'గర్భస్రావం అయితే అది నా తప్పా?'

తులిప్ మజుందార్
    • రచయిత, తులిప్ మజుందార్
    • హోదా, హెల్త్ ప్రతినిధి

గర్భం దాల్చిన ప్రతీ అయిదుగురు మహిళల్లో ఒకరికి గర్భస్రావం అవుతోంది. ఈ అనుభవం చాలా బాధాకరంగా ఉంటుంది. నేను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. వేదనకు గురయ్యాను.

గాబ్రియెల్లా ఓ డోనెల్ కలిసి నేను గర్భస్రావాలపై ఒక డాక్యుమెంటరీ రూపొందించాం. ఈ డాక్యుమెంటరీ కోసం ప్రపంచవ్యాప్తంగా గర్భస్రావానికి లోనైన మహిళలు చాలా మందితో మాట్లాడాం.

ఈ కథనంలో కొంత సమాచారం కలచివేసేదిగా ఉండచ్చు.

Short presentational grey line

వేదన అందరికీ ఒకటే. కానీ, గర్భస్రావం జరిగినప్పుడు, ఆ తర్వాత మహిళలకు దొరికే మద్దతు, ప్రేమ మాత్రం వారు ఎక్కడున్నారనే అంశం పై కూడా ఆధారపడి ఉంటుంది.

మిల్కా

మిల్కా వామాది , 37, లిలోంగ్‌వీ మలావీ

నేను గర్భం దాల్చిన ఐదు నెలలకు గర్భస్రావం అయింది. ఒక రోజు నా కాళ్ళ మధ్యలోంచి నీరు వస్తున్నట్లుగా అనిపించింది. నేను ఆసుపత్రికి వెళ్ళగానే గర్భస్రావం అయినట్లు చెప్పారు. నాకేమి జరుగుతుందో అర్ధం కాలేదు. మృత శిశువుకు జన్మనివ్వాలనే విషయాన్ని గ్రహించలేకపోయాను.

ఆసుపత్రి వార్డులో ఒంటరిగా ఉండిపోయాను. అది చాలా వేదనాత్మకంగా అనిపించింది.

నాకు నొప్పులు మొదలయ్యాయి. ఏమి చేయాలో తెలియలేదు. నొప్పులు మొదలయినప్పుడు గట్టిగా తోస్తూ ఉండాలి. దాంతో, నేను నొప్పులను ఇస్తూ, తోస్తూ వచ్చాను. ఆ నొప్పి భరించలేనిది. నా లోపల నుంచి ఏదో బయటకు వచ్చినట్లు అర్ధమయింది. అది నా బిడ్డ. ఏమి చేయాలో అర్ధం కాలేదు. నేను ఒక్కర్తినే ఉన్నాను.

మానసికంగా చాలా కష్టంగా అనిపించింది. నేనుండే సమాజంలో గర్భస్రావం గురించి ఎవరితోనూ చర్చించకూడదు.

అదొక తప్పు. మహిళ పైనే నింద వేస్తారు. బిడ్డను పోగొట్టుకోవడం కోసం ఏదో తప్పు చేసినట్లు చూస్తారు.

గర్భం దాల్చినప్పుడు తలెత్తే వైద్య సమస్యల గురించి ఎవరూ పట్టించుకోరు. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నేనేదో మహిళను కానట్లుగా అనిపిస్తూ ఉంటుంది.

గర్భస్రావం గురించి బహిరంగంగా చర్చించగలగాలి. లేదంటే చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ఈ గాయం ఎప్పటికీ మానదు. కొన్ని రోజుల పాటు మోసినందుకే నువ్వెందుకు అంతలా ఏడుస్తున్నావు? అని చాలా మంది అడుగుతారు. కానీ, అది గర్భస్రావం.

నేనిప్పటి వరకు ముగ్గురు బిడ్డలను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలున్నారు. నష్టపోయిన తర్వాత కూడా ఆశ మిగిలే ఉంటుంది.

డాక్టర్ మాకి కగామి

డాక్టర్ మాకి కగామి, 50, టోక్యో, జపాన్

నాకిప్పటి వరకు ఐదు సార్లు గర్భస్రావమయింది. అన్నీ కష్టమైనవే. కానీ, మూడవ సారి జరిగిన గర్భస్రావం చాలా కష్టంగా అనిపించింది.

