మహారాష్ట్ర రిసార్ట్ రాజకీయాలు: ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? ఈ లగ్జరీ హోటళ్లలో ఎమ్మెల్యేలు ఏం చేస్తారు

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, BBC Marathi

    • రచయిత, జోయ మతీన్
    • హోదా, బీబీసీ న్యూస్

భారత్‌లో అసెంబ్లీల దగ్గర మొదలైన రాజకీయాలు ఇప్పుడు ఖరీదైన హోటళ్ల చుట్టూ తిరుగుతున్నాయి.

భారత్‌లోని సుసంపన్న రాష్ట్రం మహారాష్ట్ర ఇప్పుడు రిసార్టు రాజకీయాలకు వేదికైంది. 40 మందికి పైగా శివసేన శాసనసభ్యులతో ఏక్‌నాథ్ శిందే ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని గువాహటి నగరంలో మకాం వేసిన సంగతి తెలిసిందే.

భారత్‌లో ఏ పార్టీ అయినా అసెంబ్లీలో తమ ఆధిక్యాన్ని నిరూపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. అయితే, ఆధిక్యం కంటే తక్కువ సీట్లు వచ్చినప్పుడు, లేదా సంకీర్ణంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పుడు.. ప్రభుత్వాలు కూలిపోయే ముప్పు ఎక్కువ ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలు అసంతృప్త నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తుంటాయి.

ఇలాంటి పరిణామాలే ‘‘రిసార్టు రాజకీయాలు’’కు కారణం అవుతాయి. వీటిలో భాగంగా రాజకీయ పార్టీలు తమ శాసన సభ్యులను రిసార్టు లేదా హోటల్‌కు తీసుకెళ్తుంటాయి. ఇతర పార్టీల్లోకి, ప్రత్యర్థి క్యాంప్‌లోకి వెళ్లకుండా అక్కడ పక్కాగా నిఘా పెడుతుంటారు.

ప్రత్యర్థి పార్టీలు వేసే ఎరలకు పడకుండా నాయకులు పక్కా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం శిందే మొదటగా తనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలను గుజరాత్‌కు తీసుకెళ్లారు. అయితే, అది మహారాష్ట్రకు సమీపంలోనే ఉంటుంది. అసంతృప్త ఎమ్మెల్యేలు మళ్లీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గూటికి చేరుతారనే ఆందోళనల నడుమ మళ్లీ అందరినీ తీసుకొని అస్సాం వెళ్లిపోయారు.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Getty Images

తాజాగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన నాయకులు శివసేన పార్టీకి చెందిన వారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

ఇప్పుడు ఈ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటామని శిందే, అసంతృప్త ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఫలితంగా మహారాష్ట్రలో ప్రభుత్వం కుప్పకూలే ముప్పుంటుంది.

మరోవైపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలిసి శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధమూలేదని బీజేపీ చెబుతోంది.

మహారాష్ట్ర ఎమ్మెల్యేలు.. గుజరాత్ నుంచి అస్సాం వెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. గభగభా వస్తున్న ఎమ్మెల్యేలను ప్రశ్నలు అడిగేందుకు రిపోర్టర్లు కూడా వరుసకట్టారు.

‘‘ఇవి ఏవో సినిమా దృశ్యాల్లా కనిపిస్తున్నాయి’’అని ఒక సోషల్ మీడియా యూజర్ ట్వీట్ చేశారు.

ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ఇదేమీ కొత్త కాదు. 1980ల్లోనే రాజకీయ పార్టీలు ఇలా రిసార్టులకు తరలించడం ప్రారంభమైంది.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, BBC Marathi

కొంతమంది రాజకీయ నాయకులకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత కొన్ని హోటళ్లు కూడా ప్రముఖ హోటళ్లుగా మారిపోయాయి.

1983లో అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఇలానే తన వెంట ఉన్న ఎమ్మెల్యేలను ఒక రిసార్టుకు తరలించారు.

తమ ప్రభుత్వాన్ని విపక్షాలు కూలదోసేస్తాయనే ఆందోళన నడుమ ఆయన ఎమ్మెల్యేలందరినీ తీసుకొని రిసార్టులో మకాం వేశారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

సంవత్సరం తర్వాత 1984లో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి.

అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పార్టీలో తిరుగుబాటు జరిగి ఎన్టీఆర్ పదవి కోల్పోయారు. దీంతో అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గాల్సిన అవసరం ఎన్టీఆర్‌కు ఏర్పడింది.

దీంతో... ఎన్టీఆర్ అల్లుడు, ఆ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు.. అవిశ్వాస తీర్మానంలో ఎన్టీఆర్‌కు అనుకూలంగా ఎమ్మెల్యేలు ఓటువేసేలా చూసేందుకు వారిని బెంగళూరుకు, అక్కడి నుంచి దిల్లీకి తరలించి ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చేలా చేశారు.

అక్కడికి దశాబ్దం తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే.. చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోని తన అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్‌లో ఉంచి వారి మద్దతుతో సీఎం కాగలిగారు.

1980ల్లో ఇలాంటి పరిణామాలు కేవలం పత్రికలకు మాత్రమే పరిమితమయ్యేవి. అయితే, నేడు సోషల్ మీడియా, టీవీల్లో పెద్దపెద్ద చర్చలు జరుగుతున్నాయి.

