Misoprostol: గ్యాస్ట్రిక్ అల్సర్‌ల కోసం కనిపెట్టిన మాత్ర గర్భస్రావం కోసం వాడే ఔషధంగా ఎలా మారింది?

అబార్షన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీబీసీ ముండో
    • హోదా, నుంచి

అబార్షన్.. చాలా దేశాల్లో ఇదొక వివాదాస్పద అంశం. కొందరు దీన్ని మహిళల హక్కుగా భావిస్తే, కొందరు దీన్ని తప్పని, పాపమని అంటారు. పలు దేశాల్లో అబార్షన్‌ను నిషేధించారు కూడా. ఇది లక్షలాది మహిళల జీవితాలపై ప్రభావం చూపే అంశం.

అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మందులతో అబార్షన్ లేదా శస్త్రచికిత్స.

సర్జరీ ద్వారా స్త్రీ గర్భాశయం నుంచి పిండాన్ని తొలగిస్తారు. ఆస్పిరేషన్ పద్ధతి (సూది గుచ్చి గర్భస్రావం అయ్యేట్టు చేయడం), లేదా గర్భాశయ ముఖ ద్వారం నుంచి పిండం బయటకి వచ్చేలా చేయడం (డైలేషన్) ఇందులో పద్ధతులు.

రెండోది, గర్భస్రావం కావడానికి మాత్రలు వాడడం. దీనికి మైఫ్‌ప్రిస్టాన్, మిసోప్రాస్టల్ అనే రెండు రకాల మాత్రలను కలిపి తీసుకుంటారు. దీన్ని మెడికల్ అబార్షన్ అంటారు.

మైఫ్‌ప్రిస్టాన్ అందుబాటులో లేకపోతే మిసోప్రాస్టల్‌ను మాత్రమే ఉపయోగించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది.

అయితే, మిసోప్రాస్టల్‌ అబార్షన్ కోసం కనిపెట్టిన ఔషధం కాదు. ఇది గ్యాస్ట్రిక్ అల్సర్ల చికిత్స కోసం అభివృద్ధి చేసిన మాత్ర. 1980ల మధ్యకాలంలో సైటోటెక్ పేరుతో ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించింది.

లాటిన్ అమెరికన్ మహిళలు తొలిసారిగా ఈ ఔషధం ఇతర ఉపయోగాలను కనుగొన్నారు. అబార్షన్ డ్రగ్‌గా దాని వినియోగాన్ని వ్యాప్తి చేశారు.

అబార్షన్

ఫొటో సోర్స్, Getty Images

'నోటి మాటగా పొక్కిన సమాచారం'

"1980లలో మహిళలే దీన్ని కనుగొన్నారు. ముఖ్యంగా పరిమితంగా వనరులు ఉన్నవారు, గ్యాస్ట్రిక్ అల్సర్ల చికిత్సకు వాడే ఈ మాత్ర గర్భస్రావాన్ని తొలగించగలదని కనిపెట్టారు" అని డాక్టర్ జార్జినా సాంచెజ్ రామిరెజ్ బీబీసీతో చెప్పారు. ఆమె,'రియాలిటీస్ అండ్ చాలెంజెస్ ఆఫ్ మెడికేషన్ అబార్షన్ ఇన్ మెక్సికో' అనే పుస్తకాన్ని రాశారు.

"నోటి మాట ద్వారా ఈ సమాచారం పొక్కింది. గ్యాస్ట్రిక్ అల్సర్ల కోసం కనిపెట్టింది కాబట్టి అంత ఖరీదైనదేమీ కాదు" అని మెక్సికోలో జెండర్, హెల్త్ నిపుణులు కొలెజియో డి లా ఫ్రోంటెరా సుర్ చెప్పారు.

మిసోప్రాస్టల్‌ను 1973లో సియర్ల్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసింది. జీర్ణాశయ సమస్యల చికిత్స కోసం కనిపెట్టిన ఈ ఔషధం సైడ్ ఎఫెక్టులలో గర్భస్రావం ఒకటని త్వరలోనే బయటపడింది.

1980 చివర్లలో మహిళలు దీన్ని వాడడం మొదలుపెట్టారు. బ్రెజిల్‌లో అబార్షన్‌ను నేరంగా పరిగణిస్తారు. దీనికి విరుగుడుగా మహిళలు మిసోప్రాస్టల్‌ మాత్రను సిఫార్సు చేయడం మొదలుపెట్టారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మకాలు జరిగేవి.

1987లో ఫ్రాన్స్‌లోని పరిశోధకులు గర్భస్రావం కోసం ప్రత్యేకంగా మైఫ్‌ప్రిస్టాన్ కనిపెట్టారు. దీన్ని మిసోప్రాస్టల్‌తో కలిపి వాడితే సునాయాసంగా అబార్షన్ జరుగుతుందని తేలింది.

అప్పటికే లాటిన్ అమెరికాలో మహిళలు మిసోప్రాస్టల్‌ను విరివిగా వాడడం మొదలుపెట్టారని డాక్టర్ జార్జినా సాంచెజ్ తెలిపారు. లాటిన్ అమెరికాలోని చాలా దేశాల్లో అబార్షన్ నిషిద్ధం.