నాకు రక్తస్రావం మొదలవ్వగానే ఏదో తేడాగా అనిపించింది.

మేమొక పార్టీకి వెళ్ళాం. పార్టీలో కొందరు తమ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు. మాకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుంటుందని అంటున్నారు. నాకు ప్రపంచం తలకిందులయినట్లుగా అయింది. కానీ, నా ముఖం పై నవ్వును కప్పుకున్నాను.

నాకు కడుపులో తీవ్రమైన నొప్పి మొదలయింది. కానీ,అక్కడ నుంచి త్వరగా బయటపడే మార్గం కనిపించలేదు. చివరకు కారు తీసుకుని ఇంటికి వచ్చాం.

అప్పటికే నాకు రక్తస్రావం ఎక్కువయింది. నా లోపల ఏవో భాగాలు చీలినట్లుగా అనిపించింది. నేను ఇంటికి వెళ్లి టాయిలెట్ కు వెళ్లి చూసుకునేసరికి ఒక పిండం బయటకు వచ్చినట్లు కనిపించింది.

ఏమి జరిగిందో అర్ధం చేసుకునేందుకు డాక్టర్లకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో నేనా పిండాన్ని టిష్యూలో చుట్టి పెట్టాను.

ఆ రోజు నాకు కలిగిన నొప్పి, విచారం నాకింకా స్పష్టంగా గుర్తున్నాయి. అది నా జీవితంలో అత్యంత కష్టమైన క్షణం.

నేనొక డాక్టర్‌ని . గర్భస్రావం జరగడం నా తప్పు కాదని నాకు తెలుసు. కానీ, నాకెందుకో సిగ్గుగా అనిపించింది.

పిల్లలు తమ తల్లితండ్రులను ఎంచుకుంటారనే నమ్మకం జపాన్‌లో ఉంది. నాకొక మంచి బిడ్డను కావాలనుకోవడం వల్లే, నన్ను తల్లిగా ఆ బిడ్డ ఎంచుకోలేదని నా స్నేహితురాలు చెప్పారు. ఈ నష్టానికి నన్నే నిందిస్తున్నట్లు అనిపించింది. నేనొక ఒత్తిడి కలిగించే ఉద్యోగంలో పని చేయడం వల్లే ఇలా జరిగిందని నా కుటుంబ సభ్యులు అన్నారు.

దుఃఖపడేందుకు కూడా ఆ వ్యక్తికి సమయాన్ని ఇవ్వాలి. బాధితులకు మద్దతిచ్చేందుకు మీరేమి మాట్లాడనవసరం లేదు. వారి పక్కనే ఉండి వారి బాధను వినగల్గితే చాలు.

టిడా సమాతే

టిడా సమాతే, 27, కెనేబా గ్రామం, గాంబియా

ఒక రోజు మధ్యాహ్నం నేను బరువుగా ఉన్న వంట చెరుకు మోసుకుని వస్తున్నాను. కొంత సేపటికి రక్తస్రావం మొదలయింది. బరువైన వస్తువులు మోయడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశముందని నాకు తెలియదు. మహిళలు గర్భం దాల్చగానే ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య సలహాలు, సూచనలు తీసుకునే వీలుండాలి. చాలా గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు లేవు. ఈ పరిస్థితి మారాలి.

నేనొక స్థానిక ఆసుపత్రికి వెళ్లాను. అంతా బాగానే ఉంటుందని చెప్పారు. నేను ఇంటికి వెళ్లి విశ్రమించాను.

అదే రోజు రాత్రి నేను బకెట్ తో నీళ్లను తీసుకుని స్నానానికి వెళ్లాను. తిరిగి నొప్పి మొదలయింది.

అంతలోనే స్నానాల గదిలోనే గర్భస్రావం జరిగి పిండం బయట పడిపోయింది.

నాతో పాటు గర్భస్రావ పొరను తీసుకుని రమ్మని చెప్పారు. నేనా పిండాన్ని ఒక వస్త్రంలో చుట్టి ఆసుపత్రికి తీసుకుని వెళ్లాను. అక్కడ నన్ను బాగా చూసుకున్నారు. కానీ, చాలా ఒంటరిగా విచారంగా అనిపించింది. నా భర్త వేరే దేశంలో ఉంటారు.

