ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య పెరగడానికి అసలు కారణాలేంటి?

ఫొటో సోర్స్, VARUN THAKKAR
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిపిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
పులుల సంఖ్య పెరుగుదలపై జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అయితే, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పులి జాడలు కలకలం రేపుతున్నాయి. పలు చోట్ల పాడి పశువులపై పులులు దాడి చేస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
కాకినాడ జిల్లాలో నెల రోజుల నుంచి సంచరిస్తున్న పులి రాయల్ బెంగాల్ టైగర్‌గా అధికారులు గుర్తించారు. కానీ దానిని ఎలా రెస్క్యూ చేయాలన్న దానిపై స్పష్టత రాకపోవడంతో యంత్రాంగం కూడా ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ సమయంలో పులల సంఖ్యకు సంబంధించిన సర్వే ఆసక్తిదాయకంగా మారింది.

ఫొటో సోర్స్, VARUN THAKKAR
ఎన్ని పులులు ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా దేశ వ్యాప్తంగా పులుల సంఖ్య నిర్ధారణ కోసం నాలుగేళ్లకు ఓసారి సర్వే నిర్వహిస్తారు.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. రాష్ట్రాల వారీగా పులుల సంఖ్యను నిర్ధారించి, అధికారికంగా ప్రకటిస్తారు. 2018లో జరిగిన సర్వే వివరాలను 2019లో వెల్లడించారు.
అప్పట్లో దేశంలోనే పులుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో ఎక్కువ పులులు ఉన్నట్టు ప్రకటించారు. అప్పట్లో మొత్తంగా 2,967 పులులు ఉండగా ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 526 ఉన్నట్టు ఎన్‌టీసీఏ తెలిపింది. ఆ తర్వాత కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అత్యధికంగా పులులు ఉన్నాయి.
ఆ నివేదిక ప్రకారం ఏపీలో 48 పులులు ఉన్నట్టు ప్రకటించారు. పులి సంచారం ఉన్న 21 రాష్ట్రాల్లో ఏపీ 12వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో 26 పులులు ఉన్నట్టు తెలిపారు.

ఫొటో సోర్స్, VARUN THAKKAR
పెరుగుతున్న సంఖ్య
2006లో 1,411 పులులు ఉన్నట్టు ఎన్‌టీసీఏ ప్రకటించింది. ఆ తర్వాత 2010లో వాటి సంఖ్య 1,706గా నమోదయ్యింది. తర్వాత నాలుగేళ్లకు 2,226కి చేరింది. 2018 నాటి సర్వే ప్రకారం 2,967 పులులు ఉన్నట్లుగా గుర్తించారు.
ఈ సారి జరుగుతున్న సర్వేలో దేశవ్యాప్తంగా వాటి సంఖ్య 3వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో కూడా అదే క్రమంలో పులుల సంఖ్య పెరుగుతోంది.