2019లో కర్నాటకలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఒక లగ్జరీ రిసార్టుకు తరలించింది. రాష్ట్రంలో అనిశ్చితి నెలకొన్ని తరుణంలో వారు ఒక రిసార్టులో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్య విధానాలు కొరవడ్డాయని చెప్పడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

‘‘కొన్నిసార్లు రాజకీయ నాయకులు చాలా కారణాలతో పార్టీలు మారుతుంటారు. సీనియర్ నాయకులతో విభేదాలు కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు’’అని రాజకీయ విశ్లేషకుడు రాహుల్ వర్మ వివరించారు.

‘‘అగ్ర నాయకుడితో వారికుండే సత్సంబంధాలపైనే అన్నీ ఆధారపడి ఉంటాయి. సంబంధాలేమైనా దెబ్బతింటే మరో శిబిరానికి వారు మకాం మారుస్తారు’’అని రాజకీయ విశ్లేషకుడు సుధీర్ సూర్యవన్శి అన్నారు.

‘‘ఇక్కడ నైతిక విలువలు, సిద్ధాంతాలు లాంటి వాటికి ఎలాంటి పాత్రా ఉండదు. అందరూ అధికారంలోనే ఉండాలని అనుకుంటారు’’అని ఆయన అన్నారు.

పార్టీలు తరచూ మారకుండా భారత్‌లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే, ఒక పార్టీలో మూడింట రెండొంతుల మంది పార్టీని విడిచిపోతే ఈ చట్టం వర్తించదు. అందుకే ఒకేసారి ఎక్కువమంది నాయకులు పార్టీలు మారేందుకు ప్రయత్నిస్తుంటారు.

భారత్‌లో డజన్ల కొద్దీ ప్రాంతీయ పార్టీలు ఉండటంతో ఎన్నికల్లో చాలాసార్లు ఎవరికీ కచ్చితమైన ఆధిక్యం దక్కదు. ఫలితంగా పార్టీ ఫిరాయింపులకు ఎక్కువ అవకాశం ఉంటోంది.

‘‘మార్కెట్‌లో చిన్న ప్లేయర్లు చాలా మంది ఉంటే... వారిని తమవైపు తిప్పుకోవడానికి, ఏక ఛత్రాధిపత్యం కోసం ఏదో ఒక పెద్ద ప్లేయర్ ప్రయత్నిస్తూనే ఉంటారు. రాజకీయాలు కూడా అంతే’’అని వర్మ అన్నారు.

వీడియో క్యాప్షన్, నవనీత్ కౌర్ చుట్టూ ముసురుకున్న వివాదం ఏమిటి? ముంబయిలో ఏం జరిగింది

ఇలా రిసార్టులకు తరలించినప్పుడు కొంతమంది నాయకులు క్రికెట్ ఆడటం, పేకాడ ఆడటం లాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి.

ఎందుకంటే ఇక్కడ నాయకుల ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలను స్విచ్ఛాప్ చేయిస్తారు. అందరినీ సీనియర్ నాయకుల పర్యవేక్షణలో ఉంచుతారు.

2019లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను క్యాంపుకు తీసుకెళ్లినప్పుడు, మ్యాజిక్ షోలు, సినిమాలు కూడా వేశారు. ఇద్దరు అగ్ర నాయకుల మధ్య విభేదాల నడుమ ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో సోషల్ మీడియాలో మీమ్‌లు, జోక్‌లు పేలాయి.

అయితే, ఒక్కోసారి అన్ని అనుకున్నట్లు జరగవు. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు పక్కదారులు చూసినప్పుడు ఊహించని ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి.

వీడియో క్యాప్షన్, ద్రౌపది ముర్ము: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. బీజేపీ వ్యూహమేమిటి

ఇలాంటి లగ్జరీ హోటళ్ల నుంచి కొంతమంది నాయకులు తప్పించుకుని బయటకు కూడా వస్తుంటారు.

ఇప్పుడు కూడా గువాహటి శిబిరంలో ఎంత మంది ఉన్నారు? ఎవరెవరు అక్కడి నుంచి బయటకు రావాలని భావిస్తున్నారు? లాంటి అంశాలపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి.

ముంబయిలో భోజనానికి అని చెప్పి ఏకంగా గుజరాత్ తీసుకెళ్లిపోయారని కొందరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనతో చెప్పినట్లు కైలాశ్ పాటిల్ చెప్పారు. తను కార్ నుంచి తప్పించుకుని ఎలాగోలా ముంబయి చేరుకున్నానని ఆయన వివరించారు.

మరోవైపు గుజరాత్‌లోని హోటల్ నుంచి తప్పించుకోవాలని చూసిన కొందరు ఎమ్మెల్యేలను బలవంతంగా ఒక ఆసుపత్రిలో చేర్పించారని మరో శివసేన నాయకుడు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి నాటకీయ పరిణామాలు టీవీ షోలకు బాగా పనికొస్తాయ, రాజకీయాల్లో పడిపోతున్న విలువలకు ఇది పరాకాష్ట వారు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)