జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?

జగనన్న కాలనీ మోడల్ ఇల్లు

ఫొటో సోర్స్, housing.ap.gov.in

ఫొటో క్యాప్షన్, జగనన్న కాలనీ మోడల్ ఇల్లు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"పేదలకు నెలకు లక్ష ఇళ్లు కట్టడమే లక్ష్యం. అధికారులు దీనికి తగ్గట్టు కార్యక్షేత్రంలో దిగి చర్యలు తీసుకోవాలి. ప్రతి 15 రోజులకు లక్ష్యాలను చేరుకుంటున్నామో లేదో సమీక్ష ఉంటుంది" అని ఏపీ గృహా నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆ పార్టీ నాయకులు, మంత్రులు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

క్షేత్రస్థాయిలో వైఎస్సార్ కాలనీల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు బీబీసీ అనకాపల్లి జిల్లా నర్సయ్యపేట, మాడుగుల, విశాఖపట్నం సమీపంలోని పైడివాడ అగ్రహారంలోని జగనన్న కాలనీలలో పర్యటించింది. కొన్నిచోట్ల లబ్ధిదారులు తమకు కేటాయించిన జగనన్న కాలనీలోని స్థలాలను తిరిగి ప్రభుత్వానికే అప్పగించారు.

'పట్టాలు తిరిగి ఇచ్చేశారు'

'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు', పథకంలో భాగమే వైఎస్సార్-జగనన్న కాలనీలు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ వైఎస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్లకు అన్నీ సౌకర్యాలు ఉన్నాయని రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు చెప్తున్నారు.

అయితే వీటిని అందుకున్న లబ్ధిదారులు చాలామంది ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సాయం, ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రాంతాలపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో తమకు ఇచ్చిన ఇంటి స్థలాలను కొందరు తిరిగి ఇచ్చేస్తూ స్థానిక తహాశీల్దార్‌కు లేఖలు ఇస్తున్నారు.

ఈ పరిస్థితి విశాఖపట్నం జిల్లా వి.మాడుగుల మండలంలో కనిపించింది. దాదాపు ఇలా వంద మంది తిరిగి ఇంటి స్థలాలను తిరిగి ఇచ్చేస్తూ లేఖలు ఇచ్చారని వి.మాడుగుల తహాశీల్దార్ పీవీ రత్నం బీబీసీతో చెప్పారు.

"2021 మార్చిలో వి.మాడుగుల మండలంలోని వెయ్యి మందికి వైఎస్సార్ జగనన్న కాలనీల్లోని ఇంటిపట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కోవిడ్ కావడంతో నిర్మాణాలు చేపట్టలేదు. అయితే కోవిడ్ తగ్గిన తర్వాత ఇప్పుడు తాము అక్కడ ఇల్లు కట్టుకోలేమంటూ 98 మంది ఇళ్ల పట్టాలను తిరిగి ఇచ్చేస్తున్నట్లు మాకు లేఖలు ఇచ్చారు. తల్లిదండ్రులకు ఇంటి పట్టా వచ్చినా, ఆ ఇంటిలోని పిల్లలు రేషన్ కార్డులు వేరేగా పొందటం వల్ల ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నా కూడా ఇరువురికి ఇళ్ల పట్టాలు వచ్చాయి. దాంతో ఒకరు పట్టాను తిరిగి ఇచ్చేస్తున్నారు" అని తహాశీల్దార్ వీపీ రత్నం చెప్పారు.

అయితే వారు ఇచ్చిన లెటర్ ఆఫ్ రిలిక్విష్మెంట్ (Letter of relinquishment)లో మాత్రం తమ నివాస గ్రామానికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఇంటి స్థలాన్ని మంజూరు చేయడంతో అక్కడ మేం ఇల్లు కట్టుకోలేమని, అందుకే తిరిగి అప్పగిస్తున్నామంటూ లబ్ధిదారులు చెప్పారు.