గాంబియాలో పెళ్ళై మూడు నాలుగు సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నామని నిందిస్తారు. పిల్లలు లేకపోవడం వల్ల భర్తను ఏమీ అడగలేని పరిస్థితి వస్తుంది.

నాకిప్పుడు మూడు నెలల చిన్నారి ఉంది. పేరు హా.

జోసీ బ్రానన్

జోసీ బ్రానన్, 33, లీసెస్టర్, బ్రిటన్

రక్తస్రావం కనిపించగానే మీ ఆశలు, కలలు ముగిసిపోయినట్లు అనిపిస్తుంది. చాలా నొప్పి కలుగుతుంది. అంత రక్తం చూసేసరికి ఇంకా కాపాడేందుకు ఏమీ మిగిలి లేదనే విషయం అర్ధమవుతుంది.

నాకు 2018 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు గర్భస్రావం అయింది. గర్భం దాల్చిన మూడు నెలల లోపే అన్ని గర్భస్రావాలు అయ్యాయి.

వాళ్ళను నేను పుట్టిన పిల్లల్లానే భావించి ఇప్పటికీ వారి పుట్టిన రోజులు జరుపుతూ ఉంటాం.

నాకు మూడవ సారి గర్భస్రావమైన తర్వాత పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిస్‌ఆర్డర్ ఉన్నట్లు తేల్చారు. ఆ తర్వాత మరో రెండు గర్భస్రావాలయ్యాయి.

మేము తిరిగి గర్భం దాల్చేందుకు చాలా ధైర్యం చేయాల్సి వచ్చింది. చివరకు ఆరవసారి గర్భంతో ఉన్నాను. ఈ విషయం తెలిశాక చాలా భయభ్రాంతులకు గురయ్యాను.

వీడియో క్యాప్షన్, పసిపిల్లలకు ఎప్పుడు ఏం తినిపించాలి, ఏం తినిపించకూడదు?

నేను వెంటనే టామీస్ ఛారిటీ రీసెర్చ్ సెంటర్‌కు కాల్ చేసి "నాకు మీరు సహాయం చేయాలి" అని అడిగాను.

వాళ్ళు కొంత మంది మహిళల పై నిర్వహించిన ప్రాజెస్టరాన్ పరీక్ష గురించి చెప్పారు. ఈ పరీక్ష కొంత మందికి సానుకూల ఫలితాలనిచ్చినట్లు చెప్పారు. నాకు వెంటనే ఆ చికిత్స మొదలుపెట్టారు.

ఈ సారి అంతా బాగుంటుందని అనుకోకుండా చొరవ తీసుకుని ఏదో ఒకటి చేస్తున్నామని అనిపించింది.

నాకిప్పుడు నెలలు నిండుతున్నాయి. ఈ మొత్తం అనుభవంతో నేను చాలా ఉద్వేగంతో ఉన్నాను. అదృష్టవంతురాలినని అనుకుంటున్నాను.

రుక్సానా ఆమిర్

రుక్సానా ఆమిర్, కరాచీ, పాకిస్తాన్

గర్భస్రావం గురించి విన్నాను కానీ, అది నాకే జరుగుతుందని అనుకోలేదు. నేను డాక్టర్ దగ్గరకు వెళితే ఇలా జరగడం చాలా సహజం అని చెప్పారు.

కడుపులో ఉన్న పిండం బయటకు వచ్చేస్తుందని, దాని గురించి విచారించాల్సిన పని లేదని చెప్పారు.

ఆ తర్వాత మూడు సార్లు గర్భస్రావం అయింది. అన్నీ 8 వారాల సమయంలోనే అయ్యాయి.

నా కుటుంబం ఏమనుకుంటుందో? అని ఆలోచిస్తూ ఉండేదానిని. నాలో ఏదో లోపం ఉన్నట్లుగా అనుకుంటారేమో అనుకున్నాను. నాకు చాలా మంది కాల్ చేసి, అంతా బాగుంటుందని చెబుతూ ధైర్యం చెప్పేవారు. నువ్వింకా చాలా చిన్నదానివి. నీకు మళ్ళీ పిల్లలు పుడతారు అని చెబుతూ ఉండేవారు.

