Tollywood: సినిమా కార్మికుల ఆందోళనతో షూటింగ్‌లు నిలిచిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది?

- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సినీ పరిశ్రమ కార్మికులు హైదరాబాద్‌లో పోరుబాట పట్టారు. కృష్ణానగర్ కష్టాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రెండు రోజులుగా షూటింగులు ఆగిపోయాయి.
జూన్ 22న హైదరాబాద్‌లో సినీ కార్మికులు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా వేతనాలు పెంచే వరకు పనులకు రాబోమని స్పష్టం చేశారు.
వేతనాలు పెంచడంపై తర్వాత ఆలోచిస్తామని, సమ్మె నోటీసులు ముందుగా ఇవ్వకుండా పనులకు హాజరు కాకపోవడం సరికాదని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తున్నాయి.
గురువారం జరిగిన చర్చల అనంతరం, వేతనాలు పెంచుతామని నిర్మాతల మండలి హామీ ఇవ్వడంతో శుక్రవారం నుంచి షూటింగ్ లకు హాజరవుతామని సినీ కార్మిక సంఘాలు ప్రకటించాయి.

ఇంతకూ ఈ వివాదం ఏమిటి?
"౩౦ ఏళ్లుగా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ విభాగంలో పని చేస్తున్నాను. మూడు ఏళ్లకు ఒక సారి ౩౦% వేతనాలు పెరిగేవి కానీ ఈ సారి నాలుగేళ్లు అయినా పెరగలేదు. నెలకు 10 -15 రోజులే పని దొరికే వారు కూడా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి" అని వేణుగోపాలరావు అనే కార్మికుడు ప్రశ్నించారు.
నాలుగేళ్లుగా వేతనాలు పెంచడం లేదు కాబట్టే , ఇలా రోడ్ల మీదకు వచ్చి తమ గోడు వినిపించాల్సి వచ్చిందని ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి వచ్చిన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు మూడు దశాబ్దాలుగా తెలుగు చిత్రపరిశ్రమలో పని చేస్తున్న ఒక మహిళతో బీబీసీ మాట్లాడుతూ.. "మా కష్టాలు కూడా వారు అర్థం చేసుకోవాలి . పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, బస్సు చార్జీలు, చివరకు టమాటా రేట్లు కూడా పెరిగిపోయాయి . మూడేళ్ల క్రితమే ఇటు పని లేక , కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరం ఇబ్బందులు పడ్డాం. వేరే పని చేతకాక , దీని మీదనే ఆధారపడి ఉన్నాము. ఇంట్లో వాళ్లు కూడా జీతంరాని పనికి వెళ్లి ఏం లాభం అంటున్నారు . కానీ పూట గడవాలి అని రోడ్డు మీదకు వచ్చాం" అని చెప్పారు.
సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ అంటే 24 విభాగాల్లో ఉన్న కళాకారులూ, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె వల్ల జూన్ 22న ఒక్క రోజే సుమారు 20 యూనిట్లు అవుట్ డోర్ షూట్లలో ఉన్నాయని సీనియర్ నటుడు నరేశ్ చెప్పారు. ఇలా 25 సినిమా ఔట్‌డోర్ ఇన్‌డోర్ షూటింగ్‌లపై ఈ సమ్మె ప్రభావం పడిందని సినీ వర్గాలు చెప్పాయి.

16 వేల మంది కార్మికులు
టాలీవుడ్‌లో కార్మికులు సుమారు 16 వేల మంది దాకా ఉన్నారు. వీరిలో మేకప్ ఆర్టిస్టులు ఒక యూనియన్‌గా , కాస్ట్యూమ్స్ సిబ్బంది మరో విభాగంగా, ఇలా 24 విభాగాల్లో ఉన్న వారు కలిసి ఫిల్మ్ ఫెడరేషన్‌గా ఏర్పడ్డారు. ఇక ఫిల్మ్ ఫెడరేషన్‌కు, నిర్మాతలకు మధ్యలో ఉండేదే ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్.
ఈ సినీ కార్మికులకు పనిని బట్టి రోజుకు 700 నుంచి 1500 రూపాయల వరకు వేతనం ఇస్తున్నారు. మూడేళ్లకోసారి 30% పెరిగే ఈ వేతనాలు నాలుగేళ్లుగా పెరగలేదు. దానితో పాటు కోవిడ్ కారణంగా తగినంత పని దొరక్క తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని, అందువల్ల వెంటనే 45 % వేతనాలు పెంచాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది నిర్మాతలు సమయానికి డబ్బులు కూడా ఇవ్వడం లేదు అని వీరు ఆరోపిస్తున్నారు.
జూన్ 22న సాయంత్రం ఫిల్మ్ ఫెడరేషన్ అంటే కార్మిక సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. వేతనాలను 45 శాతం పెంచి చెల్లించడానికి అంగీకరించే నిర్మాతల నుంచి రాతపూర్వకంగా హామీ తీసుకొని, వారి సినిమాల్లో మాత్రమే పనిచేస్తామని తేల్చి చెప్పేసింది.
ఈ అంశంపై ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ బీబీసీతో మాట్లాడుతూ.. " కార్మికులకు అన్యాయం జరుగుతోంది . ఎన్నో సార్లు ఫిల్మ్ చాంబర్, ప్రొడ్యూసర్ల ముందు ఈ విషయం ప్రస్తావించాం. వాళ్లు తాత్సారం చేస్తూ వస్తున్నారు. ఎంతో ఘనంగా జరుపుకొన్న మే డే రోజున అయినా వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటిస్తారని ఆశించాం, కానీ ఎలాంటి స్పందనా లేదు. వారిని ఇబ్బంది పెట్టాలి అన్నది మా ఉద్దేశం కాదు , కానీ వారు మా ఇబ్బందులను అర్థం చేసుకోవాలి" అని అన్నారు .
ఈ సమయంలో కూడా వారధిగా ఉండాల్సిన ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ కూడా బెదిరించే ధోరణిలో ఉంది తప్ప, తమ సమస్యలను గుర్తించడం లేదని ఫిల్మ్ ఫెడరేషన్ అభిప్రాయపడుతోంది.

ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ ఏమంటోంది?
తెలుగు ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ కూడా ఈ సమస్యపై ఒక ప్రకటన విడుదల చేసింది. కార్మికులు హఠాత్తుగా సమ్మెకు దిగినందున , ప్రొడ్యూసర్లు వారి డిమాండ్లకు తలగ్గొద్దు అన్నది ఆ ప్రకటన సారాంశం .
"23.06.2022 నుంచి 15 రోజుల వరకు సినిమా షూటింగ్‌లు చేయబోయే నిర్మాతలందరూ ఆయా వివరాలు ఏరోజుకారోజు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు తెలియజేయాలి. వర్కర్లకు చెల్లించాల్సిన వేతనాలను పాత అగ్రిమెంట్‌లో ఉన్న విధంగా చెల్లించాలి. దానికి విరుధ్ధంగా ఎవరు వ్యవహరించకుండా ఉండాలి" అని ఆ ప్రకటనలో చెప్పారు.
ఈ ప్రకటనతో వివాదం మరింత ముదిరింది.

ఫొటో సోర్స్, UGC
నిర్మాతలు ఏమంటున్నారు?
షూటింగ్‌కు ఆటంకం కలగకుండా పనికి రావాలని కార్మికులను సీనియర్ నటుడు నరేశ్ ఒక వీడియోలో కోరారు.
"ఈ విషయంలో పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. దాదాపు మూడేళ్లుగా సినిమా పరిశ్రమ కరోనావైరస్ మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయింది. చాలా మంది కార్మికులకు తిండి కూడా దొరకని పరిస్థితి ఉండింది. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాం. బ్యాంకులు నిండకపోయినా కడుపులు నిండుతున్నాయి . ఇలాంటి సమయంలో ఇలా ఫ్లాష్ స్ట్రైక్ చేయడం వలన అందరం నష్టపోతాం. కృష్ణా నగర్‌కు, ఫిల్మ్ నగర్‌కు మధ్య దూరం మూడు కిలోమీటర్లే. కలిసి అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మరి కొన్ని రోజులు షూటింగ్‌కు ఆటంకం కలగకుండా పనికి రావాలన్నదే మా కోరిక" అని ఆయన చెప్పారు.
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. "షూటింగులు ప్రారంభమయ్యాకే వేతనాలపై చర్చిస్తాం. ఈ రోజు కూడా షూటింగులు జరగడం లేదు. నిర్మాతలు ఎవరితో పని చేయించుకోవాలో వారితో పని చేయించుకుంటారు" అని చెప్పారు .
రెండు పక్షాల వాదనలు విన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. రెండు వైపులా సమస్యలు ఉన్నాయన్నారు. పంతాలకు, పట్టింపులకు పోకుండా సామరస్యంగా సమస్యకు పరిష్కారం చూడాలని రెండు వర్గాల వారిని కోరారు.
చర్చల అనంతరం వేతనాల పెంపుకు అంగీకరించింది నిర్మాతల మండలి. దీంతో కార్మికులు కూడా విధులకు హాజరవుతామని ప్రకటించారు.
దిల్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటి శుక్రవారంనాడు నిర్మాతల మండలి, కార్మిక సంఘాలతో చర్చించి, వేతనాలు ఎంత పెంచాలి, ఎప్పటి నుంచి పెంచాలన్నది నిర్ణయిస్తుందని కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- నూరేళ్ళు జీవించేందుకు ఫార్ములా ఉందా?
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