ఇలా ఇచ్చేసిన వారిలో వి.మాడుగుల మండలంలోని జాలంపల్లి, పోతనపూడి అగ్రహారం, ఎల్.పొన్నవోలు గ్రామాల లబ్ధిదారులున్నారని తహాశీల్దార్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఇళ్ల పట్టాలను తిరిగి ఇస్తున్న ధోరణి ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోయినా, ఒకటి రెండుచోట్ల ఇలాంటి పరిణామాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

జగనన్న కాలనీ

'ప్రభుత్వం ఇస్తున్న డబ్బు సరిపోదు'

నివాసయోగ్యమైన ప్రాంతాలకు దూరంగా ఉన్నాయని కొందరు అక్కడ ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అలాగే కొందరు కట్టుకునేందుకు ముందుకు వచ్చినా అక్కడ ప్రాధమిక సౌకర్యాలు లేవని, మరికొందరు ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సరిపోవని ఇళ్ల నిర్మాణానికి వెనకడుగు వేస్తున్నారు.

వైఎస్సార్ జగనన్న కాలనీలలో స్థలం, ఇంటి నిర్మాణ స్కీం పొందిన కొందరు లబ్ధిదారులతో బీబీసీ మాట్లాడింది.

"మాకు ఇచ్చిన ఇంటి స్థలం చాలా దూరంగా ఉంది. అక్కడకు వెళ్లాలంటే నడకదారి కూడా లేదు. కొందరికైతే తమ స్థలం ఎక్కడుందో కూడా తెలీదు. అలాగే నీటి సౌకర్యం, కరెంట్ కూడా లేదు. అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంటి స్థలం ఇచ్చారు. చిన్న చిన్న పనులు చేసుకుని బతికే మేం అంత దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోలేం" అని చోడవరంలోని వెంకన్నపాలెంకు చెందిన కొందరు లబ్ధిదారులు చెప్పారు.

చోడవరం మండలంలోని నర్సయ్యపేటలో ఇళ్ల పట్టాలు పొందన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు మంచి ప్రాంతంలో స్థలం, రోడ్డు పక్కనే దక్కిందని చెప్పారు.

అయితే ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం సరిపోవడం లేదని అన్నారు. అయితే కొందరు డబ్బులున్నవారు ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా...అధికారుల ఒత్తిడితో మరికొందరు అప్పులు తెచ్చి మరీ ఇల్లు కట్టుకుంటున్నారు.

ఇల్లు కట్టుకోవాలని వలంటీరు దగ్గర నుంచి అధికారుల వరకు ఒత్తిడి తేవడంతో తప్పడం లేదని చెప్పారు. పూర్తిగా ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని కొందరు కోరుతున్నారు.

జగనన్న కాలనీ

ఫొటో సోర్స్, @APStateHousing/twitter

కనీస ఖర్చు ఎంత?

ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులకు ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది.

1. లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకోవడం,

2. లబ్ధిదారుడికి నిర్మాణ సామగ్రి అందించడం

3. ప్రభుత్వం పూర్తిగా ఇంటిని నిర్మించి ఇవ్వడం

మూడో ప్రత్యామ్నాయానికే ఎక్కువ మంది మొగ్గుచూపారు.

ఇంటి నిర్మాణ సామగ్రిని 2020 డిసెంబరు నాటి ధరల ప్రకారం నిర్ణయించారు. అయితే నిర్మాణ సామాగ్రి ధరల్లో అప్పటికి, ఇప్పటికి చాలా తేడా వచ్చింది.

విశాఖకు సమీపంలో ఉన్న పైడివాడ అగ్రహారంలోని పేదలకు కేటాయించిన ఇంటి స్థలాల వద్ద బీబీసీ పర్యటించినప్పుడు, కొందరు లబ్ధిదారులు, మేస్త్రీలను తీసుకొచ్చి అక్కడే ఉన్న మోడల్ హౌస్ లా నిర్మించాలంటే అయ్యే ఖర్చు వివరాలు తెలుసుకుంటున్నారు.

నగరానికి సమీపంలో ఉండటంతో ఇక్కడ ఒక్కొ లబ్ధిదారుడికి 50 గజాల స్థలాన్ని మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే సెంటున్నర అంటే 72 గజాల స్థలం ఇచ్చింది.