నేను నా భర్త గర్భస్రావాలు గురించి మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఆయన నాకు బాగా మద్దతిచ్చేవారు. దీని గురించి మాట్లాడితే మాకు వేదన కలుగుతుందని తెలుసు.

నా అదృష్టం కొలదీ నాకొక మంచి డాక్టర్ లభించారు. ఆమె చాలా దయగా, జాగ్రత్తగా చూసుకునేవారు. ఆమె నాకు చాలా రకాల పరీక్షలను సూచించారు. నాకు గర్భం దాల్చిన తర్వాత రక్తం గడ్డ కట్టే సమస్య వస్తున్నట్లు తెలుసుకున్నారు.

ఆ తర్వాత గర్భం దాల్చినప్పుడు గర్భం నిలబడేందుకు నేను చాలా ఔషధాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది.

నేను నలుగురు బిడ్డలను కోల్పోయాను. ఇదంతా నా తప్పు కాదని గుర్తు చేసుకోవాలి. గర్భస్రావం జరిగిన ప్రతీ మహిళ ఇది తమ తప్పు కాదని గ్రహించగలగాలి.

తమీరా డాన్

తమీరా డాన్ 34, బాల్టిమోర్, యూఎస్

2014 అక్టోబరులో నేను పొద్దున్న లేచేసరికి విపరీతమైన నడుం నొప్పి మొదలయింది.

నేను డాక్టర్‌తో మాట్లాడితే మూత్ర విసర్జనతో ఇబ్బంది పడుతున్నానేమో అని అన్నారు.

అల్ట్రా సౌండ్ కోసం ఆసుపత్రికి రమ్మన్నారు. కానీ, ఆస్పత్రికి వెళ్లే లోపే గర్భస్రావం అయిపొయింది. నేనొక్కదానినే ఉన్నాను. నాకేమి జరుగుతుందో అర్ధం కాలేదు. రక్తం మడుగు మాత్రమే కనిపించింది.

నన్ను ఆస్పత్రికి అంబులెన్సులో తీసుకెళ్లారు. "ఇలా అవుతూ ఉంటాయి" అని డాక్టర్ అన్నారు.

ఆ తర్వాత డి&సి చేశారు. వైద్య ప్రక్రియ ద్వారా గర్భం లోపల ఉండిపోయిన గర్భానికి సంబంధించిన పొరను శుభ్రం చేశారు. నన్ను అరగంట సేపు ఆస్పత్రిలోనే ఉంచారు. గర్భస్రావం గురించి లీఫ్ లెట్లను ఇచ్చి ఇంటికి వెళ్ళిపోమన్నారు.

మానసికంగా నాకు చాలా వేదన కలిగింది. డాక్టర్లకు మాత్రం అదొక పని. "ఇలా జరుగుతూ ఉంటాయి. సారీ, మరొకసారి ప్రయత్నించండి" అని చెప్పారు.

నేను టాయిలెట్‌లో నా బిడ్డను కోల్పోయాను. ఆ తర్వాత బాత్ రూమ్‌కు వెళ్లాలంటే పదే పదే ఆ జ్ఞాపకాలు వస్తూ ఉండేవి.

నేను ఆరు నెలల వరకు రోజూ ఏడుస్తూ ఉండేదానిని. నేను వెంటనే ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నేను టీచర్ గా పని చేస్తున్నారు.

పిల్లల చుట్టూ ఉండాలని అనిపించేది కాదు. కానీ, నాకు మరో మార్గం లేదు. నా వేదన పై దృష్టి పెట్టేందుకు కూడా నాకు సమయం లేదు.

నేను కౌన్సెలింగ్ తీసుకున్నాను. 8 సంవత్సరాలు అయింది. కానీ, ఇంకా థెరపీ తీసుకుంటున్నాను. సెలవులు, వార్షికోత్సవాలు సమయంలో నా బిడ్డను కోల్పోయిన క్షణాలు గుర్తుకొస్తాయి. ఇవన్నీ నాకు జ్ఞాపకాలను రేపుతూ ఉంటాయి.

వీడియో క్యాప్షన్, భర్తను చంటి పిల్లాడిలా కాపాడుకుంటున్న మహిళ కథ..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)