ఈ బిల్లు కార్యరూపం దాల్చలేదు'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, IRANIAN ROYAL FAMILY COLLECTION
ఇరాన్ పట్టణ జీవితానికి చిహ్నాలు పెంపుడు కుక్కలు
ఇరాన్ గ్రామీణ ప్రాంతాల్లో కుక్కలను పెంచుకోవడం సాధారణమే. కానీ, గత వందేళ్ల కాలంలో నగరాల్లో కూడా కుక్కలను పెంచుకోవడం పట్టణ జీవన శైలికి చిహ్నంగా మారిపోయింది.
1948లో జంతు సంరక్షణ చట్టాన్ని ఇరాన్ అమల్లోకి తెచ్చింది. పశ్చిమాసియాలో ఈ చట్టాన్ని తెచ్చిన అతి కొద్ది దేశాల్లో ఒకటిగా ఇరాన్ నిలిచింది.
దీని తర్వాత, జంతువుల హక్కులను ప్రోత్సహించే తొలి సంస్థను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సహాయపడింది. అప్పట్లో దేశ రాజకుటుంబానికి కూడా పెంపుడు కుక్కలు ఉండేవి.
అయితే, 1979లో జరిగిన 'ఇస్లామిక్ ఉద్యమం... ఇరాన్ ప్రజలకు, పెంపుడు కుక్కలకు చెందిన అనేక అంశాలను మార్చింది.
ఇస్లాం, జంతువులను అపవిత్రంగా భావిస్తుంది. ఇస్లామిక్ ఉద్యమం తర్వాత దేశంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం దృష్టిలో కుక్కలు, 'పాశ్చాత్యీకరణ'కు చిహ్నంగా మారాయి. దీంతో కుక్కలు పెంచుకోవడాన్ని నివారించేందుకు అక్కడి అధికారులు ప్రయత్నించారు.
కుక్కలను పెంచుకోవడంపై ఒక పటిష్ట నిబంధన అనేది ఎప్పుడూ లేదని టెహరాన్ వెటర్నరీ డాక్టర్ అష్కాన్ షెమిరానీ, బీబీసీతో అన్నారు.
''కుక్కలతో వాకింగ్ చేసినప్పుడు లేదా వాటిని తీసుకొని కారులో వెళ్తున్నప్పుడు పోలీసులు, వాటి యజమానులను అరెస్ట్ చేస్తారు. పాశ్చాత్యీకరణలో భాగంగా ప్రజలు వాటిని పెంచుతున్నారని పోలీసులు అనుకుంటారు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌లో కుక్కల కోసం జైలు
''ప్రభుత్వం, కుక్కల కోసం ఒక జైలును నిర్మించింది. ఆ జైలుకు సంబంధించి చాలా భయంకరమైన కథలను మేం విన్నాం. తగినంత ఆహారం, నీరు ఇవ్వకుండా ఆ జైలులో కుక్కలను చాలా రోజులు ఉంచుతారు. ఆ కుక్కల యజమానులు కూడా అన్ని రకాలైన చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు'' అని అష్కాన్ వివరించారు.
ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టడంలో ఇరాన్ ఆర్థిక సంక్షోభం కూడా కీలక పాత్ర పోషించింది. కొన్నేళ్లుగా పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.
విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం కోసం 'పెంపుడు జంతువుల ఆహారం' దిగుమతులపై మూడేళ్ల కాలానికి పైగా నిషేధం విధించారు.
ఈ విషయం గురించి మష్‌హాద్‌లోని ఒక వెటర్నరీ క్లినిక్ యజమాని, బీబీసీతో మాట్లాడారు. ''రహస్యంగా 'పెట్ ఫుడ్'ను సరఫరా చేసే వ్యక్తులపై మేం ఇప్పుడు ఆధారపడుతున్నాం. వాటి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి'' అని చెప్పారు.
స్థానికంగా తయారు చేసే ఈ ఆహారపదార్థాలు నాణ్యంగా ఉండవని ఆయన తెలిపారు. ''వాటి నాణ్యత చాలా దారుణంగా ఉంటుంది. చౌక మాంసం లేదా చౌకగా లభించే చేపలతో ఆహారం తయారు చేస్తారు. గడువు దాటిన పదార్థాలను అందులో ఉపయోగిస్తారు'' అని చెప్పారు.

కుక్కలే కాదు పిల్లులు కూడా
ప్రతిపాదిత చట్టం... కేవలం కుక్కలనే కాదు పిల్లులను కూడా లక్ష్యంగా చేసుకుంది. మొసళ్ల గురించి కూడా ఈ చట్టంలో ప్రస్తావించారు.
'పర్షియన్ క్యాట్' అనే పిల్లి జాతికి ఇరాన్ జన్మస్థలం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పిల్లి జాతుల్లో ఇది కూడా ఒకటి.
''ఇకపై పర్షియన్ జాతి పిల్లులకు దాని సొంతభూమి సురక్షిత ప్రదేశం కాదంటే మీరు నమ్మగలరా? ఈ చట్టానికి అసలు అర్థమే లేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రజలపై తమ అధికారాన్ని చూపెట్టాలని అనుకుంటున్నారంతే'' అని టెహరాన్‌కు చెందిన ఒక వెటర్నరీ డాక్టర్ అన్నారు.
ప్రతిపాదిత చట్టాన్ని డాక్టర్ మొహెబీ, 'అవమానకరం' అని వ్యాఖ్యానించారు.
''ఒకవేళ పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదిస్తే, రాబోయే తరాలు మన తరాన్ని పిల్లులు, కుక్కల్ని నిషేధించిన తరంగా గుర్తు పెట్టుకుంటాయి'' అని అన్నారు.
ఇరాన్‌లో మహ్సా వంటి చాలామంది వారి పెంపుడు జంతువుల భవిష్యత్ గురించి ఆందోళనలో ఉన్నారు.
''నా పెంపుడు కుక్క, నాకు కుమారుని లాంటిది. దాన్ని పెంచుకునేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ వారు నా దరఖాస్తును తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి? నేను దాన్ని రోడ్లపై వదిలేయలేను'' అని మహ్సా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లఖ్‌నవూ లులు మాల్లో నమాజ్, వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
- లలిత్ మోదీ: ఈయన కొందరికి విలన్, మరి కొందరికి మాత్రం హీరో
- ‘‘ఇప్పుడు మేం, మా పిల్లలు మాత్రం బతికున్నాం. ఇంకేమీ మిగల్లేదు''
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- శ్రీలంక కు భారత్ చేయాల్సింది సైనిక సాయమా, ఆర్ధిక సాయమా, 1987 అనుభవాలు ఏం చెబుతున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