వీడియో క్యాప్షన్, పరువు హత్యలు కాదు, అహంకార హత్యలు

"ప్రభుత్వం సూచించిన సైజుల్లో ఇంటిని ఆగకుండా నిర్మించాలంటే కనీసం రెండు నెలలు పడుతుంది. ఈ రెండు నెలలూ ఒక మేస్త్రీ, ఇద్దరు కూలీలు ఉండాలి. ప్రస్తుతం తక్కువ రేటు అనుకున్నా, మేస్త్రీ పనికి రూ.800, కూలీకి రూ. 600 ఇవ్వాలి. దీనికే రూ.1.2 లక్షలు అవుతుంది. ఇక సిమెంటుకు రూ.50వేలు, ఇనుము కనీసం ముప్పావు టన్ను పడుతుంది. దీనికి రూ. 60 వేలు, ఇతర నిర్మాణ సామాగ్రికి రూ. 1.5 లక్షలు అవుతుంది. మేస్త్రీ, కూలీల ఛార్జీతో పాటు మెటీరియల్ రవాణా ఖర్చు కలిపి రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలవుతుంది. ఇక పెయింటింగ్, వైరింగ్, బిగింపులు వంటి ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షల రూపాయలైనా అవుతుంది." అని మేస్త్రీ నాయుడు బాబు బీబీసీతో చెప్పారు.

సాదాసీదాగా కట్టాలన్నా అంటే ఎటువంటి హంగులు లేకుండా గోడలు, తలుపులు, కిటికీలు, బాత్రూం ఉన్న ఇల్లు 60 గజాల్లో కట్టాలంటే కూడా కనీసం రూ.3 లక్షలు అవుతుందని చెప్పారు. చాలా ప్రాంతాల్లో ఇంటి స్థలాలను లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చారు. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ముందు రోడ్డు లెవెల్ కు మట్టిపోసి, చదును చేసుకోవాలి. దీనికి అదనపు ఖర్చు అవుతుంది.

మొత్తం మీద ఇళ్ల నిర్మాణంలో ఖర్చులు, ఇతర సమస్యలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయి.

పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు
ఫొటో క్యాప్షన్, పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు

'6 నెలల్లో కట్టుకుని, ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు'

లబ్ధిదారులకు పట్టా ఇచ్చిన తర్వాత ఆరు నెలల లోపు అక్కడ ఇంటిని నిర్మించుకోవాలనే నిబంధన ఉంది. ఒక వేళ అలా చేయనట్లైతే...అతడు/ఆమెకు ఆ ఇంటి స్థలం అవసరం లేదని భావిస్తూ ప్రభుత్వం తిరిగి వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. అలాగే పట్టా పొందిన లబ్ధిదారులు వాటిని అమ్మకూడదు.

అయితే ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. కానీ, ఈ నిబంధనలు పాటించే వారు కనిపించడం లేదు. పట్టా చేతికి వచ్చిన వెంటనే నోట్లు రాసుకుని అమ్మడం, కొనడం జరుగుతున్నాయి. కొందరు మాకు ఇల్లు ఉంది కాబట్టి, మళ్లీ కట్టుకోవడం ఎందుకని, మరికొందరు ఆర్థిక అవసరాలంటూ విక్రయాలు చేస్తున్నారు.

పైడివాడ అగ్రహారం, నర్సయ్యపేట వంటి చోట రోడ్డు పక్కనే స్థలాలు ఇవ్వడంతో ఇక్కడ స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. నర్సయ్యపేటలో 72 గజాలు రూ. 4 నుంచి రూ. లక్షలు, పైడివాడ అగ్రహారంలో 50 గజాల స్థలం రూ. 6 లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి.

అయితే చాలా మంది ఇలాంటి డిమాండ్ ఉన్న చోట ఇల్లు కట్టుకోడానికే ఎక్కువ మంది లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి కనీస సౌకర్యాలైనా ఉండాలి కదా అని అంటున్నారు.