"ఫ్రాన్స్‌లో మైఫ్‌ప్రిస్టాన్ కనిపెట్టకముందే గ్యాస్ట్రిక్ అల్సర్ల కోసం కనిపెట్టిన మిసోప్రాస్టల్‌ను ఎంత మోతాదులో తీసుకుంటే గర్భస్రావం అవుతుందో లాటిన్ అమెరికన్ మహిళలు కనిపెట్టారు. విరివిగా వాడడం మొదలుపెట్టారు" అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, పోలండ్: అబార్షన్ చేయించుకునేందుకు మరో దేశానికి వెళ్తున్న యువతులు

ఈ మందు ఎలా పనిచేస్తుంది?

దీనికి సర్జరీ అవసరం ఉండదు. ఇంట్లోనే అబార్షన్ చేసుకోవచ్చు. మైఫ్‌ప్రిస్టాన్, మిసోప్రాస్టల్ రెండూ తగు మోతాదులో కలిపి తీసుకుంటే గర్భస్రావం అవుతుంది.

ముందు మైఫ్‌ప్రిస్టాన్ తీసుకుంటారు. ఇది శరీరంలో గర్భం కొనసాగడానికి అవసరమైన ప్రొజెస్టెరాన్ హార్మోన్‌ను అడ్డుకుంటుంది.

తరువాత 24 నుంచి 48 గంటల లోపు మిసోప్రాస్టల్ తీసుకుంటారు. ఇది తీసుకున్న కొద్దిసేపటికి గర్భాశ్రయం పైపొర విచ్ఛిన్నం అవుతుంది. నొప్పి, రక్తస్రావం తద్వారా గర్భాశయం ఖాళీ అయిపోతుంది.

మైఫ్‌ప్రిస్టాన్ అందుబాటులో లేనప్పుడు, కేవలం మిసోప్రాస్టల్ వాడవచ్చని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

అబార్షన్ చట్టవిరుద్ధమైన దేశాల్లో మైఫ్‌ప్రిస్టాన్ అమ్మకాలను నిషేధించారని డాక్టర్ జారినా సాంచెజ్ తెలిపారు. అయితే, చట్టబద్ధమైన చోట కూడా మిసోప్రాస్టల్ మాత్రే విరివిగా వాడకంలో ఉందని ఆమె అన్నారు.

"మైఫ్‌ప్రిస్టాన్‌ను ప్రత్యేకంగా అబార్షన్ కోసమే తయారుచేశారు కాబట్టి, అబార్షన్ చట్టవిరుద్ధమైన దేశాల్లో అది దొరకడం కష్టం. దానిపై నిషేధం ఉంటుంది. అబార్షన్ నేరం కాని మెక్సికో లాంటి దేశాల్లో కూడా మైఫ్‌ప్రిస్టాన్ ఫార్మసీల్లో ఎక్కువగా దొరకదని, దొరికినా దాని ధర చాలా ఎక్కువగా ఉంటుందని వినియోగదారులు చెప్పారు. అందుకే మిసోప్రాస్టల్‌నే ఎక్కువగా వాడుతున్నారు. ఇది చౌక కూడా" అంటూ డాక్టర్ జార్జినా సాంచెజ్ వివరించారు.

అబార్షన్

ఫొటో సోర్స్, Getty Images

'ఇది విప్లవాత్మకం'

అబార్షన్లు చట్టబద్ధమైన దేశాల్లో ఎక్కువగా ఔషధాలతోనే గర్భస్రావం చేస్తారు. సర్జరీ చేసి అబార్షన్లు చేయడం తక్కువ. ఉదాహరణకు అమెరికాలో సగం కన్నా ఎక్కువ మెడికల్ అబార్షన్లే.

మెడికల్ అబార్షన్ విస్తృతం కావడం వలన మహిళలు స్వచ్ఛందంగా అబార్షన్ చేయించుకునే రేటు పెరిగిందని, రహస్య గర్భస్రావాలు, మరణాల రేటు గణనీయంగా తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

"అబార్షన్‌ను చట్టబద్ధం చేసి, దానికి కావలసిన మందులు విరివిగా లభ్యం కావడం, ఇంట్లోనే సురక్షితంగా అబార్షన్ చేసుకోగలగడం వలన మరణాలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి" అని కొలెజియో డి లా ఫ్రోంటెరా సుర్ అభిప్రాయపడ్డారు.

అబార్షన్ ఆలస్యం కాకుండా, గర్భధారణ జరిగిన వెంటనే అబార్షన్ చేయించుకోవడానికి కూడా మెడికల్ అబార్షన్ సాయపడింది.

మెడికల్ అబార్షన్ విస్తృతం కావడం వలన మహిళలు దీన్ని ఒక ప్రయివేటు వ్యవహారంగా పరిగణిస్తూ, వైద్యుల అవసరం లేకుండా అబార్షన్ చేసుకోవడానికి వీలు కలుగుతోందని డాక్టర్ జార్జినా సాంచెజ్ అన్నారు.

"మెడికల్ అబార్షన్ విస్తృతమైన కొత్త యుగంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మహిళలు ఆస్పత్రుల వరకు వెళ్లక్కర్లేదు. ఇది వైద్య రంగం ప్రాబల్యాన్ని, ప్రభుత్వ ఆధిపత్యాన్ని పరిమితం చేస్తుంది. ఈ మందులు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎలా వాడాలో తెలిపే సమాచారం కూడా అందుబాటులో ఉంది" అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆమె చీర కట్టు, జడలో పూలే ర్యాపర్‌గా మంచి గుర్తింపు తెచ్చాయి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)