ఫొటో సోర్స్, DFO, markapuram
తొలుత ఉమ్మడి రాష్ట్రంలో 46 పులులు ఉన్నట్టు ప్రకటించగా, 2018 నాటికి ఒక్క ఏపీలోనే వాటి సంఖ్య 48గా నిర్ధారణ అయ్యింది.
ప్రస్తుతం 2022 సర్వే ప్రకారం ఈ సంఖ్య 70 దాటుతోందని సర్వే నిర్వహణ బాధ్యతల్లో ఉన్న మార్కాపురం అటవీ శాఖ అధికారి, ఐఎఫ్ఎస్ విఘ్నేష్ బీబీసీకి తెలిపారు.
రాష్ట్రంలో పులుల సంఖ్యపై స్పష్టత వచ్చిందని, అధికారిక ప్రకటనను ఎన్‌టీసీఏ చేస్తుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడొంతులు నల్లమలలోనే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఏరియాలో పులుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ప్రకాశం జిల్లా మార్కాపురం, నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న ఆత్మకూరు డివిజన్ల పరిధిలో విస్తరించి ఉన్న నల్లమలలో అత్యధికంగా పులుల జాడ ఉంది.
నల్లమల, శేషాచలం ప్రాంతంలోనే రాష్ట్రంలో మూడొంతుల పులులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. 55 పులులకు పైగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. పాపికొండల ప్రాంతంలోనూ పులల సంచారం గుర్తించారు.
సహజంగా ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల నుంచి ఏపీలోని అటవీ ప్రాంతానికి పులుల రాకపోకలు సాగిస్తుంటాయి.
మహారాష్ట్రలోని మాల్గార్ రిజర్వు ఫారెస్ట్ నుంచి కూడా నల్లమల వైపు పులులు వస్తూ పోతూ ఉంటాయి. ఒడిశాలోని సిమ్లిపాల్ రిజర్వు నుంచి పాపికొండలు అటవీ ప్రాంతానికి కూడా పులులు వస్తుంటాయి.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3500 చదరపు కిలోమీటర్ల పరిధిలో పులుల సంచారం ఉన్నట్టు తాజా సర్వేలో పేర్కొన్నారు. ప్రతి పులికి టెరిటోరిల్(సరిహద్దులు) 100 చదరపు కిలోమీటర్లుగా ఉంటుందని ప్రస్తావించారు.
పులుల సర్వే ఎలా చేస్తారు
తొలుత దేశంలో 2006లో పులుల లెక్కలు తేల్చేందుకు ఈ సర్వే ప్రారంభించారు. అంతకుముందు పులుల ఆనవాళ్లను బట్టి, అంచనాగా లెక్కలు ఉండేవి.
శాస్త్రీయంగా పులుల ఫోటోలు సేకరించి, వాటి సంఖ్యను నిర్ధారించే ప్రక్రియ ఇప్పటికే నాలుగు దఫాలు ముగిసింది. ప్రస్తుతం ఐదో దఫా పులుల సంఖ్యను తేల్చే ప్రక్రియ పూర్తవుతోంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పులుల జనాభాకు సంబంధించిన లెక్కలను తేల్చే సర్వేని అటవీ శాఖ వన్యప్రాణి విభాగం పూర్తి చేసింది. నిర్ధారణ కోసం రెండో దఫా వివరాల సేకరణ కూడా చేశారు. వాటిని అధికారికంగా ఎన్‌టీసీఏ వెల్లడించాల్సి ఉంది.
పులుల సంఖ్య నిర్ధారణ కోసం వాటి సంచారం ఉన్న ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వాటిలో లభించే వివరాలను నమోదు చేస్తారు. వాటితో పాటుగా కాలి ముద్రలను సేకరిస్తారు. కాలి గుర్తులను బట్టి పులిని గుర్తించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దేశంలో ప్రతీ పులికి సంబంధించిన ఫోటో, వయసు సహా ఇతర వివరాలన్నీ సర్వే రిపోర్టులో పొందుపరుస్తారు. తద్వారా పులికి సంబంధించిన జాడలు ఎక్కడ బయటపడినా అది ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు సులువుగా గుర్తించే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
సంరక్షణ మూలంగానే...
సర్వే తర్వాత కూడా కొన్ని పులుల సమాచారం చేరుతుంది. దాంతో 2021 నాటి అంచనాల ప్రకారం ఏపీలో 63 పులల వరకూ ఉన్నట్టు అటవీ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 70 దాటుతుండడానికి ప్రధాన కారణం పులుల సంరక్షణ కోసం తీసుకున్న చర్యలేనని కాకినాడ డీఎఫ్ఓ సెల్వం బీబీసీతో అన్నారు.
"ఇటీవల కాకినాడ జిల్లాలో తిరుగుతున్న రాయల్ బెంగాల్ టైగర్ కూడా ఏపీ జాబితాలో లేదు. ఎన్టీసీఏ లిస్టులో కూడా దాని ఆనవాళ్లు లేవు. ఇప్పుడు అది కూడా మన రాష్ట్రంలో తాజా లెక్కల్లో వచ్చింది. అది యంగ్ టైగర్. కాబట్టి తన టెరిటరీ కోసం ప్రయత్నిస్తోంది. ఇలాంటి పులులను పరిరక్షించే ప్రయత్నం జరుగుతోంది. ఇటీవల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రంలో పులుల సంఖ్య పెరగడానికి అదే కారణం. గడిచిన నాలుగేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం వివిధ కారణాలతో 5 పులులు చనిపోయాయి. అయినా రాష్ట్రంలో పులుల సంఖ్య పెరగడం ఆశాజనకం"అని ఆయన వివరించారు.
ఆక్రమణలు అడ్డుకోవడం ఉపయోగపడుతోంది..
నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఏరియాలో మొత్తం 950 కెమెరాల సహాయంతో పులుల సమాచారం సేకరించామని మార్కాపురం డీఎఫ్ఓ విఘ్నేష్ బీబీసీకి తెలిపారు. పులులతో పాటుగా వివిధ జంతువుల సమాచారం కూడా లభించిందని, గతంతో పోలిస్తే వన్యప్రాణులకు ఎన్ఎస్టీఆర్ సురక్షిత ప్రాంతంగా మారుతుండడం సానుకూల అంశం అంటూ ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, DFO, markapuram
"పులి పిల్లల ఫోటోలు కూడా లభించాయి. ఒక్కో పులికి రెండు, మూడు కూడా పిల్లలు ఉన్నట్టు గుర్తించాం. వచ్చే నెలలో టైగర్ డే సందర్భంగా అధికారికంగా దేశవ్యాప్త సమాచారాన్ని ప్రధాని చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. ఏపీలోని ఎన్ఎస్టీఆర్, తెలంగాణలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఏరియాల మధ్య కృష్ణా నది సరిహద్దుగా ఉంటుంది. ఆ ప్రాంతంలో గతంలో అనధికారికంగా చేపల వేట సాగేది. దాంతో వన్యప్రాణుల రాకపోకలకు సమస్యగా ఉండేది. ఇటీవల మత్స్యకారులతో మాట్లాడి చేపల వేటను అడ్డుకోవడంతో పులులు కృష్ణా నదిని దాటుకుంటూ అటూ ఇటూ రాకపోకలు చేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని వన్యప్రాణులు పెరగడానికి ఇది దోహదపడుతుందని"అని తెలిపారు.
పులులను గుర్తించడంలో వాటి ఒంటి మీద ఉండే చారలు కీలకంగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రతీ పులికి ఆ చారలు భిన్నంగా ఉంటాయని, అదే తోడ్పడుతుందని వివరించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటుగా ఏపీలో కూడా పులుల సంఖ్య పెరుగుతుండడం పట్ల అటవీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
ఇవి కూడా చదవండి:
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