ఇలా క్రయవిక్రయాలు చేపట్టడం నేరమని, దీనిపై ఎటువంటి తగాదాలు వచ్చినా చట్టాలు, కోర్టులు పరిష్కరించలేవని అధికారులు చెప్తున్నారు. పైగా వివాదం వస్తే ప్రభుత్వం ఎవరికైతే స్థలం ఇచ్చిందో వారికే చెల్లుతుందని, కొన్న వారికి ఎటువంటి హక్కులు ఉండవని తెలిపారు.

జగనన్న కాలనీ

విమర్శలపై ప్రభుత్వం ఏమంటోంది?

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా భావిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ, జగనన్న కాలనీల నిర్మాణం కార్యక్రమాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

నాసిరకం ఇళ్లు నిర్మిస్తున్నారని, కనీస సౌకర్యాలు లేని చోట స్థలాలు ఇచ్చారని, ప్రభుత్వమే పూర్తిగా కట్టి ఇవ్వాల్సిన ఇళ్ల నిర్మాణ భారాన్ని లబ్ధిదారులపైనే వేస్తున్నారంటూ టీడీపీ సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణ విమర్శించారు. అయితే ఈ విమర్శలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది.

తొలి దశ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి ఏడాదిన్నర కావస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. ఈ ఏడాదిన్నరలో కరోనావైరస్ మహమ్మారి, కోర్టు కేసులతో ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పనులు వేగవంతగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒక్క మే నెలలోనే 30 వేల ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.

వీడియో క్యాప్షన్, దళిత రైతు పొలంలోకి మురుగు నీరంతా వదిలేశారు

"ప్రస్తుతం రోజుకు రూ.25 కోట్ల మేర పనులు జరుగుతున్నాయి. 17 వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో 30.60 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశాం. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా లేఅవుట్‌లలో విద్యుత్‌ సరఫరా, బోర్లు వేయడం, మోటార్లు బిగించడం వంటి పనుల కోసం ఇప్పటికే రూ.450 కోట్లతో తాత్కాలిక సదుపాయాల కల్పన చేపట్టాం" అని ఆయన తెలిపారు.

ప్రారంభంలో ఆప్షన్‌-3 ఎంచుకున్న లబ్ధిదారులు చాలావరకూ స్వచ్ఛందంగా విరమించుకుని, ప్రస్తుతం 3.27 లక్షల మంది మాత్రమే ఆప్షన్‌-3కి కట్టుబడి ఉన్నారని జోగి రమేష్ చెప్పారు. లబ్ధిదారులను గ్రూపులుగా ఏర్పాటుచేసి వీరి ఇళ్ల నిర్మాణ బాధ్యతను గృహ నిర్మాణ శాఖ చేపట్టిందని తెలిపారు.

జగనన్న కాలనీ

‘ఇది నిరంతర ప్రక్రియ’

రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలెవ్వరు ఉండకూడనే ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మొత్తం రూ.28,084 కోట్లతో మొదటిదశలో 15.60 లక్షల పక్కాగృహాలు నిర్మాణాలు, రెండో దశలో రూ.22,860 కోట్లతో మరో 12.70 లక్షల గృహాల నిర్మాణం చేయ‌నున్నారు.

వీటిని 2023 చివరకు పూర్తి చేయాలనేది టార్గెట్. ఆ తర్వాత ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నా కూడా వారందరికి ఇళ్లు ఇస్తామని... ఇది నిరంతర ప్రక్రియ అని ఏపీ ప్రభుత్వం చెప్తోంది.

ఈ పథకంలో భాగంగా నిర్మించే ఇళ్లు 340 చదరపు అడుగుల్లో ఉంటాయి. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బులు, ఒక ప్లాస్టిక్ వాటర్ ట్యాంకు ఉంటాయి. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన మూడు అప్షన్లలో ఏ అప్షన్ ఎంచుకున్నా...ప్రభుత్వం తరపున గరిష్టంగా రూ. లక్షా 80 వేల రూపాయిల సాయం లబ్ధిదారుడికి అందుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)